గుంభన

గుంభన

కుడి చేత్తో ఇచ్చినది ఎడమ చేతి కి కూడా తెలియకూడదు అనే గొప్ప నైతిక సూత్రాన్ని మనం నిత్యం నెమరు వేస్తూ ఉంటాం.

అయితే మనం ఏది దానం చేస్తే దాన్ని అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని చెప్పుతూ తృప్తిని పొందుతాము.

చదువు అయితే అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది అని, భోజనం అయితే అన్నదానం గొప్పదని, నీరైతే ఉదకదానం గొప్పదని చెప్పేస్తాము.

కారణం ఆ సమయంలో మనము ఇచ్చేదానికి గొప్ప రంగును పులిమెస్తాము. అవి ప్రపంచాన్ని వణికిస్తున్న రోజులు.ఆ రోజుల్లో మీడియా ప్రచారం లేకపోయినా చీమ సైతం తల దాచుకునేది..

ఈ అలజడికి కారణం స్కైలాబ్.అది ఏ క్షణనం లో అయినా భూమండలం మీద పడవచ్చు. జనావాసాల పై పడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే జన నష్టం తప్పదు. ఇలా జనాలు చిగురుటాకులా వణికి పోతున్నారు.

ఆయన మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా శరీరమంతా చెమటలు పట్టేస్తున్నాయి సైకిల్ నడుపుతూ దస్తి చేతిలోనే ఉంచుకొని మధ్యమధ్యలో మొహం తుడుచుకుంటున్నారు.

నిదానమే ప్రధానం అనే సూత్రానికి కట్టుబడిన ఆయన కాస్త సైకిల్ ని వేగంగా నే తొక్కుతున్నారు. మేలిమి బంగారు ఛాయ ఆయనది.

ఆయనను చూడగానే చెప్పొచ్చు, ఆయన్ని కన్న తల్లిదండ్రులు గొప్పవారై ఉంటారని. దీనికి కారణము ఆయన మృదుభాషిత్వం మరియు మొహంలో పసిబిడ్డ సున్నితత్వం.

సైకిల్ ని మధ్య మధ్యలో ఆపుతూ కనబడిన వారిని ఏదో అడుగుతున్నారు.. మరి ఈయన ప్రయాణం ఎటు? సాయంత్రం ఐదున్నర గంటలకు ఆఫీసు వేళ అయిపోతుంది.

ఇంటికి వచ్చిన వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోయారు.మరి ఈ ఆందోళనకు ఈ ఆందోళన ప్రయాణానికి ఏంటి కారణం?

సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి చేరారు ఆయన. భార్య ఆయన్ని చూడగానే ” ఏంటండీ హడావిడి ఆఫీసు నుండి రాగానే ఎటు వెళ్లినట్టు? కనీసం నాతో చెప్పి అయినా వెళ్ళాలి గా? ” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

ఏం లేదులేవే, నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. రేపు మా నాన్నగారి మాసికం కుడా ఉంది కదా….. వంటకు కావలసినవి తెచ్చాను. ఉపవాసం కదా ఆకలి పై ఉన్న దృష్టి మళ్ళింద్దాం అని అలా వెళ్లాను.

పెద్దోడు ఏడి? అని కాస్త బొంగురు గా అడిగాడు. “ఇంటి వెనుక ఆడుకుంటున్నాడు”, అని సమాధానం చెప్పింది, ఆవిడ .

మరుసటి రోజు సుజాతమ్మ గారు పొద్దున్నే లేచి కాలకృత్యాల అనంతరం మడికట్టే సుకున్నారు. ఆరోజు మావగారిది మాసికం కాబట్టి మాసికం వంట సిద్ధం చేయాలి.

వంటగదిలోకి ప్రవేశాన్ని నిషేధించింది. చేసేది లేక ఇంటి ముందు వాకిట్లో మేమందరం ఆడుకోవడం మొదలు పెట్టాము.

రెండు గంటల తర్వాత అంటే సుమారుగా 11:30 కావస్తోంది. మంత్ర బ్రాహ్మడు మరియు భోక్తలు సైకిళ్లపై వచ్చేసారు.

రాంగానే, అయ్యవారు నన్ను చీవాట్లు పెట్టేసాడు. “నిన్న నీ తాత గురించి నాకు చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళాలి కదా? ఎక్కడెక్కడో తిరుగుతూ వెళ్లావు? ఒకవైపు చీకట్లు ఇంకోవైపు స్కైలాబ్ ఈ పరిస్థితుల్లో మీ నాన్నగారు కంగారు పడిపోతూ వచ్చారు.

‘మా పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు’, అని చెప్పారు. ఇంకో మారు ఇలా చేయకు. బుద్ధిగా మసలుకో”, అని సాగర సంగమంలో కమలహాసన్ లా ‘తకిట తదిమి తకిట తదిమి తందాన’, అని నృత్యం చేశాడు.

ఇదంతా విన్న సుజాతమ్మ గారు విస్తుబోయి ముక్కున వేలేసుకుంది. “ఏంటండీ మీరు ఇలా చేశారు?” అని ఆవిడ తను పోయేవరకు కూడా ఆయన్ను అడగలేదు.

ఆ పెద్దోడు కూడా, ” ఏంటి నాన్న నా కోసం వెతికే వా? ” అని ఈ రోజు వరకు అడగలేదు. వాడి పెద్దరికాన్ని వాడు కాపాడే వేసుకున్నాడు.

ఇలా మా తండ్రి గారు నాకు ఇచ్చిన తన మౌనమైన ప్రేమ వాగ్దానాన్ని తన రెండు చేతులకి కూడా తెలియనివ్వలేదు.

పుస్తకంలో ముగ్గులు వేయడం ప్రయత్నిస్తున్న ఆయన పెద్ద కూతురు ఆయన ఆఫీసు నుండి రావడం చూసి , “నాన్న, పెద్దోడు బ్రాహ్మణులకి చెప్పడానికి ఉదయం వెళ్ళాడు. ఇంకా రాలేదు ” అని చెప్పింది.

‘వస్తాడులే’, అని నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆయన ఎవరికీ తెలియకుండా నడిపిన తెర వెనుక కథ ఇది.

– వాసు

Related Posts

1 Comment

  1. వాసు గారు మీ యొక్క కవిత్వం, మీరు పెట్టిన అనుభవాత్మకమయిన కధలు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, ఈ యాంత్రిక జీవితం నుంచి కొద్దిస్సేపు విశ్రాంతిని, ఊరటను కలిగిస్తున్నాయి. మీకు సదా ఆఁ పరాశక్తి ఆశీర్వాదం ఉండాలని ప్రార్ధిస్తూ. శిరీష ఎర్రమిల్లి.
    శ్రీ శారద వాణి.

Comments are closed.