చినుకు గడుగ్గాయి

చినుకు గడుగ్గాయి

చినుకు ముత్యాలు
జారుతుంటే
మనసంతా రుబాయిలు
లిఖిస్తున్నంత సంబరం

సంబరాన్ని పోగేసిన గాలి
వేణుగానంలా చొరబడుతుంటుంది
చొరవతీసుకున్న చిలిపిదనం
యవ్వనకాంతులను పరుస్తుంది

లల్లాయిపదాలన్ని పెదవులపై
కొలువుతీరగా
బాధ, దుఃఖం కాసేపు ప్రేక్షకులవుతాయి
బతుకు తో రణం
బతుకు తోరణమవుతుంది

ఆనందమెపుడూ తాత్కాలికమే
ఆ క్షణంలో జీవించటం నేర్పుతుంది
నేర్పుంటే జీవితం కూర్పు తెలుస్తుందని
చినుకు గడుగ్గాయి చెవిలో చెబుతోంది

– సి.యస్.రాంబాబు

Related Posts