ఈ జన్మకి ఈ బంధం చాలు.!

ఈ జన్మకి ఈ బంధం చాలు.!

ఒకరోజు ఒక్కడినే.. చీకటిలో పొలం గట్టుమీద కూర్చుని ఏడుస్తున్నా.. చుట్టూ ఎవరూ లేరు.. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశమంతా.. నా ఏడుపు ఎవరికీ వినిపించలేదు.. నా కన్నీరు ఎవరికీ కనిపించలేదు..

ఇంకోరోజు మళ్లీ ఒక్కడినే.. గోదావరి ఒడ్డున కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్నా.. ప్రశాంతంగా ముందుకు సాగిపోతున్న గోదారితో సహా అప్పుడూ నన్నెవరూ పట్టించుకోలేదు. ఏమైందని ఓదార్చేవారెవరూ రాలేదు.

ఒకసారి జీవితంలో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తూ కష్టంలో ఏడ్చాను.. ఇంకోసారి ఒంటరిగా మిగిలిపోయినందుకు ఏడ్చాను.. తర్వాత ఎప్పుడూ ఏడవలేదు. కానీ నువ్ నా జీవితంలోకి వచ్చే వరకూ ఒక మనిషి కోసం ఇంతలా కన్నీరొలుకుతానని అనుకోలేదు.

నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులు నాతోనే ఉంటాయి.. నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచన వదలను.. లేస్తూనే నీ రూపం కళ్ల ఎదుట ఉందని ఊహించుకుంటాను. ఏ పనిచేస్తున్నా నిన్ను మరువకుంటాను.

నాతో నువ్ లేకున్నా.. నీతోనే అనుక్షణం జీవిస్తుంటాను.. ఏమంటారే దీన్ని అంటే పిచ్చి అంటావేమో.. అదీ నిజమే.. నువ్వంటే పిచ్చే.. నీ కోసం చచ్చేంత పిచ్చి.. ఎందుకంటావా.. నా మనసు పొరల్లో నీపై దాగి ఉన్న నా ప్రేమను అడుగు.

నువ్ నాతో ఉంటే చాలు.. దేన్నయినా ఎదిరించగలననె ధైర్యం వస్తుంది.. నీతో మాట్లాడితే చాలు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.. నీతో గడిపే ప్రతి నిమిషం అలా కరిగిపోకుండా ఆగిపోవాలని ఎన్ని సార్లు కోరుకున్నానో నాకే తెలుసు.

నీ అలకలోనూ నాపై ప్రేమనే చూశానే.. నువ్వంటే అంతిష్టం.. ఇలా ఎన్నాళ్లని అడగకు.. నేనున్నన్నాళ్లని నీకు తెలుసు.. నీ కోసం నేను ఏమీ చేయలేకపోవచ్చు.. కానీ నాకన్నా నిన్ను ప్రేమించలేరెవరు.

నీకోసం కన్నీరొలికేంత ప్రేమ నా గుండెలో నీపై ఉంది. మన ఇద్దరి జీవితాలు వేరైనా నా ప్రపంచం నువ్వే.. నువ్ ఉన్నా లేకున్నా నాతో.. నీ నీడై ఎప్పటికీ నే తోడుంటానే. ఈ జన్మకి ఈ బంధం చాలు.!

– ది పెన్

Related Posts