చూపు ఆనని వాళ్ళు

చూపు ఆనని వాళ్ళు

ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్క పక్క ఇళ్లలో నివసిస్తూండేవాళ్లు. ఆ ముగ్గురికీ అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే గాని కనిపించేది కాదు.

ఆ అన్నదమ్ములు ముగ్గురూ ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకుని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ములతో, “అన్నట్లు, ఈ మధ్య, నా చూపు చాలా బాగయింది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాననుకోండి,’ అన్నాడు.

“చాల్లే నీ బడాయిలు! వారం క్రితమేగా నువు పట్టపగలు కావడివాడిపైన పడిందీ?” అన్నాడు రెండోవాడు.
“ఫగలు మాట అటుంచు. చీకటిపడిన కొద్దీ అద్భుతంగా చూపు అనుతున్నది. కొందరికి రాత్రి చూపు ఉంటుందట,” అన్నాడు పెద్దవాడు.
ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు? తింటే గాని రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది,” అన్నాడు మూడోవాడు.

“ఏమిటా పరీక్ష?” అన్నాడు రెండోవాడు, “చెబుతాను వినండి, మన వీధికెదురుగాసత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలిపైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు.

ఆ, శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దానిమీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికీ ఓడినవాడు భోజనం పెట్టే టట్టు పందెం! అన్నాడు మూడోవాడు.

దీనికి పెద్దవాళ్లిద్దరూ సరేనన్నారు. చిన్న వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయాక పెద్దవాడికి బెంగపట్టుకున్నది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకిగాని చదవలేడు.

ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది.
సత్రంలో గుమాస్తా ఉంటాడు. ఆయననడిగితే ఆ ధర్మశాసనం పలక పైన ఏమున్నదీ చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు ఉన్నఫళానా బయలుదేరి సత్రానికి వెళ్లాడు.

“ఏదో పనిమీద దయచేశారు?” అని అన్నాడు సత్రం గుమాస్తా.“మరేమీ లేదు. రేపు ధర్మశిల వేస్తున్నారటగా? దానిమీద ఏమీ రాయించారేమిటి?’ అన్నాడు పెద్దవాడు.“ఏమీ.లేదండీ, శ్రీరామకటాక్షము అని రాయింఛారు,’ అన్నాడు గుమాస్తా,

పెద్దవాడు ఆనందభరితుడై గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరూ చూపు ఆననివాళ్లే గనక ఒకరినొకరు గమనించలేదు.

పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికీ వచ్చింది. అతడు కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్లే, ధర్మశాసనంపైన ఏమి రాయించారని అడిగాడు.

ప్రతివాళ్లూ ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్లే జవాబు చెప్పాడు.

రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్లిపోక, ‘పలక రంగు ఏది? అక్షరాలు ఏ రంగు?” అని అడిగాడు.

“తెల్లటి చలవరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు, అన్నాడు గుమాస్తా, రెండోవాడు వెళ్లిన కాస్సేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటి వాడు అడిగినట్లే అడిగాడు. గుమాస్తా చెప్పాడు.

“శ్రీరామ కటాక్షము అన్నదాని కింద శాసనం వేయించేవారి పేరుగాని చెక్కించలేదా ఏం?” అన్నాడు మూడోవాడు.

“చిన్న అక్షరాలతో పలానావాడు అని చెక్కించారు. దానికి ఏం రంగు పూశారని అడుగుతారేమో! ఎర్ర రంగు” అన్నాడు గుమాస్తా నవ్వుతూ.

అన్నదమ్ములు ముగ్గురూ, నేను గెలిచా అనుకుంటే నేను గెలిచా అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్లిద్దరూ వచ్చారు.

ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికీ ఆత్రంగానే ఉంది. అందుచేత అటే ఆలస్యం చేయకుండా ముగ్గురూ వీథిలోకి వచ్చారు.

పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, “ఇంకా దగ్గిరికి పోవలసిన అవసరమేముంది? శాసనం పలకమీది అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి. చదవనా? శ్రీరామ కటాక్షము – కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి!” అన్నాడు.

ఈ మాటల్లు విని చిన్నవాళ్లిద్దరూ నిర్హాంత పోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్లు భయపడ్డారు. కాని రెండో వాడు తెప్పరిల్లుకుని, ‘పలక ఏరంగుది? అక్షరాలు ఏ రంగు?” అని అడిగాడు.

పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. “రంగా! నీకు రంగు కనిపిస్తున్నడా?’ అడిగాడతడు రెండోవాడిని.

“రంగు కనిపించకపోవటమేమిటి? తెల్లటి పలకమీది బంగారు పూత పూసిన చెక్కుడు అక్షరాలు అనిపించటం లేదూ?” అన్నాడు రెండోవాడు.

“మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు, ఆ పలకమీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు కబోది కూడా చదువుతుంది” అన్నాడు మూడోవాడు.

“ఫలకమీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా? అన్నారు పెద్దవాళ్లిద్దరూ.

“కనిపిస్తూంటేనే! ఎర్రటి అక్షరాలు. ఫలానావారు అని స్పష్టంగా రాసి ఉంది! ఏమిటో అనుకున్నాను. మీ ఇద్దరి చూపు కంటే నాదే నయంలాగుందే!’ అన్నాడు మూడోవాడు, |

పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో, ‘నీ చూపే మన ముగ్గురి లోకీ మంచిది. తరవాత నా చూపు మంచిదంటాను, పెద్ద అక్షరాలను గుర్తించినది నేను, కద! మీరింకా ముందుకుపోబోతుంటే నేను అక్కడే ఆగాను. అందుచేత నీకు నాకూ రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు.

రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో, పలక ఏ.రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మటం?

కాస్సేపు ముగ్గురూ ఘుర్షణ పడి ఈ విషయంపై ఎవరి తీర్పు అయినా తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు.

“అయ్యా! మీరెవరో కాస్తా మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసి ఉన్న మాట అబద్దమా?” అని పెద్దవాడు గుమస్తాను అడిగాడు,
“కాదు!” అన్నాడు గుమాస్తా

“పలకతెల్ల చలవఠాయి అవునంటారా? దానిమీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా?’ అన్నాడు రెండోవాడు.

“అవును!” అన్నాడు గుమాస్తా.

“చిన్న అక్షరాలతో ఫలానావారు అని రాసి ఉన్నమాటా, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా?’ అన్నాడు మూడోవాడు.

“నిజమే!” అన్నాడు. మళ్లీ అన్నదములు ముగ్గురూ ‘నా చూపుమెరుగు! అంటే నా చూపు మెరుగు” అని తగాదా పడసాగారు.

సత్రం గుమాస్తావారిని ఆపి, ‘మెరుగోతరుగో గాని మీ ముగ్గురి చూపూ ఒకటి గానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు!’ అంటూ నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు.

—{చత్వారం : ఒక వ్యక్తి యొక్క వయసు పెరిగే కొద్దీ దగ్గరి వస్తువులపై చూపు నెమ్మదిగా తగ్గుతుంది. దీనికి స్పష్టమైన కారణం తెలియదు. చత్వారము అనేది కంటి స్థితి ని తెలిపేది.

దీనిలో కన్ను, కళ్ళు నెమ్మదిగా దగ్గరగా ఉన్న వస్తువులపై త్వరగా దృష్టి పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ చత్వారం ఉన్న వాళ్ళకి దూరంగా ఉన్న వస్తువుల కంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడటం కష్టం . పిల్లలకి కథ చెప్తూ చత్వారం గురించి కూడా చెప్పండి. దీని వలన వారికొచ్చిన సందేహం కూడా నివృత్తి అవుతుంది

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *