హాస్య కధ
దోస్తులకోసం కిచెన్లో చికెన్ వండుతున్నాడు బిపిన్. ఆదివారం అయితే చాలు బిపిన్ రూముకు అతని మితృలంతా వచ్చేస్తారు. కోడి కూయకముందే కోడిని కోసేసి బిర్యానీ వండే పనిలో బిజీగా ఉంటాడు బిపిన్. బిపిన్ చేసే చికెన్ బిర్యానీ అంటే అతని మితృలకు ఎంతో ఇష్టం. ఇలా ప్రతి వారం అందరికోసం బిర్యానీ వండటం బిపిన్ కు చిరాకు కలిగిస్తోంది.
ఈసారి బిర్యానీ చెత్తగా తయారు చేసి మితృలకు పెడితే మళ్ళీ ఇంకోసారి బిర్యానీ వండమని అడగరు. అప్పుడు ఆదివారం హాయిగా పదింటివరకు పడుకోవచ్చు అనేది బిపిన్ ప్లాన్. చికెన్ బిర్యానీ తయారు చేసేప్పుడు ఉప్పు,కారం ఎక్కువ వేసాడు. మోతాదుకు మించి ఆయిల్ వేసాడు. ప్రతి సారి కంటే ఎక్కువ సేపు స్టవ్ పై ఉంచాడు. ఆ తర్వాత మసాలా రెండు రెట్లు వేసి బాగా కలిపాడు. ఆ తర్వాత అందులో నెయ్యి వేసాడు. మొత్తానికి అన్ని రకాల పదార్థాలు కలిపేసి బిర్యానీ చేసాడు.
ఈసారి బిర్యానీ తిన్న మితృలు మళ్ళీ తనను బిర్యానీ చేయమని అడగరు అని ఆశించాడు. మితృలంతా వచ్చేసారు. బిపిన్ వాళ్ళకు బిర్యానీ వడ్డించాడు. ఆ బిర్యానీ తిన్న మితృలు “ప్రతి సారి కంటే ఈ సారి బిర్యానీ సూపరుగా ఉంది. ఇకనుంచి వారానికి రెండు రోజులు బిపిన్ బిర్యానీ చేస్తాడు. ఈ రోజు వండిన విధంగానే బిర్యానీ వండు బిపిన్” అన్నారు. బిపిన్ అవాక్కయ్యాడు. అత్యంత చెత్తగా చేసిన బిర్యానీ మితృలందరికీ నచ్చటంతో పాటు మళ్ళీ అలాగే వండమని అతన్ని కోరటంతో జుట్టుపీక్కున్నాడు. ఇప్పుడు వారానికి రెండ్రోజులు పని అని తెలిసి బావురుమన్నాడు.
– వెంకట భానుప్రసాద్