ఎదురీత

ఎదురీత

దిన దిన గండంగా గడిచే మధ్యతరగతి జీవితాలు
రోజు కూలితో దినం గడిపే నిరుపేదలు
కూడూ గుడ్డా వంటి కనీసవసరాలైనా తీరక
రోడ్డు పక్కనే నివాసనేర్పరచుకుని
ఈసురో మని కాలం గడిపే ఎందరికో
తప్పదు కాలానికి ఎదురీదుతూ పోరాడడం

ర్యాంకుల కోసం పోటీలతో పరుగెడుతూ
అమ్మానాన్నల కృత్రిమ హోదాల కోసమని
పిల్లలపై రుద్దే చాదస్తంలో
పులిని చూసి‌ నక్కవాత చందాన
పోలికలతో చిన్ని మనసుని సతమతం చేస్తుంటే
తప్పదు చదువుల వెంట పరిగెత్తే ఎదురీత

ఆలు మగల ఉద్యోగాలలో క్షణమైనా తీరిక లేక
మితిమీరిన ఒత్తిడికి గురి అవుతూనే
ఆలు మగల సత్సంబంధం‌ చిద్రం చేసుకుంటూ
మమతానురాగాలని మరచి చరిస్తూ
అహాలతో కూడిన సంబంధాలు నిలవవంటూ
విడివడి వేరైన నేటి తరాలకి తప్పదు ఎదురీత

అడుగడుగునా జీవితమనే రహదారిలో
ఎదురయ్యే ఎత్తు పల్లాల స్పీడుబ్రేకర్లు
అలలు అలలుగా ఎగసి పడే మనో ఉద్విగ్నతలు
అదిమి‌ పట్టి సర్దుకుపోతూ బంధాలను కాపాడుకుంటూ
ఆదర్శంగా సహనమే ఆయుధంగా నడచి
నిలిచిపోవాలి ఎదురీదినా అలసిపోని విజయ తీరాలని చేరి.

– ఉమామహేశ్వరి యాళ్ళ

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress