గురుదక్షిణ
సాందీపుడనే గురువు వద్ద విద్యాభ్యాసం చేసారు బలరామకృష్ణులు. వారు గురువు చెప్పిన పనులను చేస్తూ గురువు వద్ద విద్యను అభ్యసించసాగారు. సాందీపుడు తన శిష్యులైన బలరామకృష్ణులకు అన్ని విద్యలు బోధించాడు. బలరామకృష్ణులు గురువు చెప్పిన విద్యలన్నీ అతి కొద్దికాలంలోనే నేర్చుకున్నారు.
సాందీపునికి ఒక కుమారుడున్నాడు. ఒకనాడు అతను సముద్రంలో స్నానం చేస్తూ అందులో మునిగిపోయాడు. తమ కుమారుడు సముద్రంలో మునిగిపోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయాడు సాందీపుడు. బలరామకృష్ణులు సాందీపుని వద్ద తమ చదువుసంధ్యలు పూర్తి చేసుకున్నారు.
అప్పుడు కృష్ణుడు “గురువర్యా, మీరు మాకు అన్ని విద్యలూ నేర్పారు. మీకు మేమెంతో ఋణపడి ఉన్నాము. మీకు మేము
ఏమి గురుదక్షిణ ఇవ్వగలమో సెలవివ్వండి” అన్నాడు. అప్పుడు సాందీపుడు ‘‘కృష్ణా, నా కుమారుడు సాగర గర్భంలో మునిగిపోయాడు. మీరు అతనిని తిరిగి తెచ్చివ్వగలరా?’’ అని అడిగాడు.
అప్పుడు కృష్ణుడు “గురువర్యా, మీ కుమారుడు ఎక్కడ ఉన్నా మేమతన్ని తీసుకొచ్చి అప్పగిస్తాం. ఇదే మేము మీకు చెల్లించే గురుదక్షిణ’’ అన్నాడు. ఆ తర్వాత బలరామకృష్ణులు సముద్రంలో ప్రవేశించి గురుపుత్రుని కోసం వెతకసాగారు. వారి వెదుకులాటను గమనించిన సముద్రుడు ‘‘కృష్ణా, నాలో పడిపోయిన మీ గురుపుత్రుని ఒక రాక్షసుడు మింగేశాడు’’. అని చెప్పాడు.
అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసునితో పోరాడి, వాడిని వధించి అతని పొట్టలోకి ప్రవేశించి చూడగా ఒక శంఖం కనిపించింది. ఆ శంఖాన్ని తీసుకుని పూరిస్తూ యముని వద్దకెళ్లాడు కృష్ణుడు. యముడు బలరామకృష్ణులకు నమస్కరించి తన వద్ద ఉన్న సాందీపని కుమారుణ్ణి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు ఆ బాలుడిని తీసుకొని వెళ్లి గురువుకు అప్పగించాడు.
అప్పుడు ఆ గురువు ఎంతో సంతోషించాడు. ఆ విధంగా బలరామకృష్ణులు తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు. కృష్ణ లీలలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. జై శ్రీ కృష్ణ
– వెంకట భానుప్రసాద్ చలసాని