ఏది కావలసినది…!!!
మసిబూసుకొని చిటారు కొమ్మన
మిఠాయిగా అందని ఆకాశానికై
ఎగబాకుతుంటే…దొరకని దానికోసం
దోసిటి పట్టాలా విడువని పాదాల
చరణదాసీ తనానికి దాసోహమంటు
తీరని ఆశలతో అవకాశాలకై ఎదురు
చూడాలా…ఏది కావలసినది…
నిరూపణకు నోచుకోలేక సిగ్గుతో
సమాజం గెలువని విషకోణమై…!!
మనుషుల నిరంకుశత్వానికి తలవంచిన
విజయం చెల్లని నోటుగా మధిని విడిచిన
మానవత్వం ఓర్పుతో గాయపడుతు…
క్షణాలు ఒద్దికలు కాలేక…చేయని నీతితో
కుఠిలత్వపు నారుకు నీరవుతుంది…
కర్షక కార్మికుల శ్రమలో దాగిన చైతన్యాన్ని
కాచిన చిగురులోనే కాలి క్రింద చీమల్లా
నలిపేస్తు…నలిగిన ముఖాలతో
అడిగిన రూపం ప్రపంచాన్ని చూడలేని
బానిసత్వంగా మగ్గుతు…తెగిన రెక్కలకు
దొరకని అన్వేషణా చేయని మనుషులతో
కూల్చబడిన నిరంతరమై నిండిన కన్నీరు
కాలానికి దాహం తీర్చుతున్నది…
పారే ఏరువాకలు ఏనాటికో
ఏ పొద్దులను ముంచెత్తునో…!!
తడి ఆరిన సంబరాలతో స్నానమాడని
మా బతుకుల సూర్యోదయం
మసక బారిపోతున్నది రూపుదిద్దుకోలేని
ఆత్మ విశ్వాసపు ఊహాచిత్రాల పర్యంతంలో
వెనక బడిన బతుకుల వేదనలను తోడక…
మచ్చుకైనా కనిపించని మానవత్వాన్ని
జగతిన వెలుగుగా నడిపించు…
– దేరంగుల భైరవ