దేవత

దేవత

    

డాక్టర్… “ అన్నాను మెల్లగా. ఆ మూడు అక్షరాలు పలకడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. నేను డాక్టర్ ని కాదు. నర్స్ ని. ఏం కావాలో చెప్పండిఅందామె. ఆమె గొంతు చాలా తీయగా, మృదుమధురంగా ఉంది. నాకు ఏమైందో కాస్త చెప్పగలరా?” అన్నాను మెల్లగా. రెండు క్షణాల మౌనం తరువాత, మీకు ఏక్సిడెంట్ జరిగింది. ఎవరో మిమ్మల్ని ఇక్కడ చేర్చి వెళ్లిపోయారు. ఇది జరిగి మూడు రోజులయ్యింది. ఈరోజే మీరు స్పృహలోకి వచ్చారు. చెప్పండి మీ ఒంట్లో ఎలా వుంది?” అందామె. ఆమె గొంతులో ఏదో లాలిత్యం. మార్దవం.

నాకు ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉంది. కళ్ళు కూడా విప్పలేకపోతున్నాను. నా కళ్ళకు కట్టు కూడా కట్టారు. ఎందుకు?” అన్నాను ఆతృతగా. ఆమె కాసేపు తటపటాయించింది. తరువాత మెల్లగా చెప్పింది. ప్రమాదంలో మీరు మీ కళ్ళను…” అర్ధోక్తిగా ఆగిందామె. నాలో కంగారు పెరిగింది. నా కళ్ళను, ఏమైందో చెప్పండిఅన్నాను ఆతృతగా. పోగొట్టుకున్నారు…” మెల్లగా చెప్పిందామె. ఆమె మాటలు వింటూనే షాక్ అయ్యాను. మెదడు మొద్దుబారింది. మీరుమీరు చెప్పేది నిజమేనా?” అన్నాను బాధగా. నా కళ్ళు జలధారలయ్యాయి. ఆమె కంగారు పడింది.

సర్నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి. ప్రమాదంలో మీ కళ్ళు దెబ్బ తినటం మాట వాస్తవమే. కానీ, మీరు కంగారు పడవలసిన పని లేదు. మీకు త్వరలో ఆపరేషన్ జరుగుతుంది. కళ్ళు వచ్చే అవకాశముందని డాక్టర్ గారు చెప్పారు” అందామె నేను బాధ పడటం చూసి, ఆమె మాటలతో నాకు కాస్త ఉపశమనం కలిగింది. మీరు చెప్పేది నిజమే కదా?” అన్నాను అభ్యర్ధనగా.

నొప్పులు తగ్గటానికి ఇంజెక్షన్ చేసాను. డాక్టర్ గారు వచ్చి చూస్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ వస్తానుఅని చెప్పి వెళ్లిపోయిందామె. మళ్ళీ ఎవరో నా దగ్గరకు వచ్చిన అలికిడి. నర్స్ మీరేనా? మళ్ళీ వచ్చారా?మీరు ఇచ్చిన ఇంజెక్షన్ తో నాకు నొప్పులు కాస్త తగ్గాయి” అన్నాను ఎంతో ఆరాధనగా. నేను నర్స్ ని కాను. డాక్టర్ ని. చెప్పండి. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా వుంది?” అడిగాడాయన. అతని గొంతు గంభీరంగా వుంది. పర్వాలేదు డాక్టర్ కొంచెం బాగుందిచెప్పాను.

మీకు ఒంట్లో కాస్త కుదుట పడ్డాక మీ కళ్ళకు ఆపరేషన్ చేస్తాం. అదృష్టం బాగుంటే మీకు చూపు రావొచ్చుఅని చెప్పి వెళ్లిపోయారాయన. హు అదృష్టం విరక్తిగా నవ్వుకున్నాను. ఆ పదానికి నాకు చాలా దూరం. ఆ అదృష్టమే ఉంటే నేను చిన్నప్పుడు తండ్రిని, పెద్దయ్యాక తల్లిని, పోగొట్టుకొని అనాథగా మిగిలిపోయేవాడ్ని కాదు. ఆ అదృష్టమే ఉంటే నేను గాఢంగా ప్రేమించిన ప్రియ నాకు దూరమయ్యేది కాదు. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం కలగదు. నా జీవితం ఇలా అంధకార బంధురంలా సాగిపోవాల్సిందే. విరక్తితో సాగే ఈ నా ఆలోచనలు. అలా ఆలోచిస్తూనే నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను. ఎవరో నన్ను తట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది.

మీకోసం భోజనం తెచ్చాను. లేచి తినండిఅందామె. నేను మౌనంగా ఉండిపోయాను. మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి. కబురు పెడతాం. మిమ్మల్ని చూసుకోవడానికి” అందామె మళ్ళీ. అప్పుడు పెదవి విప్పాను. నాకంటూ ఎవరూ లేరు. నేను అనాథనుచెప్పాను. ఆ మాట విన్నాక ఆమె నా వైపు ఎలా చూస్తోందో నాకు తెలుసు. ఆమె కళ్ళు నన్నుజాలిగా చూడటం నా మనసుకు తెలుస్తూనే ఉంది. క్షణం మౌనం తరువాత, చూడండి. ఎలాంటివారికైనా ఇక్కడ వైద్యంతో పాటూ హాస్పిటల్ సేవలూ అందుతాయి. మీ బాగోగులు చూసుకోవడానికి నేనున్నాను. మీరు బాధ పడకండి” అంటూ ఆమె నన్ను పైకి లేపి కూర్చో బెట్టింది. ఆమె సహాయంతో లేచి కూర్చున్నాను. తరువాత ఆమె తెచ్చిన భోజనం నాకు తినిపించ సాగింది. ఆమె అలా తినిపిస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె అవ్యాజమైన ప్రేమకు చలించి పోయాను. నా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆమె కంగారు పడింది.

మీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువుగా ఎమోషన్ అవుతున్నారు. ఇది నా వృత్తి. మీ స్థానంలో ఎవరున్నా నేను సహాయం చేస్తాను. మీరు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మందులకంటే ముందు మీ ఆత్మ స్థైర్యమే మిమ్మల్ని త్వరగా బాగు చేస్తుందిఅందామె. నిజమే! మందులకంటే కూడా ఆమె మృదువైన మాటలే నాపై ఎక్కువ ప్రభావాన్నిచూపించాయి. ఆమె ప్రేరణాత్మకమైన మాటలకు నాకు జీవితం పై ఆశ కలిగింది. ఆ తరువాత నుండి నాకు తెలియకుండానే నా మనసు ఆమెను ఆరాధించటం మొదలు పెట్టింది. ఎప్పుడూ ఆమె రాక కోసమే నా కళ్ళు ఎదురుచూస్తుండేవి. నా అంతర్నేత్రంతో ఆమె కదలికలను గమనించేవాడిని.

ఆమె నాకు అన్ని సేవలు చేసేది. కంటికి రెప్పలా కాపాడేది. చిన్న పిల్లాడ్ని సాకినట్టు సాకేది. నేను నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్ళీ పడుకోబోయేంత వరకు నాకు ఏ కష్టం కలగకుండా చూసుకునేది. నేను ఆశ్చర్య పోయేవాడిని. ఈరోజుల్లో కూడా ఇలాంటి సేవలు చేసేవారుంటారా అని. ఆమె సమక్షంలో, ఆమె సేవల్లో నేను మెల్లగా కోలుకోవడం మొదలు పెట్టాను. క్రమంగా ఆమె రూపం ఇలా ఉండి ఉండాలి అని నా మనోఫలకంపై ఆమె చిత్రాన్ని ముద్రించుకున్నాను. నా గుండె గుడిలో ఆమెను దేవతను చేశాను. ఆరాధించాను. ఆమెను ప్రేమించటం మొదలు పెట్టాను.

దేవత
దేవత

క్రమంగా ఆమె కూడా నాకు ఆకర్షితురాలు అవుతున్నట్టే అనిపించింది. ఆమె మాటలు, చిరునవ్వులు, నా మదిలో మల్లెలు పూయిస్తుండేవి. దాదాపుగా నాకు చాలా వరకు బాగయింది. ఇప్పుడు చిన్న చిన్న పనులు ఆమె సాయంతో నేను చేసుకోగలుగుతున్నాను. ఇంకా నాకు మిగిలింది కంటి ఆపరేషన్ మాత్రమే! ఆ ఆపరేషన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె నాకు చెప్పింది. ఆమె ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేది. తన డ్యూటీ విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా నాతో పాలు పంచుకునేది. ఆమె కూడా నాలాగ అనాథ! చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆశ్రమంలో పెరిగి పెద్దదయింది. చదువుకొని నర్సింగ్ ట్రైనింగ్ అయి ఈ హాస్పిటల్ లో జాబ్ చేస్తోంది. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అర్ధం అయ్యింది. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోందని.

నేను తెల్లగా అందంగా ఉంటాను. ఒడ్డూ పొడవూ ఉంటాను. ఇన్ని సేవలు చేసి నన్ను మనిషిగా బ్రతికించిన ఆమెను పెళ్లి చేసుకోవడంలో నేనూ ఏ తప్పూ చేయలేదనే అనిపిస్తుంది. అలాంటి మంచి మనసున్న అమ్మాయి నాకు భార్యగా దొరికితే నా జీవితమే నందన వనమవుతుంది. ఆమె గురించి ఇలా సాగేవి నా ఆలోచనలు. నాకు కంటి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నేను, ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాం. నేను ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు నమ్మాలని అనిపిస్తోంది. ఆమె ప్రేమతో నా జీవితం చిగురించింది. వసంతం వెల్లి విరిసిన భావన. నేను ఆమె సేవల వలన త్వరగా రికవరీ అయ్యాను. ఇక అదృష్టం బాగుండి నాకు కళ్ళు కూడా వస్తే నేను ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు మంచి జీవితాన్నివ్వాలి. ఆమెను సంతోష పెట్టాలి.

నేను క్షణం కూడా ఆమెని మర్చిపోలేకపోతున్నాను. అనుక్షణం గుర్తొస్తూనే ఉంది. ఆమె ఒకసారి అంది మన ప్రేమ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్లంతా ఇక్కడ వుండే నర్సులే కాబట్టి మిమ్మల్ని చూసారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే అని నన్ను పొగిడారుఅని చెప్పింది. అదృష్టం అంటే నీది కాదు. నీలాంటి అందమైన మనసున్న అమ్మాయిని పొందటం నేను చేసుకున్న అదృష్టంమనసులో అనుకున్నాను. ఆ తరువాత నా కళ్ళకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చాలా బాగా జరిగిందని డాక్టర్స్ అనుకుంటుంటే విని ముందుగా వచ్చి చెప్పిందామె సంతోషంగా. ఆమెకు నా పైన ఉన్న ఆపేక్షకు, అనురాగానికి నా హృదయం ద్రవించింది. ఆమె చేతులు నా చేతుల్లో ఉంచి ధైర్యం చెప్పిందామె.

ఈరోజు నా కళ్ళకు కట్లు విప్పే రోజు. డాక్టర్లు నర్సులు అందరూ నా వద్దకు చేరారు. మెల్లగా కట్లు విప్పడం మొదలు పెట్టారు. మీకు కట్లు పూర్తిగా విప్పాక మొదటగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు?” అని అడిగారు ఒక డాక్టర్. నా దగ్గర ఒకే ఒక జవాబు. అది నేను నా ప్రేమ దేవతనే ముందుగా చూడాలనుకుంటున్నాను అనుకున్నాను మనసులో. నేను నమ్ముతున్న అదృష్టం నన్ను వరించింది. ఆపరేషన్ విజయవంతమైంది. నాకు కళ్ళు తిరిగి వచ్చాయి. ముందుగా ఎదురుగా ఉన్న దేవుని ఫోటో పైన నా దృష్టి పడింది. ఆ తరువాత ఒక్కొక్కరిగా అందరినీ చూసాను. మల్లె పువ్వుల్లాంటి తెల్లటి డ్రెస్సుల్లో మెరిసి పోతున్న అందమైన ఆ నర్సుల్లో నా దేవత ఎవరో అనుకున్నాను. మా ప్రేమ విషయం తెలిసిన తోటి నర్సులు చిన్నగా చిరునవ్వులు చిందిస్తున్నారు.

తరువాత నన్ను బెడ్ పైకి చేర్చారు. ఈరోజే కట్లు విప్పారు కాబట్టి నేను మరి కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలట. ఎన్ని రోజులయినా నాకు ఉండడానికి అభ్యంతరం లేదు. కానీ నా ప్రేమ దేవతని ఒకసారి చూసి మాట్లాడితే చాలు అనుకున్నాను. రోజూ వచ్చి నాకు సేవలు చేసే నా ప్రేమ మూర్తి ఈరోజు రాలేదెందుకో నాకు అర్ధం కాలేదు. అటుగా వెళుతున్న ఒక నర్స్ ని అడిగాను ఆమె గురించి. ఆమె ఒక వారం రోజులు సెలవు పెట్టిందని, నేను డిశ్చార్జ్ అయ్యే రోజున వస్తానని చెప్పినట్టు తెలిపింది. నా మనసు బాధగా మూలిగింది. నేను హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమె ఎప్పుడూ నన్ను విడిచి వెళ్ళలేదు. నాకు చూపు వచ్చి నేను చూడటం మొదలు పెట్టగానే ఆమె సెలవు పెట్టి ఎక్కడికి వెళ్ళింది? పరి పరి విధాలుగా సాగాయి నా ఆలోచనలు. ఇంతలో ఆ నర్స్ మీకు ఈ లెటర్ ఇమ్మని చెప్పి వెళ్ళిందిఅంటూ ఒక చిన్న లెటర్ అందించింది. ఆత్రంగా అందుకొని విప్పి చదివాను. అక్షరాల వెంట నా కళ్ళు వేగంగా పరుగెత్తాయి.

ప్రియమైన… మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియక అలా వ్రాసాను. క్షమించండి. నాపై మీకున్న అభిమానం వల్లనైతే నేమి, నా మంచి మనసు(ఇది మీరు చెప్పిందే) వల్లనైతేనేమి మీకు నాపై ప్రేమ కలిగిందని మీరు అన్నారు. కానీ మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే నా మనసును మీకు అంకితం చేసాను. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నానేమోనని నేను అనుక్షణం బాధ పడుతూనే ఉన్నాను. నా గురించి మీరు మీ మనసులో ఒక అందమైన రూపాన్ని ప్రతిష్టించుకొని ఉంటారు. ఏ మగాడైనా తనకు కోబోయే భార్య చాలా అందంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు కూడా అలా అనుకునే వారే అయితే మాత్రం మన ప్రేమ కానీ, స్నేహం కానీ ఇక్కడితోనే ఆపేద్దాం. ఎందుకంటే నేను మీలాగ అందగత్తెను కాను. తెల్లగా ఉండను. మీలాగ ఒడ్డూ పొడవూ ఉండను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మీకు ఎంతమాత్రం సరిపోను.

మీరు మీలాగ అందమైన మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఇది నా కోరిక. నేను ఇంత చెప్పినా మీరు నన్ను చూడాలనుకుంటే ఇందిరా పార్క్ కి రండి. అక్కడ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ప్రేమికురాలిగా కాకపోయినా కనీసం ఒక స్నేహితురాలిగానయినా మీ మనసులో కాస్త చోటిస్తే, నా అంత అదృష్టవంతురాలు ఉండదేమో?! ఇట్లు.. మీకేమవుతానో తెలియని..  మీ……

నేను క్షణం కూడా ఆలోచించలేదు. మనసులో అనుకున్నాను. నేను నీ రూపాన్ని ప్రేమించలేదు. నీ మనసుని ప్రేమించాను. నువ్వెలా ఉన్నా నువ్వే నా శ్రీమతివి. నేను ఇప్పుడే బయలుదేరి నీ వద్దకు వస్తున్నాను అనుకుంటూ నడుస్తున్న నా అడుగులు వడి వడిగా ఇందిరా పార్క్ వైపుకి దారితీసాయి.

 

– నంద త్రినాధరావు

 

Related Posts