కలలసాగు

కలలసాగు

వర్ణ రాగరంజితమై
జీవితం వెలగాలనుకుంటాడతను
వేపుకుతిన్న క్షణాల సాక్షిగా
వేడుకను వెతుకుతుంటాడు

వలపుమాయ డబ్బు మాయ
అధికారహంకారం
నా అనుకున్నవాళ్ళందరి దగ్గర
చూసేశాడు
ఎదిగామనుకున్నారు
ఎగిరిపోయారంటాడు

అందరికీ దూరంగా
నదీగమనాన్ని చూస్తూనో
ఏటిపాట వింటూనో
తనలోకి తాను ప్రయాణిద్దామనుకుంటాడు

పాడు జీవితం
పట్టి ఆపేస్తుందంటాడు
కాడెద్దులా బాధ్యతల బండిని లాగేవాడికి
శాంతెక్కడ.. విశ్రాంతెక్కడ అంటాడు

అందుకే ఆకాశం కప్పుకింద
సంతోషాల మగ్గం నేస్తుంటాడు
మగ్గుతున్న నిరాశను విడుదల చేస్తుంటాడు
జారే వాన నీటిబొట్టులో కలలసాగు చేస్తుంటాడు

– సి. యస్. రాంబాబు

Related Posts