జనం

జనం

జనం, జనం ఎటూ చూసినా జనం. కనుచూపు మేరా జనం, కాలు పెట్టే సందు కూడా లేని జనం. అబ్బబ్బ ఇసుక వేస్తే రాలనంత జనం. బస్సులు, రైళ్లు, కార్లు, మోటారు సైకిళ్లు ఇలా ఎన్నో ఉన్నా ఇంకా చాలని జనం. నిమిషానికి ఒక బస్సు వేసినా నిలబడే సందు లేని జనం. ఇంత మంది జనాలు ఎక్కడి నుండి వచ్చారు?

అసలెందుకు వచ్చారు అని ఒక్క సారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చిన వారే ఈ జనం ఎందుకు వలస వచ్చారు అసలు ఎందుకు ఇంత మంది జనాలు ఉన్నారు అని ఆలోచిస్తే పల్లెలో పనులు లేక పంటలు సరిగ్గా పండక, బోర్లు వేసినా నీళ్లు పడక పంట గిట్టుబాటు అవని రైతు కుటుంబాలన్నీ జీవనాధారం వెతుకుతూ పట్నానికి వలస వచ్చాయి.

అందుకే ఇంత జనాభా ఒక హైదరాబాదులోనే కనిపిస్తుంది ఇక్కడ ఎంతోమంది బ్రతకడానికి వస్తారు. అయితే ఇక్కడ ఈ హైదరాబాదు మహానగరంలో మూడు లక్షలు సంపాదించేవారు ఉన్నారు. నెలకు 3000 సంపాదించేవారు, 300 సంపాదించేవారు కూడా బ్రతుకుతున్నారు. అదే ఈ భాగ్యనగరం గొప్పదనం రోజుకు 100 రూపాయలు సంపాదించినా బ్రతకగలిగే అవకాశం ఈ హైదరాబాదు పట్టణ ప్రత్యేకత ఇది ఒక హైదరాబాదు గురించి చెప్పడానికే కాదు మన చుట్టూ సమాజంలో మనుషులు మనస్తత్వాలు వారి జీవన విధానాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి మాత్రమే చేసే చిరు ప్రయత్నం.

ఈ భాగ్యనగరంలో 20 రూపాయలకు ఆహారం దొరుకుతుంది 20,000కు కూడా ఆహారం దొరుకుతుంది. రిక్షా తొక్కేవాడు బ్రతుకుతున్నాడు, బెంజ్ కారు వాడు బ్రతుకుతున్నాడు. బెంజ్ కార్ లో తిరిగేవాడు కూడా ఒక చిన్న నాలుగు పయ్యల బండి మీద టిఫిన్ చేసి వెళ్తున్నాడు అదే నాలుగు పయ్యల బండి మీద టిఫిన్ తిని వెళ్లే నెలకు 300 సంపాదించే వారు కూడా ఉన్నారు.

ఓ పక్కన పెద్ద పెద్ద మేడలు భవంతులు లాంటివి కనిపిస్తున్నా వాటి పక్కనే మురుగునీరు మురికివాడలో చినిగిన బట్టలతో ఆడుకునే పిల్లలు కూడా బ్రతుకుతున్నారు. ఇంతమంది జనాలకి బస్సులు కానీ కార్లు కానీ వస్త్ర దుకాణాలు కానీ హోటల్లు కానీ ఏవి సరిపోవటం లేదు అంటే అతిశయోక్తి కాదు. గల్లీ గల్లీకి చాయ్ బండి నాలుగు రెస్టారెంట్లు లాంటివి ఉంటున్నాయి.

అయితే ఏ బస్సు చూసినా ఏ వీధి చూసినా ఏ షాపులో చూసినా జనాలు విపరీతంగా ఉంటున్నారు దానికి తోడు వీధి వీధికి కొత్త షాపులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాదులోనే రెండు కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా అందువల్లే ఎన్ని దుకాణాలు ఎన్ని హోటల్ లు ఉన్నా సరిపోవటం లేదు. అలాగే అదే హోటల్ లో పని చేస్తూ జీవనం సాగించేవారు చాలామంది ఉన్నారు.

పట్నం వచ్చాక ఎలాగైనా బ్రతకవచ్చు అనే ఆశతో పల్లెలనుంచి వలస వచ్చి భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తూ జీవనం సాగించేవారు అంతో ఇంతో సంపాదించి తల్లిదండ్రులకు పంపేవారు చాలామంది మనకు కనిపిస్తూనే ఉంటారు. పైసా ఉంటేనే పట్నం అనే మాట నిజమే అయినా డబ్బు సంపాదనకు కూడా పట్నం రావడం కూడా అంతే నిజం.

ఐదు రూపాయల భోజనం నుంచి 5 లక్షల భోజనం వరకు ఇక్కడ దొరుకుతుంది. 20 రూపాయల చీర నుంచి 20 లక్షల చీర వరకు ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ హైదరాబాద్ అనే మహా భాగ్యనగరంలో ఎన్నెన్నో వింతలు విశేషాలు కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంటాయి. మనం చూడాలే కానీ మన చుట్టూ సమాజంలో చాలా కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఒక రెండు గంటల బస్సు ప్రయాణంలో నేను గమనించింది ఇది ఇంకా గమనించాల్సింది చూడాల్సింది ఎంతో ఉందని నా ఉద్దేశం. ఇక్కడ ఎన్నో చితికిన బతుకుల్ని, చిత్రమైన బ్రతుకుల్ని, ఆశ్చర్యకరమైన బ్రతుకుల్ని ఎన్నో చూడవచ్చు మనకు చూసే సహనం ఓపిక ఉండాలే కానీ ప్రతి మనిషి జీవితం ఒక కథ అవుతుంది.

ఇలా ఈ భాగ్యనగరంలో మెరుమెట్లు గొలిపే అంశాలు ఎన్నో కనిపిస్తూ ఒకపక్క ఉంటూనే మరోపక్క కారు మబ్బులు కమ్మిన చీకటి కూడా మరో పక్క అగుపిస్తూనే ఉంటుంది. అయినా ప్రొద్దున లేస్తే ఉరుకుల పరుగుల జీవితంలో ఇవన్నీ గమనించే తీరిక ఓపిక సమయం ఎవరికీ లేదు కడుపు నింపుకోవాలనే ఒక్క ఆశ తప్ప.

– భవ్యచారు

Related Posts