గర్భసహచరులు

గర్భసహచరులు

మానవీయ విలువలను ఏమాత్రం పట్టించుకోని సమాజంలో మనం జీవిస్తున్నాము. అత్యున్నతమైన నాగరికత వైపు అడుగులు వేస్తూ సైన్స్ లో ఎంతో ప్రగతి సాధించాం గొప్పలు చెప్పుకుంటున్న మనిషి మనిషిగా ఉండడం మాత్రం మరిచిపోతున్నాడు. సమాజం అభివృద్ధి చెందాలంటే నైతిక, నాగరికత, మానవీయ విలువలు అత్యంత ముఖ్యం. శాస్త్ర సాంకేతిక వైద్య, న్యాయ తదితర రంగాలలోని వృత్తి నిపుణుల్లో సైతం మానవీయ, సృజనాత్మక కోణాలు కనుమరుగవ్వడంతో మన సమాజం అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదనేది ఒప్పుకోక తప్పని వాస్తవం. ఒక శాస్త్రవేత్త, వైద్య నిపుణుడు, ఇంజనీరు తమ విజ్ఞానాన్ని మానవీయ కోణాలలో సమ్మిళితం చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతనంగా సృష్టించే ఆవిష్కరణలకు ప్రాణం పోయాలి అప్పుడే సమాజం సజీవంగా ఉంటుంది. జీవకళ తొణికిసలాడుతుంది.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు చాలావరకు ఈ ఆర్థిక అంశాలే చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. యుక్త వయస్సు దాకా ఒకరికొకరుగా కలిసి ఉన్న అన్నదమ్ములు తర్వాత పెళ్లిళ్లు, పిల్లలు, పొలాలు, ఆస్తి పంపకం, తల్లిదండ్రుల సంరక్షణ, బాధ్యతలు మొదలైన వాటివల్ల మనస్పర్ధలు పెరిగి దూరం అవుతున్నారు. కుటుంబ వ్యవస్థ సమున్నతంగా నిలవాలంటే కుటుంబ చట్రానికి ఆధార భూతమైన అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ఉండకూడదు.

ఒకే తల్లి గర్భస్థావరాన్ని పంచుకొని ఓకే ప్రాణంగా జీవించిన అన్నదమ్ములు తమ అనుబంధాన్ని మరిచి అన్నా.. తమ్ముడు పిలుపులకంటే ఆస్తులు, డబ్బు, హోదాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కుటుంబ ఆదర్శాలను సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది అన్నదమ్ములే… ప్రేమాభిమానాలు తర్వాత తరానికి అందించేది కూడా వాళ్లే.. అందుకే తమ జీవిత సహచరులతో తమ బంధం ప్రాధాన్యత గురించి వివరించి కుటుంబ విలువలను కాపాడుకునే దిశగా అడుగులు వేయాలి.

మమతానురాగాలకు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవహారాలను అత్యంత సులువుగా పరిష్కరించుకోవాలి. అప్పుడే ఒకే తల్లి గర్భస్తావరాన్ని పంచుకున్న సహచరులు జీవిత పర్యంతం ఆత్మ సహచరులుగా ఉండేది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాల అవుతున్నా ఆంగ్ల విద్యా విధానం పోకడలనే అనుసరిస్తూ భారతీయ ధర్మంలోని కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను తెలియచెప్పే విద్యా విధానం రూపొందించుకోలేకపోతున్నాం.

విద్యా విధానంలో ఉన్నతమైన నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ కుటుంబ వ్యవస్థలోని, సహోదర బంధంలోని ఆత్మీయ స్పర్శను భావితరాలు భద్రంగా పదిలపరుచుకునేలా పాఠ్యాంశాలను చేర్చాలి. అప్పుడే మన తరతరాల భారతీయ సంస్కృతి నాగరికతలు ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లేది.

– మామిడాల శైలజ

అసిస్టెంట్ ప్రొఫెసర్

Related Posts