"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ఎవరు పార్ట్ 11

ఎవరు పార్ట్ 11

మొక్కల చాటున ఉన్న ముసుగు మనిషి నన్ను చూడగానే నేను శిల అయిపోయాను.

అతను తన దగ్గర ఉన్న కర్రతో నా మీదకు దూకాడు. కర్ర దెబ్బ భుజం మీద పడింది, కళ్ళు క్షణకాలం బయరులు కమ్మాయి. తేరుకునేసరికి మళ్ళి కర్రతో అతను నా తల మీద కొట్టబోయాడు. సూటిగా ఒక రాయి వచ్చి అతని తలకి తగిలింది. వెనక్కి తిరిగాను, లక్ష్మిగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ముసుగు మనిషి ఆమెని చూసి పారిపోయాడు.

దగ్గరకు వచ్చిన లక్ష్మిగారు “ఎలా ఉంది రాయుడు గారు?”

పర్వాలేదు అని తల ఆడించి “అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి లక్ష్మిగారు” అని చెప్పి, నేను అతను వెళ్లిన దిశగా వెళ్ళాను. నా వెనక లక్ష్మిగారు వచ్చారు. మాకు అతను కనిపించలేదు. అంతలో ముసుగు మనుషుల గుంపు చేతిలో కాగడాలతో పరిగెత్తుతూ కనిపించారు, వారిని ఎవరో తరుముతున్నారు. అందులో నుండి ఒక అతను మేము ఉన్న వైపు రాసాగాడు.

మొక్కలు చాటున పొంచి, అతను దగ్గరకు రాగానే అతని మీదకు అమాంతం దూకాను. అతను లేచి తన మొలలో ఉన్న కత్తి తీసి విసిరాడు. నేను తప్పించుకోగలిగాను కానీ కత్తికి ఉన్న పిడి లక్ష్మిగారి తలకి తగలింది. అతని వెనకనుండి పరిగెత్తుకుంటూ వస్తున్న అలీ, కనుమూరి గారు అతన్ని పట్టుకున్నారు. లక్ష్మిగారి నుదుటి నుండి రక్తం మెల్లగా కారటం కనిపించి ఆమె దగ్గరకు వెళ్లేలోపే ఆమె కింద పడిపోయారు.

*********

మర్నాడు ఉదయం లక్ష్మిగారి గదిలోకి అల్పాహారం తీస్కుని వెళ్ళాను. ఆమె మంచం మీద పడుకుని ఉన్నారు. దగ్గరికి వెళ్లి నుదిటి కట్టిన కట్టుని చూసి, తాకడానికి ప్రయ్నతించాను. అంతలో ఆమె లేచారు. నేను వెనక్కి జరిగాను.

“ఏమి చుస్తున్నారు రాయుడుగారు?” సగం లేచి మంచానికి వీపు జారవేస్తూ అడిగారు. మళ్ళీ ఆమె,

“ఏమిటి మీరు తీసుకుని వచ్చారా? పని వారు?”

“అందరూ ఉన్నారు.”

“మరి మీరు తీస్కుని వచ్చారు.”

“మీకు ఎలా ఉందొ తెలుసుకుందాం అని, మాములుగా మీ గదిలోకి వచ్చే సాహసం చేయలేము గనక .. ” ఆమె పెదాలపై చిగురించిన చిరు మందహాసం నా మనసులో పెను ఉప్పెన రేపింది.

“పర్వాలేదు రాయుడుగారు. నాకు బానే ఉంది.” ఆమె చేతికి నేను తెచ్చిన అల్పాహారం ఇచ్చాను. నేను మౌనంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాను.

“ఎంత సేపు అని ఆలా నిలబడతారు, ఇక్కడ కూర్చోండి.” అని ఆమె పక్కనే మంచం మీద కూర్చోమన్నారు.

అప్పుడే గదిలోకి అలీ, కనుమూరిగారు వచ్చారు.

కనుమూరి “ఎలా ఉంది మేడమ్?”

“నాకు బానే ఉంది. అతని నుండి ఎమన్నా వివరాలు సేకరించారా?”

కనుమూరి నిరుత్సాహంగా “లేదు మేడం. అతను ఏమి చేసినా నోరు విప్పలేదు. పోలీస్ పద్ధతులు అన్నీ ప్రయ్నతించాము కానీ ప్రయోజనం లేదు.”

నాకు అది వింతగా అనిపించింది. “ఆలా ఎలా వదిలేస్తాము కనుమూరిగారు?”

కనుమూరి కోపంగా నావైపు చూసి “వదిలే సమస్య లేదు రాయుడు. కానీ సమయం అనుకున్న దానికంటే ఎక్కువే పట్టేటట్టు ఉంది.”

అలీ విషయం మార్చి “వైద్యుడిని ఏమన్నా పిలవమంటారా?”

లక్ష్మి “లేదు, అవసరం లేదు ఇప్పుడు.”

కనుమూరి “మీరు ఏమి అనుకోనంటే, ఒక ప్రశ్న. మహేష్ గారు చనిపోయిన రోజు మీరు ఆ గదిలోకి ఎమన్నా వెళ్ళారా?”

“లేదు కనుమూరి గారు.” అని లక్ష్మిగారు సమాధానం చెప్పింది.

“సరే మేడం, మేము ఇంక సెలవు తీసుకుంటాం” అని చెప్పి కనుమూరి గారు, అలీ వెళిపోవటానికి సిద్దపడ్డారు. కానీ నాకు కాసేపు అక్కడే ఉండాలి అనిపించి అలానే ఉండిపోయాను.

అంతలో కనుమూరి గారు వెనక్కితిరిగి “లక్ష్మిగారిని విశ్రాంతి తీసుకోనివ్వండి, ఇప్పుడు కూడా ఎస్టేట్ పనులతో విసిగిస్తే ఎలా?”

ఏమీ అనలేక నేను కూడా వారి వెంటే వెళ్ళాను. దారిలో నాకు ఒక సందేహం వచ్చి కనుమూరి గారితో,

“కనుమూరి గారు, ఎందుకు పదే పదే లక్ష్మిగారిని మీరు, మహేష్ గారి గదిలోకి మీరు వెళ్ళారా అనే ప్రశ్న అడుగుతున్నారు?”

కనుమూరి గారు నా వైపు చూసి “చెబుతాను కానీ ఇక్కడ కాదు, మీ ఆఫీస్ గదికి పద.” మేము ముగ్గురం ఆఫీసు గదిలో కూర్చున్నాము. కనుమూరి గారు పొగాకు వెలిగించారు. మెల్లగా గాలిలోకి పొగ వదులుతూ,

“దేనికైనా కారణం ఉంటుంది అని నమ్ముతాను. ఇక్కడ జరిగే వాటికి కూడా కారణం ఉండాలి, ఉండే ఉంటుంది. కానీ అది ఏంటి?”

నాకు ఏమి అర్ధం కాలేదు. మళ్ళి ఆయనే, “అందరూ అనుకుంటున్న మొదటి కారణం, ఆ అమ్మాయి.”

అలీ “అవును.”

కనుమూరి “కానీ ఆ అమ్మాయి ఎక్కడ? ఇన్నాళ్లు కనిపించలేదు అంటే చనిపోయిందా? చంపబడిందా? దాయబడిందా? అసలు ఉందా?”

అలీ “ఉందా అంటే? లేకపోతే మీకు నేను చూపించిన లేఖ?”

కనుమూరి “ఆ అమ్మాయిని భూపతిగారు తీసుకుని వస్తుండగాగానీ, తెచ్చిన తర్వాతగానీ చుసినవారు ఎవరూ లేరు, అందరూ విన్నవారే తప్ప. ఆ లేఖ నిజమే అయ్యి ఉండచ్చు, కానీ కాసేపు ఇది నిజం కాదు అనుకుందాం.”

“అది కాకపోతే వేరే కారణం ఉండాలి కదా” అని అడిగాను.

కనుమూరి “ఉండచ్చు”

నేను “ఏంటి అది?”

కనుమూరి “ఆస్తి”.

నేను ఆలీ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం.

అలీ “ఆస్తి కోసం ఇదంతా చేసారా? ఎవరు చేస్తారు?”

కనుమూరి గారు పెదాలు విరుస్తూ “లక్ష్మిగారి తర్వాత వచ్చేవారు చేస్తున్నారేమో? లేక లక్ష్మిగారే అయ్యి ఉండచ్చు.”

నేను “ఎందుకు మీకు ఆ అనుమానం?”

కనుమూరి “మహేష్ గారు పుట్టినరోజు కోసం భవంతి అంతా శుభ్రం చేసారు, రంగులు వేశారు. ఒక్క మహేష్ గారి గది ముందుగా శుభ్రం చేయటం కుదరలేదు. అందుకని ఆ రోజు ఉదయం పదింటికి మీరే పనివారికి శుభ్రం చేయమని చెప్పారు.”

నేను అవును అని చెప్పను.

ఆయన కొనసాగిస్తూ “అప్పడు శుభ్రం చేసిన పనివాడితో నేను మాట్లాడాను. ఆ రోజు అతను అంతా శుభ్రం చేసి, గది అంతా సర్ది వెళ్ళాను అని చెప్పాడు.”

అలీ “అయితే”

కనుమూరి “చనిపోయిన మర్నాడు ఉదయం, మహేష్ గారి గదిలో నాకు ఈ గజ్జలు కనిపించాయి. ఇవి పనివారివి కావు. లక్ష్మిగారు తప్ప వేరే అమ్మాయి ఈ భవంతిలో ఎవరూ ఉండరు. కానీ లక్ష్మిగారు ఆ రోజు ఇక్కడ లేరు.”

అవి చూడగానే నాకు అవి లక్ష్మిగారివని గుర్తించాను.

అలీ “ఇది ఆధారమా?”

కనుమూరి “కాదు, తీగ మాత్రమే.”

అలీ “తీగా?”

కనుమూరి “తీగ లాగితేనే కదా డొంక కదిలేది, సరైన తీగ దొరికే వరుకూ, ప్రతి తీగ లాగి చూడాలి కదా!”

అంతలో తలుపు తట్టిన శబ్ధం. నేను వెళ్లి తలుపు తీశాను. బయట చూస్తే పోతన నిలబడి ఉన్నారు. డీలాగా గదిలోకి నడుచుకుంటూ వచ్చి, కనుమూరి గారి ముంది నిలబడి, “మీరు పట్టుకున్న అతను నా మనిషి. అతను అమాయకుడు. మీరు దయచేసి అతన్ని విడిచిపెట్టండి. దీనికి కారణం నేను. మీకు కావాల్సిన వివరాలు నేను చెబుతాను.”

కనుమూరి “మీరు?”

“పోతన అంటే ఈయనే.”

కనుమూరి “ఇంతకముందు ఇక్కడ పనిచేసింది మీరే కదా!” అని అక్కడ ఉన్న మంచినీరు అతనికి ఇచ్చి “కంగారు పడకండి. నేను అతన్ని వదిలేస్తాను. ముందు మంచినీరు తాగండి.”

పోతన మంచినీరు తగిన తర్వాత కనుమూరి గారు “ఇప్పుడు చెప్పండి అసలు కథ”

పోతన “నేను ఇక్కడ పాతిక సంవత్సరాల పైనే పనిచేశాను. భూపతి వంశీయులు అన్నా, ఈ భవంతి అన్నా నాకు ప్రాణం. అలాంటిది ఈ రోజు వారికిచ్చిన మాట తపాల్సివస్తుంది.”

“ఏంటి అది?”

పోతన “అందరూ అనుకుంటున్నట్టు, నారాయణ భూపతి గారు (లక్ష్మిగారి తాత) అడివిజాతి వారి నుండి తీసుకుని వచ్చింది అమ్మాయిని కాదు, అమూల్యమైన అమ్మవారి విగ్రహాన్ని.”

“అమ్మాయి కాదా!!!! అమ్మవారి విగ్రహమా!!!!!”

********

– భరద్వాజ్ (Bj writings)

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *