ఎవరు పార్ట్ 14

ఎవరు పార్ట్ 14

జట్కా బండి శరవేగంగా కదులుతుంది. చీకటిలో దారి కనబడటం కష్టంగా ఉండటంతో అలీ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. నా పక్కనే స్నేహితుడిగా ఉన్న అలీ గురించి నాకు తెలియలేదు. అసలు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు నియమించారు? సందేహాలకు సమాధానం కోసం అలీని ప్రశ్నించటం మొదలుపెట్టాను.

“అలీ, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? ఈ కేసులో నిన్ను ఎవరు నియమించారు?”

“ఇంకా అడగట్లేదు ఏంటి అని అనుకుంటున్నా మనసులో, అడిగావు.”

“సరే, కనిపెట్టడం నీ వృత్తే కదా!, అసలు విషయం చెప్పు.”

“నేను లండన్ లో ‘వెపన్ ఎవల్యూషన్ అండ్ డిజైనింగ్’ అనే కోర్స్ చేస్తుండగా అదే కోర్స్ చదువుతున్న లక్ష్మిగారు పరిచయం అయ్యారు. ఆ తరువాత కూడా తరుచూ కలుస్తుండే వాళ్లము. నేను డిటెక్టివ్ గా మా కంపెనీలో మొదటి కేసు సాల్వ్ చేసాక ఒక రోజు లక్ష్మిగారు నన్ను కలిసి, వాళ్ళ తాతగారు, పెదనాన్నగారు అనుమానాస్పదంగా మరిణించారు అని చెప్పి తను ఊరికి వెళ్లిపోయారు.

నేను మొదట్లో అవి మామూలు ఆక్సిడెంట్స్ అనుకున్నా, కానీ కొన్ని రోజులకి మళ్ళీ ఆమే లేఖ రాసారు, ఆమెకు వాళ్ల పెదనాన్నగారు చనిపోయింది ఆక్సిడెంట్ లా అనిపించలేదు అని, నన్ను కేసు తీస్కుంటారా అని, ఇంకా కొన్ని వివరాలు అందులో రాసారు. కానీ మా కంపెనీ పని ఒత్తిడిలో ఆ లేఖలను అంతగా పట్టించుకోలేదు.

లక్ష్మిగారు పట్టు వదలకుండా ఇక్కడ జరిగే విషయాలు అన్ని లేఖల ద్వారా నాకు వివరించేవారు. అవి చదివే కొద్దీ నాలో ఆసక్తి పెరిగింది. ఎప్పుడైతే లక్ష్మిగారు భవంతిలో రాత్రి పూట అపరిచితులు ప్రవేశిస్తున్నారు అని రాసారో అప్పుడే ఇంకా ఆలస్యం చేయకూడదని మా కంపెనీలో ఉద్యోగం మానేసి ఇక్కడికి నాటక రచయితగా వచ్చాను.”

“కనుమూరిగారికి నువ్వు డిటెక్టివ్ అని తెలుసా?”

“తెలుసు, లక్ష్మిగారు ముందే చెప్పారు”

నా మనసులో “అందరికి తెలుసు అన్నమాట, నేను నా స్నేహితుడు అనుకుని లక్ష్మిగారి గురించి, నా ప్రేమ గురించి నీతో చెప్పాను”

అలీ “నువ్వు ఈ టైంలో కృపగారి పరిశోధనాశాలలో ఏమి చేస్తునావు?”

“అది తరువాత, ఏమి తెచ్చానో చూడు, కృపగారి ఇంట్లో నాకు ఈ పత్రాలు దొరికాయి.” అవి నా దగ్గర నుండి తీసుకుని, తాను గుర్రాలను అదుపు చేస్తూ అక్కడ ఉన్న దీప కాంతిలో వాటిని పరీక్షించి చూసాడు.

“వీటితో పని లేదు”

“ఎందుకు?”

“కాసేపు ఓపిక పట్టు. భవంతి చేరుకున్నాక అన్ని వివరాలు తెలుస్తాయి.”

*********

నేను, అలీ భవంతిలోకి వెళ్ళాము. కనుమూరిగారు కాస్త కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. ఆలీని చూసి హడవిడిగా ఎదురు వచ్చి “ఏమైంది?”

అలీ “మనం అనుకున్నది నిజమే”

కనుమూరి ఉపిరి పీల్చుకుని, అక్కడే ఉన్న బల్ల మీద కూర్చుని, పిడికిలితో దాని గుద్ది, పళ్ళు బిగించి “గాట్ హిం!”

నాకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. “ఎవరు అనుకున్నారు? ఎవరు దొరికారు?”

కనుమూరి “ఎవరు కాదు అసలు ప్రశ్న ఎందుకు?”

కనుమూరి తన జేబులో నుండి గజ్జలు, ఒక అంగుళము పరిమాణంలో ఉన్న ఒక సీసా తీసి “ఇవే ఈ కేసులో కీలక పాత్రలు. రాయుడు, ఈ గజ్జలు లక్ష్మిగారివి అని నీ అనుమానం కదా!”

“అవును”.

కనుమూరి “నేనూ ముందు లక్ష్మిగారివే అనుకున్నా, కానీ మహేష్ భూపతి పార్టీకి వచ్చిన వారి అందరి గురించి వివరాలు సేకరించిన తరువాత అర్థం అయ్యింది, ఇవి దర్శన్ చిత్రపాటి కూతురు ఆలోక్య చిత్రపాటిగారివి అని. ఎందుకంటే ఆ పార్టీలో మహేష్ గారి గదిలోకి వెళ్లేంత చనువు ఆమెకు తప్ప ఎవరికీ లేదు. ఆలోక్యగారికి మహేష్ గారంటే ఇష్టం, దర్శన్ గారు కూడా ఆమెను మహేష్ గారికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు అని ఆయనే చెప్పారు, అందువల్ల ఇది పెద్ద విషయం అని అప్పుడు అనిపించలేదు.”

కనుమూరిగారు నా వైపు చూసి, తన చేతిలో ఉన్న పొగాకు గొట్టాన్ని వెలిగించి “కానీ పోతన ఎప్పుడైతే భూపతి రాజుగారు (మహేష్ నాన్నగారు) చనిపోయిన రోజు ఆలోక్యగారు పట్నం వెళ్లారు అని చెప్పారో నాకు అనుమానం మొదలైంది. రెండు చావుల్లోనూ ఒకరే ఉన్నారు, అది కుడా ఒక నీడలాగా.”

పొగ బయటకు వదులుతూ “ఆ నీడను ఛేదించటానికి, దర్శన్ గారి ఇంటికి వెళ్ళాను. దర్శన్ గారితో, వారి కూతురితో మాట్లాడాను. వారిని విచారించగా వారికి మహేష్ గారికి మంచి అనుబంధమే ఉంది అని తెల్సింది. ఆ అనుబంధం నిజమో కాదో తెలుసుకోటానికి, కృపగారితో మాట్లాడాను, కృపగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దర్శన్ గారు మహేష్ గారిని పార్టీలో తన కూతురితో వివాహం గురించి అందరికీ చెప్పమని కోరారట. కానీ మహేష్ గారు అందుకు అంగీకరించలేదు అని చెప్పారు.”

కనుమూరి “కృపగారు ఇచ్చిన వివరాలతో ఆలోక్యగారిని మళ్ళీ కలిసాను. ఆమె మహేష్ గారు తనని ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పారు అని, అదే విషయం పార్టీలో అందరితోను చెబుతా అని మాట ఇచ్చారు అని, కానీ ఆ తరువాత పెళ్లి గురించి ఆ రోజు మాట్లాడొద్దు అని చెప్పారు అని చెప్పింది.”

“అయితే”

కనుమూరి “ఇది దర్శన్ గారికి నచ్చలేదు. తన పరువు పోతుంది, అలాగే మహేష్ గారు అల్లుడు అయితే వచ్చే ఆస్తి, హోదా కూడా తనకి ఉండవు కాబట్టి ఆయనే మహేష్ గారిని చంపేశారు.”

“దర్శన్ గారా, అది ఎలా సాధ్యం. నేను చూసాను మహేష్ గారిని దర్శన్ గారు చంపలేదు.”

కనుమూరి “అక్కడికే వస్తున్నా, నీ ప్రశ్న ఎలా చంపారు అనే కదా?”

“అవును”

“అదే ఈ సీసా. ఇది నాకు దర్శన్ గారి ఇంట్లో దొరికింది. ఇదే సీసా, అందులో అదే రసాయనం నాకు పార్టీ తరువాత రోజు భవంతిలో క్లూస్ కోసం వెతుకుతుండగా కనిపించింది. దీని గురించి తెలుసుకోవటానికి దీనిని ల్యాబ్ కి పంపించాను. ఆ ల్యాబ్ పరీక్ష ఫలితాలలో తెలిసింది ఇది సాధారణమైన డ్రగ్ కాదు అని.

దీని గురించి సూక్ష్మం గా చెప్పాలంటే ఈ డ్రగ్ మానవ శరీరంలోకి ప్రవేశించాక, ఊహశక్తిని విపరీతంగా పెంచేస్తుంది. మనిషిలో సాధారణంగా ప్రతికూలత ఎక్కువ ఉంటుంది, దానికి తోడు ఈ డ్రగ్ తీసుకున్న మనిషికి కాస్త భయం కలిగినా తనకి నచ్చనివి, విపరీతంగా భయం కలిగించేవి తన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ ఒత్తిడి మానవ శరీరం తట్టుకోలేదు. తీవ్రమైన చర్యలు గాని, గుండెపోటుతో గాని, బీ.పీ ఎక్కువై నరాలు పగిలి గాని చనిపోవచ్చు”

అలీ “అంతే ముఖ్యమైన విషయం, ఇది మనిషి చనిపోయాక అతని రక్తంలో గాని, మిగతా శరీరద్రవాలలో గాని కనిపించదు. అంటే పరమాణువులు విస్తరించాక వాటిని కనిపెట్టడం కష్టం. అందువల్ల మహేష్ గారి శరీరాన్ని పరీక్షించినా, ఈ విషయం ముందు తెలియలేదు.”

“మరి ఇదే చావుకు కారణం అని మీకు ఎలా తెలుసు?”

కనుమూరి “దీన్ని మనిషి శరీరంలోకి పంపించే ముందు ఒక ఉత్ప్రేరకం (catalyst) కలపాలి. ఆ ఉత్ప్రేరకం చాలా ఇంగ్లీష్ మందుల్లో ఉండేదే. కానీ మహేష్ గారి శరీరంలోనూ, నిన్న పైకి తీసిన భూపతి రాజుగారి శరీరంలోనూ ఉండటం వల్ల, భవంతిలో ఈ డ్రగ్ సీసా దొరకటం వల్ల ఇది వాడి ఉంటారు అని నిర్దారణకు వచ్చాము.”

“భూపతి రాజుగారిని ఎందుకు చంపాలి?”

కనుమూరి “ఒకటి, విగ్రహం ఆయన దగ్గర నుండి తీసుకుందాము అనే ఆశతో, రెండు ఆలోక్యగారిని తన కోడలు చేసుకోవటానికి ఆయన అంగీకరించక పోవచ్చు. వీటిలో ఏదో ఒకటి కారణం అయ్యి ఉండవచ్చు.”

“చంపేస్తే ఆస్తి రాదూ కదా!”

అలీ “లక్ష్మిని కూడా చంపేస్తే!! తరువాత తన కూతురుకి మహేష్ గారికి పెళ్లి అయ్యింది అని నిరూపించటం అంత కష్టం కాదు ఏమో! పైగా పలుకుబడి ఉన్న వ్యక్తి.”

“ఆ డ్రగ్ సీసా ఇంట్లో దొరికింది అనేది ఆధారం ఎలా అవుతుంది?”

కనుమూరి “అందుకే కదా ఆధారం కోసం లక్ష్మిగారిని దర్శన్ దగ్గరికి పంపాను.”

“అర్థం కాలేదు”.

కనుమూరి “ఏముంది, లక్ష్మిగారిని దర్శన్ గారితో తనకి నిజం తెలిసిపోయింది అని చెప్పమని చెప్పను. తప్పు చేసినవాడు దొరికిపోతే కంగారుపడతాడు, ఆ కంగారులో లక్ష్మి మీద దాడి చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే ఆధారాలు అక్కర్లేదు.”

నాకు కోపం వచ్చింది. “లక్ష్మిగారు ఎర అనుకున్నారా ఒంటరిగా ప్రమాదంలోకి పంపటానికి. మీకు చేత కాకపోతే వదిలేయండి. అంతే గాని ఇలా చేస్తారా?”.

కనుమూరి “రాయుడు, కంగారు పడకు, వారిని అనుచరిస్తూ రక్షగా పోతన, భూపతి సైన్యం ఉన్నారు.”

అంతలో పోతన భవంతిలోకి వచ్చారు.

కనుమూరి “మీరు ఏంటి ఇక్కడ? మిమల్ని లక్ష్మిగారికి తోడుగా ఉండమని కబురు పంపించాను కదా!”

పోతన “లేదు. వచ్చిన అతను నన్ను భవంతికి రమ్మని కబురు ఇచ్చాడు”

అలీ “అంటే మీరు పంపిన వాడు దర్శన్ చిత్రపాటి మనిషా!!!”

“ఐతే లక్ష్మిగారు??”

– భరద్వాజ్ (Bj Writings)

Related Posts