కలగంటే సరిపోదు.!

కలగంటే సరిపోదు.!

పచ్చని ప్రకృతి నడుమ చిరిగిన నిక్కరు మెడలో కండువా వేసుకుని పశువులను మేపుతున్న ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఒకరోజు పొలంలో ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు.. గుట్టలు ఎక్కుతూ గట్లను దాటుతూ.. పడుతూ, లేస్తూ, ముందు ఏముందో చూడకుండా పరిగెట్టడానికి కారణం ఆ పిల్లాడికి నింగిలో శబ్దం చేస్తూ పక్షిలా దూసుకుపోతున్న ఓ విమానం… వాడికి ఎందుకో దానిని చూస్తే పట్టరాని ఆనందం.

అది ఆకాశంలో మబ్బుల మాటున దాగి ముందుకు పోతుంటే సాధ్యమైనంత దూరం పరిగెడుతూ దాన్ని సాగనంపడం వాడికి ఓ సరదా… ఎప్పుడో ఒకసారి ఆకాశంలో అలా చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం ఎంతో గొప్పగా భావిస్తుంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. తండ్రి సంపాదనపైనే ఇంటిల్లపాది గడపాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ పిల్లాడికి అంతకన్నా పెద్దపెద్ద ఆశలు ఏముంటాయిలే అనుకోవడం సహజం…. కానీ వాడలా అనుకోలేదు. ఏనాటికైనా ఆ విమానాన్ని ఎక్కే రోజు వస్తుందని, రావాలని ఆ వయసులోనే కలలుకన్నాడు.

***************

అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇరుమిట్లు గెలిపే దీపకాంతులు మధ్య అద్దాలకు ఆవల వరుసగా నిలిపి ఉంచిన విమానాలను చూస్తున్నాడు ఓ కుర్రాడు… చుట్టూ తాను కనీసం కలలో కూడా కలుస్తానని ఊహించని రాజకీయ నేతలు, సినీ తారలు. వారందరితో పాటుగా బోర్డింగ్ పాస్ కోసం లైన్ లో నిలబడ్డాడు. “పాస్పోర్ట్ ప్లీజ్” అంటూ విమానాశ్రయం సిబ్బంది అడుగుతుంటే వారి చేతికి పాస్పోర్ట్ను అందిస్తున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపులు వచ్చాయి.

లగేజీ తనిఖీలు ముగించుకుని గేటు వైపు అడుగులు వేస్తుంటే అతని కాళ్లు తడపడ్డాయి. రన్‌వే పై బస్సు ఎక్కి విమానం వైపుగా వెళుతుంటే చిన్నప్పుడు పొలం గట్ల మీద అదే విమానాన్ని చూసేందుకు తాను పరుగు తీసిన రోజులు కళ్ళముందు కదలాడాయి. విమానంలోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నప్పుడు తాను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు ఎదుర్కొన్న సవాళ్లు గుర్తొచ్చాయి. లోపలికి వెళ్ళిన ఆ యువకుడికి ఎయిర్ హోస్టెస్ చూపించిన తన సీటులో కూర్చోగానే కన్నీళ్లు ఆగలేదు. తనను తాను తడుముకుంటూ, తాను కూర్చున్న కుర్చీని తాకుతూ, చుట్టూ తదేకంగా అందరినీ చూస్తూ వెక్కివెక్కి ఏడ్చేశాడు.

కాసేపటికి పెద్ద శబ్దంతో విమానం బయలుదేరింది రన్‌వే పై ఒకప్పుడు ఆ కుర్రాడు పరిగెత్తినట్లుగా ఇప్పుడు అతనిని తీసుకుని పరుగులు తీస్తోంది. కిటికీలోంచి విమానం రెక్కలు చూస్తున్న ఆ కుర్రాడికి ఆకాశంలోకి వెళ్లిన తరువాత ఆ రెక్కల కింద తాను ఇన్నాళ్లూ నివసించిన మహానగరం చిన్నదిగా కనిపించింది..

అచ్చం తన సంకల్పం ముందు తలవంచిన పేదరికంలా…. తాను పుట్టి పెరిగిన కుగ్రామంలా…. వేల మైళ్ళ ఎత్తులో ఎగిరే విమానాన్ని ఎప్పుడో ఒకసారి చూడడమే గగనం అనుకునే పరిస్థితి నుంచి గగన వీధిలో అదే విమానంలో విహరించే స్థాయికి చేరుకున్న ఆ యువకుడు ఇప్పుడు విధి నిర్వహణలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నాడు. ఆర్టీసీ బస్సు కూడా లేని కుగ్రామం నుంచి వచ్చి ఎయిర్ బస్ లో తిరుగుతున్నాడు.

ఈ విజయం కోసం అతను పడ్డ కష్టాలు.. ఎదుర్కొన్న ఇబ్బందులు మనలో చాలా మంది జీవితంలో నిత్యం ఎదురయ్యేవే…. కానీ అతను ఎదిరించాడు, పోరాడాడు, నిలబడ్డాడు, గెలిచాడు.

ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో కలలు కట్టుకుంటాడు. కానీ, అతి కొద్ది మంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకోవడానికి ప్రతిక్షణం పరిశ్రమిస్తూ ఉంటారు అలాంటి ఓ యువకుడి కథే ఇది. ఆ యువకుడు మరెవరో కాదు ఎంతోమంది దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల యువతీ యువకుల ప్రతిబింబం..

పరిస్థితులకు తలవంచి ఎంతోమంది ఈ సమాజంలో పెడత్రోవపట్టి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువతీయువకులు మాత్రం నీతి నిజాయితీల వైపు నిలబడి స్వశక్తితో కష్టపడి విజయం వైపు అడుగులు వేస్తున్నారు. వారిని భావితరం ఆదర్శంగా తీసుకుంటే.. వారు కలలు కన్న స్వప్నాలను నిజం చేసుకోగలుగుతారు. విజయ తీరాలను చేరుకోగలుగుతారు. అంతేగానీ ఊరికే కలగంటే సరిపోదు.. కష్టపడాలి.. ఎదురు దెబ్బలను ఓర్చుకోవాలి.. కన్నీళ్లను వదిలి… కసితో, పట్టుదలతో పరిస్థితులను ఎదిరించాలి.. తప్పదు.. బతకాలంటే యుద్ధం చేయాల్సిందే… వేరే ఆప్షన్ లేదు.!

– ది పెన్ 

Related Posts