గురిచూసి వదిలిన తూటాగా…!!!
రాజ్యాల వాదనలు రాచరికపు
మర్యాదలు దాటలేని హద్దులతో
రోసాలై తెగిపోయినా…రాసుకొన్న
రాతలు చెదబట్టి ఎండిన ఆకుల్లా
విరిగిపోయేను…ఆప్యాయతలు కరువై
పొడబారిన వ్యవస్థలో పోటెత్తిన
సందర్భాలతో అబల సబలగా బతకలేని
నాడు ఆయుధాన్ని పట్టి అడుగేయ్…
అడుగేసిన శౌర్యం వ్యూహానికి
రచనవుతు…విశాల సముదాయాన
కనిపించే నీ దేశ దీనస్దితికి కారణాన్ని
వెదకుతు…రెక్కలు విప్పిన రాబంధుల
మోహరింపులను తీరని కోరికలతో
చావని కామాంధులను…గురిచూసి
వదిలిన తూటాగా గుండెలను చీల్చాలని…
అయుధం పట్ట అడుగేయ్…
సమరం మీకై సద్వినియోగం మాకైనా
దేహపు సుకుమారాన్ని ఎంచక…
చమర్చని కళ్ళతో మబ్బులను తిలకిస్తు
ఒడి నిండని సమయంతో ఓదార్పు
బడలేని దేశమాత దారి స్థిమితాల
నిశ్చలానికై పాటుపడుతు…
క్షణ ఘాతకానికి దీటుగా
ఆయుధాన్ని పట్టి అడుగేయ్…
పోరాటంలో గెలుపోటములు సహజాలే అయినా…ఒరిగిన తోటి సైనికులకు
సాయమవుతు వికాసాన్ని ఒంటరి
తపస్సున ఆగని గమ్యానికై సాగిస్తు…
తుది సమరంతో దేశ సౌభాగ్యాలకు
రక్షణవుతు…రక్షించబడిన ప్రతి క్షణాన్ని
భరతమాత నుదిటిన తిలకమై
దిద్దబడాలని ఆశయమై అవని పలికిన
నినాదమై ఆయుధాన్ని పట్టి అడుగేయ్…
– దేరంగుల భైరవ