కరుణామూర్తికి వందనాలు!
మౌనం తెరచాటుతో కాలం మబ్బులు
కరుగుతున్నాయి…కారణం ఏదైనా
కావచ్చు గమనానికి దివిటిగా కాలుతూనే
ఆ బతుకుల ప్రపంచాన్ని ఓపికతో మోసావు
అనుదినాన్ని ఆర్తితో వింటూనే మనస్సుతో చేసిన త్యాగాన్ని నీ ప్రతిరూపంగా మార్చుకొన్నావు…
కడుపు చింపుకొని పుట్టిన ఫలితాన్ని
కాయల పడనీయక…వృధాకాదు
జీవితమని…వ్యర్థం కాయని కొమ్మవై…
ఎన్నో మైలురాళ్ళు వంచనతో గాయం
చేసినా…మారని గమ్యం నా శ్వాసని
రాజీపడకా తనకోసం కానిది బతుకని
సాహసమన్నది సాధింపై సాగించిన ఒక
మూర్తీభావం అమ్మగా….
బతికినన్నాళ్ళు సమాజపు కుళ్ళును
చూస్తూనే…ఒదిగిన ప్రేమను సాక్ష్యంగా
పంచుతు తలచిన ప్రతి తలంపు నిప్పుల
కుంపటైనా ఎదన భాదలకు ఓర్పౌతునే…
నీ సేవల తిరునాళ్ళలో అందరిని
సేదతీర్చావు పూచిన పుష్పం పూటకు
నమ్మకం లేనిదిగా…ఆకుచాటున దాగిన
నీకు లోకం పొడబారిన చూపైనది….
జగతికి సూర్యోదయం నేర్పిన
అక్షరభ్యాసం వెలుగు…ఆ వెలుగుల
అవపోషణతో ఆరాధించే గుణానికి అమ్మవై
అనువనువున గాఢాంధకారాన్ని ప్రమిదలతో
పారదోలిన జ్ఞానజ్యోతి…నువు తలచిన
రూపాలకు ప్రాణంపోస్తు ఫలితం ఆశించని
నిత్య శ్రామిక జీవి…మాకోసం తనువుతో
బంధమేర్పరుచుకొన్న త్యాగశీలి…
ఆ…. వెనుదిరగని ప్రయానంలో క్షణాలు
మలచని గుణపాలై గుచ్చినా…హృదయం
చెప్పిన పాఠానికి స్పందనవుతు బతకని
ప్రతి అర్థాన్ని బతికించుటకు నిలువునా
నీరవుతున్నా అమృత స్వరూపిణి…
ఒడిగట్టని బతుకులను కాలం వక్రించినదిగా
చూపక…చేతుల సలువతో వెచ్చని ఒడిలో
లాలించిన దేశం నాదేననిన ఆ కరుణామూర్తికి
వందనాలు….
-దేరంగుల భైరవ
మాతృమూర్తులందరికీ వందనాలు.