కల్తీ 

కల్తీ 

 

నాయన లేవ్వలే అంటూ వచ్చాడు నారాయణ. లే ఇంకా పొద్దు బోయినా పండుడు ఎందో! లేపుదామనుకుంటే మల్ల నువ్వు ఎడ తిడతావో అని నేను లేపలే అన్నది లలిత. అవునా గట్ల ఎందుకు అంటనే లేపు నీ శాష్టలు కని అంటూ నాయిన ఓ నాయిన లేవ్వే అంటూ తండ్రి నర్సింలు దగ్గరికి వచ్చాడు నారాయణ. తండ్రి కప్పుకున్న చద్దర్ తీసేస్తూ నాయన, ఓ నాయిన, ఏమైందే అన్నాడు దగ్గర కూర్చుని, హు అని మూలుగుతూ ఉన్న నర్సింలు, ఏమో బిడ్డా ఒళ్లంతా నొప్పులు ఉన్నయి, గొంతు కూడా బిందెలు వడట్టు అయ్యింది. పెయ్యి అంతా సువ సువా అంటుంది బిడ్డ వశం అయితలేదు అన్నాడు మెల్లిగా నర్సింలు.

అగో నాయిన గట్ల అనవడతివి ఏమే అగు డాక్టర్ ను పిలిపిస్తా అంటూ ఫోన్ తీసి 108 కు డయల్ చేశాడు నారాయణ. గంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. అందులోంచి, దిగిన నర్సు, నర్సింలు కు టెస్ట్ చేసింది వివరాలు అన్ని అడిగింది. ఈలోపు లలిత తన మామ బట్టలు అన్నీ ఒక బ్యాగ్ లో సర్దింది, నర్సు వివరాలు అడుగుతూ ఉండగానే, నర్సింలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అందువల్ల నారాయణ చాలా భయపడుతూ, నాయన నువ్వేం ఫికర్ చేయకు, నీకేం కాదు. లలిత నాయనకు కొంచం చాయి చెయ్యి, అల్లం బాగా ఎసి అన్నాడు. లలిత చాయి చేసి తీసుకుని వచ్చింది. నారాయణ తీసుకుని తండ్రికి కొంచం దూరంలో పెట్టాడు నోటికి మాస్క్ పెట్టుకుని, నర్స్ అతన్ని టెస్ట్ చేయడం అయిపోవడంతో సార్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలి అంది. నర్సింలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గమనించి.

సరే అమ్మా తోలుక పోండ్రి నాయన పోతావా దవాఖానకు అన్నాడు తండ్రితో. పోతా బిడ్డా ఈడ మీకు కష్టం అయితుంది కదా పోత అన్నాడు. బాయ్స్ వచ్చి నర్సింలు ను మెల్లిగా తీసుకుని వెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. తండ్రి ఎక్కిన తర్వాత నారాయణ ఆ బాయ్స్ ని పిలిచి బాబు, మా నాన్న జాగ్రత్త ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అని చెరో అయిదు వందల ఇచ్చాడు. సిస్టర్ కి ఇవ్వకముందే వ్యాన్ కదిలింది. ఆ తర్వాత లలిత, పిల్లలకు జాగ్రత్త అని చెప్పి తాను బైక్ పై వెళ్ళాడు నారాయణ.

అక్కడ హాస్పిటల్ లోకి వెళ్ళగానే నర్సింలు ను ఒక పక్కగా నిలబడమని చెప్పారు. కానీ, అతనికి శక్తి లేక అక్కడే కిందనే కూలబడ్డాడు. బైక్ పై వచ్చిన నారాయణ అది చూసి ఎందయ్య ఇది మనిషికి ఛాత కాకపోతే కింద కులబడుతున్నా పట్టించుకోరు. అంటూ అరిచే సరికి అక్కడున్న నర్స్ లు, బాయ్స్ వచ్చి చూస్తూ ఏందయ్యా ఆయనకు కరోనా వచ్చింది. ఇక్కడ బెడ్స్ ఖాళీగా లేవు. ఇంటికి తోలుకపో అన్నారు గట్టిగా . . . ఏందీ బెడ్స్ ఖాళీగా లేవా? ఇంటికి తొల్క పోవాల్నా? అదేం కాదు కానీ, ముందు మీ డాక్టర్ ను పిలువు అన్నాడు జబర్దస్తీగా, ఇంతలో లోపలి నుండి పి.పి కిట్ వేసుకున్న డాక్టర్ వచ్చి ఏంటి ఏమైంది అని అడిగాడు. నర్స్ జరిగింది అంతా చెప్పింది.

