కళ్ళగంతల జీవితం!!

కళ్ళగంతల జీవితం!!

రావు గారు ప్రముఖ వ్యక్తి. సంఘంలో గొప్ప పేరుంది. మృదుభాషి. ఆయన కాళ్ళు బయట పెడితే చాలు, నవాబు నుంచి గరీబు వరకు గౌరవంతో నమస్కరిస్తారు.

ఆయన ప్రసంగాలను ప్రవచనాలు గా భక్తితో వింటారు, జనాలు. ఎన్నికలు వస్తే చాలు పార్టీలు ఈయన ఇంటి చుట్టు తిరుగుతాయి. కారణం ఆయన ఓ రెండు మాటలు మైకు పట్టుకుని చెబితే ఓట్లు రాలుతాయి అని.

ఆ రోజు సాయంత్రం 6:30 కావస్తోంది. ఒక్కడే గుడిలో నేలపై కూర్చుని ఉన్నాడు. తనలో తాను ఏదో మదనపడుతూ ఉన్నాడు. ఏదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అపరాధి లా ఉంది ఆయన ముఖం.

“దేవుడా ఈ పాపిని క్షమించు. నా విజ్ఞత నన్ను కళ్ళు ఉన్నా గుడ్డివాడిని చేసింది. నాది విలాసవంతమైన జీవితం. పెద్ద ఇల్లు, కారు, పేరు, బ్యాంకులో మూలుగుతున్న కోట్ల డబ్బులు.

అవన్నీ ఈరోజు నిష్ప్రయోజనంగా గోచరిస్తున్నాయి. ఈ పాపికి ఏదైనా తగిన శిక్ష ఉంటే విధించు భగవంతుడా ఆనందంగా స్వీకరిస్తాను” అని దేవుడితో తన బాధని చెప్పుకుంటున్నాడు.

ఇంతలో ఆలయ ప్రధాన పూజారి, “నమస్కారం అండి, రావు గారు. మిమ్ములను చాలా సేపటినుంచి గమనిస్తున్నాను. ఏదో విచారంగా కనిపిస్తున్నారు.

భగవత్ సన్నిధి లో కూడా పరిష్కారము లేని సమస్య అంటూ ఏదైనా ఉంటుందా……? నాతో చెప్పుకోండి సాధ్యమైన మేరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను”, అన్నాడు ఆలయ పూజారి.

*********

గోపాల్ గారి వయస్సు 70 సంవత్సరాలు ఉంటాయి.. రావు గారి ఇంటి ఎదురుగా ఓ చిన్న గదిలో జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. ఆయనకి ఒక కుమారుడు. ఇద్దరూ చక్కటి స్నేహితుల్లా కలిసి ఉంటారు.

ఇంటి వాతావరణాన్ని బట్టి వారు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉంటారని ఇట్టే తెలుస్తుంది. ఉదయం వేళల్లో మరియు సాయంత్రం వేళల్లో రోడ్లన్నీ చుట్టి రావడం గోపాల్ గారి అలవాటు.

“నమస్కారం, దేవరాజు గారు” ఆప్యాయంగా చేయి ఊపుతూ పలకరించాడు గోపాల్. కానీ దేవరాజ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మనసులో బాధ పడ్డాడు గోపాల్.

“నమస్తే అమ్మ. ఎలా ఉన్నావు. కూరల బండి బాగా నడుస్తుందా? ” బుచ్చమ్మని అడిగాడు.

“ఆ గట్లనే సారు ఏదో బతుకు ఎల్లదీయనికి సరిపోతుంది” చెప్పింది బుచ్చమ్మ.

కాస్త గోపాల్ గారి మనసు కుదుట పడింది. బుచ్చమ్మ సమాధానం ఆయనకి తృప్తిని ఇచ్చింది .

“నమస్తే రామ్ ప్రసాద్ గారు” అన్నాడు గోపాల్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి.

ఆయన స్పందించకపోగా, మొహాన్ని వెనక్కి తిప్పుకున్నాడు. ఓ నిమిషం క్రితం కుదుటపడిన గోపాల్ గారి మనసు మళ్ళీ బాధకి గురి అయింది “పోనీలే” అనుకున్నాడు మనసులో.

“దండాలయ్య నీ బాంచన్. ఎట్లున్నారు సారు? నిన్న మీరు నాకు చాయ్ తాగించారు. ధర్మాత్ములు సార్ మీరు”, అన్నాడు ఆ భిక్షువు.

“దాందేముందిలే అయ్యా. ఏదో నా ఆనందం. చేశాను అంతే”, అన్నాడు గోపాల్.

” సల్లగా ఉండాలి సార్, మీరు. ” అంటూ బిక్షువు ముందుకు వెళ్ళిపోయాడు.

డబ్బు గర్వంతో విర్రవీగుతూ ఉన్న వారెవరూ పాపం గోపాల్ గారిని పలకరించేవారు కాదు. కనీసం ప్రతి నమస్కారం చేయడానికి చేతులు లేపడానికి కూడా బద్దకించే వారు.

**********

“నేను దుర్మార్గున్ని పాపాత్ముని” అన్నారు రావు గారు పూజారితో.

“చెప్పండి రావు గారు అసలు ఏం జరిగింది? ” అడిగాడు పూజారి.

“మా ఇంటి ఎదురుగా గోపాల్ అనే ఓ పెద్దాయన ఉంటాడు. ఆయన నేను బాల్కనీలో నిలుచున్నప్పుడు అల్లా నన్ను చూసి పలకరింపుగా నవ్వే వాడు.

నేను రోజు మొత్తంలో ఎన్ని సార్లు ఎదురుపడిన నమస్కారం చేసేవాడు. దేవుడా…..! ఈ పాపిష్టి చేతులను తీసుకో నాయనా…..!”

“ఇంతకీ ఏమయింది గురువుగారు. అంతగా బాధ పడకండి. అసలు విషయం చెప్పండి.” అన్నాడు పూజారి.

“గోపాల్ గారు తన ఆర్థిక పరిస్థితి కి నన్ను ఏమన్నా సహాయం అడుగుతారేమో అని నేను ఏనాడు ఆయనకి స్పందించలేదు”

“మరి ఏ రోజైనా మిమ్ములను అడిగాడా ఆర్థిక సహాయం ఆ గోపాల్ గారు? ” అడిగాడు ఆలయ పూజారి.

“బ్యాంకులో కోట్లు మూలుగుతున్నాయి. ఒకవేళ ఆయన అడిగినా ఇచ్చే స్తోమత నాకుంది. కానీ ఏం లాభం చెప్పండి? నా కక్కుర్తి, నా కాపీనం, నా రాక్షసత్వం నేను ఆయన్ని అపార్థం చేసుకోవడానికి కారణమయ్యాయి.

గోపాల్ గారు మహోన్నతుడు ఆయన ఎప్పుడూ తన చిరునవ్వులు నమస్కారాలు నాకు ఇచ్చాడు కానీ నా నుంచి ఏమీ ఆశించలేదు. నేనే ఆయనకి వాటిని రుణపడి ఉన్నాను. నేను దుర్మార్గుడిని” అన్నారు రావు గారు.

“ఇంతకీ ఏం జరిగింది? ” అడిగాడు పూజారి.

“గోపాల్ గారి అబ్బాయి, నిన్న నాకు షాప్ లో కనిపించాడు. దేవుడు నాకు కనువిప్పు కలిగించడానికే నేమో ఈ సందర్భాన్ని సృష్టించాడు.”

“చెప్పండి” అన్నాడు పూజారి.

” బాబు, మొన్న మీ నాన్న ని రోడ్డు మీద చూశాను. ఆయన నవ్వుతూ నన్ను పలకరించారు. కానీ నేను ఎవరో రాజకీయవేత్త తో మాట్లాడుతూ చూసి చూడనట్టుగా ఉండిపోయాను. ఎలా ఉన్నారు ఆయన? “

“ఆయన లేరు, అంకుల్, నెల రోజుల క్రితమే కాలం చేశారు. ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన కోరిక ప్రకారం స్వగ్రామం తీసుకెళ్ళాను. అక్కడే పోయారు. చెప్పాడు అబ్బాయి.

“మరి గోపాల్ గారు నెల రోజుల క్రితమే చనిపోతే మీరు ఆయన్ని రోడ్డు మీద ఎలా చూశారు?” అని అడిగాడు ఆ పూజారి.

“నేను ఆయనని చూడలేదు. ఏదో పలకరింపుగా, ఆ బాబు తో అలా అన్నాను. అందుకే నేను పాపిని. దేవుడు నాకు తగిన శిక్ష వేయాలి.

నేను రుణ విముక్తుణ్ని కావాలి. ప్రతిరోజు గోపాల్ గారికి వేయి చిరునవ్వులు మరియు వేయి నమస్కారాలు ఇచ్చి రుణము తీర్చు కోవాలి. “

“సరేలే అండి, రావు గారు. అయిందేదో అయిపోయింది. కాస్త కుదుట పడండి. ” అన్నాడు పూజారి.

“నా వల్ల ఆయన అజ్ఞాతవాసి అయ్యారు. నా కళ్ళముందు తిరుగుతున్న కూడా నేను ఆయన్ని అజ్ఞాతంలోకి నెట్టి వేశాను. గోపాల్ గారు గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన నిజంగానే శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.” అని గొల్లుమని ఏడ్చేశారు రావు గారు.

– వాసు

Related Posts