కనులు కనులను దోచాయంటే

కనులు కనులను దోచాయంటే

అబ్బా… టైమైపోయింది అనుకుంటూ స్కూటీ పార్క్ చేసి ఆంటీ ఆంటీ అని గట్టిగా అరుస్తూ గేటు తీశాను.
వరండాలో ఎదురుగా స్టెప్స్ పైన ఎవరో ముఖం కనపడకుండా పేపరు చదువుతూ కూర్చొని కనిపించాడు. ఎవరా అనుకుంటూ ముందుకెళుతుంటే సడెన్ గా తను పేపర్ దించడంతో కళ్లు కళ్లు కలుసుకున్నాయి… మెరుపుతో
ఏంట్రా వసూ ఏమైంది? అమ్మ చేపల పులుసు ఇచ్చిందాంటీ… అంటూ టేబుల్ పై పెట్టి చకచక బయటకొచ్చేస్తుంటే ఏంట్రా అపుడే వెళ్లిపోతున్నావు అంది శారద ఆంటీ
కాలేజ్ కు టైం ఐపోతోందాంటీ అది కాదురా అంటున్నా. వినకుండా పరుగు పరుగున బయటికొస్తూ ఓరకంట అతని వైపు చూడ్డం తనూ నను చూడ్డంతో మళ్లీ కళ్లు కళ్లు కలుసుకున్నాయి మైమరపుతో….
అవును చెప్పలేదు కదూ… అమ్మ, శారద ఆంటీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ మధ్యే పరిచయం అయ్యింది కానీ చాలా ఏళ్ల ఆత్మీయత అనుబంధం అల్లుకుపోయింది ఇద్దరి మధ్యా… తనకు అమ్మాయిలు లేరు అనే కారణంగా నన్ను శారద ఆంటీ చాలా గారాబం చేసేది.
నా కాలేజ్ కి వెళ్ళే దారిలోనే ఆంటీ వాళ్లిళ్లు… అందుకే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు నా ద్వారా జరిగేవి. సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొచ్చి ముఖం కడుక్కుంటుంటే, వసూ ఆంటీకి  కర్రీ ఇచ్చావా అని అడిగింది అమ్మ,
ఆ ఇచ్చాను.. ఆంటీ వాళ్లింట్లో ఎప్పుడూ ఆంటీ, అంకుల్ మాత్రమే ఉంటారు కదా… ఈరోజు ఎవరో అబ్బాయున్నాడమ్మా? అని అమాయకంగా అడిగాను.
ఓ అదా… ఆంటీ వాళ్ళ అబ్బాయి రిషి. కేరళలో ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. సెలవు మీద వచ్చాడని  తెలిసే చేపలపులుసు పంపానే అంది. ఓ…అదా విషయం అంటూ కాఫీ కప్పు అందుకున్నాను.
రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ కళ్లు నను వెంబడిస్తూనే ఉన్నాయి. ఆ కళ్లలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.
మరుసటీ రోజు కాలేజీకి బయలుదేరాను. మనసులో ఏదో అలజడి. రిషి ఉంటాడా ఉండడా… ఏదో తెలియని, తెలుసుకోవాలనే ఆత్రుత. అనుకుంటుండగానే స్కూటీ హ్యాండిల్ తెలీకుండానే ఆంటీ వాళ్లింటి వైపు తిరిగింది.
అలా ఆ రోజుతో మొదలు ఏదో ఒక వంకతో వీలు దొరికినపుడల్లా శారద ఆంటీ వాళ్లింటి కెళ్లడం ఆ కళ్ల కోసం వెతకడం… ఆ కళ్లతోనే మాట్లాడుకోవడం… కానీ తనను చూసినా తన మాట విన్నా ఏదో పరవశం నాలో… ఇద్దరి మధ్యా ఏదో తెలీని కెమిస్ట్రీ నడిచేది…
నేనింతగా ఫీలవుతున్నాను కదా… తన మనసులో ఏముందో…పైగా అందగాడూ… నేనంటే ఇష్టమో లేదో అని ఓవైపు అనుమానమున్నా ఇష్టం లేకపోతే నా మాట వినగానే ఎక్కడో లోపల ఉన్నవాడు అవసరం లేకపోయినా నా ముందు ప్రత్యక్షమవ్వడం.
అడిగినవి అందుబాటులోకి తేవడం లాంటివెందుకు చేస్తాడులే… అని ఓ వైపు నన్ను నేను సమర్థించుకోవడం…  ఓ రోజు కాలేజ్ అవ్వగనే అటునుండి అటే ఆంటీ వాళ్లింటికెళ్లాను. లోపలికెళ్లి ఆంటీ ఆంటీ అని పిలిచాను. ఎవరూ కనపడరే…
అంకుల్ కూడా లేరు… మన హీరో ఎక్కడున్నాడో అని ముసిముసిగా నవ్వుకుంటూ కిచెన్ లోనూ, యుటిలిటీలోనూ, హాల్లోనూ, అంతా కలియ తిరిగాను.
ఎక్కడా ఎవరూ కనపడరే అనుకుంటూ బెడ్ రూం వైపు నడిచాను లోపల ఎవరూ లేరే అని అనుకుంటూ వెను తిరిగే లోపు సడన్ గా రిషి నా ముందుకు వచ్చి నా భుజాలు రెండూ పట్టకుని అలా  నన్ను గోడకానించి తన రెండు అర చేతులతో నా మొహాన్ని దగ్గరగా తీసుకుంటుంటే కళ్లు కళ్లు కలిశాయి మోహంతో.. నా పెదాలకు నా శరీరానికి  అత్యంత దగ్గరగా తను… 
వయసు… సొగసు… రెండూ పోటీ పడి రెచ్చగొడుతుంటే… గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంటూ పెంచిన వేగం తో ఊపిరి నుని వెచ్చని ఉప్పెనై తీరం తాకుతుంటే మౌనమనే అలల హోరులో చేతల మాటలు ఎగిసిపడుతుంటే….
నా కళ్లు భయపడుతూ…. నా పెదాలు వణుకుతూ… నా శరీరం ఏదో కోరుకుంటూ… ముచ్చెమటలు పడుతుంటే …
ఏం జరుగుతోందో తెలీని తన్మయత్వంలో ఉండగా… సడన్ గా తనను తోసేసి బయటికి సిగ్గు తో నవ్వుకుంటూ పరిగెత్తాను. వెనుకనుండి  మీ ఆంటీ అంకుల్ బయటికెళ్లారు. నేను రేపు ఊరెళ్లిపోతున్నా అని అరుస్తున్నాడు.
తను నాకోసం అలా చెబుతున్నాడనుకుని నవ్వుకుంటూ బండి స్టార్ట్ చేస్తుండగా తను గేటుదగ్గరకు రాగా మళ్లీ కళ్లు కళ్లు కలిశాయి ప్రేమతో…
తెలీని తన్మయత్వం… అనిర్వచనీయమైన అనుభూతి .. పెదాలపై చిరునవ్వు… మనసు గాల్లో తేలినట్టుంది.…
జీవితంలో మధురమైన అనుభవం.. దాన్ని ఒడిసిపట్టే క్రమంలో నన్ను నేను కోల్పోతాననే  ఓ భయంతో వచ్చేశాను. 
ఎంత ధైర్యం, ఎంత ఇష్టం లేకపోతే అంత చొరవ చూపిస్తాడు అనుకుంటూ ఇల్లు చేరాను. రాత్రంతా ఒకటే కలలూ కలవరింతలూ…
ఆ మరుసటి రోజు వెళితే నిజంగానే తను ఊరెళ్లిపోయాడని తెలిసి బాధ పడ్డాను.. ఏడ్చుకున్నాను… కానీ వాళ్లింటికెళ్లినపుడల్లా తనను చూస్తున్నట్టు తనతో మాటాడుతున్నట్టు ఓ తెలీని అనుభూతి…
అలా రెండు నెలల తర్వాత నా చదువైపోయి హైదరాబాద్ లో  సీటు రావడంతో నేను హాస్టల్ లో చేరడం జరిగింది.  కాలేజీ అయిపోయి హాస్టల్లో రూం లోకి వెళ్తుంటే, నీకు ఎవరో ఫోన్ చేశారు వసూ అంటూ 7 గం లకు మళ్లీ చేస్తారంట అంది వార్డెన్.
ఎవరా అనుకుంటుండగా సరిగ్గా 7 గం.లకీ వసూ నీకు ఫోన్ అనే పిలుపు. రిసీవర్ తీసుకుని హలో అన్నాను. ఏంటి మేడం ఏమైపోయారు అన్నాడు రిషి నవ్వుతూ… అంతే సంతోషం కట్టలు తెంచుకుంది. రిషీ అంటూ కుశల ప్రశ్నలతో మొదలుపెట్టి అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం
అలా రోజూ ఏదో ఒక టైంలో తను ఫోన్ చేయడం సరసంగా, విరహంగా, మాట్లాడుకుంటున్నా ఎక్కడా నేను తను ఓపెన్ అవ్వలేదు. అలా వారం రోజులు గడిచాక మాటల్లో రిషి వచ్చే నెలలో హైదరాబాద్ వస్తున్నా నీకో  సర్ప్రైజ్ అని చెప్పడంతో ఉబ్బుతబ్బిబ్బయి పోయాను.
తను చెప్పినా చెప్పకపోయినా నువ్వంటే నాకిష్టం రిషి, నువ్వు నాకు కావాలి అని తనతో చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో అమ్మమ్మ చనిపోవడంతో ఊరెళ్లిపోయాను.
అన్ని కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత అమ్మతో నేను ఓ రోజు రిషి నేను ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటున్నాము అని మాత్రం చెప్పాను. ఎందుకో అమ్మ చాలా సంతోషపడింది.
రాత్రి 9.30 ని..భోజనం చేసి బెడ్ పైన పడుకుని “ఐ టూ హ్యాడ్ ఎ లవ్ స్టొరీ” (“I too had a love story” novel) చదువుతుంటే కింద నుండి ఏదో పెద్ద శబ్దం.… కిందికెళ్లబోతుంటే పెద్ద పెద్దగా నాన్న అరుపులు… అంతే నిల్చుండిపోయాను. 
మనది పరువుగల కుటుంబమే.. ఏదో స్నేహం పోనీలే అనుకుంటే సంబంధాలు మాట్లాడతావా? అసలు వాళ్ల స్థాయెంత మన స్థాయెంత? ఏదో కంపెనీలో గుమాస్తాగా పనిచేసుకునే ఆ శారద కొడుక్కు నా కూతురి ని ఇస్తానని ఎలా అనుకున్నావు?
ఇంకోసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే ఆ శారదను, నిన్ను నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ స్నేహమేదో నీ దాకే పెట్టుకో అంతే ఈ విషయం వసూకు చెప్పావో నరికిపారేస్తా… అంటూ అరుస్తూ బయటికెళ్లిపోయారు.
అంతే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. ప్రేమ, గౌరవం, భయం అనే మూడు ఎమోషన్స్ లో భయం అనేది నన్ను ఎక్కువగా డామినేట్ చేసేసింది.
సంబంధం గురించి అడగగానే అంత రియాక్షన్ ఇచ్చిన నాన్న… ఇలా ఇష్టం ప్రేమ అని తెలిస్తే అంతే…
రాత్రంతా ఆలోచించి నా మనసును చంపేసుకున్నాను. ఆ మధ్య ఎవడో నాకు లైనేస్తున్నాడనే అనుమానంతో ఓ నాలుగు రోజులు వాడిని జైలు పాలు చేసిన నాన్న అనుకుంటే ఏమైనా చేస్తారని తెలుసు. రాత్రంతా ఏడుపుతోనే తెల్లారిపోయింది….
ఆ తర్వాత 2 రోజులకు హైదరాబాద్ వెళ్లిపోయాను. ఆ సంఘటన నాలో భయాన్ని పెంచి రిషి పైనున్న ప్రేమను ఇష్టాన్ని అచేతనావస్థ లోకి తోసేసింది. ఆ తర్వాత రిషి చాలా సార్లు కాల్ చేయడం నేను అవాయిడ్ చేయడం జరిగింది.
ఓ రోజు సాయంత్రం శారదా ఆంటీ కాల్ చేసింది. వసూ నువ్వంటే రిషికి చాలా ఇష్టం అంట. తనకు సంబంధాలు చూస్తున్నాం. కుదిరితే వెంటనే పెళ్లి అనుకుంటున్నాము. రిషి నిన్నోసారి కనుక్కోమన్నాడు. నీకూ ఇష్టమైతే నువ్వు  నా కోడలివి అవుతావు అంది.
సారీ ఆంటీ అటువంటి ఉద్దేశం లేదు ఇంకా చదువుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి రిషి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, ఐ లవ్ హిం అని గట్టిగా అరిచి చెప్పాలని అనిపించింది ఆ క్షణం…
అంతే మనసులో కన్నీటి కడకండ్ల వర్షం కురుస్తుంటే… పెద్దింటి బిడ్డలకు ఇష్టాలు ఉండకూడదు. ఉన్నా చంపేసుకోవాలి అని బుక్ లో రాసుకుని ఏడుస్తూ ఎపుడో నిద్రలోకి జారుకున్నాను.
రెండు రోజుల తర్వాత మళ్లీ శారదా ఆంటీ నుండి ఫోను… నువ్వు వద్దన్నావని అమ్మాయి ఫోటో కూడా చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు అని డేటు, టైం చెప్పి పెళ్లికి రమ్మని పిలిచి పెట్టేసింది. ఆ తర్వాత ఓ ఇరవైరోజుల తర్వాత రిషి ఫోన్ చేశాడు.
ఎలా ఉన్నావు అని మొదలెట్టి, ఎడ్యుకేషన్, జాబ్, లైఫ్, సినిమాలు, రాజకీయాలు అన్నీ మాట్లాడి సడెన్ గా  “నీకెలాంటోడు భర్త” గా కావాలి వసూ అని అడిగాడు. నవ్వుతు ఏం చెప్పాలో తోచక బిల్ క్లింటన్ అన్నాను.
వచ్చే జన్మంటూ ఉంటే వాడిలాగే పుడతాను అంటూ మీ అమ్మాయిలు ఎప్పటికీ అర్థం కారే… వసూ నువ్వెక్కడున్నా హ్యాప్పీ గా ఉండు.
తప్పకుండా పెళ్లికి రా… అంటూ చివరిగా ఓ మాట “ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా నా మనసులో నీ స్థానం మాత్రం అలాగే ఉంటుంది. నువ్వెప్పుడొచ్చినా యాక్సప్ట్ చేస్తాను.అది గుర్తు పెట్టుకో… ఈ రిషి మాటంటే మాట” అంటూ ఫోన్ పెట్టేశాడు.
ఆటో SR కళ్యాణమండపం ముందు ఆగింది. రిషి వెడ్స్ లక్ష్మి అనే ఫ్లవర్ డెకరేషన్ తో ఉన్న బ్యానర్… మొట్ట మొదటి సారిగా పట్టుచీర, కెంపుల నక్లెస్, బుట్టకమ్మలతో మెరిసిపోతున్నావని అందరూ అంటున్నా నా మనసులో రగులుతున్న అగ్నిజ్వాలను అదిమి పెట్టి చిరునవ్వుతో అందరినీ పలకరించుకుంటూ లోపలికి అడుగు పెట్టాము అమ్మ, నేను.
కాస్త ఆలస్యం అవ్వడంతో మాంగళ్యధారణ అయిపోయినట్టుంది. వేదిక పైనుండే రిషిని చూశాను కళ్ల కళ్లు కలిశాయి నిరాశగా…. 
ఇంతలో ఏంటి జయంతి ఇంత లేటు… అన్నీ దగ్గరుండి చూడాల్సింది పోయి ఇప్పుడా రావడం. అన్నయ్య రాలేదా అంటూ శారద ఆంటీ అమ్మను తీసుకెళ్తూ… వసూ నువ్వెళ్లి రిషిని పలకరించు అంటూ వెళ్లిపోయారు.
వెళ్లాలనిపించడం లేదు. కాసేపలాగే ఒంటరిగా ఓ మూలకూర్చుండి కళ్లు మూసుకున్నాను. ఓ అరగంట తర్వాత ఎందుకో తలపైకెత్తాను ఎదురుగా రిషి, వస్తావనుకోలేదు. థ్యాంక్యూ.. నాతో ఓ ఫోటో దిగుతావా?నీగుర్తుగా నా  కోసం అన్నాడు.
ఇంతలో లక్షీ రావడం పరిచయం చేసుకోవడం, ఇబ్బందిగానే తన కోరిక మేరకు ఫోటో దిగడం…జరిగిపోయాయి.
అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని వెళుతూ ఓసారి వెనక్కి తిరిగాను. మళ్లీ కళ్లు కళ్లు కలుసుకున్నాయి…కానీ కన్నీటిపొర అడ్డొచ్చింది …
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత…
హలో… అన్నాను
వసూ …ఎలా ఉన్నావు అంటూ రిషి
ఈసారి కళ్లు కాకుండా  మనసులు మాటాడుకోసాగాయి..
నీ జ్ఞాపకంగా ఈ జన్మకు సరిపడా ప్రేమతో……

Related Posts