ధరణి మొదటి భాగం

ధరణి మొదటి భాగం'

ధరణి మొదటి భాగం

మల్లెల వాన , మల్లెల వాన , నాలోనా అంటూ చెట్టుకు పూసిన పువ్వుని తన బుగ్గ మీద కొట్టుకుంటూ , సంతోషపడుతున్న మనవరాలిని చూస్తూ , ఒసే పిచ్చి మొఖమా పాడింది చాల్లే , కానీ వచ్చి ఇంత ఉడకేసి చావు , అంది నాయనమ్మ  అనసూయ.

అబ్బా ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండనివ్వదు, ఈ ముసలిది అంటూ వస్తున్నా , అని లోపలికి నడిచింది ధరణి. ఏంటి ముసలమ్మ ఆకలి బాగా వేస్తోందా నీకు, అయినా ఇప్పుడే కదే చెంబు నిండా పాలు తాగావు , అప్పుడే మళ్ళి ఆకలి వేస్తుందా నాన్నమ్మ  ,అంటూ అమయాకంగా అడిగింది ధరణి ..

ఓ  యబ్బో  మరి చిక్కటి పాలా, ఏమన్నన్నా, పాలు ఇచ్చావు, నేనది తాగి అరగక ఆపసోపాలు పడుతున్నా… నీ బాబు నాకు మంచి పండ్లు, పాలు తెస్తే ఇంకేం అనేదానివో, అయినా ఇది నా ఇల్లు, నా కొడుకు సంపాదన ఇది, నువ్వు తినడం లేదా తేరగా తిని కూర్చుంటూ, ఒళ్ళు పెంచడం లేదా, ఎదో పాపం అని నేను నీకు   ఇచ్చిన బిక్షనే ఇది, నన్నే అంటావే ముదనష్టపు దానా, నేను నా ఇష్టం వచ్చినట్టు తింటా, ఉంటా నీకేందుకే ? నా మొగుణ్ణి మింగావు కదే , ఎందుకొచ్చిన బతుకే నీది,

ఇదిగో చూడు తల్లి లేని దానివి అని ఏం అనకుండా ఉంటున్నా, అదే ఇంకొకరు అయితే నీ తల్లి చావగానే, నిన్నెక్కడో పారేసి నా కొడుక్కి ఇంకో పెళ్లి చేసేదాన్ని. ఎందుకులే , పాపం అని ఉరుకుంటుంటే , నాకే ఎదురుచెప్తావా? పైగా ముసలమ్మా అంటూ వెక్కిరిస్తావా ? అంటూ కయ్యిమని లేచింది అనసూయమ్మ.

ఎదో సరదాగా అన్న మాటల్ని పట్టుకుని తనని అన్నేసి మాటలు అంటున్నా , అవి తనకు మాములే అయినా, ఆ రోజున నాయనమ్మ తిడుతుంటే తానెందుకు బతికి ఉన్నానా , అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, వంట గదిలోకి వెళ్ళి, పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టి , ఆలోచనలో మునిగిపోయింది ధరణి. తనని నాన్నమ్మ ఎప్పుడూ ప్రేమగా చూడదు. తన తల్లి , తాత చనిపోవడానికి తానె కారణం అన్నట్టుగా మాట్లాడుతుంది.

తన తల్లేమో, తను పుట్టగానే వాతం కమ్మి చనిపాయిందట.  తాత పొలం లో పాము కరిచిపోతే, వాటికి తానెలా భాధ్యురాలు అవుతుందో, తనకు ఇప్పటికి అర్ధం కావడం లేదు. తాను పుట్టగానే వారిద్దరిని పొట్టన పెట్టుకున్నావు, అంటూ తనకు బుద్ది తెలిసినప్పటి నుండి తిడుతూనే ఉంది.

తనకు పదేళ్ళు ఉన్నప్పటి నుండి వంట, ఇంటిపని చేస్తుంది. పదకొండు ఏళ్ళప్పుడు  నాయనమ్మకు కాస్త పక్షవాతం వచ్చింది. ఇప్పుడు బాగానే తిరుగుతున్నా వైద్యలు నీళ్ళలో తిరగకూడదు అని చెప్పడంతో, పనంతా తానే చెయ్యడం మొదలు పెట్టింది.అయినా నాన్నమ్మ ఏదో ఒక రకంగా తిడుతూ, తను చేసిన వంటకు, పనికి వంకలు పెడుతూనే ఉంటుంది. పాపం నాన్న, తల్లికి నచ్చచెప్పలేక, కోప్పడలేక నలిగిపోతూ ఉంటాడు.

*********

అయ్యో అయ్యో ముద్దపప్పులా నిల్చుంటావేమే? మొద్దు మొహందానా, అన్నమంతా నేలపాలయ్యింది కదే, అన్న అనసూయమ్మ కేకతో ఈ లోకంలోకి వచ్చిన ధరణి. పొంగుతున్న అన్నం గిన్నెను చేత్తో దించబోయి, చెయ్యి కాలి గిన్నె ను కింద ఎత్తేసింది.

అయ్యో తల్లి, నిన్ను అన్నం వండి పెట్టమన్నదే పాపం అయ్యిందే, అన్నం అంతా భూమి పాలు చేసావు. నా కొడుకు సంపాదన అంత నాశనం చేస్తున్నావు కదే , అంటూ ధరణి దగ్గరికి వచ్చి దొంగ ముండా, ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అన్నం వండటం రాదా? నీకు అంటూ నెత్తి మీద పొడిచింది. అటు కాలిన వేలు, ఇటు నాన్నమ్మ తిట్లతో, అప్పటి వరకు అణుచుకున్న దుఖం మొత్తం కట్టలు తెంచుకుని, కన్నీరు రూపం లో బయటకు రాసాగింది.

ఆ అదొక్కటే నీకు దిక్కు ఏడవకు, శుక్రవారం పూట నడింట్లో ఎడ్చావో, నీ తోలు వలిచేస్తా, ఎత్తు అన్నం మొత్తం ఎత్తి నీళ్ళలో కడిగి , అది నువ్వే తిను , అని ఆర్డర్ వేసి ఇంకో గిన్నెలో బియ్యాన్ని, కడిగి ఇంకో పొయ్యి మీద పెట్టింది అనసూయమ్మ.

ఏడుపుని ఆపుకుంటున్నా, కళ్ళలోని నీరుని మాత్రం ఆపలేకపొయింది ధరణి. ఏడవకే మీ అయ్య వచ్చే టైం అయ్యింది. వాడు వచ్చేసరికి నువ్వు ఏడుపు మొహం వేసుకుని కనిపిస్తే, నా కొడుకు తిండి కూడా సరిగ్గా తినడు. వెళ్ళి మొహం కడుక్కుని నవ్వుతూ కనిపించు అంటూ ఆర్డర్ వేసింది.

కింద పడిన అన్నాన్ని మొత్తం గిన్నెలోకి ఎత్తి, మట్టి అంటిన దాన్ని మళ్ళి , మళ్ళి కడిగి, పొయ్యి మీద పెట్టింది ధరణి. ధరణిని అసహ్యంగా చూస్తూ నేను వాడు అన్నం తినేటప్పుడు నువ్వు ఆ వైపుకు రాకు. నీ మొహం చూస్తూ తినే తిండి కూడా ఒంటికి పట్టదు.

నీ దరిద్రపు మొహాన్ని చుస్తే నా కొడుకు తినే ఆ కాస్త అన్నం కూడా తినడు, అప్పటివరకు నువ్వు ఎదురుపడకుండా ఎక్కడో అక్కడ చావు, అంటూ బుగ్గలు పొడిచింది. అలాగే అంటూ ఉబికోస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బయటకు నడిచింది ధరణి..

*********

మేడ మీద చీకట్లో కుర్చుని మోకాళ్ళ మీద తల ఉంచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తానంటే ఎవరికీ ఇష్టం లేదు, అసలు తను ఓ నష్ట జాతకురాలు, పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకుంది. తన పసుపు కుంకుమలు పోవడానికి తానే కారణమంటూ తను పుట్టడం వల్లే అలా జరిగిందంటూ మొదటి నుండి నాన్నమ్మ తనని మంచిగా చూడదు. ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. పని కూడా అంతే , చేసిన పనులే మళ్ళి మళ్ళి చేయిస్తుంది.

అయినా తనకు అవన్నీ అలవాటయ్యాయి. తానేమి బాధపడదు. నాన్నమ్మ ఎప్పుడూ తిట్టినా, దాన్ని తను ఆశీర్వాదంలా భావిస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజు అసలు ఉరుకోలేకపోతుంది, మనసు కు నచ్చ చెప్పుకోలేక పోతుంది.

ఎందుకంటే ఈ రోజు తన పుట్టిన రోజు కనీసం ఈ రోజైనా సంతోషంగా ఉండాలి అని అనుకుంది. కానీ ఆ సంతోషం తనకు లేకుండా చేయాలనీ నాన్నమ్మ కంకణం కట్టుకుంది. తన పుట్టిన రోజు ఎవరికీ గుర్తులేదు. తను పుట్టినప్పుడు నాన్న ఎక్కడో డైరీలో రాసింది, ఈ రోజు ఇల్లు తుడుస్తున్నప్పుడు డైరీ దొరికి తను అందులో చూసి పొంగిపోయి,ఇన్నాళ్ళుగా ఎవరు గుర్తుచేయని పుట్టినరోజును, తను జరుపుకోవాలని కనీసం ఈ రోజైనా ఏడవకుండా ఉండాలని ప్రయత్నించి ఓడిపోయింది.

******

చల్లగా ఉన్న అమృత హస్తం తల నిమరుతూ ఉంటె , టక్కున ఏడుపుని ఆపేసి తలెత్తి చూసింది ధరణి. ఎదురుగా తన తండ్రి చెంచు రామయ్య నిలబడి ఉన్నాడు. తండ్రిని చూడగానే ఇంకా దుఖం పొంగుకొచ్చింది.

తండ్రి ఒళ్లో తలపెట్టుకుని తన హృదయ భారం తగ్గేలా ఏడవసాగింది  ధరణి. ఏడవకు రా కన్నా , నీ ఏడుపుని నేను చూడలేను. అయినా నానమ్మ సంగతి నీకు తెలియనిది కాదు కాదమ్మా,  పుట్టిన రోజు ఎవరైనా ఏడుస్తారా తల్లి,  నా తల్లిని ఏమి అనలేక , నిన్ను ఇన్నాళ్ళు ఎడవనిచ్చాను. ఇక నీకు ఏడుపును రానివ్వను.

ఈ కష్టాల నుండి నీకు విముక్తిని ఇవ్వడానికి నీకో మంచి సంబంధం చూసాను, ఇదిగో ఫోటో, అబ్బాయి నచ్చాడేమో చూడు , నచ్చితే వాళ్ళని రమ్మని చెప్తాను. చూసుకోవడానికి, ఇదే నీకు నేనిచ్చే పుట్టినరోజు కానుక. ఇదే మొదటిది , చివరిది కూడా కావొచ్చునెమో, ఇన్నాళ్ళు నీ పుట్టినరోజు ను జరపలేదు. అసలు గుర్తులేదా అంటే ఉంది,  కాని అదే రోజు మీ అమ్మ చనిపోవడం వల్ల , అది గుర్తొచ్చి ఇన్నాళ్ళు బాధపడ్డాను, నేను చేసింది తప్పే కానీ నిన్ను ఇంత బాధ పెట్టానని అనుకోలేదు.

ధరణి ఈరోజు నీతో నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను తల్లి , నిన్ను ఇన్ని రోజులు తిడుతున్నా , నిన్ను కష్టాలుపెడుతున్నా, అన్ని తెలిసి, నేను ఎందుకు ఊరుకున్నా , అంటే నువ్వు అంటే నాకు కూడా నీ మీద మనసులో కోపం ఉండి ఉండవచ్చు. అందుకే నేనేమి అనలేక పోవచ్చు , పైగా నిన్ను బాధపెడుతున్నా ,నేను సంతోషించాను కావచ్చు, కాని ఇన్ని రోజులు నేనేదో తప్పు చేస్తున్నా అని అన్పించింది. అదేంటో నాకు అర్ధం కాలేదు.

ఈ మధ్యనే నీవు పెద్ద దానివి అయ్యాక , నా ఆలోచనలో మార్పు వచ్చింది అనుకుంటా , మొన్న నేను పట్నం వెళ్ళినప్పుడు అక్కడ నా పాత మిత్రుడు ఒకడు కనిపించి , వాడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాడికి ముగ్గురు కూతుర్లు ఉన్నా వాడు సంతోషంగా ఉన్నాడు…

వాడి భార్య కూడా చివరి పిల్ల పుట్టగానే చనిపోయిందని చెప్పి, ఆ పిల్లని చూపిస్తూ నా ఇంట్లో లక్ష్మి పుట్టింది అంటూ ,వారి మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు , నేను ఆశ్చర్య పోయాను. అది గమనించిన వాడు నాకు నిజాల్ని చెప్పాడు. ఆడపిల్లలు కొద్ది రోజులే పుట్టింట్లో ఉంటారు. ఆ తర్వాత మెట్టినింటికి వెళ్తారు. కష్టమైనా , సుఖమైనా అక్కడే ఉండిపోతారు.ఎంత కష్టనష్టాలలో ఉన్నా , తమ పుట్టింటి వారు బాగుండాలని కోరుకుంటారు. పూజలు చేస్తారు.

ఎంత కష్టం ఎదురైనా పుట్టింటివారికి చెప్పరు. తల్లి దండ్రుల కష్టాన్ని పంచుకోవాలనే చూస్తారు అంటూ , నా కళ్ళు తెరిపించాడు. నీకింకో విషయం చెప్పనా  ధరణి , వాడి మూడో కూతురు అంగవైకల్యంతో పుట్టింది. ఆ అమ్మాయికి వాడే అన్ని దగ్గరుండి చేయిస్తాడు. అది చూసి నేను సిగ్గుతో తలదించుకున్నాను. వాడి ముందు నేనొక అల్పుడిలా అనిపించాను.

*******

నా భార్య చనిపోయిందని దానికి కారణం నా కూతురే అని అనుకున్నాను. తప్పితే అందులో నీ తప్పేంత ఉందో అని అనుకోలేదు. పైగా నానమ్మ నిన్ను బాధలు పెడుతుంటే, చూస్తూ ఊరుకున్నా, ఒక మూర్ఖునిలా ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

తల్లిదండ్రులు పిల్లల సుఖసంతోషాన్ని కోరుకోవాలి, తప్పితే నాశనం కావాలని కోరుకోకూడదని తెలుసుకున్నాను. అందుకే నీ బాధలు తీరాలి అంటే నీకు పెళ్లి చేయడమే మంచిదని అనిపించింది నాకు. అందుకే వాడికి చెప్పి పెట్టాను. ఒక సంబంధం చూడమని , వాడు ఈరోజు నన్ను పిలిచి నాకు వరుడి వివరాలు ఇచ్చాడు. అయితే వాడు నన్ను ప్రత్యేకంగా పిలవడం తో వెళ్ళాను.

నన్నెందుకు పిలిపించావురా అంటే ఈరోజు వాడి చిన్న కూతురు పుట్టిన రోజు పండగంట, నన్ను పిలిచి విందు భోజనం పెట్టాడు. వాడా అమ్మాయికి ఎన్ని నగలు చేయించాడో, ఎంత మంచి బట్టలు కుట్టించాడో,  ఆ నగలలో ఆ బటల్లో  ఆ అమ్మాయి ధగధగా మెరిసిపోతూ, సంతోషంగా కనిపించింది.

అది చూసిన నేను , నీకు యేన్నడు మంచి బట్టలు కూడా కొనివ్వలేదని, గుర్తొచ్చి మనసు కలుక్కుమంది. ఆమె స్థానంలో నాకు నువ్వే కనిపించావు. వాడు తినమని అంటున్నా ,కూడా వినకుండా, నేనిక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. కాని పుట్టిన రోజు నాడు నువ్వు ఏడవడం చూసి , నా మనసులో ఉన్నదంతా చెప్తున్నా,

అమ్మా ధరణి ఇన్ని రొజులూ కనీసం నిన్ను మనిషిగా, కూడా గుర్తించని, ఈ తండ్రిని క్షమిస్తావు కదూ, అంటూ ధరణి తలెత్తి , ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు చెంచు రామయ్య.

తండ్రిలోని బాధని, మధన పడడాన్ని గుర్తించిన ధరణి, నాన్న మీరు నాకు జన్మనిచ్చారు. మీరేం చేసారని క్షమించమని అడుగుతున్నారు. నాన్న మీరలా అడగకండి , నన్ను దండించే అధికారం మీకుంది నాన్న, ఇక ఎప్పుడు  నన్ను మీరు అలా అడగకండి. నేనెప్పుడు బాధ పడలేదు. అమ్మ లేక పోయినా నాకు మీరు ఉన్నారు. అది చాలు ఎదో కాస్త బాధ అనిపించి ఏడ్చాను.

కాని మీరు నాకు అన్ని విధాల మంచే చేసారు. ఇక నగలు ,బట్టలు అంటారా అవి కేవలం అలంకరణ కోసమే కదా నాన్న, నాకు అవేమి అవసరం లేదు. మీ నుండి నాకు కావలసింది ప్రేమ ,అభిమానం అంతే నాన్న, అంది గద్గదస్వరంతో , అమ్మ నీకున్న ఓపిక సహనానికి , నువ్వు నిజంగా గోప్పదానివే అమ్మ , నీ పేరును సార్ధకం చేసుకున్నావు.

సరే పద మరి నీ మనసులో ఏమి లేదంటున్నావు. కాబట్టి ఇదిగో నీ కొసం నేను స్వీటు , బట్టలు తీసుకొని వచ్చాను. పుట్టిన రోజున కొత్త బట్టలు వేసుకోవాలని అంటారు. వెళ్ళు , వెళ్ళి మొహం కడుక్కొని, బట్టలు మార్చుకో, అంటూ బట్టలు, స్వీట్ ఉన్న బ్యాగును ధరణి చేతిలో పెట్టాడు చెంచు రామయ్య.

ధరణి కళ్ళు తుడుచుకొని బ్యాగ్ తీసుకొని , అలాగే నాన్న అంటూ మేడ దిగి వెళ్ళింది. చెంచు రామయ్య కూడా కిందికి దిగి , కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కొడుకు రావడం, బంగ్లా మీదికి వెళ్ళడం, కాసేపటి తర్వాత ధరణి సంతోషంగా కిందికి రావడం , చూసిన అనసూయ స్త్రీ సహజమైన అసూయ తో రగిలిపోయింది. కోపం గా మాట్లాడకుండా కూర్చుంది.

ఇంతలో ధరణి కొత్త బట్టలు వేసుకొని, స్వీట్ ప్లేట్ తో బయటకు వచ్చింది. సరాసరి  తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ పిలిచింది. వారిద్దరూ ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకోవడం చూసిన అనసూయమ్మ కోపంతో రగిలిపోతూ, మనసులో కుళ్ళుకుంటూ, ఆ ఇద్దర్ని ఏం చెయ్య బోతుంది ? తండ్రి కూతుర్ల ను వీడదియ్య బోతుందా ? ముందు , ముందు జరిగేది ఏమిటి? ధరణి జీవితం ఏం కాబోతుంది? చదవండి తదుపరి భాగంలో…..

 

– భవ్య చారు 

Previous post శుభాకాంక్షలు
సంఘర్షణ పార్ట్-1 Next post సంఘర్షణ పార్ట్ 1

2 thoughts on “ధరణి మొదటి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close