కనికరం లేని ప్రేమలు….

కనికరం లేని ప్రేమలు….

గోడకు సాగిలబడి ఆలోచిస్తుంది….చేసింది తప్పని తెలిసే సమయానికి జీవితం… దారం తెగిన గాలిపటం అయ్యింది….

★★★★★★★★★★

నా పేరు అమల… చదివింది బి.ఎడ్…. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు… ఇదే మా కుటుంబం. నాన్న బతుకుతెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు….. అలా సంపాదిస్తూనే అక్క పెళ్లి చేశారు. తరవాత నా పెళ్లి గురించి ఆలోచన చేస్తుంటే…. చదువుకుని చేసుకుంటానని చెప్పాను.

అది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు … నాకు ఇద్దరు స్నేహితులు పూజ, జ్యోత్స్న ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకున్నా… కలిసిపోతూ మా ఊరి నుండి పక్క ఊరి కాలేజి లో చదుకునేవాళ్ళం… ఆనందంగా సాగిపోయే నా జీవితంలో అనుకోని కుదుపు…. ప్రేమ.

అతనిది మా ఊరే… ఒకే గల్లిలో ఉంటాము. ఎదురుపడితే నవ్వేవాడు, అప్పుడప్పుడు మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. చూసే చూపులు, అతను నా దృష్టిలో పడాలని చేసే పనులకు ఎందుకో ఆకర్షితురాలయ్యాను. కానీ, లోలోపల భయంగానే ఉండేది… ఎందుకంటే అతను అన్య మతస్తుడు. అందుకనే చూసి చూడనట్టుగా వదిలేసేదానిని….

అతడి గురించి ఆలోచిస్తే ఇంట్లో ఇద్దరు అక్కల తరవాత ఇతడు…. అమ్మ గృహిణి, నాన్న చిన్నప్పుడే పోయారు. ఇద్దరి అక్కల పెళ్ళి బాధ్యతలు తీర్చుకున్నారు. పెద్దగా చదుకోకున్నా… చిన్న చితక పనులు చేస్తూ సంపాదించేవాడు…

అలా చూస్తుండగానే డిగ్రీ అయిపోయింది. కానీ, నాకు నచ్చని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యా… సప్లై రాసినా పాస్ అవ్వలేదు దాంతో ఒక సంవత్సరం వెనకబడిపోయా… పూజ, జ్యోత్స్న బి.ఎడ్ ఎంట్రన్స్ రాసి వేరు వేరు కాలేజీల్లో సీట్ రావడంతో చేరిపోయారు.

అలా ముగ్గురం మూడు దారుల్లో విడిపడ్డాము. ఖాళీగా ఒక సంవత్సరం ఇంట్లో ఉండిపోయానని బాధ వేసేది. అందుకనే కుట్టుపని నేర్చుకున్నాను, అవసరానికి పనికివస్తుందని…

ఎక్కువగా ఇంట్లోనే ఉండటంతో…. అతను నన్ను ఇంప్రెస్స్ చేయడానికి చూసేవాడు… ఒక రోజు అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ చేసాడు. రెండు రోజుల వరకు ఏ రిప్లయ్ ఇవ్వలేదు కానీ నా మనసులో ఇవ్వమనే ఆరాటం మొదలయ్యింది.

మంచి చెడు చెప్పే స్నేహితురాళ్లు దూరంగా ఉండటంతో చేసేది తప్పని తెలిసినా అతనితో మాట్లాడటం మొదలెట్టాను.. అది ఎంత వరకు వచ్చింది అంటే, అతనితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంత….

అలా సాగుతుండగానే…. పూజ, జ్యోత్స్న తిట్లతో సప్లై బాగా రాసి బీఎడ్ ఎంట్రన్స్ రాసాను. కష్టపడి చదవడంతో కాలేజ్ సీట్ దగ్గర గానే వచ్చింది. అతనితో మాటలు, ఇటు చదువు నడుస్తున్నాయి….

అతను అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందాం అని ఒత్తిడి చేసేవాడు అయిన ఒప్పుకోలేదు. సంపాదన లేకుండా ఎలా గడుస్తుంది? అందుకే ముందు పని చేసుకోమనేదాన్ని… బీఎడ్ అయిపోయాక… చిన్నగా ఒక స్కూల్ లో చెప్పడం మొదలు పెట్టాను…

అప్పుడప్పుడు మదన పడేదాన్ని… ఒక కులం ఒకే కులం అవ్వని ప్రేమలనే ఒప్పుకొని వారు, వేరే మతమంటే ఒప్పుకుంటారా…? భయమేసేది… అంతలోనే గల్ఫ్ లో ఉన్న నాన్న కు ఆరోగ్యం బాగుండడం లేదని.. ఆందోళన మొదలయ్యింది. ఎలాగోలా వచ్చేయమని ఇంట్లో పోరు పెట్టేసాము…

వచ్చేస్తానని మాటిచ్చిన వారానికే కన్నుమూశారు. కానీ, అయిన వారు మాకు తెలియనివ్వలేదు… అలా ఆయనని తీసుకురావడాని నెల రోజులు పట్టింది… తీసుకువచ్చే 3 రోజుల ముందు మాకు తెలిసింది… ఎంత ఏడ్చినా తిరిగి రాని నాన్నను, ఐస్ బాక్స్ లో చూడలేకపోయాను. తదుపరి కార్యక్రమాలన్నీ గడిచాక… అతను నన్ను బలవంతం చేయడం మొదలు పెట్టాడు…

ఇంట్లో అతని అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుండంతో, నన్ను గుడిలో పెళ్లి చేసుకుంటానని వచ్చేయమన్నాడు. నేనెప్పుకోలేదు ఎందుకంటే అప్పటికే నాన్న చనిపోయి నెల రోజులు కూడా అవ్వలేదు… ఇప్పుడు ఇలాంటి పని చేస్తే బాగుండదు అని ఎంత నచ్చ చెప్పిన వినలేదు. చివరికి చచ్చిపోతాను అని బెదిరించి నన్ను తీసుకువెళ్లి పెళ్లిచేసుకున్నాడు….

నెల రోజుల వరకు ఊరికి రాలేదు… వేరే ఊరిలో అద్దెకు ఉండి, తరవాత తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు… అయిష్టంగానే లోనికి రానిచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు చీదరించుకున్నారు..

అమ్మ మెడలో తాళి తెగిపోయిన బాధ లేదు గాని దీనికి పెళ్లి కావాల్సి వచ్చింది…. నాన్న చనిపోయాడు అని కూడా ఆలోచన లేకుండా పెళ్లి పీటలెక్కింది చూడండి అని చెవులు కోరుకుంటూ సూటిపోటి మాటలు అనేవారు… ఒకానొక సమయంలో వారు అన్నది కూడా నిజమే అనిపించేది…

నేను పెళ్లి చేసుకుని పోయాక, నలుగురిలో తలెత్తలేక, అమ్మ తమ్ముడు వేరే దగ్గరకు అద్దె ఇంట్లోకి మారిపోయారు…. 

అత్తింట్లో మొదట్లో ఎం అనక పోయినా… కట్నం రాలేదని, వారి మతం కాదని సూటిపోటి మాటలు అనేవారు… పట్టించుకోలేదు… గాని ఒకరోజు రాత్రి అతను తాగొచ్చి గొడ్డును బాధినట్లు బాదేశాడు….

మా అత్తమ్మ ఏదో కల్పించి చెప్తూ ఉండేది… కొన్ని రోజులు భరించిన కూడా నా వల్ల కాకా వెళ్లిపోతానని గొడవ చేసాను. ఏమనుకున్నాడో… నన్ను పట్టుకొని ఏడ్చాడు… ఇంకోసారి చేయను అన్నాడు. అవి ఒట్టి మాటలే అని కొన్ని రోజులకు తెలిసింది.

తాగొచ్చిన ప్రతిసారి, ఇదే తంతు అలవాటు పడిపోయాను… అతనున్నప్పుడు ఎం అనుకున్న అతను లేని సమయంలో ఏదో ఒక విధంగా అక్కసు వెళ్లగక్కేది…. ఇవి చాలదన్నట్లు తన చిన్న అక్క వాళ్ళ అత్తింట్లో గొడవపడి ఇక్కడకు వచ్చేసింది…. ఇక అత్త ఆడపడుచు కలిసి నరకం చూయించడం మొదలు పెట్టారు…

పెళ్లై ఇన్ని నెలలు అయిన పిల్లలు అవ్వడం లేదని అతనికి ఇంకో పెళ్లి చేసేద్దాం అని నా ముందే మాట్లాడుకునేవాళ్ళు… వారి మతంలో బహుభార్యత్వం తప్పు కాకపోవడం తో… ఈయన ఎక్కడ వారి మాట వింటాడో అనే ఆలోచనలతో వారు ఏమన్నా పడేదాన్ని.

అలా గడిచిపోతుండగానే… నెల తప్పాను అనే విషయం తెలిసి చాలా సంతోషంగా అనిపించింది… ఆయన కూడా కాస్త మారినట్లు కనపడ్డాడు… ఒట్టి మనిషిని కాదు అని కాబోలు….

అత్త ఆడబిడ్డే సనుగుళ్ళు ఆపలేదు. ఆయన ఫ్రెండ్ పెళ్లికని వేరే ఊరు వెళ్ళాడు నిన్న…. రెండు రోజుల వరకు రానని, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు. కానీ, కానీ, ఇప్పుడున్న స్థితిని చూస్తుంటే నా మీద నాకే జాలి వేస్తుంది.

ఆయన వెళ్ళాక, ఇంట్లో సామన్లు ముట్టనివ్వడం లేదు, వారిది వారికి వండుకొని తింటున్నారు తప్ప ఏడు నెలల గర్భవతిని అన్నది చూడకుండా, బియ్యం పప్పులు కూడా ఇవ్వడం లేదు…

ఎందుకు ఎందుకు తప్పు చేశాను? నలుగురిలో పుట్టింటి వారిని తల ఎత్తుకోకుండా చేసి, ఇలాంటి నరకంలోకి వచ్చాను వెక్కి వెక్కి ఏడుస్తున్న ఓదార్చేవారు లేరు… అక్క గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ చేసిన హడావిడి గుర్తొస్తుంది… అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది… కోరికలు నావి కాదు నాలో ఉన్న పసి ప్రాణానివి…

లోపల ఆకలి దహించివేస్తున్నా… కనికరించడం లేదు వీళ్ళు. అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నాక, మిగిలినది ఒక్క మెతుకు వదలకుండా తినేసాను… కన్నీళ్లు ధారపాతంగా కారిపోతున్న అలాగే గోడకు చేరబడ్డాను….

సశేషం…. అవును ఈ కథకు అంతం లేదు… ఇదే మొదలు కావచ్చు…. మరో ప్రాణానికి….

– కవనవల్లి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *