కానుక

కానుక

అమ్మా అమ్మా అంటూ వచ్చింది ప్రీతి. ఎంటమ్మా ఏం కావాలి ఇంకో అట్టు వేయనా అంది సుమిత్ర దోసెలు వేస్తూ… మరో పక్క కూర కలియ పెడుతూ, అవన్నీ వద్దమ్మ నాకు మన పెరట్లో ఉన్న పూలతో ఒక మాల కట్టివ్వు .

అలాగే ఏదైనా వెరైటీ స్వీట్ కూడా చేయమ్మ, అలాగే నాకు నీ చీరకట్టు, హా లంచ్ లోకి చికెన్ కర్రీ చెయ్యి, తొందరగా చేయమ్మా అంటూ నోట్స్ లో ఏదో రాస్తున్న ప్రీతి దగ్గరికి తల్లి అట్టు తో వచ్చి సరే అన్ని చేస్తాగానీ ముందు నువ్వు అట్టు పూర్తిగా తిని నోట్స్ రాసుకోవాలి అంది సుమిత్ర.

అమ్మా…, అబ్బా ఎప్పుడు తిను తిను అంటూ నా వెనకాలే పడతావు. ముందు నేను చెప్పినవి అన్ని తొందరగా చెయ్యి అంటూ వెనుదిరిగి వెళ్ళిపోతున్న కూతురి నోట్లో దోసె పెట్టేసింది సుమిత్ర. అబ్బా అని అనుకుంటూనే దోసె అంతా తినేసింది ప్రీతి.

తిని గబగబా నోట్స్ రాస్తూనే తొందరగా చెయ్యి అంటూ బయటకు వెళ్ళింది. ఎనిమిది గంటల లోపు ప్రీతికి కావాల్సినవి అన్ని చేసి భర్త కు, పిల్లాడికి కూడా అన్ని విధాలా సర్ధేసిన సుమిత్ర తాను రెండు దోసెలు తిందామని కంచం లో పెట్టుకుని ఒక ముక్క నోట్లో పెట్టుకోబోతుండగా… ఏంటమ్మా ఇది ఇంకా మాల కట్టలేదు.

తొందరగా కట్టు ఇప్పుడే తినాలా నువ్వు, మేము వెళ్ళాక నీకంతా ఖాళినే కదా తినడం ఆపు, అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని హాల్లొకి తీసుకుని వెళ్ళింది. దాదాపు పెరట్లో ఉన్న పువ్వులన్ని కోసి తెచ్చేసింది.

అవ్వన్నీపెద్దమాలగా కట్టింది సుమిత్ర. ఆ తర్వాత మాలను సమానంగా పన్నెండు ముక్కలుగా కట్ చేయించి, స్వీట్, చికెన్, మిగిలిన వన్నీ తీసుకుని, కనీసం తల్లికి థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ప్రీతి.

అందరూ వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చిన సుమిత్రకు ఇల్లంతా చిందర వందరగా కనిపించడంతో కొంగు నడుముకి చుట్టి అవన్నీ సర్దేపనిలో పడింది. టేబుల్ పైన సుమిత్ర తినాలనుకున్న దోసె ఎండిపోతుంది.

అయినా పట్టించుకోకుండా అంతా సర్దేసి స్నానం చేసి పూజ చేసుకోవాలని పెరట్లో పూల కోసం వెళ్ళిన సుమిత్రకు ఒక్క పువ్వు లేకుండా చేసింది.

హ్మ్మ్ అని నిట్టూర్చి పువ్వులు లేకుండానే పూజ కానిచ్చి, ఎండిపోయిన దోసె తినేసి, పిల్లలు విడిచిన బట్టలన్నీ ఉతకడం మొదలు పెట్టింది సుమిత్ర .

***************

ఇక ప్రీతి స్కూల్ కి తల్లి కట్టిన చీరతో స్నేహితురాళ్ళతో నవ్వుతూవెళ్ళింది. స్కూల్ లో ఉన్న మహిళా ఉపాధ్యాయునిలకు అందరికీ తాను తెచ్చిన పూలమాలలన్నీ ఇచ్చింది.

తన స్నేహితురాళ్ళు ఎవరూ చేయని విధంగా తాను ప్రత్యేకంగా తెచ్చిన భోజనాన్ని అందరికీ వడ్డించింది ప్రీతి. ఉపాధ్యాయినిలు వంటలు చాలా రుచిగా ఉన్నాయి అంటూ చాలా పొగిడారు.

ప్రీతీ చాలా సంతోషంగా ఉంది. పొంగిపోయింది. తన మిత్రుల ముందు తనను తన టీచర్స్ పొగుడుతూ ఉంటే తనకు ఆనందమే కదా, లంచ్ తర్వాత ప్రిన్సిపాల్ అయిన శారద గారు మాట్లాడుతూ…..

ఈరోజు ప్రీతి చాలా బాగా మాకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇప్పుడు ఇలా ఉన్నారు, మేము మీకు పాఠాలు బోధిస్తున్నాము అంటే మా అందరి తల్లులు చేసిన కృషి ఫలితమే….

మా తల్లులు మేము చదువుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే నేను ఇప్పుడిలా ఒక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయినిగా అయ్యాను. మా అమ్మగారు చాలా పట్టుదలతో నన్ను చదివించడం వల్లే నేనిలా అయ్యాను.

మా అమ్మ అంటూ లేకపోతే నేనిలా ఇప్పుడు మీ ముందు మాట్లాడేదాన్ని కాదు. అలాగే ప్రీతి ఈ ఒక్క రోజు తెచ్చిన భోజనం చాలా బాగుందని మెచ్చకున్నారు. మరి ప్రతిరోజూ మా అమ్మ ఇంతకన్నా చాలా బాగా చేసేవారు. అంటూ తన తల్లి గురించి చెప్తున్న, టీచర్ ని చూస్తున్న ప్రీతికి హఠాత్తుగా తన తల్లి గుర్తుకు వచ్చింది.

పొద్దున్నే తమకన్నా ముందే లేచి తన కోసం, తన తమ్ముడు, నాన్న గారి కోసం వండుతూ, బట్టలు తెల్లగా పిండుతూ, ఐరెన్ చేస్తూ, తమకు ఇష్టమైన వంటకాన్ని చేస్తూ, తన ఇష్టలన్నీ పూర్తిగా మార్చుకుని, తమ ఇష్టలే తన ఇష్టంగా చేస్తూ ఉంటే పొద్దున కనీసం ఒక్క పువ్వు అయినా లేకుండా, టిఫిన్ కూడా తిననివ్వకుండా హడావుడి చేసినది అంతా గుర్తొచ్చి హఠాత్తుగా లేచి నిలబడిన ప్రీతీ  మేడం నేను మాట్లాడవచ్చా అంటూ అడిగింది.

ప్రీతి అలా అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతుంటే అలా మధ్యలో మాట్లాడకు అంటూ స్నేహితులు చెయ్యి పట్టి లాగుతున్నా పట్టించుకోకుండా మైక్ దగ్గరికి వెళ్ళింది ప్రీతి. ఆమెను చూసి శారద గారు పక్కకి జరిగి మాట్లాడమ్మా అన్నారు.

డియర్ ఫ్రెండ్స్,పోద్దటి నుంచి మనఇళ్లల్లో మనం ఎంతో హడావిడి చేసి మన ఉపాధ్యాయుల కోసం రకరకాల బహుమతులు తీసుకొని వచ్చాము. అవన్నీ చేయడానికి మనం మన అమ్మలను ఎంతో విసిగించి ఉంటాం.

అది ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నిజానికి నేను మా అమ్మని టిఫిన్ కూడా చేయకుండా కనీసం ఒక్క పువ్వు కూడా ఉంచకుండా మొత్తం ఉపాధ్యాయులకు తీసుకొని వచ్చాను.

అమ్మని ఇబ్బంది పెడుతున్నాను అని అనుకోకుండా, ప్రత్యేకమైన వంటలు చేయించి, గొప్పగా ఉండాలని అనుకుని అమ్మని ఎంతో ఇబ్బందిపెట్టాను. ఇప్పుడు మేడం గారు వారి తల్లి గారి గురించి చెప్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది.

మన ఇంట్లో, మన కళ్ళ ముందు ఉన్న మాతృమూర్తులను వదిలేసి, వేరే మాతృమూర్తుల కోసం మనవాళ్ళని బాధ పెట్టి, విసిగించి ఇన్ని రకాలుగా తెచ్చాం. అయినా అమ్మలు విసుక్కోకుండా మనం అడిగిందే తడవుగా అన్ని రకాలుగా చేసి పంపించారు.

నాకు ఇప్పుడు మేడమ్ గారు చెప్తుంటే నేను చాలా తప్పు చేసినట్లుగా అనిపించింది. నిజానికి మనం బహుమతులు ఇవ్వాల్సింది మన ఉపాధ్యాయులకి కాదు మన మాతృమూర్తులకు.

పొద్దున్నే లేచి అన్ని రకాలుగా చేసి పెట్టే వారిని మనం చాలా చులకనగా చూస్తున్నాం. అని నాకు ఇప్పుడు అర్థం అయింది. అందువల్ల నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా మీ ఇంటికి వెళ్లి మీ అమ్మగారితో సమయాన్ని గడపండి.

మేడం గారు, మీరు మీ తల్లి గారి గురించి చెప్పిన విషయం మా అందరికీ కనువిప్పు కలిగించింది. మీ పిల్లలకు కూడా మీరు  ఇలాగే చేసి ఉంటారు కదా, మీరు కూడా ఇంటికి వెళ్లి మీ పిల్లలతో సమయం గడపండి.

తల్లి మొదటి గురువు, తర్వాత తండ్రి, ఆ తర్వాత ఉపాధ్యాయులు అని అన్నారు. తల్లిని మించిన దైవం లేదు. అందుకే నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నా ఈ చర్యకు మీ అందరి తరపున మా అమ్మకి క్షమాపణలు చెప్తున్నాను. వెళ్తాను అంటూ స్టేజి నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి పరుగెత్తింది ప్రీతి.

********

గేటు తీసుకుని లోపలికి వస్తున్న ప్రీతికి బట్టలు ఆరేస్తున్న తల్లి కనిపించింది. ఇక ఆగలేక పరుగున వెళ్లి తల్లిని గట్టిగా కౌగలించుకొని, నన్ను క్షమించు అమ్మ అంటూ తల్లి కాళ్లను చుట్టేసిన కూతుర్ని చూస్తూ ఉలిక్కిపడిన సుమిత్ర  ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతున్న తల్లి గుండెలో తలదాచుకుంది ప్రీతి.

తడబడుతున్న గొంతుతో, అమ్మా ఈరోజు నుంచి నీకు అన్నిట్లో సాయం చేస్తాను. నువ్వు చెప్పినట్లే వింటాను. అంటున్న ప్రీతి తల నిమురుతూ ,తన గుండెల్లో దాచుకుంది సుమిత్ర.

*******

 

తల్లి తన పిల్లల గురించి చాలా ఆలోచిస్తుంది. వాళ్ళ బాగు కోరుతుంది. తన ఇష్టాన్ని మర్చిపోయి, పిల్లల ఇష్టాలు తన ఇష్టాలుగా మార్చుకుని వారికి నచ్చిన కూరలు నచ్చినట్లుగా వండి, వాళ్ళు తింటూ ఉంటె సంతోషం కళ్ళలో చూస్తూ తన కడుపు నింపుకుంటుంది.

తన పిల్లలకు చిన్నప్పటి నుంచి దయ్యం, భూతం కొట్టకుండా ఎలాంటి చెడు జరగకుండా దేవునికి ప్రతిరోజు పూజ చేస్తూ ముక్కోటి దేవతలను మోక్కుతూ ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుకుంటుంది.

