జరగాలి జరిగి తీరాలి

జరగాలి జరిగి తీరాలి

ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మొదలయ్యేది డిసెంబర్ ముప్పై ఒకటి. తర్వాతి రోజు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే వాళ్ళం.

కేకే కట్ చేయక పోయినా, రాత్రంతా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ ఎప్పుడెప్పుడు పన్నెండు అవుతుందా అని గడియారం వంక చూస్తూ గడిపేవాళ్ళం.

ఏమేం ముగ్గులు వేయాలి కలర్స్ ఎలా వేయాలి అని ఆలోచిస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ, పన్నెండు వరకు నిద్ర పోకుండా ఉండి, తర్వాత అందరికీ శుభా కాంక్షలు చెప్పి, వచ్చిన ఫోన్ లకు సమాధానము ఇస్తూ, ఒంటి గంట తర్వాత అందరం నిద్ర పోయేవాళ్ళం.

మళ్లీ పొద్దున్నే లేచి వాకిలి ఉడ్చి, ముగ్గులు వేస్తూ, అందులో అందమైన కలర్ లు నింపుతూ ఫోన్ లో ఫోటోలు తీసుకుంటూ ఉండే వాళ్ళం.

తర్వాత స్నానాలు చేసి కొత్తవి కాకపోయినా ఉతికిన బట్టలు వేసుకుని దేవుడి దగ్గర దీపం వెలిగించి అందర్నీ చల్లగా కాపాడమని వేడుకునే వాళ్ళం.

అమ్మా చేసిన పాయసం దేవుడికి నైవేద్యం పెట్టి అందరం ఒకరికొకరం తినిపించుకుని సంతోషంగా ఉండి టీవీ చూస్తూ గడిపేవాళ్ళం.

అమ్మ వంట అయ్యాక అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేసేవాళ్ళం. టీవీలో సినిమాలు చూస్తూ గడిపేవాళ్ళం.

ఇదంతా ఒకప్పుడు మరి ఇప్పుడు గత రెండేళ్లుగా బయటకు వెళ్లడం లేదని. వెళ్ళినా మాస్క్ లు తప్పని సరిగా పెట్టుకుని బయట ముగ్గులు వేసుకుంటున్నాము కలర్ లు లేకున్నా ఏదో వేసాము అంటే వేసాం అన్నట్టు వేసాము.

ముఖంలో సంతోషం లేదు. ఆనందంగా లేము ఎవరం ముట్టుకుంటే ఏం అవుతుందో, పట్టుకుంటే ఏం జరుగుతుందో అనే భయంతో బతుకు బ్రతుకుతున్నాము.

అదే సమయంలో జీవితంలో ఒక పెద్ద కుదుపు. అనుకోని సంఘటన దూరంగా ఉన్న వాళ్ళు అయినా బాగుండాలని దూరం అయితే వాళ్ళు లేకుండా పోవడం.

జీవితం ఒక్కసారిగా అంధకారం అలముకుంది. ఎన్నో ఆశలు నిరాశకు అయ్యాయి. ఎన్నో కోరికలు బూడిద అయ్యాయి.

అసలు ఏం జరిగింది అనేది తెలిసే లోపు అంతా అయిపోయింది. సరే జరిగిందేదో జరిగిపోయింది అని దాంట్లో నుండి బయట పడాలని అనుకునేంతలో ఇంకో ఉపద్రవం లాగా ఆరోగ్యం మందగించింది.

టెన్షన్ ఇంకేదో ఆరోగ్యం పాడయ్యింది. అతి కష్టం మీద ఆసుపత్రికి వెళ్తే లక్షలు కావాలి అన్నారు. భయపడి ఇంకో చోటికి వెళ్తే అక్కడ ఒక దేవత కనిపించింది.

నా పరిస్థితిని అర్దం చేసుకుని మంచి మందులు ఇచ్చింది. నెలల పాటు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుని ఆ సమస్యల్లో నుండి బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నాం.

ఈ సంవత్సరం సంతోషం లేదు. ఆనందం లేదు. టీవీ లేదు, పాటలు లేవు, ముగ్గులు లేవు, కలర్ లు లేవు, స్నానాలు లేవు, పూజలు లేవు, రాత్రి ఎనిమిదికి తిని పడుకున్నాం. తినాలి కాబట్టి తిన్నాం, ఉన్నాం కాబట్టి ఉన్నాం అంతే….

అందరూ పోయిన సంవత్సరం గడపలేక ఈ సంవత్సరం గడుపుతూ ఎంజాయ్ చేశారు. మాకు మాత్రం ఈ సంవత్సరం అంటే నిన్న ఎలాంటి సంబరాలు లేవు. అయినా బాధ లేదు ఎందుకంటే…

మనిషి ఆశా జీవి కాబట్టి. రేపటి నుండి ఈ సంవత్సరం అయినా అంతా మంచే జరగాలని జరుగుతుందని మేము అనుకున్న లక్ష్య సాధనకు కృషి చేయాలని మా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది అని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది. జరిగి తీరుతుంది…

Related Posts

1 Comment

Comments are closed.