డబుల్ డెక్కర్ బస్

డబుల్ డెక్కర్ బస్

నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా నాకు కళ్ళకు పసికలు వచ్చాయి. అదేనండి, జాండిస్ అంటారు కదా అవి వచ్చాయి అసలు అవి వచ్చినట్లు కూడా ఎవరికి తెలియలేదు. ఎందుకంటే అవి తెల్ల పస్కలు అంట మరి ఎలా తెలిసింది అంటారా చెప్తాను ఆగండి. మా నాన్నగారి మేన మామ ఒకరు గోదావరి ఖనిలో ఉండేవాళ్లు. ఒకసారి నాన్న గారు ఏదో పని మీద వెళ్ళినప్పుడు, అతన్ని మా ఇంట్లో కొన్ని రోజులు ఉండి వెళ్లడానికి రమ్మని పిలిచారు.

తన వెంట బెట్టుకుని తీసుకుని వచ్చారు. సో అతను అంటే నాకు తాత గారు అవుతారు అన్నమాట ఆయన మా ఇంటికి రావడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చుట్టాలు అంటే అందరికీ ఇష్టమే కదా పైగా తాత వస్తే కథలు కూడా చెప్తారు. అందుకే మాకు ఆ తాతగారు అంటే చాలా ఇష్టం. ఆయన వచ్చిన రెండో రోజు మధ్యాహ్నం నన్ను కూర్చో బెట్టుకుని ఆకలి అవుతుందా? బాగా తింటున్నవా? మూత్రం సఫ్ ఉందా? మండుతుందా? అంటూ రకరకాల ప్రశ్నలు అడిగారు.

Double Deck Bus Vector | Free SVG

దాంతో మా అమ్మ ఏం మామ ఎందుకు అలా అడుగుతున్నారు? ఏమైంది? అంటూ కంగారుగా అడిగితే దానికి ఆయన కంగారు ఏం లేదమ్మా అమ్మాయికి తెల్ల పస్కలు అని అనుమానంగా ఉంది. రేపు ప్రొద్దున లేవగానే మూత్రం పట్టి అందులో కొన్ని బియ్యం వేసి చూద్దాం. ఈ లోపు నేను కొన్ని ఆకులను చూస్తా అంటూ అలా బజారు వైపు వెళ్లారు. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు రోడ్ పక్కన పెరుగుతాయి, ఇంకొన్ని ఇళ్ళ ముందు పెరుగుతాయి. కాబట్టి, అవి మందుకు పనికి వస్తాయి అని చూసుకోవడానికి వెళ్లారు. నేను తాతతో పాటు వెళ్ళాను అలా బజారు అంతా తిరిగిన తర్వాత తాత కొన్ని మొక్కలు గుర్తించి వాటికీ మొక్కి తీసుకున్నారు.

ఇంకా కొన్నిటికి పొలాల వైపు వెళ్ళాం అక్కడ కూడా కొన్ని దొరికాయి. చీకటి అవుతుందని తిరిగి ఇంటికి వచ్చాము. అయితే తాతగారికి అందులో ఒక మొక్క దొరకలేదు దాని పేరు తెల్ల గర్జలి కూర అన్నారు అదొక్కటి దొరకలేదు. అప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కడా దొరకలేదు. పైగా నాన్న అందరినీ అడిగారు. కానీ, ఎక్కడ దొరకక పోవడంతో తాతగారు ప్రొద్దున్నే బియ్యాన్ని చూసి అవే అని నిశ్చియిoచుకొని, తెచ్చిన మొక్కలను బాగా కడిగి ఆరబెట్టన వాటిని కల్వంలో దంచి చిన్న చిన్న గోళీలుగా చేశారు.

డబుల్ డెక్కర్ బస్

అమ్మతో అవి నీడకు ఆరబెట్టి వారం రోజులు ప్రొద్దున రాత్రి వేయమని చెప్పారు. ఇక తాత వాళ్ళ కొడుకు రమ్మని లెటర్ రాయడంతో తాత అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే రోజు ఎవరో తెల్ల గర్జాలి కూర తెచ్చారు దాన్ని నూనె వేయకుండా వండుకుని తినమని చెప్పారు. తాతగారు వెళ్ళాక ఆ గోళీలు వేసుకున్నా అయినా నాకు తగ్గలేదు. అయితే ఒక రోజు నాన్న గారి స్టూడెంట్ ఒకతను హైద్రాబాద్ లో పస్కల మందు పోస్తారు రమ్మని అన్నారు. దాంతో, నాన్న నన్ను తీసుకుని వెళ్లారు.

అప్పుడే నేను పట్నంకు కొత్తగా వెళ్ళాను నాకు ఆ బిల్డింగ్స్, జనాలు తిరగడం అన్ని చాలా కొత్తగా అనిపించాయి. మేము మా నాన్నగారి చెల్లెలు అక్కడే ఉండడంతో ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. ఇక మబ్బున అయిదు గంటలకు నాన్న నన్ను నిద్ర లేపాడు మొహం కడుక్కుని రెడీ అయ్యి మేము ఆ మందు తాగడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్లాలి అంటే చార్మినార్ దాటి వెళ్లాలి. దాని పేరు బార్కాస్ అక్కడ పాలల్లో మందు కలిపి ఇస్తారు.

 

File:LT 471 (LTZ 1471) Arriva London New Routemaster (19522859218).jpg - Wikimedia Commonsదాన్ని తాగిన తర్వాత బిర్యానీ తినాలట ఆ విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నెల రోజులుగా కారం అన్నం తిని, తిని నోరు అంతా ఎలాగో అయ్యింది. అందుకే బిర్యానీ అనగానే నోరు ఊరింది. ఇక చార్మినార్ వెళ్లడానికి మేము బస్ స్టాండ్ కు వెళ్ళాం. అక్కడ నిలబడి ఎదిరి చూస్తూ ఉండగా డైరెక్ట్ బార్కాస్ కు వెళ్ళే బస్ రావడంతో గబగబా నాన్న ఎక్కాడు, నేను ఎక్కాను.

అయితే అది డబుల్ డెక్కర్ బస్ అంటే కిందొక బస్ పైన ఇంకొక బస్ ఉంటుంది కదా అదన్న మాట నేను బస్ ఎక్కగానే గబగబా సీటు కోసం పైకి వెళ్ళిపోయాను. కింద నాన్నగారు ముందుకు వెళ్ళి నన్ను పిలుస్తూ ఉన్నారు. కానీ, నాకు అది వినిపించలేదు. దాంతో నాన్న బస్ దిగాలి అనుకున్నారు. నేను నాన్న ఇంకా రావడం లేదని చూస్తూ నా చేతిలో ఉన్న కర్చిపు సీటు మీద వేసి గబగబా కిందికి వెళ్లి నాన్న అంటూ పిలిచాను. దిగబోయే నాన్న నా పిలుపు విని ఇక్కడున్నావా పిలుస్తుంటే పలకవు అని తిట్టారు కాదు మందలించారు.

నేను పైన సీటు ఉంది పదండి నాన్న అన్నాను. సరే అంటూ ఇద్దరం పైకి వచ్చి కూర్చున్నాం, నేను పక్కనున్న కిటికీ లోంచి పట్నంలో బంగళాలు, మేడలు రకరకాల మనుషులు వాళ్ళు వేసుకున్న దుస్తులు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాను. నేను కాసేపు అయ్యేసరికి పక్కకు తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు. నాకు చాలా భయం వేసి పక్కన కూర్చున్న ఆవిడను అడిగాను మా నాన్న ఎక్కడా అని. నాకేం తెలుసు అమ్మాయి అంటూ ఆమె ఆంధ్ర బాషలో అనేసరికి నాకు అసలు అర్దం కాలేదు. ఆ యాస మనకు ఇప్పటికీ అర్దం కాదు. దాంతో, నేను భయపడుతూ నాన్న నాన్న అంటూ ముందుకు వెళ్ళాను.

డబుల్ డెక్కర్ బస్

కానీ, నాన్న లేరు ఇంకొక విషయం ఏమిటంటే అప్పటి వరకు నేను ముందు డ్రైవర్ ఉన్నారు అనుకున్నా డ్రైవర్ లేకపోవడం చూసి నన్ను నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు డ్రైవర్ లేని బసు లో అని అనుకుంటూ ఏడుపు మొదలు పెట్టాను. నాన్న, నాన్న అంటూ బస్ దిగాలని ముందుకు వెళ్తుంటే నన్ను అందరూ చూస్తున్నారు తప్ప, ఎవరూ ఏమైంది అని అడగడం లేదు. ఊర్లో అయితే ఊకో బుజ్జి అని నాన్న ను పిలిచే వారు. కానీ, ఇక్కడ ఎవరు కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. నేను ఏడుస్తూ కిందకు వెళ్ళాను.

నా ఏడుపు విన్న కొందరు మగవాళ్ళు ఏమైంది పాప అంటూ అడిగారు మా నాన్నగారు లేరు అన్నాను. అది చూసిన కండక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్న మా నాన్న గబగబా వచ్చి ఏమైంది అని అడిగారు. నాన్న కనిపించడంతో గబుక్కున రెండు కాళ్ళకు చుట్టేసాను. నేను నాన్న నా వీపు మీద నిమురుతూ ఇక్కడే ఉన్నాను బిడ్డా అంటూ ఓదార్చే సరికి నేను వెక్కుతూనే ఉన్నాను.

కాసేపటికి బస్ బార్కాస్ లో ఆగడంతో ఇద్దరం దిగాము. అయితే, డబుల్ డెక్కర్ బస్ ఎక్కాను అనే సంతోషం కలిగింది నాకు. ఇక మందు కోసం లైన్ లో నిలబడితే పాలు మేమే తెచ్చుకోవాలి అనడంతో నాన్న నన్ను పంపారు. ఒక బాటిల్ లో పాలు పది రూపాయలకు ఇచ్చారు. అవి తీసుకుని వచ్చాను లైన్ ముందుకు కదిలింది. ఇక మా వరకు వచ్చేసరికి ఒక కిటికీ లాంటి దాంట్లో నుండి నాన్న దగ్గర పాల బాటిల్ తీసుకుని అందులో మందు వేసి ఇచ్చి, రెండు పొట్లాలు ఇచ్చారు. వాటిని ఉడక బెట్టుకుని తినమని అన్నారు. తాగిన తర్వాత బిర్యానీ తినమని ఇంటికి వెళ్ళాక పాల అన్నం తినమని చెప్పారు.

ఇక ఆ బాటిల్ లో మందు తాగాను నేను కళ్ళు మూసుకుని యాక్ చేదుగా వాంతి వచ్చేలా ఉంది అది. అయినా సరే తాగు అంటూ నాన్న కోపంగా చూసేసరికి సరే అని తాగాను. మూడు బుక్కలు అయ్యేది ముప్పై బుక్కాలుగా చేసి తాగడం చూసి నాన్న కాస్త కోపంగా చూసారు ఇక ఏం అనలేక కళ్ళు మూసుకుని గుటుక్కున మింగాను. నన్ను హోటల్ కి తీసుకుని వెళ్ళిన నాన్నగారు వెజ్ బిర్యాని ఉందా అని అడిగారు. కానీ అక్కడ అంతా ముస్లిం లు కాబట్టి పెద్ద కూర బిర్యానీ, మటన్, చికెన్ తప్ప వెజ్ లేదని అనడంతో ఏం మాట్లాడకుండా బయలు దేరి ఇంటికి వచ్చాము. నాకు నాన్నగారు అన్నం పాలతో పెట్టారు బార్లీ గింజలు ఉడికించి తాగించారు అలా ఆరోజు గడిచింది.

మూడు వారాలు వెళ్ళాం అక్కడికి ప్రతి శనివారం వచ్చి బస్ లో వెళ్లి అది తాగి రావాలి. ఆ రోజు పాలతో అన్నం తినాలి ఇలా మూడు వారాల తర్వాత చివరి వారం నాన్న గారి స్టూడెంట్ మాతో వచ్చాడు. అతను నన్ను హోటల్ కు తీసుకుని వెళ్లారు. నాన్న నాకు వెజ్ బిర్యానీ తినిపించాలి అని చెప్పాడు అతనికి. కానీ, అతను సార్ వెజ్ కాదు నాన్ వెజ్ బిర్యాని తినిపించాలి అన్నాడు నాన్న అసలు ఒప్పుకోలేదు. వద్దు అన్నారు. కానీ, అతను సమరు వస్తువులు పెడితే గుణం కనిపిస్తుంది ఒకేసారి కదా అని నాన్నతో సర్ది చెప్పడంతో నాన్న నేను రాను నువ్వే తీసుకుని వెళ్ళు అని నన్ను అతనికి అప్పగించారు.

కానీ, అతనితో వెళ్లాలి అంటే కాస్త భయంగా అనిపించింది. అయినా బిర్యానీ తినాలి అనే తొందరలో వెళ్ళాను. కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఒకసారి నేను చుట్టూ చూసాను ఎంత గలీజ్ గా, డర్టీగా ఉందో ఆ ప్లేస్. అది అంతా నీళ్లు వాటి మధ్యలోంచి తిరిగే మనుషులు, చాయి కప్పులు, వాటి మీద ఈగలు అన్ని ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంతా దరిద్రంగా ఉన్నాయి. అలా ఉన్నా కూడా జనాలు వచ్చి. తినేసి వెళ్తున్నారు.

British Bus Double Decker - Free vector graphic on Pixabay

వచ్చిన వాళ్ళు బిర్యానీ ఆర్డర్ ఇవ్వటమే ఆలస్యం వేడి, వేడి బిర్యానీ తెచ్చి పెడుతూనే ఉన్నాడు, ఖాళీ అవుతూనే ఉన్నాయి. మరి అందరూ పస్కల మందు కోసం వచ్చిన వాళ్ళే కాబట్టి గిరాకీ బాగా ఉంది. ఇంతలో నాన్న స్టూడెంట్, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. నేను అందర్నీ చూసేంతలో బిర్యానీ వచ్చింది. అతను దాన్ని బొక్క ప్లేట్ లో పెట్టి, ఒక్క పెద్ద బొక్క వేశాడు, అదే ముక్క అబ్బో దాన్ని చూడగానే వాంతి వచ్చినట్టుగా అయ్యింది అయితే నేను దాన్ని ముందుకు తోసి నాకు వద్దు అన్నాను.

అతను ఆశ్చర్య పోయి ఎందుకు వద్దు నువ్వు ఖచ్చితంగా తినాలి లేకపోతే మందు పారదు తాగి వృధా అవుతుంది అని కోపంగా చెప్పాడు. మళ్లీ మూడునెలలు పత్యం చేయాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అన్నాడు. నాకు భయం వేసింది. ఆల్రెడీ ఆరు నెలల నుండి కారం అన్నం, పాలన్నం తింటున్నా, కాబట్టి భయం వేసి ప్లేట్ లో ఉన్న బొక్క తిసెయ్యమని అన్నాను. అతను లేదు అదే ముఖ్యం అదే తినాలి అన్నాడు. కానీ, నేను ఉత్త అన్నం తింటాను నాకు బొక్క వద్దు అని ఏడవడంతో అతను ఇక ఏమీ చేయలేక బొక్క తీసి తన ప్లేట్ లో వేసుకున్నాడు. నేను ఒక ముద్ద తీసి బలవంతంగా పెట్టుకున్నా… నాది సగం అయ్యేంతలో అతని గిన్నె ఖాళీ చేశాడు.

నేను బలవంతంగా తిని, చేయి కడుక్కున్నా నా ప్లేట్ లో ఉన్నది కూడా తిన్నాడు. అతను వృథా చేయడం ఎందుకని అక్కడ ముస్లింలు ఒక్క మెతుకు కూడా కింద వేయకుండా తినడం చూసి నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి బయట పడదామా అన్నట్టుగా ఉన్నాను నేను. అతను బిల్ కట్టేసి నన్ను రమ్మని పిలవడంతో దేవుడా అనుకుంటూ బయటకు వచ్చాను. చేయి కడగాలి అని అంటే అతను ఒక మగ్ తో వాటర్ ఇచ్చాడు. ఆ బురదలో నీళ్లు పోస్తూ ఉంటే అవ్వన్నీ నా బట్టల మీద పడ్డాయి. బట్టలు అన్నీ బురద చిల్లింది. నా చేతికి ఉన్న సమరు ఎంతకీ పోనే లేదు.

Free photo Fun Tour Holiday Bus Transport Double Decker - Max Pixel

కడుపులో ఏమీ లేకపోవడం వల్ల తిన్న రెండు బుక్కల అన్నం కడుపులో కలిసి పోయింది. నాన్న నన్ను చూస్తూ తిన్నావా అని అడిగాడు. దానికి నేను తిన్నాను అన్నాను. అతను మాత్రం ఏం తినలేదు సార్ మొత్తం నేనే తిన్నా అని చెప్పడంతో సరే తీ ఏం చేస్తాం మరి మళ్లీ రావాలా అని అడిగాడు. వద్దు సార్ ఇగ అయిపోయింది కదా రేపట్నుంచి చెంగున ఉరుకుతది అన్నాడు అతను. సరే పోతం ఇగ నువ్వుండు అన్నాడు నాన్న. నాన్న డబుల్ డెక్కర్ బస్ ఎక్కుదాం మళ్ళి మళ్ళి రాము కదా అనగానే, అవును సార్ ఎక్కంచండి బుజ్జిని పట్టుకొని కూర్చోండి అని బస్ రాగానే ఎక్కించాడు.

నాన్న అతనికి డబ్బులు ఇచ్చాడు. ఏ వద్దు సార్ అనగానే ఏ తీసుకో అని ఇచ్చాడు. బస్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే అతను వెళ్లి అరటి పళ్ళు తెచ్చాడు, నాకు ఇచ్చి తిను అన్నాడు. నాన్న ఇచ్చిన డబ్బు తోనే తెచ్చాడు అనుకుంటా.. మళ్లీ డబుల్ డెక్కర్ బస్ ఎక్కి నేను కిటికీ లోంచి అన్ని చూసుకుంటూ సంతోష పడుతూ ఉన్నాను ఈ సారి నాన్నగారు నన్ను వదిలి వెళ్ళలేదు. (ఎందుకంటే మేము లేడీస్ సీటు లో కూర్చోలేదు గా…)

కానీ ఆ మందు తిన్నా, తాగినా, బిర్యానీ తిన్నా కూడా నాకు పష్కలు తగ్గనే లేదు. దాదాపు సంవత్సరం కష్టపడ్డాను అది తగ్గడానికి ఏం, ఏం చేసాను అనేది మళ్లీ మల్లె పల్లి మందు అనే నా కథలో చెప్తాను.. అంతవరకు బాయ్…

-భవ్య చారు

Related Posts

3 Comments

  1. మంచి అనుభవం. డబల్ డెక్కర్ జీవితాంతం గుర్తుండి పోతుంది మీకు. బాగా రాసారు.
    కృతజ్ఞతతో.

Comments are closed.