మనం  బాధ్యత లో పడి తల్లిని కష్టంగా భావించి వృద్ధుల ఆశ్రమంలో వదిలేస్తున్నాం. అమ్మని అస్యహించుకుంటున్నాం   మన మలమూత్రాలు తీసివేసిన చేతితో తాను అన్నం తింటూ కూడా మనల్ని గుండెలో దాచుకున్న ఆ తల్లిని కొంచెం ముసలిది అవగానే నీకేం తెలియదు, నోరు మూసుకో అంటూ తనని దూరం పెడుతున్నాము.

ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి అమ్మ ముసలిది అయినా కూడా తనకు ఎంత చాత కాకుండా తన చేతి వంట ఒకసారి రుచి చూడాలని తనకి చేతకాకపోయినా అబ్బా, అమ్మా, ప్లీజ్ నువ్వువండితే చాలా బాగుంటుంది. అంటూ తనను మన అవసరాలకి వాడుకుంటున్నాం.

కానీ తన ఇష్టాలు ఏమిటో తెలుసుకొని ఒక్కరోజు కూడా తనకి సెలవు అనేది ఇవ్వకుండా తన గురించి ఆలోచించకుండా తనకి ఒక్కరోజైనా ఒక్క బహుమతి అయిన ఇవ్వకుండా మర్చిపోతున్నాం, మారిపోతున్నాం.

ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి పరిస్థితి ఇంకా ఎక్కువైంది. ఉద్యోగానికి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. అని తల్లి ఎదురు చూసినట్లుగా భార్య ఎదురు చూడదు, అనేది భర్తలు మర్చిపోయి తమ భార్యలతో సంతోషంగా ఉండడానికి తల్లి అడ్డు వస్తుందని అనుకుంటున్నారు.

తన భార్య రేపు ఒక తల్లిగా మారబోతుంది అని తెలియక, భార్య చెప్పినట్టు వింటూ తల్లిని దూరం పెడుతున్నారు. ఇవన్నీ చేసినా కూడా తల్లి చివరికి అడిగే ఒకేఒక మాట ఏంటో తెలుసా? “అన్నం తిన్నావా నాన్నా” అంటూ ప్రేమగా అడుగుతుంది.

అదేదో సినిమాలో, ఎవరూ అర్థం చేసుకొని మనిషిని, చెవులు వినబడని తల్లి ఏమైందిరా నాన్నా, వచ్చి నా పక్కన పడుకో నీ బాధ అంతా తీరిపోతుంది, అంటూ పిలిస్తే అది చూసి కన్నీళ్లు కార్చే మనం. మన ఇంట్లో ఉన్న తల్లిని మాత్రం బెదిరిస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ, నీకేం తెలియదు నోరు మూసుకో అంటున్నాము.

వృద్ధుల ఆశ్రమంలో చేర్పించి  నెలకు ఇంత డబ్బు ఇస్తే చాలు అని అనుకుంటున్నాం. తను ఏ కాస్త దగ్గినా, పిత్తినా ఛీ అంటూ ముక్కుమూసుకుని పక్కకు వెళ్తున్నాం.

కానీ, మన చిన్నప్పుడు అమ్మ అన్నం తింటూ మన మలమూత్రాదులు కడిగిన విషయాన్ని మర్చిపోతున్నాం. అమ్మ అనుభవ పాఠాలు మన జీవితంలో కూడా వర్తిస్తాయని తెలియక అమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టి నీకేం తెలియదు అంటూ ప్రతీసారి తనని అవమానిస్తూనే ఉన్నాం.

అయినా కూడా చిరునవ్వుతో అవన్నీ భరిస్తూ సరేలే నాన్నా అంటూ తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటోంది. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి, తల్లి మాట వింటూ ఆమె జీవిత అనుభవాల సారాన్ని గుర్తు పెట్టుకొని, మన ముందు తరాలకు మన పిల్లలకు ఆదర్శంగా నిలుద్దాం.

దే మనం మన అమ్మలకు ఇచ్చే ఒక అతిపెద్ద కానుక అనుకుంటూ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు…

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress