కరోనా కౌగిలి

కరోనా కౌగిలి

అబ్బో మొగుడు లేకున్నా టింగు రంగ అంటూ బయలు దేరిందమ్మ టక్కులాడి మంచి మంచి చీరలు కట్టుకుంటూ, ఆఫీసుకు పోతుందా నా కొడుకు ప్రాణాలు తియ్యడానికి వాడిని చేసుకుంది దొంగ మొహంది వాడిని కాల్చుకు తిన్నది.

ఇప్పుడు వాడు పోగానే పిల్లలను పక్కకు పెట్టీ ఆఫీస్ అంటూ పొద్దున్నే తయారయ్యి అవతల పడితే నేను ముసలి దాన్ని ఇంటి శాకిరి అంతా చేయలా నాకేం వచ్చింది నేను చేయను అని కూర్చుంటే పాపం చిన్న పిల్లలు ఆకలితో ఉంటారని చేస్తున్నా, అయినా నీకేం పోయె కాలమే నన్ను కూర్చో బెట్టి చేయాలి కానీ నన్నే చేసుకోమని అంటావా? అంటూ పావని పట్టుకొని పైకి లేచింది అత్త ఆదెమ్మ.

ఏంది అత్తా అరుస్తున్నవు? నేనే అన్ని పనులు చేసి పోతున్నా కదా ఆఫీసుకు. మబ్బున లేచి పిల్లల పనులన్నీ చేసి, వంట చేసి, నీకు రొట్టెలు చేసి, ఇంట్ల అన్ని పనులూ చేసింది కాక రెండు ఇండ్లు ఒప్పుకున్న పనికి. ఆ రెండిల్ల పని అయ్యాక నీ కొడుకు ఉద్యోగం అబ్బో పెద్ద ఉద్యోగం ఆఫీస్ లో ఉడ్చే ఉద్యోగంకు పోతున్నా…

Concept photo shows Vaccine for Corona Virus | Thank you in … | Flickr

నీ కొడుకు నన్ను నా పిల్లలను నట్టేట ముంచి పోయాడు. కరోనా కాలంల బయటకు పోకు అంటే ఆఫీస్ ల మందు తాగుతూ దావత్ లు చేసుకుని కరోనా అంటించుకున్నాడు.

ఆయన వైద్యానికి ఎన్నో పైసల్ అయే, ఆ బాకిలోల్లు ఊరుకుంటారా ఏమీ సంవత్సరం అయ్యింది నీ మొగడు పోయి బాకీలు కట్టు అనవట్టిరి ఇగ ఇంట్ల కుసుంటే నా పొరల్లు ఆకలికి సస్తరు నిన్ను సుసుకోవలి అని పనికి పోవడ్తి అది చూసి నీకు కళ్ళు కుట్టవట్టే ఈ ఉద్యోగం రానికీ నాకెంత కట్టం అయ్యింది.

ఇరవై వెలు ఇయ్యమని అన్నది ఆ దొరసాని ఉద్యోగం పర్మినెంట్ చేయడానికి ఆ పైసలు అప్పు జేశి కడతి ఇంకా ఆర్డర్ రాక పాయె ఇవ్వన్నీ కాదన్నట్టు నీ కొడుకు సావుకు నేనే కారణం అని నీ ఒర్రుడు ఒకటి..

సుడత్తా నేను పనికి పోతున్న. ఇంకొక సారి ఒర్రినవో ఇంట్ల నుండి బయటకు పంపుత. ఏడికి పోతవో పో ఇగ అంటూ అత్తకు గట్టిగా చెప్పి చెప్పులు వేసుకుని బయటకు నడిచింది పావని.

మొన్నటి దాకా తనని చూసి భయపడిన కోడలు ఒక్కసారి ఉద్యోగం రాగానే ఇలా ఎదురు చెప్పేది చూసి బిత్తర పోయింది ఆదెమ్మ, కొడుకు ఉన్న నాడు బిక్కు బిక్కి మంటు ఉన్న కోడలు ఇప్పుడు ఉద్యోగం రాగానే ఎగురుతుంది దీని పొగరును ఎలాగైనా దించాలి అని పళ్ళు కొరుక్కో సాగింది.

File:Corona virus Covid-19 Single Virion.png - Wikimedia Commons

కరోనా కౌగిలి

పావని మాస్క్ పెట్టుకుని ఇళ్లలో పని చేయడానికి బయలు దేరింది. భర్త మల్లేష్ కరోనా రాక ముందు బాగానే పని చేసేవాడు. తనను పిల్లలను బాగానే చూసుకున్నాడు. అప్పుడప్పుడు తాగే వాడు కానీ కరోనా వచ్చాక దోస్తులు అందరూ కలిసి ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఆఫీస్ లోనే రాత్రి లేక పగలు లేక మందు తాగుతూ ఉండేవారు.

తాను ఎంత మొత్తుకున్నా వినలేదు మల్లేశం, అందరూ పైసల్ లేక ఇబ్బంది పడుతుంటే అప్పటి దాకా దాచిన డబ్బును తీసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు మల్లేశం.

ఫలితంగా కరోనా వచ్చింది అసలు ఏ లక్షణాలు కనిపించలేదు బాగానే ఉన్నాడు ప్రొద్దున అంతా, రాత్రి కాగానే ఒళ్ళు వెచ్చబడింది. శ్వాస తీసుకోలేక పోయాడు. అది చూసి అందర్నీ పిలిచినా ఎవరూ దగ్గరికి కూడా రాలేదు మేము రాము అని చెప్పారు. తానొక్కత్తి అతన్ని పట్టుకుని ఆటో అతన్ని బతిమాలింది.

వెయ్యి రూపాయలు ఇస్తా అంటే అతను వచ్చాడు. కానీ, సగం దూరం వెళ్ళాక ముందే భర్త తన చేతిలోనే చనిపోయాడు. అయినా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే, వాళ్ళు చూసి చనిపోయాడు అని చెప్పారు. అప్పుడు కూడా ఎవరూ రాలేదు అత్త కూడా కొడుక్కి దూరంగానే ఉంది.

మొగుడు పోయాక పిల్లలకు తిండికి చాలా కష్టం అయ్యింది. దాచిన డబ్బు అంతా మల్లేశం మందుకు ఖర్చు పెట్టాడు. తను దాచిన డబ్బు తీసి ఆరునెలలు తిండి కోసం పెట్టింది. అత్తా అన్ని చూస్తున్నా కనీసం తన దగ్గర ఉన్న పైసలు తీసి ఇవ్వనే లేదు.

పైగా కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది తనను తన పిల్లలను పట్టించుకోకుండా.. తాను ఎన్నో కష్టాలు పడి, ఉన్న గొలుసు అమ్మి ఉద్యోగానికి లంచం ఇచ్చింది. అది వచ్చెంతలో రెండిల్లలో గిన్నెలు కడగటానికి ఒప్పుకుంది. మరి ఏం చేస్తది? మొగుడు ఉన్నప్పుడు తిండికి కష్టం కాలేదు. వాడు పోయాక కష్టం అయ్యింది. పిల్లలను ఆకలితో చూడలేక ఇళ్లలో పనికి చేరింది అభిమానం చంపుకుని..

అదైనా చాలా కష్టంగా దొరికింది కరోనా కాలంల ఎవరు ఎవర్నీ రానివ్వడం లేదు ఇదేదో నెగటివ్ అని రిపోర్ట్ చూపిస్తే అప్పుడు ఇచ్చారు పని. దేవుడు దయగల వాడు కరోనా తనకి అంటలేదు. మొగుణ్ణి హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళినా కూడా రాలేదంటే తన పిల్లల అదృష్టం అనుకుంది.

అయినా అత్తకు నేను అంటే ఎందుకో అంత పగ. కోడలు కష్ట పడుతుంది అని ఇంత జాలి కూడా లేదు. పని ప్రొద్దున్న చెయ్యాలి, రాత్రికి చేయాలి అనుకుంటూ ఆలోచనలతోనే పనిలోకి దూరింది పావని..

కరోనా కౌగిలి

Panic grips Secunderabad locality after man with corona-like symptoms dies

దొంగ మోహంది నాకే ఎదురు చెప్తుందా? దాని అంతు తేల్చాలి. ఉద్యోగం చేస్తున్నా అని పొగరు ఎక్కువ అయ్యింది. అబ్బా ఇదేంటి నాకు గొంతులో అంత గరగరగ ఉంది? అమ్మో సలి సంపుతుంది అయ్యో అరేయి పిల్లలు చద్దర్లు కప్పురా అంటూ మునగ దిసుకుని పడుకుంది ఆదెమ్మా.

పిల్లలు అది చూసి పావనికి ఫోన్ చేశారు. నాయనమ్మకు ఏమో అయితుంది అని ఇద్దరు పిల్లలు పావనికి (బాబు మూడేళ్లు, పాప ఏడేళ్లు)  భయపడుతూ ఫోన్ చేసేసరికి పావని కంగారు పడుతూ ఇంటికి వచ్చింది పని మధ్యలోనే వచ్చేసరికి ఆదేమ్మ పడుకుంది.

అత్తా ఏమౌతుంది అని దూరం నుండి అడిగింది పావని. సలి వెడ్తుంది, గొంతుల గరగర ఉంది ఒళ్లంతా నొప్పులు ఉన్నాయి అని చెప్పింది పావనికి. అమ్మో ఇది అదే అంటూ అత్తను వేరేగా ఒక రూమ్ లోకి వెళ్ళమని చెప్పింది పావని.

ఎందుకే నేను ఇక్కడే పడుకుంటా అంది ఆదెమ్మా, వద్దు అత్తా చిన్న పిల్లలు ఉన్నారు అక్కడే ఉండు అని తనకు తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసింది తాను పని చేసే ఒక ఇల్లు డాక్టర్ గారిదే కావడం వల్ల డాక్టర్ ప్రేమ్ పాపం అని భావించి నర్సును పంపాడు కిట్ ఇచ్చి నర్సు వచ్చి టెస్ట్ చేసింది.

రిపోర్ట్ వచ్చే వరకు అత్తను దూరంగానే ఉంచి అన్నం, నీళ్లు, గోళీలు ఇవ్వసాగింది పావని. కానీ, ఆదెమ్మ మాత్రం లోలోపల కుళ్ళుకోసాగింది. తనకు రోగం వచ్చిందని కోడలు తనను దూరంగా పెట్టడం, అన్నం పై నుండి వేయడం, పిల్లలను దగ్గరికి రానివ్వక పోవడం, తనను అంట రాని దానిలా చూడడం వల్ల ఆదేమ్మా మనసులో కోడలి మీద పగ పెరగసాగింది.

నన్ను దూరంగా ఉంచి, టక్కులాడి అన్ని విధాలా చేసుకుని తింటుంది. నన్ను సరిగ్గా చూడడం లేదు. మటన్, చికెన్ చేసుకుని తింటున్నారు. నాకు రెండు ముక్కలు, ఇంత పులుసు వేసి పడేస్తున్నారు అనుకుంటూ ఉంది. పాపం పావని మాత్రం అత్తకు బలం రావాలి అని చికెన్ మటన్ సూపు చేసి పోస్తుంది. కానీ అది ఆదేమ్మకు నచ్చడం లేదు.

మూడో రోజు టెస్ట్ రిపోర్ట్ రావడం వల్ల డాక్టర్ ప్రేమ్ గారు ఫోన్ చేసి చెప్పాడు కరోనా పాజిటివ్ అని, దాంతో పావనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్నది రెండు గదుల ఇల్లు ఇంకొక గది లేదు పోని హాస్పిటల్ లో జాయిన్ చేద్దాం అంటే చాలా డబ్బు కావాలి.

పోని, దూరంగా ఉన్న ఆడపడుచు ఇంటికి పంపాలి అనుకుని ఆడపడుచు కు ఫోన్ చేసింది పావని ఆడపడుచు వినగానే అయ్యో అమ్మకు ఇలా జరిగిందా అని బాధపడి తన ఇల్లు కాస్త పెద్దగా ఉండడం వల్ల వదిన మంచితనం తనకు తెలుసు కాబట్టి ఇక్కడికి పంపమని అన్నది ఆడపడుచు కళ్యాణి .

పావని వెంటనే అత్తను పంపడానికి అత్తతో చెప్పింది కళ్యాణి ఇంటికి వెళ్ళి ఉండమని. కాని ఆదెమ్మకు వెళ్ళడం ఇష్టం లేదు. కూతురి ఇంటికి వెళ్తే ఎంత నామోషీ అక్కడ గట్టిగా మాట్లాడలేదు, ఉండలేదు. అల్లుడి ముందు చిన్నతనంగా అనిపిస్తుందని నేను పోను అన్నది.

Corona Virus Coronavirus - Free photo on Pixabay

కానీ, పావని అత్తా నీ వల్ల నీ మనుమల్లు బాధ పడతారు మాకు అంటుకుంటది కాబట్టి నువ్వు వెళ్లాలి అని పట్టు పట్టింది. లేదు, నేను ఎక్కడికి పోను నా కొడుకు ఇంట్లో నేను ఉంటాను అంటూ ఆదెమ్మ కూడా పట్టు బట్టింది.

దాంతో పావనికి ఏం చేయాలో తెలియక నలుగురికి విషయం చెప్పింది. ఆ నలుగురు మాస్క్ లు పెట్టుకుని వచ్చి ఆదెమ్మను నాలుగు మాటలు అన్నారు. దాంతో ఆదెమ్మ అయిష్టంగా ఒప్పుకుంది. ఒక ఆటో మాట్లాడి అందులో పంపడానికి ఒప్పుకున్నారు అందరూ.

ఆటో వచ్చింది. ఆదెమ్మ కోపంతో రగిలి పోయింది తనను తన ఇంట్లోంచి గెంటేస్తున్న కొడలును ఎలాగైనా కష్ట పెట్టాలి అనుకుని ఆటో ఎక్కేది అల్లా గబుక్కున వచ్చి పిల్లలను, పావనిని ఒక దగ్గర ఉండడం చూసి వెళ్లి వాళ్లను గట్టిగా కౌగిలించుకుంది. ఆదెమ్మ చేసిన పని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అయ్యో అందరికీ అంటించింది అని బాగా తిట్టారు ఆదెమ్మను అయినా ఆదెమ్మ నవ్వుకుంటూ ఇప్పుడు మీరు సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తా అన్నది.

విషయం తెలిసిన పోలీసులు ఆదెమ్మ మీద కేసు పెట్టారు కానీ కరోనా తగ్గిన తర్వాత తీసుకుని వెళ్తాం అన్నారు పోలీసులు అందర్నీ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. తన పిచ్చితనంతో, అసూయతో ఆదెమ్మ కొడలుకు పిల్లలకు కరోనా అంటించింది. దాని వల్ల తానేం సాధించిందో తనకు ఐసో లేషన్ సెంటర్ లో అయినా తెలిసి వస్తుందేమో చూడాలి…

(ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు ఇలా కుడా ఉంటారని చెప్పడానికి మాత్రమే, ఎవ్వరినీ ఉద్దేశించి కాదు!!!) 

-భవ్యచారు

Related Posts

1 Comment

  1. పొరపాటున ముట్టుకుంటేనే కరోనా వస్తుందనే ఆదెమ్మకు తెలియని విషయం ఏమిటంటే కరోనా గాలివలన ఒకరినుండి మరొకరికి సంక్రమిస్తుంది. ఏదేమైనా ఇతరులను ఇబ్బంది పెట్టి ఆమె ఏవి
    సాధించిందో అర్థం కాదు. ఏమైనా కధ
    ఆలోచింపజేసేదిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *