హోదా

హోదా

 

సభ్య సమాజంలో సర్వ సాధారణంగా మూడు రకాలైన వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. వారు పేద, ధనిక మరియు మధ్య తరగతి. రెక్కాడితేగానీ డొక్కాడదన్నా చందంగా పేద వారు రెక్కలు ముక్కలు చేసుకుని రోజు గడిస్తే చాలనుకుంటూ వారు జీవితాన్ని గడుపుతుంటారు ఉన్నంతలో సంతృప్తిగా. ధనికుడికి ఎంత డబ్బు సంపాదించినా సంతృప్తి వుండదు. ఇంకా సంపాదించాలని తహతహలాడుతూ తన సమయాన్నంతా డబ్బు సంపాధనకే వెచ్చిస్తుంటాడు. ఇకపోతే మధ్య తరగతి వారు. వీరి పరిస్థితి అటు పైకి వెళ్ళ లేరు, ఇటు కిందికి దిగ లేరు. మధ్యలో ఊగిసలాడుతుంటారు.

పై మూడు వర్గాల్లోంచి మరో వర్గం పుట్టుకొచ్చింది.  అది నడమంత్రపు సిరీ వర్గం. ఈ వర్గం వారు గతంలో వారున్న స్థితి గతులను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు.

*****

శ్రీకాంత్ ఒక ప్రైవేటు కంపెనీలో టైపిస్టుగా పనిచేస్తున్నాడు.  తను చేరిన ఆరు నెలలకు ఇంజనీరింగ్ విభాగంలో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్మునికేషన్ లో డిప్లొమా చేసినతను చేరాడు. అతడి పేరు మోహన్. మోహన్ కి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న శ్రీకాంత్ ని సంప్రదించేవాడు. అందుక్కారణం శ్రీకాంత్ మోహన్ కంటే ఆరు నెలలు సీనియర్ అవడమే. అలా సరదాగా ఓ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 

గడచిన రెండు సంవత్సరాల కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. శ్రీకాంత్ టైపిస్ట్ గానే కొనసాగుతున్నాడు. మోహన్ ని డిజైన్ విభాగం నుండీ సర్వీసింగ్ విభాగానికి మార్చారు. ఇంజినీర్ గా ప్రమోషనొచ్చింది మోహన్ కి. సర్వీసింగ్ పనిమీద అడపాదడపా క్యాంపులకి వెళ్ళాల్సి వుంటుంది. అలా క్యాంపులకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తిరుపతిలో ఉన్న శ్రీకాంత్ రూముకొచ్చి పడుకొని మరునాడు ఉదయం లేచి ముఖప్రక్షాళనాదులు పూర్తి చేసుకుని క్యాంపుకెళ్ళేవాడు. 

శ్రీకాంత్ ని మరో కంపెనీకి టైపిస్టుగా మార్చిన తర్వాత శ్రీకాంత్, మోహన్ లు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. తలవని తలంపుగా ఎప్పుడైనా, ఎక్కడైనా అగుపడితే మాట్లాడడం, లేకపోతే లేదు. ప్రమోషన్లిచ్చే పర్వంలో భాగంగా మోహన్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ప్రమోషన్ వచ్చింది.

“ఎప్పుడైతే మోహన్ కి ప్రమోషనొచ్చిందో అప్పటినుండీ ఆయనగారి కంటికి శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఆనరు. పొరబాటున శ్రీకాంత్ మోహన్ ని మాట్లాడించినా చులకనగా మాట్లడేవాడు. నా మిత్రుడేనా ఇలా మాట్లాడుతున్నది! అని ఆశ్చర్యపోవడం శ్రీకాంత్ వంతైంది. ఇందులో అతడి తప్పేమీ లేదు. యాజమాన్యం అతడికిచ్చిన ‘హోదా’ అతడి చేత అలా మాట్లాడించిందని సరిపెట్టుకున్నాడు.

హోదా
                                                                     హోదా

*  *  *  *

శ్రీకాంత్ ని మార్చిన కంపెనీలో ఇంజినీరింగ్ విభాగం ఉన్నది. అందులో పనిచేసేవాళ్ళందరూ ఇంజినీర్లే. వాళ్ళలో ఒకతను శ్రీకాంత్ తో చాలా సన్నిహితంగా వుండేవాడు. అతడి పేరు శశికాంత్. ప్రతిరోజూ లంచ్ అవర్లో శశికాంత్ శ్రీకాంత్ వర్క్ ప్లేస్ కొచ్చి ‘భోజనానికి వెడదాం రండి” అని తనతో పాటూ లంచ్ కి క్యాంటిన్ కు తీసుకెళ్ళేవాడు.  ఇలా ఆరు నెలలు గడచింది. ఈ కారణంగా వారిద్దరి మధ్య మైత్రీబంధం బాగా ఏర్పడింది. ఆ మైత్రీ బంధం ఎంతవరకొచ్చిందంటే ఆఫీసుకెళ్ళగానే ఒకరినొకరు స్నేహ పూర్వకంగా పలకరించుకునే నుండి, ఒకరి బాధలు మరొకరికి పంచుకునేదాకా వచ్చింది. ఇంతలో యాజమాన్యం సంవత్సర ఇంక్రిమెంట్లు, వాటితో పాటూ వ్యక్తిగత ప్రమోషన్లని ప్రకటించింది. ఇంక్రిమెంట్లు బాగా పడ్డ వారు సంతోషంగానూ, పడనివారు విచారంగాను, ఇంక్రెమెంట్ విత్ ప్రమోషన్ ని పొందినవారు మరింత సంతోషంగానూ వుంటారు. ఇది ప్రతి యేటా జరుగుతున్న తంతే!.

*  *  *  *

ప్రమోషన్లిచ్చే పర్వంలో భాగంగా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే శశికాంత్ కి సీనియర్ ఇంజినీర్ గా ప్రమోషనొచ్చింది. అతడికి ప్రమోషనొచ్చిన తర్వాత శ్రీకాంత్ తో అదివరకటిలా మనసు విప్పి మాట్లాడిన దాఖలాలు మచ్చుకి ఒక్కటి కూడా లేదు. అందుకు కారణం యాజమాన్యం ఆయన సేవలను గుర్తించి ఆయనకో హోదాను కల్పించారు. ఆ హోదా అతడిని మునుపటిలా మాట్లాడనీయకుండా అతడి నోటిని నొక్కేసింది కాబోలు అని అనుకున్నాడు శ్రీకాంత్ లోలోన.

*  *  *  *

శ్రీకాంత్ తన ఆప్తమిత్రుడు మోహన్ తో తన స్నేహాన్ని కొనసాగించనందుకు గానీ, శశికాంత్ తనతో ఎప్పటిలా మట్లాడనందుకు గానీ ఈషణ్మాత్రం బాధ పడటం లేదు. కానీ తను పడుతున్న బాధంతా ఒక్కటే.  హోదా పెరిగితే మనుషుల ప్రవర్తనలో వచ్చే మార్పును చూసి. ఆ మార్పు ఒక్కొక్క వ్యక్తిలో వారి మస్తత్వాన్ని బట్టి ఒక్కోరకంగా వుంటోంది”. అని అన్నాడు శ్రీకాంత్.

హోదా పెరిగితే కొంతమంది వ్యక్తులు రిజర్వుడు గానూ, కొంతమంది చులకన భావంతో మాట్లాడేవాళ్ళుగాను, మరికొంత మంది దేవుడి గుళ్ళో దైవదర్శనం కోసం భక్తులు ఎలా పడిగాపులు కాస్తారో అలా ఆ సదరు వ్యక్తిని కలవడానికి పడిగాపులు కాస్తుంటారు.. 

ఏ నూటికో, కోటికో ఒకరు హోదా పెరిగినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాకుండా మునుపటిలా ప్రవర్తించే వారుంటారు.  అలాంటి వారు సమాజంలో గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తులుగానూ, మహానుభావులు గానూ కీర్తింపబడుతుంటారు. 

– హెచ్. నాగార్జున శర్మ

Related Posts