E తరం బతుకమ్మ

అమ్మా ఏం కూర వండలేనే అడిగింది అర్చన,తల్లిని ఏమున్నాయి బిడ్డా  అంది  సుమిత్ర, క్యారెట్, బీట్రూట్, టమాటా ఉన్నాయి అమ్మా, ఏ అవి ఉత్తగా తిననికి అయితయి, టమాటా పప్పు ఎయ్యి పో, అంది సుమిత్ర. హ మల్లా పప్పేనా, నిన్న కూడా పప్పే అన్నాడు చిన్నోడు గునుకుంటా, అరె మరి ఏం చెయ్యిమంటవు, బయటకు పోతే కరోనా పాడాయే, కూరగాయలు తెచ్చుకుని రెండు రోజులు కూడా కాలే, అందరూ ఇంట్ల నే ఉండుడుకు అగుతలేవు ఏవీ, నన్నేం చెయ్యిమంటరు, ఇయ్యల ఒక్క నాడు తినుండి,రేపు మామ ను పంపిస్తా బిడ్డా అని మనుమన్ని బతిలాడింది సుమిత్ర. హ సరే తి చెయ్యే అమ్మా, మంచిగా ఒత్తుగా టమాటలు ఎయ్యి అంటున్న కొడుకును  చూసి నా బంగారు కొండ ఇది అని మురుసుకుంట లోపలికి పోయింది అర్చన. అరెయి నాని పింఛన్ వచ్చిందా సుడు బిడ్డా జర ఆ ఫోన్ ల తమ్ముడు సుస్తాడు కదా,గట్ల సుశి చెప్పు అంది సుమిత్ర పెద్ద కొడుకును చూస్తూ ఆమె కొడుకుని ముద్దుగా నాని అని పిలుస్తది అసలు పేరు రవి తేజ,సుషీనా గని రాలె ఇంకా ఇవ్వాల బక్రీద్ కదా,వస్తదేమో రేపెల్లుoడి అన్నాడు రవితేజ. అయ్యో ఇయ్యాల బక్రీద్ పండుగ నా ఈ పట్నంకు వచ్చుడేమోకని పండగలే తెలుస్తలేవు. ఎడికి వచ్చి నాలుగేండ్ల యి నాలుగేండ్ల నుండి తిరుగుడు కె సరిపోయే,పండుగలు ఏం చేస్కోక పోతిమి సక్కగా,ఎదో కిత కిత చేసుకుంటిమి,మీ నయినా పింఛన్ కూసోని,తమ్మునికి ఉద్యోగం అచ్చె వరకు గి యల్లా అయే బిడ్డా,పోయిన తాప సూత ఏం సక్కగా చేసుకోలే, ఇగో అన్ని మంచిగున్నాయి అనుకునే కాలం కు గి కరోనా అంట అదేందో అచ్చి పాడాయే,అవుతాలికి కాలు వెడుదాం అన్నా భయం అయ్యి పాడాయే అని నిట్టూర్చింది సుమిత్రమ్మ.

అయ్యో అమ్మ రేపు రాఖీల పండుగకు రాఖీలు తేవాల,మరి నువ్వు పోతావా రా తమ్మి అడిగింది అర్చన, నేనా నేను పోను ,నాకు రాఖీలు లేకున్నా మానే,మొన్ననే పోయి వచ్చిన కదా, ఊకె పోతారా,అడ అవుతాల ఎవనికి అచ్చుందో,ఏందో కూడా తెలుస్తలేదు. ఉన్న దంట్ల అండుకుని తినుండ్రి,అని ఫోన్ ల మొఖం పెట్టిండు రవి తేజ. అమ్మ సుడే పోనంటుండు ఎట్లా మల్ల అంది అర్చన.లేదమ్మ నువ్వు ఏం ఫికర్ జెయ్యకు,పోయిన సారి  తమ్ముళ్ల కని తెచ్చిన రేకలు ఇంట్ల దేవుని గుట్ల ఉన్నాయి తియ్యి సాలు అవే నీ పిల్లగానికి ఒకటి,పెద్దతమ్మునికి ఒకటి కట్టు బిడ్డా అన్నది సుమిత్రమ్మ,మరి చిన్నోనికే అంది అర్చన,చిన్నోడు ఇడ లేడు కదా బిడ్డా అచ్చినంక కడుదువు తి  అని కింద వేసుకున్న ప్లాస్టిక్ చాప లో ఒరిగి,కళ్ళు మూసుకుంది,తల్లి పడుకోవడం చూసి కిచెన్ లోకి వెళ్ళిపోయింది అర్చన.

సుమిత్రమ్మ భర్త ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తూ,గుండె పోటు వచ్చి హఠాత్తుగా చనిపోయాడు మూడేళ్ళ క్రితం పెద్ద కొడుకు పెద్ద చదువులు చదవడం వల్ల చిన్న కొడుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం,సుమిత్రమ్మ కు పింఛన్ వచ్చే సరికి రెండేళ్లు పట్టింది.ఇలా ఉద్యోగం,పింఛన్ కి తిరగాలి ఏ.జి ఆఫీసుకు తిరిగే పని ఉంటుంది.ఊర్లో ఉంటే  తిరుగుడు కష్టం అని పిల్లలు ఆత్మీయులు అనడం తో,అప్పటికే భర్త కొని పెట్టిన ఫ్లాట్ లోకి మారింది సుమిత్రమ్మ.అలా మారినా ఏం ఫాయిదా లేక ఇంకా ఎక్కువ టైం పడుతది అని చెప్పడం తో ఉత్తగానే కూసుంటే ఎమోస్తది,తిండి కి అప్పు లకు కావాలె గదా అని తల్లి బిడ్డలు ఇద్దరు కంపెనీల పని సూసుకున్నారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం,ఇప్పుడు ఒకరి కింద పని చేయాలి అంటే కష్టంగా ఉన్న తప్పని పరిస్థితి మరి ,ఇక అర్చన భర్త అప్పు చేసి దుబాయ్ వెళ్తే కూలి చేసి అప్పు కడుతుంది,తల్లి దగ్గరే ఉంటూ..ఉన్న వాళ్ళు దూరం అయ్యారు భర్త చావు తో,ఇక మాట్లాడితే మా మీద ఏం పడుతారో అని అందరూ దూరంగా ఉన్నారు మధ్యతరగతి బతుకులు కడుపులకు లేకున్నా కాళ్ళు ముడుచుకుని,గౌరవంగా బతికిండ్రు ఇన్ని రోజులు ,ఇగ పింఛన్ కూసుని యడాది కూడా కాలే పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు,ఏదోలా రోజులు గడుస్తున్నాయి అని అనుకుంటే ఈ కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారు.పింఛను కూడా సగమే వచ్చినా ఎలాగో నెట్టుకొస్తున్నారు ,ఆ సగం పింఛన్  ఆచిందని కలవరపడుతోంది సుమిత్రమ్మ.చిన్న కొడుకు ఆఫీసుల చిక్కుక పోయిండు.ఇగ వాణ్ణి ఆటే ఉండమని అన్నది తల్లి.

అమ్మా వంట అయ్యింది లే తిందాం అని లేపింది తల్లిని అర్చన.హ పెట్టు బిడ్డా పానం కొట్టుక పోతుంది అని అంది. అందరూ తిన్నారు దూరం దూరం కూసుని,కంచాలు అన్ని శుభ్రం చేసి,ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది అర్చన.సుమిత్రమ్మ ఒరిగింది చాప పైన,కొడుకు తమ్ముడు ఇద్దరు ఒకరు ఫోన్ లో ఇంకొకరు టీవీ చూస్తున్నారు.అలా ఒక అద్ద గంట అయ్యాక అర్చన ఫోన్ మోగింది,అబ్బా దీనికి మల్లా దొరికిన రా అని అనుకుంటా,లోపలికి పోవే అన్నాడు తమ్ముడు లోపలి బెడ్రూం లోకి వచ్చి,ఫోన్ ఎత్తింది అర్చన.చేసింది సౌజన్య అర్చన కు పట్నం ల అయిన జాన్ జిగ్రీ దోస్తు ఆమె ఒక్కతే కావడం వల్ల అన్ని విషయాలు చెప్పుకుంటుంది అర్చనతో. ఫోనెత్తి ఆ హలొ సౌజి చెప్పు ఏంటి సంగతి అని అడిగింది అగొ ఫోన్ ఎత్తనికి ఇంత సేపా నేను ఊకె చేస్తున్నా అనే కదా అంది. అయ్యో రామా అదేం లేదే బొల్లు కడుగుతున్నా అని అబద్ధం ఆడింది అర్చన లేకపోతే రచ్చనే ఇగ అనుకుంటా.బాగున్నవా అని అడిగింది అర్చన ఆ బాగున్నా నువ్వు బాగున్నవా ,ఒక ఫోన్ లేదు,మెసేజ్ లేదు ఆవు నాకు ఎందుకు చేస్తావు తి నేను నీ దోస్తును కాదు గదా అంది అబ్బా అది కాదే నాకు పని ఉoడే,అందుకే చేయలేదు ఏమనుకోకు  అంది అర్చన,హ సరే తి ఇగో ఇక్కడ నాకు మస్తు బోర్ కొడుతోంది,ఏం జెయ్యలే నాకు అర్థం అయితలేదు.మా అత్త వంట పని ఇంటి పని మొత్తం నాకే పెట్టింది.నేను అటూ పిల్లలను,పని ని సూసుకోలేక సస్తున్నా, అని ఆగకుండా చెప్తానే ఉంది సౌజన్య,ఇగ తనని మాట్లాడనివ్వదు అని అనుకున్న అర్చన అన్నిటికీ ఉ కొడుతూoది. మా అత్త రాఖీల పున్నమా అయినంక పోతాం అంటే ఏం పోతారు ఇప్పుడు బతుకమ్మ పండుగ అయినంక పో oడ్రి అని అని అన్నది.రాఖీల పున్నమా కంగానే ఇగ వరుసగా పండగలే కృష్ణాష్టమి పొలాల అమస,అవి అయ్యినంక బతుకమ్మ అంటే రెండు నెలలు ఆగలే,ఈయనకు జాబ్ లేక పాయే,పోయి ఏదన్నా సుసుకుందాం అంటే  వాడొక్కడు పోనీ ,మీరెందుకు ఈ కష్టకాలంల అందరూ పోవుడు అవసరమా అని అంటుంది.ఇగ ఆడికి వచ్చుడు లేనట్టే కని ఇడనే పండుగలన్ని చేసుకుంటాం ఈ తపకు అంది సౌజన్య అర్చనతో..అవునా మంచిదే కదా  ప్రతిసారి సెలవు దొరక లేదని అదర బాదరగా పోయి వస్తుంటిరి కదా ఈ సారి ఇగ  బాగా చేసుకోండి మరి అంది అర్చన.ఏ ఏంది చేసుకునేది ఈడ బాగుంది కరోనా మా ఇంటి పక్కనే అచ్చింది.మొన్న నాగుల పంచమికి పుట్టకే పోలేదు, పిల్లలతో ఏడ బొతం ,ఏవలకు ఉందొ ఏమో తెల్వది,కదా ఇగ బతుకమ్మ ఏం అయితదో ,సరే మల్లా రేపు చేస్తా ఫోన్ ఉంటా అత్తమ్మ పిలుస్తుంది చాయ్ పెట్టలనో ఏమో అని ఫోన్ కట్ చేసింది సౌజన్య.అత్త కేమో కోడలు చేసి పెట్టాలని ,దినికేమో అక్కడ ఉండడం ఇష్టం ఉండది.ఈ కరోనా కాలం లో ఎక్కడో ఒక దగ్గర ఉండాలి,తప్పదు అని  అనుకుంటూ జడ అల్లుకోసాగింది అర్చన ..

ఎవలె ఫోను అని అడిగింది సుమిత్రమ్మ.ఏ మా దోస్తు సౌజన్య కదా అంది అర్చన,ఏమoటుంది ఆ పిల్ల  అని  తల్లి అడుగంగానే ,ఏ వాళ్ళత్త అడనే ఉండమని అంటుందంట గా గూడూరు ల ఏం తొస్తది,అది పట్నం ల తిరిగిన పిల్ల నాయే,ఆవు పండుగలు అని ఏమో ఇనవడ్డది అంది సుమిత్రమ్మ,అదా పండుగలు అన్ని అయ్యేదoక అడనే ఉండమని అందంట,ఇడికి రావాలని దానికి ఇష్టం ,ఆమెమో అద్దు అనవట్టే అని నాకు చెప్పుతుందే అంది అర్చన.అవుమల్లా అడుంటేనే మంచిది,చిన్న పొరగాళ్లను పట్టుకుని ఈడ ఏడ ఉంటది .ముందులెక్క మంచిగా లేక పాయే రోజులు,ఊర్లనే మంచిగా ఉంటది మంచి గాలి,ఫ్యాక్టరీలు లేకుండా మస్తుగా ఉంటది.ఇగ పండుగలన్ని అడనే మంచిగా అయితాయి.

అయినా గి కాలం ల ఎవరాడుతారో ఏందో గిప్పుడు ఒకలనొకళ్ళు తాకొద్దు,దూరంగా ఉండాలే అని అనవట్టిరి,ఇగ బతుకమ్మలు ఏడ ఆడుతారో,ముందే ముక్కిడి అంటే దాంట్లకు దగ్గు వడిశం వోలె ఐపాయే,ఈ కాలం పొల్లాలకు ఆడుడు రాదు,పాటలు రావంటే,ఇగ ఈ కరోనా అచ్చి పాడాయే,చీరలు,నగలు సింఫేరించుకుని ముచ్చట్లు పెట్టనికే అస్తరు అనుకుంటే ఇగ గిప్పుడు మాస్కులు,సానీతైజర్ గవ్వి ఏసుకుని అస్తరు గావచ్చు,మా కాలం ల అయితే గివన్నీ ఉండేనా ఏమి,ఏం లేకుంటే పెండ్లి ల వెట్టిన పట్టు చీర కట్టుకోవలె,ఏ నగలు లేకున్న బంతి పువ్వు ఒక్కటి పెట్టుకొని ఆడుడే గొప్పా, అనుకుంటిమి అడనికి పోతుంటిమి అని గట్టిగా నిట్టూర్చింది సుమిత్రమ్మ.బతుకమ్మ బతుకమ్మ అని గుండ్రంగా సుట్టు తిరుగుతూ ఆడుతారు గదేనా అమ్మమ్మ ,అన్నాడు మనుమడు..అవును బిడ్డా అదే అంది సుమిత్ర ,ఓహో అయితే అమ్మమ్మ అమ్మమ్మ మీరెం చేస్తుండేనే నాకు జెప్పు,నాకు జెప్పే అబ్బా ప్లీస్ అమ్మమ్మ  అని అడిగాడు అక్కడ కూర్చుని సుమిత్రమ్మ మాటలు వింటున్న పదేళ్ల మనుమడు కుతూహలంగా,అవునే అమ్మా ఇప్పుడు ఏం పనిలేదు,కరెంటు కూడా పోయింది.నీ చిన్నప్పటి కథలు చెప్పే అప్పుడు బతుకమ్మ ఎట్లా చేద్దురో ఏంది చెప్పు అని అడిగారు కొడుకు,కూతురు కూడా ఆసక్తిగా,తన చిన్నప్పటి విషయాలు ఎన్నో సార్లు చెప్పాలి అని అనిపించినా ఎప్పుడూ చెప్పలేదు సుమిత్రమ్మ,ఇప్పుడు సమయం వచ్చినా ఆమెకు చెప్పలని లేకున్నా బిడ్డా కొడుకు అడగడం తో,ఏం చెప్తా బిడ్డా ఆ కాలమే మంచిగా ఉండే,పైసా పుట్టువడి లేకున్నా  పంట చేతికి వస్తే ఇగ పండుగానే ,కలిసి మెలసి పంట పండిచ్చుకునేటోళ్లం,అందరం కష్టపడుతుంటిమి, అని అంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళింది సుమిత్రమ్మ….

నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారింట్ల బతుకమ్మ పండుగ అంటే గౌరీ పూజ అంతే,గౌరమ్మ చేసుకుని అమ్మవారిని పూజించి,బతుకమ్మను పెర్షి,తొమ్మిది రకాల నైవేద్యంలు పెట్టి,అరగింపు చేసినంక ,అందరూ తినేటోళ్లు,అటెన్క సాయంత్రం మా కచిర్ల ముందట కి కోమట్లు అచ్చి బతుకమ్మ పెట్టి ఆడేటోళ్ళు, అల్లతో పాటు మా ఇంట్ల పనిచేసే బుడవ్వకు బతుకమ్మ ఇచ్చి అల్లతోనే పంపేటోళ్లం,అదే చెర్ల ఏసీ అచ్చేది.బతుకమ్మ తొమ్మిదోద్దులు అంతే ,మా యమ్మ గారింట్లా బతుకమ్మ పేరుసుడే గని,ఆడే ఆనవాయితీ లేదని మా అమ్మ చెప్పింది.మాకు ఆడాలని మస్తుగా ఉండేది.కని పెద్దోళ్ళు కన్నెర్ర చేసేటోళ్లు,మిగతా ఆడోళ్ల ఆటను  మేము అబ్బురంగా సూసేటోళ్లం,వాళ్ళను,వాళ్ళ చీరలను,గాజులను,పాటను తప్పులు లేకుండా చెప్పేటోళ్లను చూసేటోళ్లం,మేము చెర్వుకు కూడా పోయేటోళ్లం కాదు,బుధవ్వనే చెర్ల ఏషి అచ్చేది. ఇది మా అమ్మగారింట్ల  పండుగ ముచ్చట ఇదొక్కటే గిట్ల మిగతాయి అన్ని మంచిగానే చేసుకుంటిమి,ఇగ మేము పెరిగి పెద్దగాయి,పెండ్లి లు అయ్యే నాటికి కూడా మాకు బతుకమ్మ  పాటలు ఆడుడు సూత రాకపాయే,ఇగ నా పెండ్లి అయినంక  కామారెడ్డి  అడివిల్ల ను కరీంనగర్ కోడలుగా పోతి,మా అత్తగారోళ్లది పెద్ద కాన్దాని ,నలుగురు యరాళ్లు,నలుగురు ఆడివిల్లలు,ఇద్దరు మరుదులు,అంటే మా అత్తమ్మకు పది మంది సంతానం అన్నమాట మీ నయినా నాలుగో ఆయన,అయిన ఎంక ఇద్దరు మరుదులు అయినంక ఆడివిల్లలు చిన్నోళ్ల  కిందనే లెక్క,నేను అడివిల్లల తోనే ఎక్కువ ఉంటుంటి,మిగతా పెద్దోళ్ళు ఏరు వడ్డారు గని,ఒకటే ఇంట్ల ఉందురు అందరు. అత్తమామ మీద మేముండేటోళ్లం.ఇగ ఎవుసం,కరణికం ఉండే ఊర్ల,పంచాంగం కూడా చెప్పేటోడు మా మామ, మాఅత్త ఆంటే  మీ నానమ్మ మంచి,చెడ్డ తెల్సిన మనిషి,ఇగ మామ కూడా కోడళ్ల అంటే బిడ్డల కంటే ఎక్కువ సుస్తుండే,ఇప్పుడు అంటే అందరూ మారిండ్రు గని అప్పుడు మంచిగా ఉండే ప్రేమగా…నా పెండ్లి అయినంక మొదటి బతుకమ్మ అచ్చింది.మా అత్త అయితే ఇగ కందులు,పెసర్లు,మినుములు,బియ్యం అన్ని మంచిగా  ఎంచి,ఇసురుకొచ్చింది అప్పుడు గిర్నీ కి పోవాలంటే కష్టం అయితుండే అందరూ ఇసురాళ్లు తోనే ఇసురుకుందురు,అoడ్ల ఇసిరి,నెయ్యి పోసుకుంటా అన్ని ముద్దలు కట్టేది,మినుముల ఉండలు,నువ్వుల ఉండలు,పెసర ముద్దలు,బియ్యం,పెసర్ల తో కలిపి మలిద ముద్దలు కట్టేది పిల్లలు నలుగువరోజులు తింటారు అని,నాకు ఆమె చేసే పనులన్నీ ఈచిత్రం గా ఉండెయి.చిన్న కోడల్ని అని ఎక్కువ పని చెప్పక పోతుండే,యరాళ్లు ఏరు వడ్డా,పండుగ అంటే అందరూ కలిసి చేస్కుంటుండే,ఒకటే దగ్గర వండుకుని అందరూ తినేటోళ్లు,పెద్ద ఇల్లు,అంతకంటే పెద్ద వాకిలి,అండ్ల నే యరాళ్ళు వేరు వేరు గదులు కట్టుకుని ఉండేటోళ్లు.

వరుసగా అత్తమామలు,పెద్దోళ్ళు,రెండోళ్ళు,మూడోళ్ళు ఇట్లా ఎనిమిది రూంలు, ముందల పెద్ద బాయి,నిత్యా మల్లె చెట్టు మస్తు పువ్వులు పూసేది అందరం రోజు పెట్టుకుంటిమి,అత్తగారి ఇంట్ల ఎవరి పని అల్లే చేసుకోవాలీ,పనోళ్లు లేరు అమ్మ గారింట్ల లెక్క,ఇగ మా అత్తమ్మ పొలాల అమాసకు భక్షలు చేసి కొడుకులకు వాయినాలు ఇచ్చేది.అన్ని పండుగలు చేసేది ఇది అది కదనట్టు ఆడివిల్ల లు ఏ ఇంటికి పడ్డా అక్కడి పండుగలు తెల్వలే అన్నట్టుగా చేస్తుండే,ఇగ బతుకమ్మ కోసం బియ్యం,మినుములు ,పెసర్లు ఎంచి మలిదా ముద్దలు కట్టేది నెయ్యి పోసుకుంటా,మమ్మల్ని కూడా తినుండీ బిడ్డా నడుములు గట్టి వాడుతాయి అని చెప్పేది.ఇక బతుకమ్మ తొమ్మిదోద్దులు ఫలరం కోసం ఆ రోజు మడి గట్టుకుని చేసేది,అది గాక ఇంత మందికి వంట కూడా ఆమెనే సేసేది,ఇగ బతుకమ్మ రెండు దినాలు ఉందనంగా  ఊర్లకు గాజులోళ్లు అస్తుండే ఆమె దగ్గరనే ఏసుకునేవాళ్ళం. ఉన్న గాజులన్ని మా ఇంట్లొళ్లకే అయిపోతుండే. పెద్ద బలగం కదా.అందరం రెండు రెండు డజన్ల ఆకుపచ్చయి,ఎర్రయి కలగలిపి ఏసుకునేవాళ్ళం చెయ్యి నిండుగా… బొట్టు సీసాలు,రిబ్బన్లు,కాంటలు కూడా గప్పుడే తీసుకునేవాళ్ళం. ఇగ చీరల కోసం పక్కూరు నుండి సాలోళ్లు పెద్ద పెద్ద మూటలు తెచ్చి మా ముందు పెట్టేవాడు. ఎవరికి గావల్సింది నచ్చిన చీరలు రెండు తీసుకోమంటుండే మా అత్త. ఒకటి బతుకమ్మను ఒకటి దసరాకు. శాలోళ్ళకు, గాజులోళ్ళకు  పైసలు బదులుగా  అడ్లు కొలిసి ఇచ్చేటోడు మా మామ. ఇగ మొగోళ్లకు కూడా అప్పుడే కమిజు బట్ట తీసుకొని జాంబీకి కుట్టిచ్చు కునేటోళ్లు, మా ఆడివిల్లలకు లంగా ఓనిలు తీసుకునేది.  బతుకమ్మ తొమ్మిది దోద్దులు మా అత్తమ్మ 3 జానల బతుకమ్మ పేర్చి అందర్నీ ఆడుకొమ్మని తొలిస్తుండే ఇంటి ముందర 3 గంటలకు అలుకు సల్లి, ముగ్గు పెట్టి మా కొడళ్లను, బిడ్డలను ఆడుకోమనేది, మాకు సదువు లేదు పాటలు రాకపోతుండే మా యత్తనే సెప్పేది.

నాకు ఆట రాకపోతుండే నేను బయపడుతుంటి. కానీ మా యరాళ్లు అది సుశి మెమెట్లాడుతున్నామో అట్ల ఆడు షేల్లే అని నాకు నేర్పిండ్రు. ఇంగా మా అత్తమ్మ బతుకమ్మ పాట మొదలు పెట్టిందంటే ఆది వొడువకనే పోతుండే. రాత్రి అయితుందని ఆపుడే తప్ప అది ఒడువకపోవు. 9వ నాడు పెద్ద బతుకమ్మను ఏడేడనుండో గునుగు, బంతి, తంగేడు, కట్ల పువ్వులతో పాటు రకరకాల పువ్వులు తెచ్చి వంటoతా చేసి పెట్టి పలారాలు  చేసి బతుకమ్మ పెరుస్తుండే మా అత్తమ్మ. మొత్తం పువ్వేనాయే ఇప్పట్లలెక్క అప్పుడు కలర్లు లేకపోయే గునుగు, తంగేడు, కట్ల పువ్వులతో పెరుస్తుండే. గౌరమ్మ పెరుసుడయినాక కొడన్లలందర్ని పిలిచి పసుపుబొట్లు ఇచ్చి అన్నాలు తినేటోళ్లు. తిన్నాక పువ్వు ఎరుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఎవరెవరం ఏ ఏ చీరలు కట్టుకోవాలో అని మాట్లాడుకుంటా ఒకరి చీరలను ఒకరం పంచుకునేటోళ్లం. అలా మాట్లాడుకుంటా బతుకమ్మ పెరుస్తుండే. మాది కాకనెపోవు 3 గంటలకు సప్పుడోళ్లు సప్పుడు చేస్తుండే ఇగ మా అత్త ఆగమాగం చేస్కుంట ఇగ ఇది నేను పెరుస్తా మీరు పోయి తయారు కండి అని అంటుండే. మేము తయారయ్యే లోపల ఆమె కూడా జల్ది జల్ది పేర్చి తయారయ్యేది. ఇంటి ముందల అలుకు సల్లి ముగ్గేసి, గౌరమ్మని పెట్టి, అందరం మొక్కుకొని ఓ ఐదు సుట్లు తిరిగినాక మూడు బజార్ల కాడికి సప్పుడోళ్లు ముందు నడుస్తుండగా మా శిన్నమర్ది సుట్టుబట్ట బెట్టుకొని బతుకమ్మని ఎత్తుకుంటుండే మా యత్త గౌరమ్మను కొడళ్లoదరం 9 రకాల సద్దులు తీసుకొని పోయేటోళ్లం. మూడు బజార్ల కాడా కోమట్లయి, కర్ణాపొల్లాయి, రెడ్లయి,ఎల్మొళ్లయి, రాంగనే సుట్టు పెట్టుకొని ఆడుకునేటోళ్లం. ఇగ ఏ వాడకట్టోళ్ళు ఆడ ఏ కులపొళ్లు ఆ కులపొళ్లు కాడ పెట్టుకొని ఆడుకుంటుండే. ఏడాదికోసారాయే బుద్ధిరా ఆడుకోవాలని ఉంటుండే. ఇదే ఇగ దసరా అయితే మొగుళ్ళ పండుగ నాయె, ఎంత సేపైనా అలుపులేకుండా విసుకు రాకపోవు మాకు.

