జై ‘టెలుగు’ ‘టళ్ళీ’…!

జై 'టెలుగు' 'టళ్ళీ'...!

జై ‘టెలుగు’ ‘టళ్ళీ’…!

 

చైతన్య ప్రసాద్ అంట. ఒక విశ్రాంత తెలుగు పండితులు 〰️

జై ‘టెలుగు’ ‘టళ్ళీ’…!

తెలుగెక్కడుందిరా తెలుగోడా…!
నీ తెలుగు తెల్లారె తెలుగోడా…!
అమ్మనే ఈజిప్టు ‘మమ్మీ’ని చేశావు
నాన్ననే ‘డాడీ’కి డమ్మీని చేశావు
నీ బిడ్డ ‘అఆ’ లు దిద్దనే లేదు.

తన భాష చదవడం రాయడం రాదు
తెలుగునే వెలివేసె మన బడులు కూడా
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ

తెలుగెక్కడుందిరా తెలుగోడా…?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా…!

లేత మనసుల్లోన నీతులే ముద్రించు
శతకాలు అటకెక్కి చెద పట్టినాయి
బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి.

రామాయణం లేదు… భారతం లేదు
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి?
కదలరే టీవీల చుట్టూత చేరి…!

మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం

తెలుగెక్కడుందిరా తెలుగోడా…?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా…!

మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలు వీరులంటున్నావు
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?
గుడిగుడి గుంచాలు… కోతి కొమ్మచ్చి
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి

పోటీకి సైయ్యంది నీ తెలుగు మేధ
ఉనికినే మరచింది అది అసలు బాధ

తెలుగెక్కడుందిరా తెలుగోడా…?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా…!

కూడు పెట్టని భాష ‘భాష’ కాదన్నావు
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేశావు.

కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు
గ్లోబునే గెలిచాము చూడమన్నావు
తల్లి వేరును మటుకు తెగ నరికినావు
తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు

నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరైన ఉందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!

తెలుగెక్కడుందిరా తెలుగోడా…?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా…!

 

-ఉమాదేవి ఎర్రం ( సేకరణ)

అలికిడి Previous post అలికిడి
నా ప్రయాణం Next post  నా ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close