గాలివాటం

గాలివాటం

ఒత్తు అయిన కురులు. వాటిని ఆమె మోస్తోందా అన్నట్టుగా మొహం కొంచెం వెనక్కి వాలుతోంది. దాంతో అందమైన ఆమె కంఠంలో ధరించిన ఆకుపచ్చని పూసల దండ, నాలో తెలియని ఊహలకి పచ్చని చిగుళ్ళు తొడుగు తోంది.

ఆమె మొహం వాలినట్టు గా ఉండడంతో ఆమె చూపులు ఈ లేత చిగుళ్ల కి పిచికారి కొడుతూ ఉన్నాయా అనిపించింది.

పెద్దవి అయిన కళ్ళు అవడంతో వాలిన కనురెప్పల చాటు నుంచి కనిపిస్తున్న ఆ కను గుడ్లలో ఆమె అందం అంతా దేవుడు అక్కడే దాచాడు ఏమో అనిపిస్తోంది.

ముందుకి గాలికి పడుతున్న వెంట్రుకలని తన వేళ్ళు జొప్పించి సర్దుకుంటూ ఉంటే నా గుండెల్లో వేల మైళ్ళ వేగంతో వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ భావన.

మా ఇద్దరిదీ గమ్యం హైదరాబాద్.. ఆమె బస్సులోకి ప్రవేశించకముందే నా హృదయంలోకి ప్రవేశించేసింది.

ఆ పది నిమిషాల చూపుల పరిచయంలో నా ఊహల వాహనం ఆమెతో చాలా మైళ్ళు ప్రయాణం చేసేసింది.

ఆమె బస్సు లో నా పక్కన కూర్చునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లకి ప్రత్యేకమైన రిజర్వుడు సీట్లు ఇస్తారు. అయినా నేను దానికి అంత ప్రాధాన్యత ను ఇవ్వలేదు.

నా మనసులోకి ప్రవేశించిన ఆమె చివరికి బస్సు లోకి ప్రవేశిస్తు నా కూడా నేను అసూయ పడిపోయాను..

ఆమె బషీర్బాగ్లో దిగిపోయింది. నేను కోటి లో దిగిపోయాను. ఆమె దిగేటప్పుడు మాత్రం ఒక చూపుని నా వైపు పడేసింది.

ఆమె తన పెదాలకు పెట్టుకున్న లిప్స్టిక్ పల్లం వైపు పరవళ్లు తొక్కుతున్న సెలయేరుల కొద్దిగా కుడివైపుకు సాగింది.

మరి ఆ అమ్మాయి చిరుమందహాసం చేసిందా? ఓ చిలిపి నవ్వు ఏమైనా విసిరినదా? చిగుళ్ల దశలో ఉన్న నా ప్రేమ ఒక వటవృక్షంలా మారింది.

ఆమె పెట్టుకున్న ఎఱ్ఱని లిప్స్టిక్ రంగు లో నా చెట్టుకి పూలు, పళ్ళు పూసి మరియు కాసే సినాయి.

ఇంటికి చేరిన తర్వాత నా పనులన్నీ పక్కన పెట్టేసి స్నానం చేసి బిర్లామందిర్ కి వెళ్లాను. ఆ వేంకటేశ్వరుని అయ్యా ఆమెని నా తిరుగు ప్రయాణంలో కూడా కనిపించేలా చేయి అని వేడుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసి నా పిచ్చి కి నేనే చెవిలో పూలు పెట్టుకున్నాను.

రెండు రోజుల తర్వాత ఇక నా తిరుగు ప్రయాణం. రాత్రిళ్ళు ప్రయాణం చేసే అలవాటు ఎక్కువ. బస్టాండ్ చేరాను. నా మొక్కులు ఫలించాయి ఏమో ఆమె కూడా తిరుగు ప్రయాణానికి బస్స్టాండ్ చేరింది.

నా ఊహల చెట్టుకు కాసిన ఒక పువ్వు ని కోసి ఆమెకి ఇచ్చినంత ఆనందమైంది. అలానే పండ్లు కోసి అక్కడ ఉన్న వారికి ఇచ్చినంత ఆనందపడ్డాను.

ఈ సారి ఆ అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకోలేదు. దాంతో ఆమె నవ్విందో లేదో తెలుసుకోలేకపోయాను..

బస్సు ఎక్కేసాము ఇద్దరం. నా జేబులో కాగితం పెన్ను కూడా లేవు. నా ప్రేమ సందేశాన్ని ఆమెకి చేర్చాలని నా ప్రయత్నం. సీటు కింద నుంచి పాత టికెట్ ముక్క ఒకటి తీసుకున్నాను.

కండక్టర్ వద్దకు వెళ్లి పెన్ను తీసుకొని నా ల్యాండ్ లైన్ నెంబర్ దానిపై రాశాను. దాన్ని జేబులో పెట్టుకుని మళ్ళీ వచ్చి నా సీటుపై కూర్చున్నాను.

మా ఊరు వచ్చేసింది. నేనే ముందుగా దిగాల్సి వచ్చింది. జేబులో నుంచి టికెట్ ముక్కను తీసి ఆమె సీటు పక్కన బెట్టి సైగ చేసి చెప్పాను చూడమని.

ఆమె తన అందమైన కనుబొమ్మలను ఎగరేస్తూ పెదాలను బిగబట్టి ఏంటి అని అడిగింది. ఇంతలో రాత్రంతా మూసి ఉన్న కిటికీని ఎవడో తెరిచాడు.

నేను ఫోన్ నెంబర్ రాసిన ఆ టికెట్ ముక్క గాలికి కింద పడింది. ఇప్పుడు అర్థం అయింది ఆ అమ్మాయికి తన పక్కన సీటు పైన చూడాలని.

ఏముంది అక్కడ. నా గట్టి ప్రయత్నం ముక్కలై ఎగిరి పోయె. ఇంతలో వెనక వాడెవడో దిగువ అయ్యా బాబు అని గట్టిగా అరిచాడు.

ఇంటికి వెళ్లి స్నానం చేసి రామాలయానికి వెళ్లాను. ఆమె దర్శన భాగ్యం కల్పించు నాయన అని వేడుకున్నాను. ఈ సారి నా రెండు చెవుల్లో భక్తిగా పూలు పెట్టేసుకున్నాను.

– వాసు

Related Posts

1 Comment

  1. Nijangane pka ammai andanni chakkaga varnincharu vasu garu . Oka prathima na kalla mundu kanabadinattu ga anipinchindi …awesome vasu garu

Comments are closed.