నాకు మొదట కష్టమయ్యింది గని చిన్నప్పటిసంధి ఆడుకోవాలి అని ఉండే కదా ఇక రాత్రి 9 గంటల దాకా ఆడుతుంటిమి. ఆడుకునేటొళ్ల కోసం పెద్ద లైట్ బుగ్గలు కూడా పెట్టిస్తుండే. ఇగ మేము తీసేదాకా ఎవరూ తీయకపోతే ఉండే. మేము తీసినాకనే అందరూ బతుకమ్మ తీస్తుండే. చేర్వు కట్టకు పోయి,అంతకు ముందే సుంకరోల్లు శుభ్రం చేసి ముగ్గేసి ఆ జాగలో అందరం ఏ కులం అని లేకుండా అందరం కలిసి బతుకమ్మలు సుట్టూరుగా పెట్టి,గుండ్రంగా పలారాల డబ్బాలు సూత అడనే పెట్టి అడుతుండే ఇగ, గాజుల గలగలలు,పట్టుచీరల రెపరెపలతో,ఆగరుబత్తుల,పలరాల సువాసనలు అన్ని కలగలిపి అదొక ఉన్మత్త ఆనందం జోరు దార్ గా నడిచేది ఆట,అబ్బా ఆటను తల్చుకుంటే కండ్లల మెదలవట్టే,ఒకరు ఒక పాట అందుకుని భావాయుక్తన్గా,రాగ యుక్తంగా,చప్పట్ల తోను,లయబద్దంగా అడుగులు వేస్తూ  అట్లా తెల్లవార్లూ అడుమన్నా ఆడేటోళ్లు, ఆడొల్లము యాడాది అంతా కష్టపడి పని చేసుకునే వాళ్ళం,మాకు బతుకమ్మ నే మంచి ఆట,అదే కాలక్షేపం గా ఉండేది మాకు,ఇప్పటి లెక్క ఫోన్ లు,టీవీ లు,లేకపోయే అప్పుడు,అందుకే రాత్రి పదిగంటల దాకా ఆడే వాళ్ళం ,పిల్లలు ఆకలి కి ఆగరు అని ,ఆపైన మస్కురోళ్ళు చెర్ల నిలబడి ఒక్కొక్క బతుకమ్మను జాగ్రత్తగా నీళ్లలోకి ఇడుస్తుండే,ఆడాలందరు ఒక దగ్గర చేరి పసుపుబొట్లు ఇచ్చుకుంటూ,పలారాలు పంచుకునే వాళ్ళం,మస్కురోళ్ళకు కూడా పంచుతుంటిమి. ఇగ వాళ్లకు పండుగనే రకరకాల పలారాలు పులిహోర,దద్దోజనం,చక్ర పొంగలి,పులుసన్నo,మలిదా ముద్దలు,ఇట్లా తొమ్మిది రకాల సద్దులు తెచ్చేటోళ్లు అందరూ అందరివి పంచుకుని తిని,మొగోళ్లకు తీసుకపోయేటోళ్లం ప్రసాదం ,ఇగ ఎక్కడెక్కడి నుంచో అడుక్కునే వాళ్ళు కూడా వచ్చేటోళ్లు వాళ్లకు కుడా తీసుకపోయిన పలారాలు పంచేటోళ్లం, వాళ్ళు కడుపు నిండా తిని మమ్ములను దివిస్తుంటే ఆ ఆనందం ఎవలు చెప్పగలరు.ఒక పూటైనా వారి కడుపు నిండేది.ఇగ ఖాళీ అయిన తాంబనాలు,నీళ్ల తో నెత్తి మీద పెట్టుకుని  ఆట చిలకల్లారా,పాట చిలకల్లారా,కలికి చిలకల్లారా,కందువ మొగ్గలు,అని పాటలు పాడుకుంటూ,పోయి రా బతుకమ్మ పోయిరావమ్ము మళ్ళీ యడాదికి మర్లి రావమ్మా అని ఆమెను సాగదొలి మేము ఇంటికి పొయ్యి,తిని ,ఇంటి ముందల తాంబనాలు పెట్టి ఆ నీటిని పవిత్రంగా నెత్తుల మీద,ఇంటి మిన సల్లుకుని పొద్దుపోయిన దాకా మల్లా బతుకమ్మ ఆడేటోళ్లం,కొందరు అయితే మబ్బుల మూడు జాముల దాకా ఆడేటోళ్లు..యడాది దాకా ఇగ ఏ ఆట లేదని మమ్మల్ని మొగోళ్ళు కూడా ఏమనక పోతుండే,అప్పట్ల ఎంత సేపు ఆడినా పెయ్యి నొవ్వక పోతుండే,అలసట కూడా ఉండక పోతుండే,అది మా కాలం ల బతుకమ్మ పండుగ అంటే,ఇగ మీ నాయినకు కోల్వచ్చినంక వేరే తనకు అస్తిమి,నీకు బిడ్డా ఉంది కదా నువ్వు పెరసుకో బతుకమ్మ అనే మీ నాయనమ్మ,అట్లనే పెరిస్తి,నువ్వు సూత మంచిగానే ఆట నెరిస్తివి.

ఇగో ఈ పట్నం కు అచ్చినంక పువ్వు దొరకక పాయే,గునుగు,తంగేడు దొరకక బంతి పువ్వులతో పెరసుకునుడే నాయే ఒక్కో పరి అది కూడా దొరకక కాగితం బతుకమ్మ కూడా తెచ్చుకుంటిమి,పైసలు పెట్టి పువ్వుకు పోయి,అంగాట్ల తిరిగినంత సేపు,పువ్వు తెచ్చి బతుకమ్మ పెర్షినంత సేపు కూడా ఆడక పోతిరి,ఈ అపార్ట్ మెంటుల కింద గంత పెద్ద జగ ఉన్నా గ్రూడో ఏందో  ఉన్నా,ఒకళ్లను చూసి ఒకరు రాకపోవుడు,ఆడక పోవుడు,అచ్చినంక కూడా చీరలు,నగలు సూసుకుంట,ఇంకొల్ల మీద ముచ్చట్లు,ఎక్కిరించుడు,  పెట్టుకుంటా టైం అంతా ఉత్తదే చేస్తారు తప్ప తనివి దిరా అడుకుందాం యడాదికి ఒక సారని సోయి ఉండదు, రోజు సుసుకుంటున్నా,మాట్లాడుకుంటున్న,ఎన్నడూ మాట్లాడనట్టు,కల్వ నట్టు ముచ్చట్లు పెట్టుడినాయే,ఏ పది నిమిషాలు సక్కగా పాట పాడుకుంట ఆడుడు లేక పాయే,పాటలు రాకున్నా,నాలాంటిది ఉంటే పాట చెప్తే సూత అడుకుందాం అనే సోయి లేదు ఎవలికి ,అదేందో డి.జె అంట డి.జె పాటలు పెట్టుకుంటా గుయ్యి మని సప్పుడు చేసుకుంటా ఆ పాట అచ్చుడేమో గని ఇగ ఎగురుకుంటా,దుంకుడు ఆటలే ఆడవట్టిరి,అంటే ఇప్పటి తరం కొత్తగా నెర్శిరి,ఆడుకోండి కని అద్దు అంటలే,కాని పాత తరం వారికి కూడా విలువను ఇవ్వండి.

పాతోళ్లకు ఎగురుడు దుంకుడు రానోళ్లకు కూడా ఆడుకునే టైం ఇయ్యలే,పాత పాటలు,ఆటలు,సంస్కృతి,సంప్రదాయం మీ కొత్త తరం నేర్చుకుని,ముందు తరాల వారికి దారి చూపించాలే,ఇప్పుడు గా పాత పాటల్ని కూడా డి.జె అంట దాన్ని వెట్టి పాడు జేసిరి,అంతా కలి కాలం,అపట్ల చేతులు కల్పుడు రానోళ్ళను పిల్లల  వరుసలో ఆడుమంటే సిగ్గు వొతుండే,దాంతో కష్టం అయినా ఇష్టంగా నేర్చుకునేటోళ్లం,కానీ ఇప్పుడు ఆట రాకపోవుడే గొప్ప ఐపాయే,పది నిమిషాలు దుంకుడు,పక్కకు కుసునుడు,ఇప్పుడా పట్టుచీరల రెపరేపలు,ఏవీ,కమ్మని గంధం వాసనలు,అత్తారు వాసన,ఆగరుబత్తుల,తన్మయత్వం తో శ్రుతి,లయ రగబద్దంగా ఆడి పాడే వారేరి ఎక్కడో ఒక దగ్గర ఉన్నా పాపం వీరి విచిత్రపు పోకడలు చూస్తూ దూరంగా నిలబడుడే తప్ప పోయి ఆడుకునే వీలు లేక పాయే,ఇగ చెర్వులు,కాల్వల ఏసుడే లేదు ఇడ,ఒక తొట్టి వెట్టి అందులో కుక్కుడే బతుకమ్మ లను,పలారాలు పంచుడు లేకపోయే,పసుపు బొట్లు ఇచ్చుకున్నా చిన్న గా ,చిన్నగా అని సోకులు పోవుడే ఎక్కువాయ,స్టైలుగా ఉండుంరీ కని ఆచారాన్ని,సంప్రదాయన్ని వదులుకోకండి,అనే సెప్తున్న అవ్వ,బతుకనికి పట్నం అచ్చి పండుగలన్ని మరిస్థిమి,ఉద్యోగాలు,పిల్లల సదువుల తోని,ఏ పండుగ ఎప్పుడో తెల్వక పాయే, అప్పట్ల పువ్వులు పుణ్యనికి ఇస్తుండే,ఇప్పుడు పుణ్యం లేదు,పాపం లేదు,అన్ని అమ్ముడేనాయే, పండుగ అని తెలిసిన అదర బాదరగా ఇన్ని పువ్వులు కొనుక్కుని,పండుగ చేసుకునుడే,పల్లెల ఎవలన్నా ఉంటే పోవుడు లేకపోతే ఇడనే కిత కిత చేసుకునుడు,పట్నం ల పల్లెల సూత గిట్లనే ఉందనుకుంటే, ఇప్పుడు గి కరోనా అనేది అచ్చె,ముందుగాల అంగాట్ల అన్ని ఉన్నా అల్లున్ని నోట్ల శని అన్నవోలె పైసలు,పువ్వులు,ఆడే సత్తా ఉన్నా ఇప్పటోళ్లకు అయినా ఈ కరోనా కాలం ల ఏం ఆడుతారో ఏందో,ముందే డి.జె ఆటలు ఎగురుడు దుంకుడు ఎవరెవరిని ముట్టుకుంటారో,ఎవరెవరిని తకుతారో ఎవలికి అంటిస్తారో అనే భయం తోని ఏమైతదో ఇగ గి బతుకమ్మా,ఈ కష్టకాలంలో కూలి లేక,పనులు లేక తిండి లెనోళ్ళకు ఏం పండుగ పైసా ఉన్నోనికి పండుగ,లెనోనికి ఎండుగనే ఇగ, ఏమో తి బిడ్డా మా కాలం ల గివ్వని లేవు,పాపపు

పనులుకూడాలేవు,నాయం,ధర్మం,మంచి,చెడు,భయం ఉండే,ఒకళ్లను అనాలం చేసే బుద్ది లేకపోయే,ఎవలకు కష్టం అచ్చిన అందరం పోయేటోళ్లం,అరుసుకునే టోళ్లం. మంచి నాయకులు,దొరలు ఉండే కష్టం దొర అంటే అర్ధరాత్రి అయిన లేషి అచ్చేటోళ్లు గప్పుడు,ఎవుసం

చేసుకుంటా,సంప్రదాయం,సంస్కృతి,ఆచారం,పెద్ద,చిన్న అనే అంతరాల తెలుసుకుని ఉండేటోళ్ళు,హ గా బతుకమ్మనే బంగారు బతుకమ్మ అయే,గిప్పుడు ఏం బతుకమ్మ అది డి.జె బతుకమ్మా ఐపాయే మల్లా గా బంగారు రోజులు మల్లా గసుంటి రోజులు అత్తె ఎంత బాగుండు అని అంది సుమిత్రమ్మ.

—- భవ్య చారు

Related Posts

1 Comment

Comments are closed.