డిటెక్టివ్ ఎపిసోడ్ 5

డిటెక్టివ్ ఎపిసోడ్ 5

డిటెక్టివ్ ఎపిసోడ్ 5

వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది. “మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి.. నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు “చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు.. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు.. వాక్యం బావుందని ‘యు అర్ అండర్ అరెస్ట్” అన్నంత మాత్రాన అరెస్ట్ కావడానికి డిటెక్టివ్ సిద్దార్థ అమాయకుడు కాదు… మా ఫ్రెండ్ మీలాంటి వాళ్లకు ఓ మంచిపేరు పెట్టింది… మాయకులు…” నవ్వుతూ అంది సుగాత్రి.

కాఫీ కప్పును సిద్దార్థ చేతికి ఇస్తూ… “నేనా… ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఉన్న వాళ్లకు ట్రైలర్ మేడ్ తెలివితేటలుంటాయని ఎక్కడో విన్నాను” అంటూ కాఫీ కప్పు అందుకుని కాఫీ స్మెల్ చూస్తూ ‘ఫిల్టర్ కాఫీ అయితే బావుండేది” అన్నాడు. “మీకోసం నేర్చుకుంటాను” అనాలనుకుంది.. కానీ అప్పటికే కేబిన్ బయట మిగితా ఆఫీసర్స్ వున్నారు. “మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మిస్టర్ డిటెక్టివ్ ప్లీజ్” అంది అభ్యర్ధనపూర్వకంగా డిటెక్టివ్ సిద్దార్థ అధికారానికి ఆధిపత్యానికి తల వంచడని తెలుసు. “నేనెప్పుడూ నిజాలే మాట్లాడుతాను.. ఐ ఈట్ నిజాలు.. ఐ డ్రింక్ నిజాలు.. ఐ లవ్ నిజాలు.. ఆఫ్ కోర్స్ / ఐ లవ్…”

అని ఆగి” చెప్పండి. ఏం నిజాలు మాట్లాడుకుందాం? అడిగాడు కాఫీ సిప్ చేస్తూ… “మీరు హైద్రాబాద్ ఎందుకొచ్చారో ఆ నిజాలు” అంది సుగాత్రి “మీ సిబిఐ వాళ్ళేం చెప్పలేదా? అయినా ది గ్రేట్ సుగాత్రి మేడంకు తెలియని సీక్రెట్ ఉంటుందా?” టీవీ స్టూడియో దగ్గరికి వచ్చేసరికి మిస్టర్ డి.మీ మీద ఎటాక్ చేయించడానికి మనుష్యులను పంపించినట్టు తెలిసింది.. అందుకే ఈ అరెస్ట్ నాటకం… మీతో మాట్లాడితే కానీ ఓ క్లారిటీ రాదు కదా? సుగాత్రి చెప్పింది.

‘ఇపుడు నేను కాసేపట్లో తప్పించుకుంటాను… పోలీసుల కళ్లుగప్పి డిటెక్టివ్ సిద్దార్థ పరారీ” అనే వార్త మీడియాలో వస్తుంది. చెప్పాడు సిద్దార్థ. ఒక్కక్షణం అలానే చూస్తూ ఉండిపోయింది సుగాత్రి… పెదవులతో.. చిరునవ్వుతో మాట్లాడగలడు.. కళ్ళతో కేసు పరిశోధించగలడు.. చూపుల్లో వాడివేడి… మిస్సయిల్ లా దూసుకువెళ్తాడు…” థాంక్యూ సుగాత్రి గారూ “అన్నాడు సిద్దార్థ” గారు వద్దులెండి సుగాత్రి చాలు” అంది.

“అవును నాకు గతి చాలు” మనసులో అనుకుని.. సుగాత్రి వైపు చూసి..”నాకు సిటీ లో వున్నా గప్ చుప్.. అదే పానీపూరి బండ్ల డిటైల్స్ కావాలి. ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ ముందు ఉండేవి.. అందులోనూ ఈ మధ్య “డి” మొబైల్ పానీపూరి వాలాల డిటైల్స్ కావాలి… “చెప్పాడు సిద్దార్థ, “ష్యూర్..” అంది సుగాత్రి.

“నేను నేచురల్ గా తప్పించుకుంటాను… మీకూ నాకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలియకూడదు.” అన్నాడు. “అంటే నా తలమీద బాది “నవ్వి అంది సుగాత్రి సుగాత్రి వంక చూసి “మిస్టర్ డి తో మనం ఢీ కొనబోతున్నాం ” అన్నాడు. “మీ అనుమానం..”అంటూ ఆగింది సుగాత్రి “అనుమానం కాదు నిజం..

మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ పానీపూరీలో ఉపయోగిస్తున్నారు…. మెల్లిమెల్లిగా దీనికి ఎడిక్ట్ అవుతుంది యువత. చివరికి పిల్లలు కూడా.. ఇది చాలా ప్రమాదకరమైంది.. రోజు కొన్ని లక్షల్లో బిజినెస్” ఒక్కక్షణం అలానే ఉండిపోయింది. ఎంత ఘోరమైన విషయం… చాప క్రింద నీరులా… సరిగ్గా గంట తరువాత ప్రెస్ కు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్ ఫ్లాష్ న్యూస్ వెళ్ళింది “పోలిసుల కళ్లుగప్పి డిటెక్టివ్ సిద్దార్ధ పరారీ “

**********

జేమ్స్ కు నిద్రపట్టడం లేదు. రెండురోజులుగా విచిత్రమైన సంఘటనలు. పెద్దపేరున్న డిటెక్టివ్ సిద్దార్థ అరెస్ట్ కావడమేమిటి? అతను తన క్యాబ్ లో ఎక్కడం.. తనను కిడ్నాప్ చేయడం.. డేవిడ్ చనిపోవడం… అతని బుర్ర వేడెక్కి పోతోంది. “త్వరగా వచ్చి పడుకోండి” డేవిడ్ భార్య అంది భర్తను ఉద్దేశించి “నువ్వు పడుకో వస్తున్నా” అంటూ కిటికీ తలుపు వేయబోయి ఉలిక్కిపడ్డాడు డేవిడ్ తన వైపే చూస్తున్నాడు.. తనను పి…లు…స్తు…న్నా…డు…

ఒక్కక్షణం భయంతో వణికిపోయాడు. గట్టిగా కళ్ళు మూసుకుని కొద్దిక్షణాల తర్వాత కళ్ళు తెరిచాడు జేమ్స్. ఎదురుగుగా తననే చూస్తూ డేవిడ్. తనను చేతులు చాచి పిలుస్తున్నాడు. వెంటనే కిటికీ తలుపులు మూసాడు. జేమ్స్ భార్య వైపు చూసాడు. తను ప్రశాంతంగా పడుకుంది…. తనకలా ప్రశాంతంగా పడుకునే అవకాశం లేదు.

తనకే ఎందుకిలా జరుగుతుంది? వెళ్లి భార్య పక్కనే పడుకున్నాడు. అనీజీగా వుంది. ఎవరికి చెప్పగలడు? ఏమని చెప్పగలడు? గోడ గడియారంలోని చిన్న ముల్లు తిరిగే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. పెద్ద శబ్దంతో తిరుగుతున్నట్టు అనిపించింది. ఈ సమయంలో తనను ఆదుకునేవారెవరు? తన సమస్యకు పరిష్కారం చెప్పేవారెవరూ… ప్రభువా నువ్వే దిక్కు… క్రాస్ చేతిలోకి తీసుకుని అనుకున్నాడు.

సరిగ్గా అప్పుడే తలుపుల మీద దబదబ బాదిన శబ్దం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని గుండె చప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తుంది. ఈ టైం లో తన ఇంటి తలుపు తట్టేదెవరు? ఖచ్చితంగా డేవిడ్ అయి ఉంటాడు. అయినా చనిపోయిన డేవిడ్ తనకు కనిపించడం ఏమిటి? తలుపుల మీద శబ్దం వినిపిస్తూనే వుంది.

ఏంచేయాలి? భార్యను లేపాలా? తను మరింత భయపడుతుంది. క్రాస్ చేతిలోకి తీసుకుని లేచాడు. మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ తలుపు హాలులోకి నడిచాడు. వణుకుతోన్న చేతులతో తలుపు తీసాడు. ఎదురుగా ఉన్నదెవరో చూడాలన్నా భయం. తన భుజం మీద చెయ్యిపడింది. బలవంతాన గొంతులో నుంచి వచ్చిన కేకను ఆపుకుని కళ్ళు తెరిచి షాక్ కు గురయ్యాడు.

ఎదురుగా సిద్దార్థ… డిటెక్టివ్ సిద్దార్థ “సర్ మీరా? ఆశ్చర్యం ఆనందం ఏకకాలంలో కలిగాయి. సిద్దార్థ రాకతో కొండంత బలం వచ్చినట్టు అనిపించింది. “వేరే ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేసావా? నవ్వుతూ అన్నాడు సిద్దార్థ “అదికాదు సర్ మీరు ఇక్కడికి.. నా ఇంటిని వెతుక్కుంటూ.. “సంశయంగా చెప్పాడు. “పారిపోయి వచ్చాను” తాపీగా చెప్పాడు సిద్దార్థ.

నమ్మలేనట్టు చూసి అన్నాడు “పారిపోవలిసిన ఖర్మ మీకంటి సర్? మీరు పెద్ద డిటెక్టివ్” అన్నాడు సుగాత్రి అన్న మాటలు గుర్తొచ్చి జేమ్స్. “ఏం చేస్తాం.. పానీపూరీ తినడం నేరమైంది. అప్పటికీ మా బామ్మ చెప్పింది హైద్రాబాద్ లో పానీపూరి తినేప్పుడు జాగ్రత్త అని” అని సిద్దార్థ చెప్పి ఆ ఇంటిని పరిశీలంగా చూసాడు. “జోకులేయకండి సర్..” డేవిడ్ సంగతి కాసేపు మర్చిపోయి అన్నాడు రిలాక్స్ అవుతూ…..!

(ఇంకా వుంది)

– భరద్వాజ్

చలిమంట Previous post చలిమంట
మనిషికి మరో గ్రహంలో చోటు దొరుకుతే Next post మనిషికి మరో గ్రహంలో చోటు దొరుకుతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *