దీపం
సాయంత్రం వెలుతురు అస్తమిస్తుంది.
ఉదయాన చీకటి అస్తమిస్తుంది.
ఆమె ప్రతీక్షణం అస్తమిస్తూనే ఉంటుంది.
ఋతువులెన్ని మారినా…
జీవితమంతా ఆమెకు ఆకురాల్చు ఋతువే.
ఆమె నవ్వు ఆమెకోసం కాదు.
ఆమె అందం ఆమెకోసం కాదు.
నిజానికి ఆమెనే ఆమెకోసం కాదు లేదు.
ఆమె పంచుతున్న సుఖానికిలాగే..
ఆమె స్వేదానికి ఆమె కన్నీళ్ళకు గుర్తుల్లేవ్ గుర్తింపు లేదు.
విలువల్లేని మనుషులు వలువల్లేని మాటలతో..
ఆమెను అంగడి బొమ్మంటు గేలిచేస్తారు.
సృష్టి ఆమెను బహిష్కరించిందో…
ఆమెనే సృష్టిని బహిష్కరించిందో..
ఏమోగాని
రహస్య బంధిత జీవన్మరణ క్రీడలో..
ఆమె ఎప్పటికప్పుడు దేహాన్ని విసర్జిస్తూనే ఉంటుంది.
ఆమెది కోల్పోవడం అనివార్యమైన జీవితం.
పచ్చని నోట్లతో పచ్చిగా ఆమెను తడమగలవేమో కానీ…
ఎన్ని రాసులుపోసి ఆమె మనసును తాకగలం.
స్వేదం కన్నీళ్ళు నెత్తురు ఆవేదనే ఆమె నేస్తాలు
ఆమెకు కలలు లేవు కన్నీళ్ళే
అరే…
ఎంతమందికి తెలుసు ఆమెకు కూడా మనస్సుంటుందని ?
ఆమె కడుపు కోసం పడుపైంది.
కానీ…
పడుపు కోసమే గడప దాటలేదు.
ఎందరు వెంబడిస్తారో…
ఇంకెందరు నిష్క్రమిస్తారో…
ఎన్ని వసంతాలు కరిగిపోతాయో…
ఎన్ని కన్నీళ్ళు నదులై పారతాయో…
ఎన్ని స్వప్నాలు ఆత్మహత్య చేసుకుంటాయో…
దీపం వెలుగుతున్నంత కాలం
ఆమె ఓ ఆరిపోని దీపం.
ఊరిడిసినా ఆమెను
ఊరిడిసిపెట్టలేదు…
ఆశగా అమెవైపే చూస్తుంటుంది…
–-గురువర్ధన్ రెడ్డి