జ్ఞాపకాల శకలాలు
దర్పణం ముందు నిలుచున్నాను
ఆశ్చర్యం! నా ప్రతిబింబం కాదది
నవ్వుతూన్న తన ప్రతిమే..!
అచేతనంగా అద్దాన్ని ఛిద్రం చేశాను
వందల శకలాల్లో నవ్వుతూ తన ప్రతిమలే !
అవగతమైంది…!!
గాలిలో కలిసి తన ఊసులు
నన్ను తాకుతూనే వున్నాయని !
గాజు బిళ్లల్లాంటి తన జ్ఞాపకాలు
నా మస్తిష్కంలోనే అల్లుకునున్నాయని !
ఆశక్తుణ్ణి…!
గాలిని బాహువుల్లో బంధించనూలేను…
పగిలిన గాజుశకలాల్ని అతికించనూలేను ..!
చివరి మంటల్లో కరిగి ఫఠేల్మని పగిలి
నివురు ధూళినై గాలిని పెనేసుకుని
తన ఊసుల్ని పంచుకుంటాను…..
జ్ఞాపకాల ముళ్ళు విప్పుతూ
పగిలిన గాజు శకలాల్లో
జంట ప్రతిమనౌతాను…..!!
దరిజేర్చే ధైర్యముంటేనే
ప్రేమ పడవనెక్కండని
దిక్కులు పిక్కటిల్లేలా దండోరా వేస్తాను…
-గురువర్ధన్ రెడ్డి