గోముఖ వ్యాఘ్రలు

గోముఖ వ్యాఘ్రలు

ఒక సమూహంలో కథలు రాసే రచయిత్రిని నేను. అందులో, చాలా కథలు రాయడం వల్ల నాకు కొందరు అభిమానులు కలిగారు. నా కథలు చదువుతూ , నన్ను ఎంకరేజ్ చేస్తూ , సలహాలు ఇస్తూ ఉండేవాళ్లు. చాలా గౌరవంగా మాట్లాడతారు అక్క, చెల్లి, మేడం ఇలా అంటూ నా కథల పై సమీక్షలు ఇస్తూ ఉండేవాళ్లు. వాళ్ళ అభిమానానికి నాకు చాలా సంతోషంగా అనిపించేది. కాస్త గర్వంగానూ ఉండేది.

మనం రాసిన కథలని మెచ్చుకుంటూ ఉన్నారు. అంటే ఎవరికైనా గర్వం ఉంటుంది కదా… కానీ, దాన్ని నేనెప్పుడూ ఎవరి పైన చూపించలేదు. ఇక రోజులు సంతోషంగా గడుస్తూ ఉన్నాయి. ఇంతలో, ఒకరోజు సమూహంలో ఒక వ్యక్తి నాకు సందేశం పంపించాడు. తన రచనలు చదివి సమీక్షలు ఇవ్వండి అంటూ, నేను అందరూ ఇలాగే చేస్తారు కదా అని ఆ సందేశాన్ని ఆమోదించి, అతనికి సరే అంటూ సందేశం పెట్టాను. అతను ధన్యవాదాలు అంటూ మళ్ళీ సందేశం పంపాడు.

ఇంతలో ఆ సమూహం వారు ఎక్కువ రచనలు చేసిన వారికి సన్మానం చేస్తున్నాం అంటూ ఆహ్వానించడంతో, నేను కొందరు రచయితలను అంటే ఆడవాళ్ళను ఒక గ్రూప్ గా చేసి అందరం ఒక ఫ్యామిలి లాగా కలిసి వెళ్దాం అని అన్నాను. అందులో కొందరు మగవాళ్ళు కూడా, మేము కూడా మీ గ్రూప్ లో వస్తాం అని అనేసరికి అందర్నీ ఒక కుటుంబం లాగా గ్రూప్ ఫార్మ్ చేశాను. ఒక బస్ మాట్లాడి వెళ్దాం అన్నారు ముందు, కానీ అది కుదరలేదు. అందరం ట్రైన్ టికెట్స్ తీసుకున్నాం.

చివరికి వచ్చేసరికి, ఒక అయిదుగురం మాత్రం కలిసి వెళ్దాం అని అనుకున్నాం. ఏవేవో కారణాల వల్ల మిగిలిన వాళ్ళు వేరేగా వెళ్లారు. సరే, అనుకుంటూ మేము ఆ సన్మానంకు వెళ్లి వచ్చాము. సన్మానం కోసం వెళ్లాలి అనుకుని చేసిన గ్రూప్ మాత్రం అలాగే ఉండిపోయింది. కొందరు వెళ్ళినా, ఇంకొందరు ఉండిపోయారు.

రోజులు గడిచిన తర్వాత, నాకు ఆ సమూహంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని రచనలు చదవమని నన్ను కోరాడు. నిజానికి, అతని రచనలు చాలా బాగున్నాయి. అతని రచనలు చదువుతూ ఉంటే, నాకు అతను చాలా మంచివాడు అని అనిపించింది. నేను అతని రచనలు చదివి సమీక్షలు ఇచ్చాను. దాంతో, కాస్త పరిచయం పెరిగింది.

మేడం మీరు బాగా రాస్తున్నారు. మీ నంబర్ ఇవ్వండి. ఎప్పుడైనా, అనుమానం ఉంటే అడుగుతాను. నా రచనలు చదివి తప్పులు ఉంటే సరిదిద్దండి అంటూ నంబర్ అడగడంతో, సరే సహా రచయితే కదా అనే ధీమాతో నంబర్ ఇచ్చాను. అతను నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు.

మరుసటి రోజు ఒక కథ రాసి పంపించాడు. ఇది నా జీవితంలో నిజంగా జరిగింది, ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు నమ్మించి, మోసం చేసింది. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు. అయ్యో అని మనస్సు చలించి పోయి
కథ చదవటం మొదలు పెట్టాను. నిజం గానే హృదయ విదారకంగా ఉంది ఆ కథ.

నేను కూడా ఆలోచించడం మొదలు పెట్టాను. అలా ఓదార్పుగా, రోజూ తనతో మాట్లాడుతూ, తన బాధలు అవి పంచుకోవడం మొదలు పెట్టారు. అలా, ఒకరి రచనలు ఒకరు చదువుతూ, ఒకరికి ఒకరు సమీక్షలు, విశ్లేషణలు ఇచ్చుకుంటూ, అలా పరిచయం పెరిగి, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉన్నాము.

పాపం అని నాకు చాలా జాలి వేసింది.  అప్పటి నుండి అతను సరదాగా మాట్లాడుతూ ఉంటే, నేను అతన్ని ఆపకుండా ఉండేదాన్ని. ఎందుకంటే. పాపం అనే జాలి వల్ల కాస్త పరిమితి దాటి, మాట్లాడినా కూడా ఏమి అనకుండా ఉండేదాన్ని. రోజులు అలా గడుస్తూ ఉండగా…

అతను మెల్లిగా నన్ను చాట్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి మాట్లాడుకుందాం, కాస్త రొమాంటిక్ గా మాట్లాడు అంటూ, హద్దులు దాటి మాట్లాడడం మొదలు పెట్టాడు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. పాపం అంటే దోషం వచ్చినట్టు ఇన్నాళ్లు మంచిగా మాట్లాడిన ఈ వ్యక్తి ఇలా మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యం వేసింది.

