కన్నీటి రాఖి

కన్నీటి రాఖి

ప్రతి అన్న- చెల్లి, అక్క – తమ్ముడి మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. వీరికి ప్రతీకగా ఒక ప్రత్యేకమైన పండగ ఉంటుంది. అదే రాఖీ పండుగ (రక్షాబంధన్). రాఖీ పండుగ ఇంకా వారం రోజులు ఉంది. ఈ సారి మా అన్నయ్యకు, తమ్ముడికి మంచి రాఖీ తిస్కోవాలి. పదండి వెళ్దాం షాప్ కి అని తన భర్త తో చెబుతూ ఉంది సుప్రజ. అలాగే పద వెళ్దాం సుప్రజ అన్నాడు సంతోష్.

ఇద్దరు కలిసి షాప్ కి వెళ్ళారు. షాప్ లో ఉన్న రాఖీలను అన్నింటిని చుడాగానే ఎంతో మురిసిపోతూ ఉంది సుప్రజ. అన్ని రాఖీలను తిరగేసి రెండు రాఖీలు తీసుకుంది సుప్రజ. రాఖీలు తీసుకొని ఇంటికి వెళ్లారు సంతోష్, సుప్రజలు.

మరుసటి రోజు సుప్రజ తన అన్న రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. నీ ఎదురు చూపులు మీ అన్నయ్య కోసమా? అయినా రాఖీ వారం ఉంది కదా ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? అన్నాడు సంతోష్. అదేంటండీ… మీకు తెలిసి కూడా అలా అడుగుతున్నారు. ఒక రోజు బోనాలు, ఒక రోజు తమ్ముడి పుట్టినరోజు, ఆ తరువాత రాఖీ. అవన్నీ చూసుకొని వస్తా… ఓహో… అవన్నీ చూసుకొని వచ్చేస్తావన్నమాట. అదేంటండీ…. మీరు రారా?

ఇంతలోనే సుప్రజ అన్న సాగర్ వచ్చాడు. అదిగో… అన్నయ్య వచ్చాడు అంటూ సుప్రజ తన అన్న దగ్గరికి వెళ్ళింది. అన్నయ్యా… రా అన్నయ్య… అంటూ లోపలకు పిలిచింది సుప్రజ. సాగర్ లోపలకు వచ్చాడు.

సంతోష్: నమస్తే… బావ… ఎలా ఉన్నారు?

సాగర్: హా…. బాగున్నాను.

సంతోష్: నువ్వు ఎలా ఉన్నావు సాగర్…

సాగర్: హా… బాగున్నాను బావ….

ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తరువాత సాగర్, సంతోష్ భోజనం చేశారు. ఇంతలో సుప్రజ రెడీ అయింది.

సాగర్: నువ్వు కూడా వస్తే బాగుండేది బావా…

సంతోష్: పర్వాలేదు సాగర్, మీ చెల్లెల్ని ను తీసుకువెళ్ళు. నేను వస్తా కదా… అన్నాడు సంతోష్.

సాగర్: అలాగే బావ… నువ్వు తప్పకుండా రావాలి. నేను ఫోన్ చేస్తాను బావ… అన్నాడు.

సంతోష్: హా… అలాగే సాగర్… మీరు జాగ్రత్తగా వెల్లండి. 

సాగర్: సరే… బావ… అన్నాడు సాగర్.

సుప్రజ: నేను వెళ్ళొస్తా అండి. మీరు జాగ్రత్త…

సంతోష్: సరే సుప్రజ… నువ్వు కూడా జాగ్రత్త.

సుప్రజ: అలాగే అండి….

అని అంది సుప్రజ.

సాగర్, సుప్రజలు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్లగానే… సుప్రజ కోసం ఎదురు చూస్తూ ఉన్న తన తల్లి సుప్రజను చూడగానే చాలా సంబుర పడిపోయింది. ఎదురు వెళ్ళి, బిడ్డ చేతిలో ఉన్న బ్యాగ్ పట్టుకొని, సుప్రజను లోపలికి తీసుకువెళ్ళింది. సుప్రజ రాకతో ఆ ఇంట్లో సంబురం మొదలైంది. బిడ్డను చూసి సుప్రజ అమ్మ, నాన్న చాలా సంతోషించారు. అక్క వస్తుంది అని త్వరగా ఇంటికి చేరాడు తమ్ముడు నితిన్.

కన్నీటి రాఖి
కన్నీటి రాఖి

ఆ రోజు అంతా కబుర్లు పెట్టుకుంటూ….  సంతోషంగా గడిపారు. తెల్లవారింది…. బోనాల పండుగకు అన్ని సిద్ధం చేసుకున్నారు. బోనాలను, దేవతను అందంగా అలంకరించి, సుప్రజ ఇంట్లో వారంతా కూడా అందంగా ముస్తాబు అయ్యి బోనాలను దేవతకు సమర్పించారు.

కానీ, సంతోష్ తన పుట్టింటికి రాకపోవడం వల్ల కొంచం బాధపడింది సుప్రజ. అసలే కొత్తగా పెళ్లి జరిగింది. పెళ్ళి తరువాత మొదటగా చేసే బోనాల పండుగ ఇంటి అల్లుడు రాలేదు అని ఆ ఇంట్లో వారు కొంత కలతచెందారు. ఆ తరువాత రోజు నితిన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేశారు సుప్రజ ఇంట్లో వారు. 

చూస్తూ ఉండగా 5 రోజులు గడిచిపోయాయి. రాఖీ పండుగ రానే వచ్చింది. ఉదయాన్నే అందరూ నిద్ర లేచి, తల స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించారు. దేవునికి పూజ చేసింది సుప్రజ. తన తల్లితో కలిసి, పిండి వంటలు తయారు చేసింది. ఆ తరువాత తన అన్నయ్య, తమ్ముడికి రాఖీ కట్టే సమయం వచ్చింది. ఒక ప్లేట్ లో రాఖీలు, స్వీట్స్, కుంకుమ అన్ని పెట్టీ తీసుకు వచ్చింది సుప్రజ. 

సాగర్, నితిన్ కూర్చున్నారు. సుప్రజ ముందుగా తన అన్నయ్యకు బొట్టు పెట్టింది, తరువాత తన తమ్ముడికి పెట్టింది. ఆ తరువాత ఒక రాఖీ తీసుకొని ఎంతో సంతోషంతో సుప్రజ తన అన్నయ్యకు కట్టింది, ఆ తరువాత నితిన్ కి రాఖీ కట్టింది. ఇద్దరి పై అక్షింతలు వేసింది సుప్రజ. ఆ తరువాత స్వీట్ ని తన అన్నయ, తమ్ముడికి తినిపించింది. తన అన్నయ్యా సుప్రజకు ఎంతో ప్రేమతో స్వీట్ తినిపించాడు.

ఆ తరువాత సాగర్, నితిన్ సుప్రజను కూర్చోపెట్టి, బొట్టు పెట్టి, కట్నంగా చీరను పెట్టారు. సుప్రజ ఆ చీరను చూసి ఎంతో సంతోషించింది. నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి చెల్లి అంటూ సాగర్ తన చెల్లి తలను నులిమాడు. ఇలాంటి రాఖీ పండుగలు ఇలాగే చాలా జరుపుకోవాలని, తన అన్నా తమ్ముడు బాగుండాలని మనసులో దేవుడిని కోరుకుంది సుప్రజ.

సాగర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు. అందరినీ ఒక్కసారిగా చూడసాగాడు. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సుప్రజ సాగర్ ని గమనించింది. 

కన్నీటి రాఖి
కన్నీటి రాఖి

సుప్రజ: అదేంటి…అన్నయ్యా..? అలా చూస్తున్నావు..? ఆ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి…? అంది సుప్రజ.

సాగర్: అదేం లేదు రా… మీరు అంతా ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నాడు సాగర్.

సుప్రజ: అదేంటి అన్నయ్య… మీరు అంటున్నావు? మనం అని అనాలి అంది సుప్రజ.

సాగర్: లేదురా…

అన్నాడు సాగర్.

సుప్రజ: ఎందుకు అన్నయ్యా? ఏమైంది నీకు? ఇలా మాట్లాడుతున్నావు?

అంటూ సాగర్ దగ్గరికి వెళ్ళింది సుప్రజ. సాగర్ ఒక్కసారిగా కింద పడిపోయాడు.

అన్నాయ్యా….. అంటూ… సుప్రజ, నితిన్, సాగర్ అంటూ తన తల్లిదండ్రులు అరిచారు. సాగర్ తన తలను సుప్రజ ఒడిలో పెట్టాడు. సాగర్ నోటి వెంట నురుగ వస్తుంది. సుప్రజ, నితిన్, తన తల్లి దండ్రులు ఏడవసాగారు. అన్నయ్య ను హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం పదండి అంటూ నితిన్ అన్నాడు.

లేదు. నే….. నేను చనిపోతున్నాను. నేను బ్రతకను. అన్నాడు సాగర్ చివరి క్షణాల్లో, తన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ….

అందరి గుండెలు గుబెలుమన్నాయి. ఎందుకు నీకు ఏమైంది…? ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఏమైంది? అని అందరూ ఏడుస్తూ అడుగుతున్నారు.

మీరు అంతా బాగుండాలి. అమ్మానాన్న ను మీరే బాగా చూసుకోవాలి. నితిన్, చెల్లె జాగ్రత్త… అంటూ సుప్రజ ఒడిలోనే కళ్ళు మూశాడు సాగర్. అందరి నోట మాట మూగబోయింది. ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశబ్దం చోటు చేసుకుంది. అందరూ షాక్ కి గురి అయ్యారు. సుప్రజ ఒక్కసారిగా గట్టిగా అన్నయ్యా…….. అంటూ అరిచింది. అన్నయ్య… నీకు ఏం కాదు… నువ్వు లే… అన్నయ్య… నన్ను చూడు… అన్నయ్యా…. అంటూ ఏడవసాగింది సుప్రజ.

ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న సంతోషం ఒక్కసారిగా సాగర్ మరణంతో కన్నీరుమున్నీరు అయింది. గుండెలు బాదుకుంటూ ఏడవ సాగారు ఆ ఇంట్లోని వారంతా. సంతోషాన్ని నింపిన రాఖీ పండుగ ఒక్కసారిగా కన్నీటిని తెచ్చింది. 20 రోజులు గడిచింది. అప్పటి వరకు వారు అంతా షాక్ లోనే ఉన్నారు. మెల్ల మెల్లగా సాగర్ చావుకు కారణాలను తెలుసుకుంటున్నారు సుప్రజ, నితిన్.

మరో 10 రోజులకు తెలిసింది సాగర్ చావుకు కారణం. విషయం లోకి వెళ్తే…. 

సంతోష్ చెల్లి వసంత, సాగర్ ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో అందరికి తెలుసు వచ్చే సంవత్సరం ఇద్దరికీ పెళ్ళి కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, 10 రోజుల ముందు నుండి వసంతకు, సాగర్ కు మధ్య గొడవ జరుగుతుంది. వసంత మరో అబ్బాయితో మాట్లాడటం చూసాడు సాగర్.

కన్నీటి రాఖి
కన్నీటి రాఖి

అక్కడే వసంతను నిలదీయడంతో… వసంత తనను ఇష్ట పడటం లేదని, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు ఇంకో అబ్బాయి అంటే ఇష్టం. నేను అతన్నే పెళ్ళి చేసుకుంటా అని చెప్పింది. ఆ మాటలు విన్న సాగర్ మౌనంగా ఇంటికి వెళ్ళాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వసంత తనను మోసం చేసిందని చాలా బాధపడ్డాడు.

వసంత తన కళ్ళ ముందే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను చూస్తూ ఉండలేనని, వసంత లేని జీవితం తనకు వద్దని… ఇన్ని రోజులు తనను ప్రేమిస్తున్నానని నటించినందుకు తను తట్టుకోలేక క్షణికావేశంలో విషం తాగాడు సాగర్. ఈ విషం తెలిసి సంతోష్ వాళ్లకు, సుప్రజ వాళ్లకు చాలా గొడవలు జరిగాయి.

మరో నెల రోజులు గడిచాయి. పోయిన కొడుకు ఎలాగూ రాడు. కోపంతో ఉంటే సుప్రజ జీవితం ఎటూ కాకుండా పోతుందని ఆలోచించి, సుప్రజ అమ్మానాన్న సంతోష్ తో మాట్లాడి…. సుప్రజను తనతో పాటు పంపించారు. సంతోష్ అసలు నిజస్వరూపం ఇప్పుడిప్పుడే సుప్రజ కళ్ళలో పడుతుంది. ఎక్కువగా ఫోన్ లో మాట్లాడటం, రాత్రి తాగి రావడం, అర్ధ రాత్రి అయిన ఫోన్ వదలక పోవడం.

చీటికి మాటికి సుప్రజ మీద అరవడం, చెయ్యి చేసుకోడం చేసేవాడు. ఇప్పటికే కొడుకు మరణంతో కన్నీరు మున్నీరు అవుతున్న తన తల్లిదండ్రులకు తన విషయాన్ని చెప్పి ఇంకా బాధపెట్టకూడదు అనుకుంది. అలాగే బరిస్తూ వచ్చింది సుప్రజ. కొన్ని రోజులకు తన భర్త ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిసి సంతోష్ తో గొడవ పడింది.

నీ చెల్లి ఇలా మోసం చేసే నా అన్నయ్య ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు అని గట్టిగ గొడవ చేసింది. ఆ గొడవలో వసంత, సాగర్ మధ్య గొడవ, సాగర్ చనిపోయే విషయం తనకు ముందే తెలుసన్నట్లుగా తాగిన మత్తులో నోరు జారాడు సంతోష్.

ఆరోజు సాగర్, వసంత గొడవ పడినప్పుడు సంతోష్ అక్కడే ఉండి కూడా వసంతకు సపోర్ట్ చేశాడు. తన చెల్లి ఇష్ట పడిన వాడికే తన చెల్లె ను ఇచ్చి పెళ్లి చేస్తానని సాగర్ తో గట్టిగా అన్నాడు. సాగర్ మౌనంగా వెళ్ళిపోయాడు. రాఖీ ముందు రోజు సంతోష్ కి సాగర్ ఫోన్ చేసి ఎంతో బతిమలాడాడు. వసంత లేకుండా తాను ఉండలేననీ చనిపోతున్నా అని ఫోన్ మాట్లాడినా, సాగర్ మాటలను లెక్క చేయలేదు సంతోష్. పైగా చస్తే చావు అన్నాడు.

ఒక రకంగా సాగర్ చావుకు సంతోష్ కారణం అయ్యాడు. ఈ విషయాలు అన్ని తెలుసుకొని చాలా ఏడ్చింది సుప్రజ. తన అన్నయ్య చావుకు కారణం అయిన సంతోష్ ని చూసి అసహ్యించుకుంది. పైగా ఇంకో అమ్మాయి ని పెళ్ళి చేసుకుంటానని తనను విడాకులు ఇవ్వమన్నాడు సంతోష్. తన అన్న చావుకు కారణం అయిన సంతోష్ తో ఉండటానికి తనకి ఇష్టం లేదని, తనని కూడా మోసం చేశాడని విడాకులు ఇచ్చింది సుప్రజ.

సంతోష్ 6 నెలలో మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఆరోజే తన మొదటి పెళ్లి రోజు కూడా… సుప్రజ తన ప్రాణానికి ప్రాణం అయిన తన అన్నయ్య చావు, తన భర్త తనకు, తనకు చేసిన మోసం ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేవరకు తట్టుకోలేక సుప్రజ షాక్ కి గురైంది. 4 సంవత్సరాలు గడిచింది. సుప్రజ తన మనసును చదువు పైకి మల్లించింది.

నితిన్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఉద్యోగంతో ఆ ఇంట్లో కొంత సంతోషం నెలకొంది. సుప్రజ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతుంది. 

ఇది కథ కాదు….

నేను విన్న నా స్నేహితురాలి నిజ జీవితం.

తను ఇప్పుడు ఉద్యోగం చేస్తూ… చదువుతుంది. తను ఇప్పటికీ తన అన్నయ్యను గుర్తు చేసుకుంటూ, తన అన్నయ్య లేని లోటు ఎవరూ తీర్చలేదని ఎంతో బాధపడుతూ… ఏడుస్తుంది.

తనకి తన తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయి నీ చూస్తున్నారు. తనకి ఉద్యోగం వచ్చి, ఒక మంచి అబ్బాయి తన జీవితం లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

– అనూష, వరంగల్.

Related Posts

1 Comment

Comments are closed.