ఎవరి పని వారికి గొప్ప

ఎవరి పని వారికి గొప్ప

అబ్బబ్బా పొద్దున్నే ఏంటి సప్పుడు నిద్ర పోనియ్యావా నన్ను అంటూ అరిచాడు మా తమ్ముడు ప్రవీణ్, ఏమైందిరా ఇప్పుడు నేనేమైనా కావాలని చేస్తున్నానా? ఇంట్లో పని చేసుకోక పొతే ఎట్లా మళ్లీ ఎనిమిది గంటల వరకు అందరికీ బాక్స్ లు కట్టాలి అంటే, ఆ మాత్రం చప్పుడు కాకుండా ఎలా చేస్తారు అన్నాను కాస్త గొంతు పెంచి. చెయ్యవద్దు అంటలేను కానీ, సపుడు కాకుండా చేయొచ్చు కదా అన్నాడు వాడు. ఆ, సప్పుడు కాకుండా ఎలా చేస్తాను ? నువ్వు చెయ్యి రా ఒకసారి చూద్దాం అన్నాను కాస్త కోపంగా… సరే తీ వాడు అలాగే ఓర్రుతడు నువ్వు సప్పుడు జేక ఉకో అన్నది అమ్మ.

ఏందే, ఊకునేది, టిఫిన్స్ కావాలి, చాయి కావాలి, అన్నం, కూర కావాలి, అన్నం సల్లగా అవ్వాలని, డబ్బాలో పెట్టాలి, ఇల్లు ఊడవాలి, స్నానం కావాలి, పూజ కావాలి, నీళ్లు పట్టాలి, ఇవన్నీ కావాలి కాని సపుడు కాకుండా చేయాలి అంటే ఎట్లా అంటూ అమ్మతో అన్నాను. ఇంతలో బాబు అమ్మ నీళ్లు అనడంతో వేడి నీళ్ళు స్నానానికి పోయడానికి వెళ్ళాను. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది.

వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ, ఒక్క పని చేయరు అన్ని దగ్గరికి తెచ్చి ఇవ్వాలి. అన్ని చేసి పెట్టి నేను తయారయ్యి బడికి వెళ్లాలి, నా రోజు వారి దినచర్య ఎలా ఉంటుంది అంటే, ప్రొద్దున్నే అయిదింటికి లేచి, ముందు నా కాలకృత్యాలు తీర్చుకొని, బయట కడిగేసి ముగ్గేసి వచ్చి, పాలు కాచి, కాస్త టీ తాగుతూనే, ఓ వైపు బియ్యం కడిగి పేట్టి, ఇంకో వైపు వేడి నీళ్ళు పెట్టాలి. మరో వైపు, కూరగాయలు కోసుకోవాలి, ఈ లోపు అన్నం అవుతుంది, దాన్ని దించేసి, కూర పొయ్యిమీద వేసి, అన్నం ఒక ప్లేట్ లో అరబెట్టుకోవాలి, మరో వైపు కాగిన నీళ్లు దించేసి దాని పైన టిఫిన్ లోకి ఏదైనా చట్నీ చేయాలి.

ఈలోపు నీళ్లు రావడం మొదలవుతుంది. స్టవ్ ఆపేసి బిందెలు కడిగి నీళ్ళు పట్టాలి. ఈలోపు బాబును లేపి బ్రష్ చేయించాలి. వాడికి వేడి నీళ్ళు పోసి నల్లా వస్తుండగానే స్నానం చేయించి, మళ్లీ ఖాళీ అయిన బకిట్ లో నీళ్ళు పట్టాలి, ఈ లోపు అమ్మ, తమ్ముడు లేస్తారు. మెల్లిగా మళ్లీ వాళ్లకు టీ చేసి ఇవ్వాలి. ఇల్లు ఊడ్చుకొని, అప్పుడు పూజ చేసుకోవాలి. అదంతా అయ్యే సరికి టైం ఎనిమిది అవుతూనే ఉంటుంది. గబగబా, దోశలు, ఇడ్లీ ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందరికీ పెట్టి ఇచ్చాక, మాకు డబ్బాలు సర్దాలి. వాటిని అందరి బ్యాగ్ లో పెట్టి నీళ్ల బాటిల్ నింపి, నేను రెడీ అవ్వాలి.

డబ్బాల్లో అన్ని సర్దుకుని అమ్మకు అన్ని ఎక్కడున్నాయో చూపించాలి. టిఫిన్ తింటున్నా , మళ్లీ చాయి అడుగుతారు. వాడికి వేడినీళ్లు పెట్టాలి. బకిట్ లో పోయాలి. వాడి స్నానం అయ్యి రెడీ అవుతూనే టైం అయితుంది అంటూ, హడావుడి చేసి బ్యాగ్ పెట్టినవా, నీళ్లు పెట్టినవా, డబ్బా పెట్టినవా, అంటూ లక్ష ప్రశ్నలు వేస్తూ హడావుడి చేసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళాక మేము డబ్బాలు తీసుకుని, ఈలోపు బాబుకు డ్రెస్ వేసి, రెడీ చేసి బాస్కెట్లో మా ఇద్దరికీ డబ్బాలు పెట్టి, అమ్మకు అన్ని ఇక్కడే ఉన్నాయి అని చెప్పి, టైం అవ్వడంతో, నేను బాబు ను తీసుకుని స్కూల్ కు నడుచుకుంటూ వెళ్లాలి.

మళ్లీ సాయంత్రం రాగానే, కొంచం చాయి పెట్టుకుని తాగి, బాబుకు డ్రెస్ మార్చి, బొళ్లు సర్దేసి, కడిగేసి, రాత్రికి ఏం కూరలు ఉన్నాయి చూసుకుని, మళ్లీ కూర, అన్నం వండి రెడీ పెట్టుకుని, తమ్ముడు వస్తాడని చూస్తూ, వాడు వచ్చాక అందరం తినేసి, బాబుకు హోమ్ వర్క్ చేయించి, ఈలోపు బట్టలు ఉతికేసి అరేసి, రాత్రి పది గంటలకు అందరం తిన్నాక, వంటిల్లు సర్దుకుని, పడుకునేసరికి రాత్రి పదకొండు అవుతుంది.

మళ్లీ తెల్లారి మళ్లీ మొదలు ఒక వేళ టిఫిన్ లేకుండా ఆరోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అంటే, నాలుగున్నరకు లేవాలి. స్కూల్ ఒంటి పూట ఉన్నప్పుడు కూడా అదే నాలుగున్నరకు లేవాలి. అప్పుడు కూడా రెస్ట్ ఉండదు. ఇక పండగలప్పుడు అయితే, మాకు ఒక్క రోజే దొరికిందని అందరూ కాలు మీద కాలు వేసుకుని కూర్చునే సరికి, నేనే అన్ని చేయాలి. ఇల్లు కడగడం, దులపడం ఇలా ఎన్నో కొత్త పనులు మేమున్నాం అంటూ ముందుకు వస్తాయి.

ఎవరి పని వారికి గొప్ప
ఎవరి పని వారికి గొప్ప

అబ్బబ్బా మళ్లీ అదే సప్పుడు, రాత్రి లేట్ గా వచ్చిన కొంచం సేపు పడుకొనియ్యే అన్నాడు తమ్ముడు తెల్లారి బాబూ, రేపటి నుండి హాయిగా పడుకో,  ఈరోజు వదిలెయ్యి అన్నాను ఏం అనలేక, ఎందుకు అంత సప్పుడు చేస్తావ్ ? ఒక కూర , అన్నంకు ఎంత మందికి చేసినట్టు చేస్తావ్ సప్పుడు ?  పొద్దున్నే కుముటు పెడతావు, నిద్ర పోనివ్వకుండా, పెద్ద పని పొడిచేసినట్టు అంటూ ఎగిరి పడ్డాడు. నువ్వే చేస్తున్నావా ?  ఇంకెవరు చేయరా ఏంటి ?  ఇంతోటి వంట అన్నాడు. నేను మౌనంగా వచ్చి వాడికి ఎదురుగా నిలబడి సరే చేయొచ్చు కదా , నువ్వు రేపు చెయ్యి సరేనా అన్నాను. ఓహో అంతే కదా చేస్తా  , పెద్ద అదొక పనా మస్తుగ చేసుకున్న అన్నాడు , సరే చెయ్యి చూద్దాం అని అన్నాను, అందరం ఎవరి పనులకు వాళ్ళం పోయాము.

మర్నాడు మెల్లిగా ఆరుగంటలకు లేచాడు వాడు. నల్ల వస్తుంటే ఓ వైపు బియ్యం కడిగి పెట్టాడు. నేను స్నానం చేసి వచ్చి జడ వేసుకుంటూ చాయి అడిగా, ఈలోపు నీళ్లు పడుతుంటే, అన్నం మాడిపోయింది, దాన్ని గభాలున దించబోయి చెయ్యి కాల్చుకున్నాడు. నాకు చాయ్ పోశాడు. అందులో శక్కరి లేదు, మరో వైపు కూరగాయలు కోస్తుంటే, చెయ్యి తెగింది. ఈలోపు అమ్మ చాయి అడిగింది. అమ్మకు పోశాడు. అందులో శక్కరి లేదు అన్నది అమ్మ. మళ్ళీ చేశాడు. ఇంకా కూర కాలేదు.

కూర పొయ్యి మీద వేసి వాడు బ్రెష్ చేశాడు. ఈ లోపు కూర అడుగంటి పోయింది. వచ్చి దించాడు. ఈలోపు బాబు కోసం వేడి నీళ్ళు అడిగితే, దించబోయి, చెయ్యి మీద వేడి నీళ్లు పోసుకున్నాడు. టిఫిన్ కోసం చట్నీ చెయ్యి మంటే, దాన్ని మాడగొట్టాడు ఫోన్ చూస్తూ, తిరిగి ఇడ్లీ పెట్టి స్నానం చేయడం కోసం వెళ్లడంతో, ఇడ్లీ పాత్రలో నీళ్ళు ఆవిరి అయ్యాయి. అన్నం చల్లార బెట్టలేదు.

దాంతో, బాక్స్ లో వేడి వేడిగా అలాగే పెట్టాడు. వాడు చేస్తున్నవి అన్ని చూస్తూ ఉండిపోయాను. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వాడు రెడీ అవుతుంటే అమ్మ ఇల్లు ఉడవలేదని గుర్తు చేసింది. దాంతో రెడీ అయిన వాడు అలాగే ఇల్లు ఊడుస్తుంటే, షర్టు చిరిగి పోయింది. ఇక అందరం టిఫిన్ తినాలని కూర్చుంటే, అందులో ఉప్పు లేదు. అలాగే, మింగి టైం అవ్వడంతో బాక్స్ తీసుకుని వాడు ఆఫీస్ కు, నేను స్కూల్ కు వెళ్ళాము.

మధ్యాహ్నం అన్నం తినాలని కూర్చుంటే, అన్నం పాడయ్యింది. దాంతో వేరే టిఫిన్ తెచ్చి బాబుకు తినిపించాను. ఇక సాయంత్రం తొందరగానే వచ్చాడు. ఇంటికి రాగానే పొద్దటి బొళ్లు సర్దుకునే సరికి తాతలు దిగారు. వాడు చేసినవి అన్ని పారేసి, అన్ని మంచిగా కడిగేసి , బోర్లించాడు. నేను టీవీ చూస్తూ కూర్చున్నా, ఏమీ మాట్లాడకుండా…

వాడు బొళ్లు సర్దేసి, నా దగ్గరికి వచ్చి కూర్చుని, నా రెండు చేతులు పట్టుకుంటూ, అమ్మా తల్లి నాది తప్పు అయ్యింది. నువ్వు వంటింట్లో యుద్ధం చేస్తున్నావు. అని తెలియక నేను నోరు జారాను, నన్ను మన్నించు పొద్దటి నుండి ఏమీ తినలేదు.

కడుపు కాలుతుంది, కమ్మగా ఏదైనా చేసి పెట్టవే అంటూ కాలు పట్టుకున్నంత పని చేయడంతో, నేను మనసులోనే నవ్వుకుని పాపం అనిపించి కాలిన గాయాలకు కొబ్బరి నూనె రాసి. మళ్లీ లేచి అన్నం, కూర చేశాను.

అప్పుడు వాడు కడుపునిండా తిని, నీ కడుపు చల్లగా ఉండాలి అంటూ బ్రేవ్ మని త్రెన్చి లేచాడు. నాకు మనసుకు తృప్తిగా అనిపించింది. తెల్లారి నేను లేచేసరికి వాడు బియ్యం పెట్టాడు. అక్కా చెరో పని చేసుకుందాం,  అనడంతో నిండుగా నవ్వాను నేను. ఎవరి పని వారికి గొప్ప.

Related Posts

1 Comment

Comments are closed.