ఎవరు పార్ట్ 9

ఎవరు పార్ట్ 9

ఎవరు పార్ట్ 9

అబద్ధం కాస్త ఘాటుగా ముక్కుకి పొగాకు వాసన తెలుస్తుంది. కళ్ళు తెరవగానే పొగ, ఏంటా అని చూస్తే పోలీస్ ఆఫీసర్ పొగాకు కాలుస్తూ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. మండుతున్న కళ్ళను నలుపుకుంటూ వెళ్లి మొహం కడుక్కుని వచ్చాను.

“నా పేరు కేశవ, కనుమూరి కేశవ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్”

ఆ పేరు, వృత్తి రెండు కొత్తగానే అనిపించాయి. “నా పేరు ….”

“తెలుసు, నిన్ను కలవటానికి ఒక రోజు పట్టింది. మైకం వదిలిందా?”

“అది… కాస్త మందు..”

“తెలుసు మద్యం ఎక్కువైంది అని, అందుకే ఇప్పుడు వచ్చా… చెప్పు”

“ఏమి చెప్పాలి?”

“ఇంకా ఏమి చెబుతావు, మహేష్ గారిని ఆఖరిసారిగా చూసింది నువ్వే, దాని గురించి వివరాలు చెప్పు?”

“ఓ అదా..”

పోలీసు, కళ్ళు కాస్త చిన్నవి చేసి “వేరే ఏదైనా ఉందా?”

నేను కాస్త ఆగి “ఆహా, లేదు”

“ఆ రోజు ఏమైంది అంటే…”

“తెలుసు, కథ అంతా వద్దు, నువ్వు తలుపు తీసాక ఏమి చూసావో చెప్పు”

మహేష్ గారు “మంటలు, మంటలు అని అరుస్తూ, నన్ను తోసేసుకుని, కిందకు దూకేశారు”

“మంటలు …. మంట, మంటలా?, మంటా?. గదిలో నీరు గోడల మీదకు విసిరేశారు, అంటే మంటలు. కానీ గదిలో ఏమి కాలినట్టు ఆనవాలు లేవు. అది ఎలా?”

“నన్ను అడుగుతున్నారా?”

నా వైపు చూసి నవ్వి, “ఆ గదిలో ఇంకా ఏమి చూడలేదా?”

“లేదు అండి.”

సరే. మళ్ళీ మాట్లాడదాం. నీ విద్యా పత్రాలు అక్కడ పెట్టాను తీసుకో.

“అవి… మీ దగ్గరికి ఎలా వచ్చాయి?”

“ఎలా వస్తేనే, నీవే కదా! తీసుకో. మళ్ళీ కలుద్దాం.”

ఇవి ఇతనికి ఎలా వచ్చాయి. ఆ రోజు పోలీస్ కావాలనే వీటిని దాచి, నాకు సంచి ఇచ్చాడా? అంతలో కబురు.

“మిమల్ని లక్ష్మి గారు రమ్మంటున్నారు.” అని ఒక పనివాడు చెప్పి వెళ్ళిపోయాడు.

అప్పుడే వచ్చిన అలీ “అమ్మగారు పిలిచినా అయ్యగారి మోహంలో ఆనందం లేదు ఏంటి?”

“ఇంతక ముందు ఇలాంటి వార్త వస్తే నాకు రెక్కలు వచ్చేవి. ఇప్పుడు పిలుస్తుంది ప్రేమించుకోటానికి కాదు పని చేయించుకోవడానికి, అక్కడ ఉంది లక్ష్మి కాదు లక్ష్మి భూపతి గారు.”

“అలా అనుకున్నా వెళ్ళాలిగా! వెళ్ళు.” అలీ

“వెళ్తున్నా”

*******

దూరంలో లక్ష్మి నీరసంగా కిటికీ వద్ద నిలబడి, కిటికీ లోనుండి బయటకి చూస్తుంది. వెళ్లి గుండెలకు హత్తుకుని ఓదార్చాలని అనిపించింది. ఆలోచనలకు హద్దులు వేయలేకపోతున్నా. లక్ష్మి తిరిగి నన్ను చూసింది. ఒక్క నిముషం ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు.

