కాలాతీతం…

కాలాతీతం…

ఇన్ని రోజులూ ఎక్కడ నీవు..
బతుకు నాతో
దారుణంగా దాగుడుమూతలు ఆడుతూ
ఏ క్షణాన్ని ఆస్వాదించకుండా
అనుక్షణం వెంటాడుతూ
వేధిస్తున్న సమయంలో
అడుగంటి పోతున్న ఆశలకి
కొంగొత్త ఊపిరిలూది
జీవితాన్ని కమ్మేస్తున్న కారు చీకట్లలో
ఆశల కాగడా ఆరిపోకుండా
ఆర్తిగా చేతులొడ్డి
ఆసరా ఇచ్చే మనిషి కోసం
ఎంతగా పరితపించానని..?
అలుపెరుగని పోరాటంతో
విసిగి పోయాను..
వేసారి పోయాను..
భీతిల్లాను
బెంబేలెత్తాను
చివరకు బీరువునై నా బతుకు నాటకాన్ని
ముగించే క్రమంలో
అప్పటివరకు తెర మరుగున ఉండి
ఆట చూస్తున్న నీవు
ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యావు
నా ఆట సామానంత
మూటగట్టుకొని
నేను ప్రయాణానికి
సిద్ధమయ్యాక..

– మామిడాల శైలజ

Related Posts