దేవుడు ఎక్కడ ఉన్నాడు ?

దేవుడు ఎక్కడ ఉన్నాడు ?

నేను దేవుడిని
మీ స్వార్ధపు కోరికలని తీర్చే దేవుడిని.

నేను
హిందువులకి
ముస్లింలకి
క్రైస్తవులకి
అన్ని మతాల మనుషులకి
ఉమ్మడిగా ఉండే దేవుడిని …!

నాకు
ఆకలి లేకున్నా….. పంచ భక్ష్య పరమన్నాలు
జీవం లేకున్నా ….. నిత్య అభిషేక అలంకరణలు
నా చిరునామా లేకున్నా…… భారీ మసీదులు, చర్చిలు
నా శరీరం లేకున్నా……నాపై వజ్ర వైడూర్య ఆభరణాలు

ఇవన్నీ నాకు కానుకలుగా ఇచ్చి
మీ స్వార్థ కోరికల చిట్టాని నా చెవిలో చెప్పి
నాతో ఓ సెల్ఫీ దిగి
దానికి భక్తి అని పేరు పెడుతున్నారు.

ఎందుకంటే నేను దేవుడిని
మీ స్వార్ధపు కోరికలని తీర్చే దేవుడిని……

నన్ను మతాల వారిగా విడగోట్టోద్దు
నా దర్శనంకి ఏ నియమాలు పెట్టొద్దు
మీ ఓట్లకై నాతో ఈ నీచ రాజకీయాలు చేయొద్దు
నా ముసుగులో ఏ తాయిలాలను అమ్మొద్దు
ఈ భూత పిశాచులని తరుముతామని
నా ( దేవుడి ) బిడ్డలగా మారి
ఏ డబ్బులు వసూలు చేయొద్దు.

అలాగే
ఈ చందాలని, మూగ జీవులని
నాకు సమర్పించి…. ,
స్వార్థ పరుడనే ముద్ర నాపై వేయోద్దు.

ఎందుకంటే ……
నేను లేను
నేనెవరకి కనబడను
కనీసం మాట్లాడను
అసలు నేను లేను ,
ఎప్పటికీ మీ నరులకి కనబడను.

ఒకవేళ నన్ను వెతకాలనుకుంటే ….
సాయం చేసే తోటి వారిలో వెతకండి
రక్త మాంసాలిచ్చిన మీ తల్లిదండ్రులలో వెతకండి
జ్ఞానాన్ని బోధించిన మీ గురువులలో వెతకండి
ఈ జీవులన్నింటిని బ్రతికిస్తున్న ఆ పంచ భుతాలలలో వెతకండి
మరీ ముఖ్యంగా…,
నిర్మలమైన మీ మనుసులో నన్ను వెతకండి

ఎందుకంటే …..
నిష్కళంకమైన మీ మనసే నా స్వస్థలం
ఆశించి చేయని మీ సాయమే నా దర్శనం.

– కామేష్ మద్ది 

Related Posts