“రాయుడు గారు”

“గారు ఎందుకు అండి, పని వాళ్ళం. పేరు చాలు.”

ఆమె చూపులో మార్పు. అది ప్రేమా, కోపమా లేక అధికారామా?

“మీరు నేను నిజం దాచినందుకు కోపంగా ఉంటారేమో అని అనుకున్నాను.” లక్ష్మి

“అనురాగం చూపించవద్దు అన్నారు కదా, అధికారం ఇప్పుడు ఎలానూ… ” ఆమెను చూసి మాట పూర్తి చేయలేకపోయాను.

“మంచిది. ఇక మీరు వెళ్లొచ్చు.” లక్ష్మి

“ఎందుకు పిలిచారో చెప్పలేదు.”

“చెప్తాను. ముందు ఎస్టేట్ పనులు చూడండి. అవి ఈ అశుభం వల్ల, అంతక ముందు పుట్టిన రోజు వేడుకుల వల్ల ఆగిపోయాయి.”

‘సరే’ అని వచ్చేసాను. నోరు జారాను అనిపించింది. బాధలో ఉంటే నేను నాకు నచ్చినట్టు మాట్లాడతాను. కోపం, జాలి, అనుమానం, ప్రేమ అన్ని ఒకేసారి, ఒకే అమ్మాయి మీద… ఏంటి ఇది? అర్ధం కానీ భావాలు.

******

లక్ష్మి, కనుమూరి గారు మాట్లాడుకుంటే, కాసులు అవసరం అయ్యి ఉండి నేను అక్కడికి వెళ్ళాను. నేను రావటం చూసి లక్ష్మి మాట్లాడటం మానేసింది.

కనుమూరి “రాయుడు, ఏంటి ఇలా”

“లక్ష్మి గారితో కాస్త పని ఉండి….”

లక్ష్మి “నేను మిమల్ని తర్వాత కలుస్తాను.”

కనుమూరి “ఎందుకు పనులు ఆపుకోవటం. మీకు అభ్యంతరం లేకపోతే ఉండమనండి. ఇది పూర్తి అయ్యాక తన పని చూసుకుని వెళ్తాడు.”

లక్ష్మి నా వైపు చూస్తూ తలాడించి, కనుమూరి గారికి సమాధానం చెప్పింది.

లక్ష్మి “మా అమ్మ, నాయనమ్మ చనిపోయాక మా పెద్దనాన్న గారు, ఆరేళ్ళ వయస్సు ఉన్న నన్ను తీస్కుని వెళ్లారు. ఆదర్శ భావాలు ఎక్కువ ఉండటం వల్ల ఆయన పెళ్లి చేసుకోలేదు. పైగా ఎస్టేట్ మీద గాని, ఆస్తి మీద గాని ఆయనకి వ్యామోహం లేదు. ఇక్కడ హోదా కూడా ఆయనకు నచ్చదు. అందుకే చాలా అరుదుగా ఇక్కడికి వచ్చేవారు. నన్ను కూడా ఇక్కడికి తీస్కుని వచ్చేవారు కాదు. వ్యాపార విషయంలో మా నాన్నగారికి ఖాళీ ఉండకపోవటం వల్ల ఆయన కూడా ఈ ప్రాంతానికి రావటం అరుదు.

ఒక రోజు పెద్దనాన్న గారి నుండి విదేశాల్లో చదువుకుంటున్న నాకు లేఖ వచ్చింది. తాత గారు చనిపోయారు అని. వెంటనే చెబితే నేను చదువు ఆపేసి వచ్చేస్తాను అని కాస్త ఆలస్యంగా లేఖ రాస్తున్నట్టు, పెద్ద కొడుకుగా తన బాధ్యత నెరవేర్చటానికి తాను ఎస్టేట్ కి వెళ్లారు అని, నన్ను చదువు పూర్తి అయ్యాక అక్కడకి రమ్మని ఉంది అందులో. నేను కూడా అలానే చేద్దాము అనుకున్నాను. కానీ…

“కానీ…”

లక్ష్మి “కానీ వారం కూడా పూర్తి అవ్వకుండానే మరో లేఖ. ఈ సారి అన్నయ నుండి, పెద్ద నాన్న గారి మరణ వార్త. వెంటనే చదువు ఆపేసి పట్నం వచ్చాను. అక్కడ అన్నయ్య, నాన్న గారిని కలిసాను. వారు చెప్పిందంతా విన్నాక, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమైంది. ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతుందో తెల్సుకుందాం అనుకున్నాను. కానీ వారు నన్ను ఇక్కడికి రానివ్వలేదు.

పట్నంలో ఉన్న పోలీసుల నుండి కేసు వివరాలు తీస్కుంటూ ఉన్నాను. నాన్న గారు మరణించాక, ఇంక ఇక్కడికి రావటం తప్పలేదు. కానీ లక్ష్మి భూపతిగా కన్నా లక్ష్మిగా వస్తే దీనికి కారణం ఎవరో తెలుస్తుంది అనుకున్నా. మహేష్ అన్నయ అందుకు ముందు అంగీకరించకపోయినా తర్వాత నేను సాధారణ అమ్మాయిగా వస్తే, నాకు పెద్ద ప్రమాదం ఉండదు అని ఒప్పుకున్నాడు.”

కనుమూరి “ఇది అంతా ఎవరో చేస్తున్నారు అని మీ నమ్మకమా?”

లక్ష్మి “ముందు అలానే అనిపించింది. అడివి జాతి వారి నాయకుడు మీద చాలా అనుమానం ఉండేది. ఇప్పుడు అన్నయకి జరిగింది విన్నాక అసలు ఏమి అర్థం కావట్లేదు. దేవుడు మీద నాకున్న దృక్పథం, నేను చదివిన చదువు దీని వెనక ఎవరో ఉన్నారు అంటుంటే, జరుగుతున్న సంఘటనలు మాత్రం అలా ఎవరు లేరు అని నిరూపిస్తున్నాయి.”

కనుమూరి “ఇంతక ముందు వారు ఎలా చనిపోయారో ఎవరూ చూడలేదు. కానీ మహేష్ గారు చనిపోవటం అందరూ చూసారు. ఇంత వింతగా ఏమి జరిగినా అది మానవ ప్రమేయం లేకుండానే జరిగిందని అనిపిస్తుంది.”

“మీరు ఏది నమ్ముతున్నారు?” నేను

కనుమూరి “అంతు చిక్కే వరకు ఇవన్నీ ప్రశ్నలు లానే ఉండనిద్దాం, నమ్మకాలకి ముడి పెట్టొద్దు. కానీ వచ్చిన చిక్కల్లా అసలు ‘ప్రశ్న’ ఏంటి? అది కనుక్కుంటే సమాధానం అదే దొరుకుతుంది.”

కనుమూరి “లక్ష్మి గారు, మహేష్ గారు చనిపోయిన రోజు మీరు అసలు ఎవరికీ కనిపించలేదు. ఎక్కడ ఉన్నారు?”

“ఆ రోజు తెలిసిన వారు అందరూ వస్తారు కాబట్టి, నన్ను గుర్తు పట్టకూడదు అనే ఉద్దేశంతో ఎవరికీ కనిపించలేదు. కృప గారి ఇంట్లో ఉన్నాను.”

కనుమూరి “మీరు మహేష్ గారిని చనిపోయే ముందు కలిసారా?”

“లేదు ఉదయమే ఎవరికీ కనిపించకుండా కృప గారి ఇంటికి వెళ్లిపోయాను.”

కనుమూరి “సరే లక్ష్మి గారు. నేను మళ్ళీ కలుస్తాను.”

లక్ష్మి అబద్ధం చెబుతుందా? లేక నేను వేరే ఎవరినైనా చూసానా?

********

– భరద్వాజ్ (Bj writings)

Previous post నాలో మార్పు
గతం ఉత్తేజితమా పరాభవమా Next post గతం ఉత్తేజితమా పరాభవమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *