గాయం ఓర్పు కాలేక…!!!
ఊహించడం మార్గం కాలేదు
శాసించడం అధికారం కాదేమో…
స్వాగతంకాని స్వప్నాలతో లోకాన్ని
చూడలేవు…
వాలు తనాన్ని వాకిట నిలుపుకొని
నీలో దాగిన ధ్యాసలతో ఊహల మార్గాన్ని
ఎద చిత్రంగా చిత్రించకు…
నీవుగా కదలిన ప్రతి క్షణానికి
వ్యక్తిగా బాధ్యతను చూపుతు…
నిగర్వి తనంలోంచి నిప్పురవ్వగా
వెలుగుతు…
కర్తవ్యనిష్టతో గమనించిన కాలాన్ని
స్వార్థం పండని ఆలాపనగా…
అలసిన యథలకు దాహం తీరుస్తూ
నీ అనుకూల సమయంగా రూపుదిద్దుకో…
చిలుకు ముడి జీవితాలు
చీత్కార భావనతో చిరు దివ్వెలు
వెలిగించుకోలేక…
నిరంతరాన్ని నిప్పులుగా చేసి మింగుతు
ఎదలోతుల్లో ఐన గాయం ఓర్పు కాలేక…
తెలియని ప్రపంచానికి ఎడతెగని
బాధగా చూపుతున్నావు…
నీ ప్రతి అంశానికి బతుకు శీర్షికలతో
అక్షింతలు కలుపుతు…
త్యాగం పూయని కొత్త వెలుతురు
శూన్యమని…నీ అపనమ్మకానికి తోడవుతు
గూడు చెదరని నిజాలను గుక్కిట
పడితే…జీవితం కాలేదు…
– దేరంగుల భైరవ