గోముఖ వ్యాఘ్రలు
గోముఖ వ్యాఘ్రలు

నేను అతన్ని కాస్త వారించాను. అలా మాట్లాడకండి ఇది పద్దతి కాదు. మనం ఒకే రంగంలో పని చేస్తున్న వాళ్ళం. ఇలా మాట్లాడడం మంచిది కాదు అని అంటూ అతనితో వారించడం మొదలు పెట్టాను. కానీ నేను వారించడం మొదలు పెట్టిన ప్రతిసారీ, అతను ఇంకా రెచ్చిపోయి నీ షేప్స్ ఎలా ఉంటాయి? నీ అందాలు ఎలా ఉంటాయి? అంటూ చాలా చెడు గా మాట్లాడడం స్టార్ట్ చేసాడు.

ఇక నేను భరించలేక అతన్ని వారించడానికి, మీ అమ్మనైతే ఇలాగే అడుగుతావా? మీ అక్కను ఇలా ఎవరైనా అడిగితే, నీకు ఎలా ఉంటుంది? అంటూ అడిగాను. కనీసం, అలాగైనా అతన్ని అపొచ్చు అనుకుంటూ… కానీ, వాడు అపకపోగా నేను అన్న మాటలు కూడా పట్టించుకోకుండా, మాట్లాడేవాడు. ఇలా కాదని నంబర్ బ్లాక్ చేశాను. అయినా కాల్ చేస్తూ, నన్ను ఇబ్బంది పెడుతూ చాలా చేశాడు. దాంతో నాకు ఏమి చేయాలో అర్దం కాలేదు.

ఇంట్లో చెప్తే అసలు నంబర్ ఎందుకు ఇచ్చావు? అంటూ నన్నే తిడతారు. నువ్వు ఏం మాట్లాడకుండా అతను అలా ఎందుకు మాట్లాడతాడు అంటారు. నంబర్ బ్లాక్ చేసినా కూడా, వేరే నెంబర్ లతో కాల్స్ తో విసిగిస్తూ, నీ నడుం చూపించు, నీ అందాలు చూపించు నన్ను రంజింప చెయ్యి అని అంటూ, మాటల తూటాలు వదులుతూ, మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్న వీడిని ఏమీ చేయలేమా అని అనిపించింది.

అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను పెట్టిన గ్రూప్ లో ఈ విషయం చెప్తే, ఏదైనా పరిష్కారం దొరకవచ్చు కదా, వాళ్ళు నాకు ఏదైన ఆలోచన చెప్తారు కదా, లేదా ఆ సమూహంలో ఫీర్యాదు చేయవచ్చు అనిపించి, ఈ సమస్యను ఆ గ్రూపు సభ్యులకు చెప్పాలి అనుకుని అతను నాకు చేసిన సందేశాలను పెట్టాను.

అది చూసి కొందరు, ఎవడు వీడు అని అడిగారు. నేను వారికి విషయం వివరించాను. ఏదైనా, పరిష్కారం చెప్పండి అంటూ అడిగాను. అయితే, కొందరు నాకు సహాయం చేస్తాము . అని వాడితో ఆడుకోవడం మొదలు పెట్టారు. అంటే అమ్మాయిలాగా వాడితో చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. 

కానీ ఇక్కడే మేము ఒక పొరపాటు చేసాము. అదేంటంటే వాడికి మా గ్రూప్ లో ఎవరో వాడి మిత్రులు ఉన్నారు .అని తెలుసుకోకపోవడం మా తప్పు. నేను సమస్య చెప్పిన తర్వాత ఒక వ్యక్తి అతనికి ఫోన్ చేశాడో , లేదా సందేశం పెట్టాడో కానీ, అతను సందేశం పెట్టగానే వాడు అంటే నన్ను ఏడిపించేవాడు అతణ్ణి బ్లాక్ చేశాడు అని తెలిసింది.

 వాడు బ్లాక్ చేశాడు అని తెలియగానే, గ్రూప్ లో ఉన్న వ్యక్తి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. నువ్వు ఎందుకు నంబర్ ఇచ్చావు? ఆడవాళ్ళ వల్లనే చాలా సమస్యలు వస్తాయి. ఆడవాళ్ళ వల్లనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి అంటూ, నన్ను ఆడుకోవడం మొదలు పెట్టాడు.

నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఒక వెధవను కాపాడుతూ నన్ను అంటున్న అతని సంస్కారం ఎలాంటిదో, అతని మానసిక దౌర్భాగ్యం ఎలా ఉంది అనేది నాకు తెలిసి పోయింది. అలాగే నాకు సహాయం చేస్తాను అంటూ వచ్చిన వాళ్ళు కూడా, అతను వేస్తున్న అభాండాలు విని ఆశ్చర్య పోయి, అతనే వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. అని నన్ను జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంత కంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి.

మనతో మంచిగా మాట్లాడుతూనే అవతలి వారికి మన గురించి అన్ని విషయాలు చెప్పడం, మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అనేది వాడికి చెప్పి, వాడి తప్పు దొరక్కుండా చేయడం వల్ల, అతను ఏం సాధించాడు అనేది నాకు అయితే అర్దం కాలేదు . మీకు ఏమైనా అర్ధం అయితే నాకు చెప్పండి.

ఇలాంటి మేకవన్నే పులులను, గోముఖ వ్యాఘ్రలను అస్సలు నమ్మకండి, మన నీడను కూడా నమ్మలేని రోజులు ఇవి. ఇది గుర్తించండి… తస్మాత్ జాగ్రత్త… 

– భవ్య చారు గారి రచన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *