కాదేది కథకి అనర్హం

కాదేది కథకి అనర్హం

మనసులో ఏదో మెదులుతుంది. ఏంటది ఏమో తెలియడం లేదే పోని ఎవరికైనా చెప్పాలి అనుకున్నా చెప్పడానికి మాటలు రావడం లేదు, ఎందుకిలా నాలో నేనే మదన పడుతూ ఉన్నా , నా మనసులో మెదిలే భావాలని చెప్పాలంటే ఇంత బాధ కలుగుతుందా అది ఇప్పుడే తెలుస్తుంది.

ఎంత బాధ ఎంత నరకం ఎంత ఆవేదన , ఎంతో వేదన ఇంత వేదనను అనుభవిస్తున్నా కూడా నా మనసు లోని బాధ పోదే
దీనికి ఏమిటి పరిష్కారం. ఎలా దీన్ని అధిగమించాలి. అర్థరాత్రి సమయంలో చటుక్కున మెలకువ వచ్చి కూర్చున్నా , చుట్టూ నిశ్శబ్ధం, ఎక్కడా అలికిడి లేదు. సన్నగా గడియారం లోని ముళ్ళు శబ్ధం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు .

అసలు నాకెందుకు మెలకువ వచ్చింది. పడుకుంటే తెల్లారితే కానీ లేవని నాకు ఇప్పుడు ఈ మెలకువ రావడానికి కారణం ఏమిటి, చుట్టూ చూసాను.

అప్పుడు కనిపించింది నాకు బల్లపై కదులుతూ తెల్లని కాగితం . అవును దాని శబ్దానికి నాకు మెలకువ వచ్చి ఉంటుంది.

మెల్లిగా దుప్పటి తీసి లేచాను. నా కర్ర కాళ్ళతో నడిస్తే అందరికీ మెలకువ వస్తుందని ఒంటి కాలి తోనే బల్ల వరకు వెళ్ళాను. అక్కడ కుర్చీలో కూర్చున్నా ,నా కొడుకు పుస్తకం లోని ఒక తెల్లని కాగితం అది. దాని పక్కనే నల్లని పెన్సిల్. అగుపించాయి.

ఆ వెంటనే నా మనసు ఆగలేదు పెన్సిల్ తీసుకున్న , తెల్లని కాగితం పై నా చేతులు కదులుతున్నాయి. కదులుతూనే ఉన్నాయి. అంతో, ఇంతో చిన్నప్పుడు నేర్చుకున్న నా చదువు ఇప్పుడు నాకిలా ఉపయోగ పడింది.

నా మనసు లోని వేదనంతా కాగితం పై పెట్టేసరికి మనసు తేలికైన భావం తో గాల్లో ఉయాలలుగుతూ ఉంది. మరి నేనూ కూడా నా చిన్నప్పుడు ఊగినట్టే ఉయాల ఊగాలి కదూ , అవును ఉగాలి . ఎవరూ లేవక ముందే నేను ఉయాల ఊగాలీ.

నా భావాలన్నీ , నా ఆవేదనని, నా నరకాన్ని, నా వేదనను ఒక్కో అక్షరం గా రాస్తుంటే అనిపించింది. అక్షరాన్ని ఏర్చి కూర్చి రాయడం అంటే మాటలు కాదనీ, అదో కళ అని, అక్షరాలు వాక్యాలుగా మలుస్తుంటే అనిపించింది ప్రసవ వేదన అంటే ఇదేనేమో అని.

అయ్యో చెప్తుంటూ పోతుంటే సమయం గడిచిపోతుంది. ఈ సమయాన్ని నేను వినియోగించు కోవాలి. అదే బల్ల ను మెల్లిగా ఎక్కే ముందు కాగితా పై బరువు పెట్టాను. మెల్లిగా బల్ల ఎక్కాను. నేను కట్టుకున్న లుంగీ తీసి రేకుల షెడ్డు కు ఉన్న రాడ్డు కి కట్టాను.

లుంగీ ముడి వేశాను నా తల అందులో పెట్టాను ,ఇక బల్ల తన్నడమే ఆలస్యం. ఒక్కసారి గా ఎక్కడ లేని శక్తిని ఒంటి కాలి కి తెచ్చుకున్నా , బల్లను తన్నాను. నా లుంగీ నా మెడకు బిగుసుకుంది. నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి.

*******

పొద్దున్నే తలుపు చప్పుడు అవడంతో  ఏవర్రా ఈ సమయం లో,  అనుకుంటూ విసుక్కుని లుంగీ సర్దుకుంటూ వస్తున్నా అంటున్నా, ఆగని తలుపు శాభ్దానికి విరిగి పోతాయేమో అనిపించింది వెళ్లి గబగబా తీశాను.

అక్కడ శంకరం ఒరేయ్ రాజా మన కష్టాలు తిరినట్టే రా ఇదిగో మని యర్డారు వచ్చింది రా,  ఎంత అనుకున్నావూ ?అయిదు వేలు రా,  అంటూ ఆనందంగా రాజా చేతిలో పెడుతూ , కాలు జారీ పడబోయాడు.

వాడిని గట్టిగా పట్టుకుంటూ ఒరేయి పడిపోతావు జాగ్రత్త , అయినా నాదేముంది రా, నువ్వే గా నీ కథ రాయమని పోరు పెట్టావు. అంటూ కింద పడిన కర్ర కాలు నీ శంకరానికి అందించాడు.

 

-భవ్యచారు

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *