దొంగ దొంగా..

దొంగ దొంగా..

నా చిన్నప్పుడు నేను ఎక్కువగా దొంగతనాలు చేశాను అవేంటో తెలుసా బలపాలు. అవును బలపాలే కానీ, అవి రాసుకోవడానికి లేదా దాచి పెట్టుకోడానికో కాదు. తినడానికి అవును తినడానికే వాటిని దొంగతనం చేసేదాన్ని…

ఆ అది మామూలే చిన్నప్పుడు అందరు బలపాలు తింటారు అంటారా, మరి అక్కడే ఉంది కదా అసలు కత .. బలపాలు తినడం ఎలా మొదలయ్యిందో కానీ, తినడం మొదలు పెట్టాక ఒక పట్టాన వదలబుద్ది కాలేదు. అవెంత పిచ్చిగా తయారు అయ్యాయి అంటే అమ్మ వంటింట్లో పేపర్ కింద దాచిన డబ్బులు, పోపు డబ్బాలో దాచిన డబ్బులు దొంగతనం చేసి బలపాలు కొనుక్కుని తినేంత గా పెరిగింది.

అమ్మ పాపం తానూ దాచిన డబ్బుల కోసం వెతికేది. తను మధ్యాహ్నం నిద్ర పోకుండా ఇస్తార్లు కుట్టి జమ చేసిన డబ్బులు కూడా నేను తీసే దాన్ని, సొట్లు శోధించి అన్ని వెతికి మరి తీసేదాన్ని , వాటితో బలపాలు కొనుక్కుని బ్యాగ్ లో దాచుకుని తినేసేదాన్ని.

అమ్మ డబ్బుల కోసం చాలా వెతికేది, నాన్న తీశారేమో  అని, తమ్ముళ్ళు తీసారేమో అని వాళ్లను కొట్టేది. నాన్నతో గొడవ పడేది. కానీ నేనే ఆ దొంగ అని అమ్మకు తెలియలేదు.

పదవ తరగతి వరకు అలాగే తిన్నా, మధ్యలో నాకు జాండిస్ రావడం వల్ల కొన్నాళ్ళు మానేశాను. తర్వాత మళ్లీ తినడం మొదలు పెట్టాను. బలపాలు తినడం వల్ల ఆకలి చచ్చిపోయింది. దాంతో సరిగ్గా తినేదాన్ని కాదు. అది చూసి నాన్న పిల్ల గుంజుకు పోతుంది. ఏమైందో అంటూ హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఆకలికి టానిక్ లు, గోలిలు ఇప్పించే వారు. అవన్నీ చేసినా నేను బలపాలు తినడం మాత్రం మానలేదు.

 

 

పదవ తరగతి అయ్యాక ఇంట్లోనే ఉన్నాను ఒక యాడాది. అప్పుడు బలపాలు తినే అవకాశం లేదు కాబట్టి నోరంతా పిడచ కట్టుకుని పోయేది. పిచ్చెక్కింది కానీ అంతలోనే విద్యా వాలంటీర్ గా అవకాశం రావడంతో ఎగిరిగంతేసి చేరిపోయాను.

అక్కడ చిన్నపిల్లలకు అక్షరాలు పెట్టించే నెపంతో చాలా బలపాలు మింగేదాన్ని. రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో బలపాల ప్యాకెట్ కొనుక్కుని గడ్డిలో దాచి పొద్దున ఒక డబ్బా, మధ్యానం ఒక డబ్బా , ఇంటికి వెళ్ళే లోపు తినేసేదాన్ని…

ఇంటికీ వచ్చేసరికి మూతి అంతా తెల్లగా అవుతుంది అని బోరింగ్ దగర కడుక్కునేదాన్ని, ఇలా చాలా రోజులు జరిగింది. నేను ఇలా చేయడం చూసి నాతో పాటు వచ్చే సరిత మా అమ్మకు చెప్పింది. ఎలాగో అది తెలిసిన అమ్మ నన్ను చాలా కోప్పడింది. రేపు పెళ్లి అయితే కష్టం అంటూ చెప్పి, తిండి తినక పోతే చస్తావు అన్నది. అయినా మనం ఉరుకుంటామా ? లేదుగా తిన్నాను, తిన్నాను, తిన్నాను చాలా రోజులు తిన్నాను.

కొన్నాళ్ళ తరువాత కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, తిన్న కొంచం కూడా అరగక పోవడం, లెట్రిన్ కి వెళ్తే కష్టంగా ఉండటం అయ్యేది. చాలా బాధ పడ్డాను. చివరికి నన్ను మా అమ్మమ్మ వాళ్ళింట్లో కొన్ని రోజులు ఉంచారు. అక్కడ మామయ్య ఆయుర్వేద మందులు తేప్పించి వేసారు. 

మామయ్య అంటే ఉన్న భయానికి మందులు మింగేదాన్ని, మామయ్య నేను తినేటప్పుడు కర్ర పట్టుకుని కూర్చునేవాడు. దాంతో భయానికి బాగానే తినేదాన్ని… ఆ మందుల వల్ల, మంచి ఆహారం వల్ల కోలుకున్నాను… 😄😄😄

దీని వల్ల చెప్పేది ఏంటంటే దొంగతనంగా ఏది చేసినా అది మనల్ని ఎప్పుడో ఒకసారి దెబ్బ తీస్తుంది. ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దొంగతనాలు చేయకండి…

 

– భవ్య చారు

Related Posts

2 Comments

  1. కధ బాగుంది. చాలా మంది పిల్లలకు బలపాలు,చాక్ పీసులు
    తినే అలవాటు ఉంటుంది. అలా తినటం ప్రమాదం అని బాగా
    చెప్పారు.

  2. పిల్లలకు, అవసరమైన అంశం.బాగా చెప్పారు.మీ వ్యక్తిగతం లా అనిపించినా అందరికి అవసరం అయ్యేలా ఉంది.

Comments are closed.