దాంతో డాక్టర్ వచ్చి రిపోర్ట్ ఏది అంటూ అడిగాడు. రిపోర్ట్ రాలేదు ఇంకా అంది నర్స్. రిపోర్ట్ రాకముందే  అతనికి కరోనా అని చెప్తారమ్మా అంటూ నారాయణ దగ్గరికి వచ్చి, చూడండి మీ పేరేంటి అని అడిగాడు. నా పేరు నారాయణ. ఈయన నర్సింలు మా నాయన అనగానే నర్సింలు దగ్గరికి వచ్చి చూస్తూ, మీకు కరోనా రాలేదు పెద్దయ్య ఉత్త జ్వరము వచ్చినట్టు ఉంది అన్నాడు డాక్టర్ నవ్వుతూ, దానికి సంతోషంగా నారాయణ అవునా సార్ కరోనా కాదా అనగానే అవునయ్య కాదు రిపోర్ట్ రాకముందే ఎలా చెప్తాం. అయినా సూచనలు, లక్షణాలు అలా లేవులే అంటూ ధైర్యం చెప్తూ ఉండగా, బాయ్ రిపోర్ట్ సార్ అంటూ తెచ్చి ఇచ్చాడు.

అది చూసిన డాక్టర్ నేను చెప్పలేదా కరోనా కాదు ఉత్త జ్వరము అవును వచ్చిన వారు ఎలాగూ వచ్చారు కదా, వ్యాక్సిన్ వేసుకోండి ధర తక్కువే, పన్నెండు వందలు అంతే. ఏమయ్యా మీ నాయన గట్టిగా ఉన్నాడు. ఏం కాదు నేను చెప్పినట్టు వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రమ్మన్నా రాదు అన్నాడు డాక్టర్. అవునా సార్ అయితే, మీ దగ్గర వ్యాక్సిన్ ఉందా? అన్నాడు నారాయణ అవునయ్యా ఉంది వేయమంటారా? అన్నాడు డాక్టర్. హా డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే వ్యాక్సిన్ వేయిస్తే మా నాయన మంచిగా ఉంటాడు వేయండి సార్. పన్నెండు వందలే కదా వేయండి అన్నాడు నారాయణ సంతోషంగా…

ఎవరికీ దొరకని వ్యాక్సిన్ తమకు దొరకడంలో సంతోష పడుతున్నాడు నారాయణ. తను ఎంత ప్రయత్నించినా దొరకలేదు  వ్యాక్సిన్. లేదంటే ఇప్పటికే తన ఇంట్లో అందరికీ వేయించే వాడు. కానీ, దొరకలేదు. దాంతో, డాక్టర్ అనగానే హ్యాపీ ఫీల్ అయ్యాడు. సిస్టర్ లోపలకు అతన్ని తీసుకురండి అంటూ డాక్టర్ ముందుకు కదిలాడు. నర్సింలు ను తీసుకుని నర్స్ ముందు నడుస్తూ ఉండగా వెనకాల నారాయణ వెళ్ళాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది ఎవరని చూసాడు జేబులోంచి తీసి లలిత గబారాగ చేసింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి లలిత గంటలో, నాయన ను తీసుకుని వస్తాను. నాయనకి కరోనా కాదంట ఉత్త జ్వరం అంట అని సంతోషంగా చెప్పాడు. అవునా అయ్యా మంచి మాట చెప్పినవు. రండ్రి అంటూ ఫోన్ కట్ చసింది లలిత.

