"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

దోసిట నింపిన వరాలు

దోసిట నింపిన వరాలు

డిసెంబర్ నెల చివరి వారం.. ఊరు ఊరంతా చలికి తట్టుకోలేక సాయంకాలానికే పనులన్నీ ముగించుకొని ఇళ్లల్లో చేరి తమకు ఉన్నంతలో వేడివేడిగా వండుకొని తిని ముసుగుతన్ని పడుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అలాంటి సమయంలో తాటాకు గుడిసె ముందు ఎముకలు కొరికే చలికి గజగజ వణికిపోతూ మునగ తీసుకొని కూర్చొని ఉన్నాడు రాజు. అతని కళ్ళు మాటిమాటికీ గుడిసె తలుపుల వైపు ఆశగా చూస్తున్నాయి. అవ్వ, అయ్యలు కరుణించకపోతారా తనను లోపలికి పిలవకపోతారా అని.

నిద్రాహారాలు మాని రెండు రోజుల నుంచి ఎదురు చూసి చూసి కాయలు కాచిన కళ్ళు కన్నీటిని వర్షిస్తుండగా కన్నీటితో చారికలు కట్టి కందిపోయిన పాలుగారు బుగ్గలను తుడుచుకున్నాడు.

పదిహేడేళ్ళ వాడి పసిప్రాయం వాడికి జీవితానికి సరిపడా గుణపాఠాలను నేర్పింది. బాల్యం నుండి యవ్వన ప్రారంభదశలోకి అడిగిడే క్రమంలో లోకమంతా రంగులమయంగా కనిపిస్తూ అదుపెరగని ఆనందాలన్నింటినీ ఆస్వాదించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.

అలాంటి పరిస్థితులలో అంది వచ్చిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాలని ఆశలపల్లకిలో తేలిపోతూ పై పై ఆడంబరాలకు మురిసి తనమీదే ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఏమార్చి వాళ్లు తనపై పెట్టుకున్న ఆశలను కల్లలు చేసాడు.

చెడుసావాసాలు చేసి అడ్డదారులు తొక్కి సమాజం చీదరించుకునే స్థాయికి దిగజారాడు. ఆ సమయంలో కన్నవాళ్ళు పడిన వేదనలు, చేసిన రోదనలు తన తలకెక్కలేదు. ఒక్కసారిగా వాడి ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.

**********

అదొక అందమైన భవంతి. ఆ భవనంలోని విభిన్నమైన ఆకృతులతో అచ్చెరువును కలిగించే ఇంపోర్టెడ్ షాoడ్లియర్స్ రకరకాల వెలుగులతో పగలే వెన్నెలను కురుపిస్తున్నాయా అని తలపింపచేస్తూ ఆ భవనం యొక్క అందాలను మరింత దగద్ధాయమానం చేస్తున్నాయి.

విశాలమైన కిటికీలకు వేలాడుతున్న ఆకర్షణీయమైన, రంగురంగుల జలతారు పరదాలు గాలికి అనుగుణంగా లయబద్ధంగా ఊగుతూ ఆ భవంతికి అద్భుతమైన సొగసును ఇస్తున్నాయి.

ఆ భవంతి ప్రహరీ గోడను ఆనుకొని రకరకాల సుందర పరిమళ పుష్పాలతో కూడిన అందమైన పూలతోట కంటికింపుగా కనిపిస్తూ మనసును ఆహ్లాదభరితం చేస్తోంది.

ఆ ఇంట్లోని దాదాపు పాతిక మంది పని వాళ్ళలో కొందరు యజమాని అభిరుచులకు అనుగుణంగా ఇంటిని వివిధ రకాల పూలతో తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉండగా మరికొందరు ఎక్కడి వస్తువులను అక్కడ పొందికగా అమర్చి ఇంటిని శుభ్రపరచడంలో మునిగి ఉన్నారు.

ఆ భవంతి విశాలమైన హాల్ ను ఆనుకొని ఉన్న వంటగదిలో ఇద్దరు చెయ్యి తిరిగిన వంటవాళ్లు మధ్యాహ్న భోజనం కోసం యజమానికి ఇష్టమైన రకరకాల వంటకాలు తయారు చేసే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. అక్కడ నుంచి వస్తున్న వంటకాల ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించి అక్కడున్నవారందరికీ చవులూరించేలా చేస్తున్నాయి.

ఇంతలో ఆ ఇంటి ముందు కొత్తగా మార్కెట్లోకి విడుదలైన ఖరీదైన కారు సర్రున వచ్చి ఆగింది. కారు శబ్దం వినగానే ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోరు తీసి వినయంగా నిలబడ్డారు.

అందులోంచి చక్కని ఆకర్షణీయమైన సూటులో కళ్ళకు ఖరీదైన రేబాన్ కూలింగ్ గ్లాసెస్ ధరించి హుందాగా కనిపిస్తున్న రాజు దిగి దర్భంగా ఇంటి ముఖద్వారం వైపు నడవడం ప్రారంభించాడు. అతనితోపాటు కారులోంచి దిగిన అతని పర్సనల్ సెక్రటరీ దగ్గరున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది.

ఫోన్ లిఫ్ట్ చేసి “సర్.. అరబిందో మేనేజింగ్ కంపెనీ సీఈఓ గారు లైన్లో ఉన్నారు.. మీరు మాట్లాడతానంటే..” అంటూ నసిగాడు. తల పంకించి సెక్రటరీ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని “హలో” అన్నాడు రాజు.

“రాజూ…. ఒరే రాజుగా… ఎండ నడి నెత్తిమీదకి వచ్చినా ఇంకా ఈ మొద్దు నిద్దర ఏందిరా… యాదమ్మ గట్టిగా అరిచినట్లుగా పిలిచిన పిలుపుతో అప్పటివరకు అందమైన స్వప్న లోకంలో విహరిస్తున్న రాజు నిద్ర చెడిపోయి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.

“ఏమిటి ..? ఇదంతా కలా నిజం కాదా? ఒక్కసారిగా స్వర్గం నుంచి ప్రత్యక్ష నరకం లాంటి ప్రస్తుతంలోకి వచ్చి పడిన ఒకింత అయోమయంలో ఉండగానే.. “ఒరేయ్ రాజుగా… ముంతలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదురా నువ్వేమైనా తీశావా…?

వారం రోజుల కూలీ పైసలు అన్నీ ఆ ముంతలో దాచి పెట్టాను.. అవసరాలకు పనికొస్తాయని.. ఏమయ్యాయో అర్థం కావడం లేదు. అడుగుతుంటే చెప్పకుండా అలా మొద్దులా చూస్తావ్ ఏంది.. నువ్వేమైనా తీసావా..?” రెట్టించి అడిగింది యాదమ్మ కొడుకుని.

“అబ్బా నేనెందుకు తీస్తాను అమ్మా.. పొద్దు పొద్దున్నే నీ గోలేంటి… నాకు తెలియదు అయ్యేమైనా తీశాడేమో.. అన్నాడు రాజు.

అప్పుడే గడ్డపార భుజం మీద పెట్టుకుని కైకిలికి బయల్దేరబోతున్న యాదగిరి కొడుకును ఉద్దేశించి “రాజుగా.. నిన్న మీ మాస్టారు కనపడ్డారు తోవలో.. నువ్వు బడికి పోతలేవట ఏందిరా… రోజు పుస్తకాలు పట్టుకుని పోతాండావు కదరా… మరి మాస్టారేమో అలా..”

“గా సార్ కి ఏం తెలుసు అయ్యా.. నేను రోజూ పోతూనే ఉండాగా.. గా సారుకు నేనంటే మొదటినుంచి గిట్టదులే.. అందుకే అలా సెప్పుంటాడు..”అసహనంగా అన్నాడు రాజు.

చూడు బిడ్డ… మనవి రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. నేను మీ యమ్మ రోజంతా కట్టపడితే గానీ నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లవు. నువ్వైనా బాగా చదువుకొని పెద్ద కొలువు చేయాల.. మన బస్తి వాసుల లెక్క నువ్వు కూడా కూలికి పోకూడదు.

అందుకే ఎంత కష్టమైన నిన్ను బాగా చదివించాలని మీ యమ్మ నేను దినాం అనుకుంటుంటాం. నువ్వు బాగా సదువుకో నాయనా. సదువుకుంటేనే బిడ్డా నలుగురు గౌరవం ఇత్తారు..”

“అబ్బా ఆపు నాయనా.. నీ గోల. ఊకే చదువు చదువు అంటారు చదువుకుంటేనే గొప్పోళ్లాయితారా  ఏంది, చదువుకోని వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించవచ్చు సరేగాని.. నా దోస్తులతో బయటికి పోతాన్నా.. రెండు రోజుల వరకు రాను. ఊరికే ఎక్కడికి.. ఏంటి.. అని నస పెట్టకుండ్లి..” విసురుగా అంటూ లేచి లోపలికి బ్యాగు సర్దుకోవడం మొదలు పెట్టాడు రాజు.

“ఏందిరా దోస్తులు దోస్తులు అంటూ బువ్వ కూడా తినకుండా పోతున్నావు… రెండు రోజులు రాకుండా నువ్వు ఎలగబెట్టే పనులు ఏమిటంట.. అడుగుతుంటే సెప్పవేందిరా… ‘కొడుకు కేసి కోపంగా చూస్తూ అంది యాదమ్మ.

“అబ్బా ..నీకు చెప్పినా సమజ్ కాదులేమ్మా.. నన్ను ఇసిగించకుండి”. అంటూ బయటకు నడిచాడు రాజు.

ఈ విధంగా తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బులు కాజేసి సినిమాలు చూస్తూ దోస్తులతో తిరుగుతూ సినిమాలలో లాగ ఆధునికమైన జీవితం గడపాలనే కోరికతో మత్తు మందులు సరఫరా చేయడం, దొంగతనాలు చేస్తూ సర్వ అవలక్షణాలకు బానిసై పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు రాజు.

ఒక్కగానొక్క కొడుకు ఇలా అన్ని రకాల వ్యసనాలకు బానిస అయ్యాడు అని తెలిసిన యాదగిరి, యాదమ్మలు ఉన్న ఇంటిని కాస్త అమ్మకానికి పెట్టి పోలీసోళ్ళ కాళ్ళవెళ్ళా పడి లంచాలు ఇచ్చి బెయిలు ఇప్పించారు..

కానీ ఒక్కగానొక్క కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకొని అపురూపంగా చూసుకున్న కొడుకు నమ్మకద్రోహం చేసి నలుగురిలో అవమానాల పాలు చేయడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు.. కొడుకు జైలు నుంచి విడుదలైన మరుక్షణం…

“మళ్లీ ఈ జన్మలో నీ మొఖం మాకు చూపించకు. ఈరోజుతో మా కొడుకు చచ్చిపోయాడు. తల్లిదండ్రులను మోసం చేసి తలవంపులు తెచ్చిన నీలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒక్కటే.. కన్న పాపానికి నిన్ను జైలు నుంచి విడిపించి తీసుకొచ్చాము.

ఇకనుంచి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు.. నీ దోస్తుల దగ్గరికి పోతావో లేకపోతే గంగలో దూకుతావో నీ ఇష్టం.. ఆఖరి రోజులలో ఇంత బువ్వపెడతావని, తల కొరివి పెట్టి కన్న రుణం తీర్చుకుంటావని ఆశపడ్డాం.

కానీ నీలాంటి కొడుకులను కనడం కన్నా కుక్కను పెంచుకోవడం నయం. ఇంత తిండి పడేస్తే చాలు జీవితాంతం విశ్వాసంగా పడి ఉంటాయి అవి.. తూ..” అంటూ కొడుకు ముఖం మీదే తలుపు వేసుకున్నారు యాదమ్మ యాదయ్యలు.

ఎప్పటికైనా తల్లిదండ్రులు తనను క్షమించి, చేరదీయక పోతారా అనే ఆశతో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఎదురుచూస్తున్నాడు. తన మంచిని కోరే తల్లిదండ్రులను చీదరించుకొని తను చేసిన దిగజారుడు పనులను తలుచుకుంటూ తల్లిదండ్రులంటే భగవంతుడు “తమ దోసిట నింపిన వరాలు” అని తెలుసుకున్న రాజు.

 సమాప్తం

– మామిడాల శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *