కాలం గడిచినా

కాలం గడిచినా

చిన్నప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే, నాన్ననో , అమ్మనో, డబ్బులు అడిగి రాఖీలు కొనేదాన్ని. అమ్మ కూడా నాన్నకు తెలియకుండా ఒక రాఖీ తెచ్చి ఇవ్వమని అడిగేది. రాఖీతో పాటూ, ఒక పోస్టల్ కవర్ కూడా తీసుకుని రమ్మంటే నేను తెచ్చి ఇచ్చే దాన్ని. అయితే, నాన్న ఇచ్చిన డబ్బులో మిగిలినవి ఇచ్చేస్తే , నాన్న రాఖీలు ఏవి అని అడిగి చూసేవారు.

ఇవేనా, ఇవే తెచ్చావా అంటూ గుచ్చి గుచ్చి అడిగేవారు. ఎందుకంటే అమ్మ తన తమ్ముడి కోసం తెప్పించింది ఏమో అనే అనుమానంతో అలా అడిగేవారు. ఎందుకంటే నాన్నకు మామయ్య అంటే పడేది కాదు. అందుకే, అమ్మను ఎప్పుడూ పంపించే వారు కాదు. అందుకే అమ్మ నాన్న కు తెలియకుండా రాఖీ తెప్పించి, పోస్ట్ చేసేది.

పోస్ట్ అతన్ని మళ్లీ నాన్నకు చెప్పకండి అంటూ బతిమాలి కవర్ కు స్టాంప్ లు అతికించి పంపేవాళ్ళం. వారం ముందే ఇది జరిగేది. నేను ఆ కవర్ ను నాన్నకు తెలియకుండా, నాన్న చూడకుండా కడుపు దగ్గర దాచుకుని వెళ్ళేదాన్ని. యెంత జాగ్రతగా ఉన్నా కూడా ఒక్కోసారి దొరికి పోయేవాళ్ళం. దాంతో, నాన్న అమ్మను చితక బాదేవారు.

నాకు నచ్చని వారితో ఎందుకు మాట్లాడతావు, ఎందుకు పంపుతావు అని కొట్టే వారు , ఒక్కగానొక్క తమ్ముడికి పంపితే తప్పు ఏంటి అని అమ్మ వాదన. పాపం, ఇలా అమ్మ కొన్నాళ్ళ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనే లేదు. కొన్నాళ్ళకు నాన్న నిజాలు గ్రహించి, అమ్మను పంపించే వారు రాఖీ పౌర్ణమికి, ఆరోజు ఎలా జరిగేది అంటే…

అమ్మ మబ్బున్నే లేచి, వంట చేసి, పాయసం చేసి, రెడీ పెట్టేది, మమల్ని పొద్దున్నే లేపి తల స్నానం చేయమని తొందర చేసేది. మేము స్నానాలు చేశాక, కొత్త బట్టలు వేసుకుని, నేను తమ్ముళ్లకు నాన్నకు రాఖీలు కట్టేదాన్ని, తర్వాత అందరం పాయసం తినేసి, అన్నాలు తిన్న తర్వాత, బడికి వెళ్ళే వాళ్ళం.

అమ్మ కూడా మాతో పాటు రెడీ అయ్యాక, అందరం రోడ్ మీదికి వెళ్లి అమ్మను బస్ ఎక్కించే వాళ్ళం. నాన్న అమ్మకు బస్ కిరాయి ఇచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేయి, ఉండకు అని చెప్పేవారు. అమ్మ బస్ ఎక్కి వెళ్ళాక మేము బడికి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం ఇంటికి వచ్చి అమ్మ చేసి పెట్టిన అన్నాలు తిని, కంచాలు అక్కడే వేసి, మళ్లీ బడికి వెళ్ళేవాళ్ళం.

kalam gadichina

మళ్లీ సాయంత్రం వచ్చి, అమ్మ కు సాయంగా కొన్ని చిన్న పనులు చేసేదాన్ని. అంటే, ఇల్లు ఉడ్చి, నాన్నకు టీ పెట్టి ఇచ్చేసి, గిన్నెలు సర్ది, మధ్యానం తిన్న కంచాలు, గిన్నెలు సర్దేసి, కడిగి పెట్టేదాన్ని. రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మ తిరిగి వచ్చి, అన్నం వండి మాకు పెట్టి, తను తినేసి, పది గంటలలోపే పడుకునే వాళ్ళం, అమ్మ మళ్లీ అవన్నీ సర్దేసి కడిగి వంట ఇల్లు శుభ్రం చేసుకుని పడుకునేది.

ఒక్కొక్క సారి అమ్మ లేట్ అయ్యిందని రాకపోతే ఎనిమిది గంటలకు నేనే బియ్యం పెట్టెదాన్ని. ఇక అప్పుడు నాన్న కోపం చూడాలి… పాపం అని పంపితే రాలేదు చూడు, దీన్ని ఇంకో సారి పంపను , అంటూ అర్ధం కానీ తిట్లు తిట్టుకుంటూ, నేను వండిన అన్నం కంచంలో ఎత్తేసుకుంటూ, ఎలాగో రెండు ముద్దలు మింగి పడుకునే వారు.

ఆ సమయంలో నాన్నతో మాట్లాడాలి అంటే భయంగా ఉండేది. అందుకే అన్ని దగ్గర పెట్టి, దూరంగా నిలబడి తొంగి, తొంగి చూస్తూ ఉండేదాన్ని ,  ఒక్కోసారి చాలా కోపంగా ఉంటే గిన్నెలు అన్ని ఎత్తేసే వారు. తినుకుంటూనే ఏదో ఆలోచించే వారు.

అమ్మో చాలా భయం వేసేది ఆ టైమ్ లో . . . తమ్ముళ్ళు గానీ కనిపిస్తే,  వీపు విమానం మోత అయ్యేది. అందుకే దగ్గర్లో ఉండే వాళ్ళం కాదు. అమ్మను అడిగేదాన్ని, ఎందుకమ్మా నాన్న కు అమ్మమ్మ వాళ్ళు నచ్చరు? అని దానికి అమ్మ ఏమో తల్లి నాకు తెలియదు. ఒకరికి ఒకరు నచ్చక పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ చెప్పలేము ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కదా, తన కన్నా గొప్ప ఎవరు లేరని అనుకుంటారు. అందుకేనేమో నేను సరిగ్గా చెప్పలేను అనేది.

కాలం మారింది, నాన్న మారారు. నాకు పెళ్ళి జరిగింది. నేను నా తమ్ముళ్లకు, రాఖీ కట్టడానికి వెళ్తాను అన్న ప్రతిసారీ నా భర్త వద్దు అంటారు. పోనీ పోస్ట్ చేస్తాను అన్నా కూడా, నా తమ్ముళ్ళు పెళ్ళిలో తనను సరిగ్గా పట్టించుకోలేదు అని, మర్యాద ఇవ్వలేదని, ఏవేవో అంటారు. మళ్లీ ఎప్పుడన్నా వాళ్ళు కలిస్తే నేను వెళ్ళమని అన్నా, మీ అక్కనే రాలేదు అంటూ కబుర్లు చెప్తారు.

వాళ్లను నా ముందు తిట్టి, మాటలు అంటుంటే, ఎలా ఉంటుందో ఆలోచించండి. అయినా భర్త కదా అన్ని మూసుకుని ఉండాల్సిందే. సరిగ్గా నాన్న ఎలా చేసేవారో, ఎలా ఉండేవారో, నా భర్త కూడ అలాగే అంటారు, ఉంటారు . కాలాలు మారినా, ఆడదాని బతుకు మాత్రం మారలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే . . . . ( కాలాలు మారినా భర్తలు మారలేదని చెప్పడానికి రాసింది మాత్రమే )

– భవ్యచారు

Related Posts

2 Comments

  1. ఈ కధ బాగా వ్రాసారు. ఈ కధలోలా ఎన్నో చోట్ల అనేక సంఝటనలు జరుగుతూనే ఉంటాయి.

  2. Kaalalu marina aada dani bratuku maradu aney concept bagundi kani kalalu marina barthalu mararu anedi naku nachaledu endukantey present generation lo chala takkuva ala alochinche vallu bartalu valla alochanalu mataledu ani miru anukuntey chala mandi aadavallu bayataki velli jobs chese valla evaro kondaru talaku masina vallu untaru andaru kadu kaada

Comments are closed.