కల్తీ

                                                                     కల్తీ

ఫోన్ మాట్లాడి లోనికి వెళ్ళిన నారాయణ, డాక్టర్ బాటిల్ లోని మందును సిరంజిలోకి ఎక్కించడం చూసి డాక్టర్ ఎం చేస్తున్నావు? ఏం ఇంజక్షన్ ఇస్తున్నావు ? వద్దు వద్దు అంటూ గబగబా వచ్చి డాక్టర్ చేతిలోని బాటిల్ నీ గుంజుకున్నాడు నారాయణ. ఏమయ్యా పిచ్చోనివా? వ్యాక్సిన్ ఇస్తుంటే గుంజుకుంటున్నావు అంటూ కోపంగా అన్నాడు డాక్టర్. ఏంది? నువ్వు మాట్లాడేది డాక్టర్ ఇది వ్యాక్సిన్ కాదు ఇది రెబిస్ వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్. ఇదెందుకు ఇస్తున్నావు? నువ్వు అసలు డాక్టర్ వెనా? అన్నాడు కోపంగా నారాయణ.

ఏమయ్యా మీ నాయనకు వ్యాక్సిన్ ఇవ్వడం నీకు ఇష్టం లేదా ఏంది? నువ్వేమైనా డాక్టర్ వా? వ్యాక్సిన్ కాదని చెప్తున్నావు అంటూ గట్టిగా అరిచాడు డాక్టర్, ఈ అరుపులకు బయట ఉన్న జనాలు, పేషంట్ల బంధువులు వచ్చారు గది దగ్గరికి. అవునయ్యా నేను డాక్టర్ కన్నా ఎక్కువే కానీ, అది వ్యాక్సిన్  అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అసలు డాక్టర్ చదివావా? ఏది నీ లైసెన్స్ చూపించు అన్నాడు నారాయణ. ఇంతలో, పక్కనున్న జనాలలో నుంచి ఆయన ఇన్నేళ్ల నుండి ఉన్నాడు. అతను డాక్టర్ కాదని అంటున్నావు. నీకేమి తెలుసు? మంచిగా చూస్తాడు మా వాళ్లకు ఎన్నో జబ్బులు నయం చేశాడు అన్నాడు ఒక వ్యక్తి.

అది విన్న నారాయణ, మీ వాళ్లకు ఆయిషు ఉండి బతికారు. కానీ, వీడు అసలు డాక్టర్ కాదు. చూడండి ఎలా గుటకలు మింగితున్నాడో అన్నాడు నారాయణ. అయ్యో డాక్టర్ సాబ్ ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ సర్టిఫికేట్ చూపించండి అన్నాడు ఇంకో వ్యక్తి. ఆ అతను అనగానే నేనెందుకు చూపిస్తా? నేను చూపించ నా మీద నమ్మకం లేకపోతే ఇంకో దగ్గరికి పొండి అన్నాడు డాక్టర్ గొంతు లో భయం కదులుతూ ఉండగా..

ఇంతలో వేరే కొందరు చూపించండి సార్ మీకు ఐడీ కార్డు ఉంటుంది కదా అన్నారు. ఇదేదో తేడాగా ఉందని అనుకున్న డాక్టర్ ఆ చూపిస్తా ఇప్పుడే తెస్తాను . అంటూ ఇంకో గదిలోకి వెళ్లి అట్నుంచి అటే తన కారు లో వెళ్ళడం గమనించిన ఇంకో వ్యక్తి, ఆ డాక్టర్ ఎటో పోతున్నాడు అనగానే, అందరూ కారుకు అడ్డుగా వెళ్లారు. నారాయణ వచ్చి చూశారా అడగగానే ఎలా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడో చూడండి. వీడు అసలు డాక్టర్ కాదు. ఇదిగో చూడండి, వీడి పేరు అసలు మెడికల్ కౌన్సిల్ లోనే లేదు అంటూ తన ఫోన్ లో వచ్చిన ఒక లిస్ట్ చూపించాడు. అవునని అక్కడ చదువుకున్న యువకులు చూసి చెప్పారు. ఇంతలో కారు లో నుండి డాక్టర్ ని బయటకు లాగాను కొందరు.

నారాయణ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అతన్ని చూస్తూ డాక్టర్ అంటే కనిపించే దేవుడు అని నమ్ముతారు, మా ప్రాణాలు మీ చేతిలో పెట్టి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకుంటాం. అలాంటిది, నువ్వు బ్రతికి ఉన్న వాళ్లను చంపుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. జనాలు మీరు దేవుళ్ళు అని నమ్మితే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. మీరసలు మనుషులేనా? డబ్బు వస్తుంది, పోతుంది. కానీ, ప్రాణాలు పోతే రావు కదా ఛీ ఇంతగా దిగజారి పోతారా అన్నాడు నారాయణ ఆవేదనగా ..

అన్నా వీడిని ఏం చేద్దాం అన్నాడు పక్కనున్న వ్యక్తి, మనమేం చేయాల్సిన పని లేదు, పోలీసులకు ఫోన్ చేశాను వస్తున్నారు అన్నాడు నారాయణ. అవునన్నా, నీకెలా తెలుసు అది రేబిస్ వ్యాక్సిన్ అని నువ్వు ఇప్పుడు చెప్పకపోతే, చూడకపోతే, మీ నాయన ఏమై పోయేటోడో అన్నాడు ఆవ్యక్తి.

అవును తెలియని వాళ్ళు అదే వ్యాక్సిన్ అని తీసుకుని వెళ్లి చనిపోవడం జరిగితే, అది కరోనా అని అనుకునేవారు. వ్యాక్సిన్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు అనేది తెలిసేది కాదు. కానీ, ఈరోజు నేను మా నాయనను కాపాడుకున్న మరి చదువు రాని పేదల పరిస్థితి ఏమిటో తమ్మీ, జనాలు అన్ని తెలుసుకోవాలి అందరూ అడగాలి. ఏం ఇస్తున్నావు? చేస్తున్నావు అని కానీ, చదువురాని వాళ్ళు ఏం అడుగుతారు. మనమే ఒక్కోసారి అడగం. ఇంకా వాళ్ళు ఏం అడుగుతారు పాపం జనాలను బ్రతకనివ్వకుండా ఇలాంటి కల్తీ నాయాళ్ళు చంపుతున్నారు. డబ్బు కోసం కల్తీ ఇంజక్షన్ లు ఇస్తూ మోసం చేస్తున్నారు.

తినే తిండి కల్తీ, మందులు కల్తీ, పండ్లు కల్తీ, కూరగాయలు కల్తీ, బలం కోసం వాడే హార్లిక్స్, బూస్ట్ లు కల్తీ, నూనెలు కల్తీ, నెయ్యి కల్తీ, కారం పొడి కల్తీ, బియ్యం కల్తీ, ఇన్ని కల్తిల నుండి మమల్ని కాపాడే వాడు దేవుడు అని డాక్టర్ దగ్గరికి వస్తె, ఈ డాక్టర్ కూడా కల్తీ. అతని ఇచ్చే మందులు, సూదులు అన్ని కల్తీ. అసలు ఈ డాక్టర్ కూడా కల్తినే, తూ ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందొ ఏమో… అనుకుంటూ నారాయణ తన తండ్రిని తీసుకుని ముందుకు కదిలాడు ..

అన్నా, అన్నా నువ్వు ఎవరన్నా? నీకెలా తెలిసింది అన్నా? అన్నాడు ఇంతకు ముందు అడిగిన యువకుడు. నారాయణ నవ్వుతూ తన జేబు లోని కార్డు తీసి ఆ వ్యక్తికి చూపించాడు. అతను ఆ కార్డ్ పైన ఉన్న పేరు చూసి అవాక్కయ్యాడు. దాని పైన ఏం. నారాయణ. డ్రగ్ ఇనస్పెక్టర్ అని రాసి ఉంది. నారాయణ తన తండ్రిని తీసుకుని బైక్ పై ముందుకు వెళ్తూ ఉండగా, పోలీస్ జీప్ ఆసుపత్రిలోకి ఎంటర్ అయ్యింది.

డాక్టర్ అంటే కనిపించే దేవుడు కానీ, అలాంటి వాళ్ళు ప్రస్తుతం ఎక్కడో ఒక చోట ఉంటారు. రూపాయికి అసలు ఏం ఆశించకుండా  వైద్యం చేసే వాళ్ళు నూటికో, కోటికో ఒకరు ఉంటారు. ఇలాంటి కల్తీ కేటుగాళ్ళు గల్లీ, గల్లీ కి ఇద్దరు ఉంటారు. కాబట్టి జనాలే  జాగ్రత్త పడాలి. (ఇది కల్పిత కథ మాత్రమే ఎవర్నీ ఉద్దేశించి కాదు.)

– వెంకట కస్తూరి

 

Related Posts