కదం తొక్కిన యువగళాలు పుస్తక సమీక్ష

కదం తొక్కిన యువగళాలు

కదం తొక్కిన యువగళాలు

ఉగాది అంటే కొత్త శ్వాస, సరికొత్త ఆశ.అందుకే ఎంతటి నిరాశ ఉన్నా కవులకి ఉగాదంటే ఉత్సాహం.ప్రకృతి కొత్త సోయగాలతో హొయలు పోతుంటే కవులు తమ పరవశాన్ని అక్షర తోరణంగా తీర్చి దిద్దుతారు.అందుకే ఉగాది అనగానే కోయిల పాటతో కవికోకిలలు పోటీపడుతుంటాయి.

అలాగే ఉగాదికి ఆకాశవాణికి అవినాభావ సంబంధముంది.ఉగాది కవిసమ్మేళనాన్ని ఆకాశవాణి ఎంతో ప్రేమతో,ఎంతో బాధ్యతగా ఇప్పటికీ నిర్వహిస్తోంది.అందుకు ఆకాశవాణిని అభినందించాలి.

ఆకాశవాణి నిర్వహించే సమ్మేళనానికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.ఒకప్పుడు ఆకాశవాణి ఉగాది కవి సమ్మేళనాలంటే ఆనాటి లబ్ధప్రతిష్ఠులందరూ పాల్గొనేవారు.శ్రీశ్రీ, ఆరుద్ర,దాశరథి,సినారె,బాపురెడ్డి, కుందుర్తి, శేషేంద్ర.. ఇలా ఆకాశవాణి కవిసమ్మేళనాలలో పాల్గొనని ప్రముఖులు లేరు అనే చెప్పాలి.

అలాంటి ఆకాశవాణి 2023లో శ్రీశోభకృతు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికచేసిన ఇరవైరెండు మంది యువ కవులను ఒక్కచోట చేర్చి యువశోభ కు పట్టం కట్టింది.ఆకాశవాణి తెలుగు ప్రసారాల చరిత్రలో ఇదొక అపురూప ఘట్టం. ఇది సాకారం చేసిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రోగ్రాం హెడ్ వి.ఉదయశంకర్, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వలేటి గోపిచంద్ లతో పాటు ఈ యువశోభకు యువకవులను ఎంపికచేసే సమన్వయ బాధ్యతను స్వీకరించిన డా.మల్లెగోడ గంగా ప్రసాద్ లను అభినందించాలి.

మరొకందుకు కూడా ఈబృందాన్ని అభినందించాలి.ఆకాశవాణికి కవిసమ్మేళనాలను పుస్తకంగా ప్రచురించే సంప్రదాయం లేదు.ఒకటీ అరా సందర్భాల్లో ప్రచురించినా అవి వెలుగు చూసేనాటికి శ్రోతలు వాటిగురించి మరిచి పోయేవారు..

కానీ మొదటిసారి ఆకాశవాణి సంప్రదాయానికి భిన్నంగా కవి సమ్మేళనం జరిగిన రోజే యువశోభ కవితల పుస్తకం ఆరోజు హాజరైన ప్రేక్షకుల హస్తభూషణంగా అలంకరించటం బహుశా ఆకాశవాణి చరిత్రలోనే మొదటిసారి.ఇందుకు మిత్రుడు వలేటి గోపిచంద్ ను అభినందించాలి.

ఈ కవులందరూ ఉగాదిని వారివారి మనోధర్మంతో దర్శించారు.ఏకశిలాసదృశంగా కాకుండా ఎవరి కోణంలో వారిని ఉగాది దర్శించారు‌.ముందుగా కవులను గమనిస్తే వీరిలో ఎక్కువమంది విస్తృతంగా రాస్తూ తమ సత్తాను చాటుతుంటే ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్నవారూ ఉన్నారు.

సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన మెర్సీ మార్గరెట్,పల్లిపట్టు నాగరాజుతో మొదలు పెడితే ఎమ్మే తెలుగు చదువుతున్న అశ్విని,డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శైలజ సుధగోని వరకు ఉన్నారు.
వారందరికీ ఇదో మరపురాని అనుభవం అంటే ఆశ్చర్యం లేదు.

ఇక ఈ యువ స్వరాలను పరిశీలిస్తే

నందకిషోర్ చైత్రంతో తన ప్రియసఖి కి కవితా సందేశాన్ని పంపుదామను కున్నాడు.చైత్రం ఎలాంటిదో చెబుతూ చైత్ర ముతైదువ వలపన్నిపోతుంది ప్రియా అంటాడు కవి ఎంతో ముచ్చటగా.వసంతమంటేనే వలపు ఋతువు అంటాడు కవి.సృష్టి అద్దంలోన బింబమవుదాం ప్రియసఖీ అని మోహపరవశంతో పలుకుతాడు.

మెర్సీ మార్గరెట్ ది మరోకోణం.తన ఆమెలిపి కవితలో
ప్రకృతి దుఃఖాన్ని ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు.మెత్తని ఆకులపై చంటిపిల్లాడి పదనర్తనంలా పదాలను ముద్దుగా పేర్చి ఈకాలపు నీలినీడలను మనలో పరుస్తారు. అది ఆమెలిపిలా మారి విషాద మోహనంలా పలుకుతుంది.ఇంతకీ ఆమె ఎవరు అనేది మన ఊహకు వదిలేస్తారు.ఆమె కవితలా మీ ఎదపై వాలినప్పుడు ప్రేమగా హత్తుకోండి” అని ఆశ్వాసన చేస్తారు.

మరో కవి పల్లెపట్టు నాగరాజు
మన్సులెత్తు పెరిగిపూడ్సిన యీ అవినీతి కలుపుని/
మన్సితనాన్ని కమ్మేసిన యీ రాజకీయ బోదగెడ్డిని/
ఒడుపుగా పిడికిటబట్టికోసి పోగులెప్పుడేస్తావమ్మీ
అని తన ప్రేయసితో సంభాషిస్తాడు.

ప్రేమముచ్చట్లను పక్కనపెట్టి దేశంలో అన్ని సమస్యలను స్వచ్ఛమైన పల్లెభాషలో విన్నవించటం ప్రత్యేకంగా అనిపిస్తుంది.ఒక వాతావరణాన్ని సమకూర్చుకుని కవి మనల్ని ఆ వాతావరణంలోకి నడిపిస్తుంటాడు.

మునిమాపువేళలో కొడుకు రాకోసం ఎదురు చూపుల తల్లి బాధను, దుఃఖాన్ని వర్ణిస్తారు కవయిత్రి శ్రీనిధి విప్లవశ్రీ.
ఆ ముసలితల్లి ఎదురుచూపుకు కాలంఓడిపోతూనే ఉందెప్పుడూ

అన్న ముగింపుమాట ఉద్యమాలలో కి వెళ్లి తిరిగి రాని బిడ్డలకోసం ఎదురుచూసే ఎందరో తల్లులను గుర్తుచేస్తుంది.నిగూఢమైన కవిత.

ఆడపిల్లకు పెళ్ళయ్యాక ఉండే సంబంధం ఒడిబియ్యం.ఆ ఒడిబియ్యాన్ని సంబరంగా వివరిస్తారు తగుళ్ళ గోపాల్ తొలిసారె” కవితలో.తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న ఈ సంప్రదాయాన్ని చాలా ఆర్ద్రంగా పంచుకుంటారు..ఒక్కవాక్యం వేయి వేణువుల గానమంత మధురంగా ఉంటుంది అని కవితతో ఋజువు చేస్తారు..

అలాంటి ఒక వాక్యాన్ని చిత్తగించండి.‌ ఒక్క అక్షరం ముక్క కూడా చదవని అమ్మలు/ఒడిబియ్యమప్పుడు/ఎన్నెన్నో సదువులు సదువుతారు. సంప్రదాయాన్ని కవిత్వంలో చొప్పించిన ఈ కవి ఆడబిడ్డల పట్ల తనకున్న అపారప్రేమను అలా వ్యక్తీకరిస్తాడు.

బాల్యాన్ని అనేకరకాలుగా తలుచుకుంటారు కవులు.తండ హరీష్ గౌడ్ మాత్రం బాల్యాన్ని చినుకుపాల ఉగ్గుగిన్నె చేసి ఊరట చెందుతారు.
చినుకే కదా అనుకుంటే/జ్ఞాపకాల తుట్టెనలా కదుపుతుంది అని మురిసిపోతుంటాడు కవి.

జీవితంలో కొసరు చాలా మురిపిస్తుంటుంది.కొసరు ఇచ్చే తృప్తి వేరు.అదెలాంటిదంటే
మూయబోయిన కిటికీ లోనుండి /
మెల్లగా జారే వెన్నెల” అంటారు మానస చామర్తి తన కొసరు కవితలో.

చిన్న పిల్లల్లోని స్వచ్చత, అమాయకత్వం కవులనెప్పుడు కదిలిస్తుంటాయి.కవి చిన్న పిల్లల కళ్ళలోని కాంతులను,మూసిన గుప్పిటలోని వెచ్చటి జీవన పరిమళాన్ని తలుచుకుంటూ జీవితాన్ని రికామీగా గడపగలడు.ఆ పని డా.మల్లెగోడ గంగా ప్రసాద్ చేస్తారు పాద ముద్రలు కవితలో.
రేయి పగలు ఇంటినిండా నీలా అన్ని రంగులు కుమ్మరించాలంటే/
ఏ హరివిల్లు వల్ల అవుతుంది బిడ్డా అని తేల్చిపారేస్తాడు.అది కవితలోని స్పష్టతకు మెరుపు రేఖలాంటిది.

యువశోభ లోని కవి మిత్రులందరూ తమ జ్ఞాపకాలను, కలలను, వ్యధలను, బాధ్యతలను వ్యక్తపరుస్తారు.వారి భావాలలో హిపోక్రసీ లేదు.ఉన్నదున్నట్టు చెబుతారు.చెప్పే పద్ధతిలో క్లారిటీ,పదచిత్రాల వాడకంలో తేడా ఉండొచ్చేమో కానీ
వారి నిజాయితీలో తేడాలేదు.అదే ఈ పుస్తకానికి బలం.ఈ సంకలనంలో ఇంకా నరేశ్ కుమార్ సూఫీ, విజయకుమార్ ఎస్వీకె,డా.తిరునగరి శరతచంద్ర,

నాగిళ్ళ రమే‌ష్,డా.మామిండ్ల రేణుక,మాదస్త ప్రణవి,రక్షిత సుమ, కాశిరాజు,డా.చంద్రయ్య శివన్న, అశ్విని, రమేష్ కార్తీనాయక్,లిఖిత్ కుమార్ గోదా,బి.అరుణ వంటివారి కవితలు కూడా చోటుచేసుకున్నాయి.

ఉగాది నాడు కవులు కోయిలతో పోటీపడటానికి ఇష్టపడుతుంటారని వింటుంటాం.ఎప్పుడూ సీనియర్ కవులను వినటం అలవాటయిన మనకు యువస్వరాలను పరిచయం చేసి ఉగాది షడ్రుచులను విభిన్నంగా
పరిచయం చేసింది ఈసారి ఆకాశవాణి..ఈ యువకవుల ఆత్మ విశ్వాసానికి పాదులు చేసింది.

భవిష్యత్తంతా మాదే అన్న ఉత్సాహాన్ని వారిలో ఉగాది చైతన్యంలా పరిచి మార్గాన్ని సుగమం చేసింది.యువశోభ తో కొత్త బాటను దిద్ది,నవ్యపథాన్ని నిర్దేశించిన ఆకాశవాణికి అభినందనలు.పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దటంలో సంపాదకులది వెలకట్టలేని శ్రమ.

ఈ సమీక్ష ఈనెల కవిసంధ్య పత్రిక లో వచ్చింది.

వి.గోపిచంద్ ప్రచురణ.

-సి.యస్.రాంబాబు

సైనికుడు ధీరజ్ Previous post సైనికుడు ధీరజ్
మానవత్వమా Next post మానవత్వమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close