కాస్త చెబుతారూ!

కాస్త చెబుతారూ!

“ఏమండీ వీటిల్లో బెండకాయలేవీ. మీరు కొనటం చూశాను.” పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు రామారావు.

ఇల్లు మారి నెల రోజులవలేదింకా భార్యామణి పోరు పడలేక శుక్రవారం కూరగాయల సంతకొచ్చాడు భార్యతో సహా. ఇలాంటి సంతలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతుంటాయి.

పాతిల్లున్న ఏరియాలో ఆ బరువంతా రామారావే మోసేవాడు. రెండుసార్లు ఫోన్ పోయాక తనకచ్చిరాలేదని ఇలాంటి వీక్లీ కూరగాయల సంతకు పోవడం మానేసి
మోర్ లోనే వన్స్ మోర్ అనుకుంటూ తెచ్చేస్తున్నాడు. అలాంటిదివాళ భార్యామణిని తోడు తీసుకుని బయల్దేరాడు, కానీ దృష్టంతా సెల్ ఫోన్ కాపాడుకోవటమ్మీదే..

భార్యమణి ఉత్సాహం గమనించి నవ్వుకున్నాడు, ఎంతకాలమీ సంబరం అనుకుంటూ..

కొన్న కూరలకు డబ్బులు వీలుంటే ఫోన్ పే లేకుంటే క్యాష్ తో చెల్లిస్తున్నాడు. మొదటిసారి కాబట్టి ఈ ఉత్సాహముంటుంది, రెండువారాలు పోతే మళ్ళీ నేను  పడాల్సిందే ఈ తిప్పలు అనుకున్నాడు. కూరలు బేరమంతా భార్యే చేస్తోంది.

ఒక్క బెండకాయలు మాత్రం రామారావు చేశాడు. ఆ టైమ్ లో భార్య పూలుకొంటోంది. అలా జోరుగా షికారుగా అన్నట్లు సాగింది కూరలవిహారం చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలనుండి సీనియర్ సిటిజన్లు, హోమ్ మేకర్ల తో సందడిగా ఉంది ఆ ప్రాంతమంతా.

మాటామంతీతో బేరాలతో కిలకిలమంటూ కళకళలాడుతోంది. ఆ ఉత్సాహధ్వనులను పరవశంగా వింటూ ఇంటికి చేరాం..

ఇదిగో ఆ కూరలు వెంటనే ఫ్రిడ్జ్ లో సర్దుతుంటే బెటర్ హాఫ్ కనిపెట్టేసి నిలదీస్తుంటే ఏం జరిగిందో అలా రివైండ్ చేసుకున్నాను.

“మీరూ మీ మతిమరుపు ఒక్క పని సరిగ్గా చేయరుకదా”

“పోనీ వెళ్లి అడిగొద్దామా”

“మర్చిపోయింది మీరు.. మళ్లీ తోడొకటి.. మీరే వెళ్లి రండి”

“సరే వెళ్తామండీ.. కాఫీ కాస్త మొహాన కొడితే” కోపాన్ని నటించాను

“సార్, ఏ పనిమీద వెళితే ఆ పనిమీద ధ్యాస పెట్టాలి ఆ పనినే ధ్యానించాలి.”

మధ్యాహ్న మార్తాండుడిలాంటి నా మొహం చూసి కొంచెం టోన్ మార్చింది.

“ప్లీజ్, రిటైర్ అయ్యారు. కొంచెం శ్రద్ధ పెట్టండి. ఆ బెండకాయలు కనిపెట్టి పట్రండి” కాఫీ కప్పు చేతిలో పెట్టి సౌమ్యంగా చెప్పిందీసారి, సారీని మిళాయించి

ఇలా షాపింగ్ లో కొన్నవి మర్చిపోవడం కొత్తేమీకాదు. మా వంశపారంపర్యంగా వస్తున్నదే. కాకపోతే నా ధ్యాస ఫోన్ కాపాడుకోవటంలోనే సరిపోయింది. అమ్మయ్య ఫోన్ పదిలం అనుకుంటూ మళ్లీ అక్కడికే బయల్దేరాను..

గతంలో ఇలా మర్చిపోయి మళ్లీ వెళ్తే హోంవర్క్ సరిగ్గా చేయని స్టూడెంట్ ని చూసిన టీచర్ అదోలా నవ్వినట్టు ఆ ప్లాస్టిక్ సంచీ నా చేతిలో పెట్టే వారు పాతింటి దగ్గర. మీర మారరా సార్ అన్న హెచ్చరికను కూడా చేరవేసే వారు కాన్ఫిడెంట్ గా అదే ఊహిస్తూ బయల్దేరాను..

********

ఇక్కడ పూలు అమ్మే అమ్మి ఉంది. ఆ పక్కన బెండకాయలమ్మే మాలక్ష్మి అనుకుంటూ ముందుకెళ్ళి ఆగాను

“సార్ బెండకాయలు తీసుకోన్రి. మంచిగున్నయి.”

“ఇంతకుముందు తీసుకున్నానమ్మా. ఆ క్యారీ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయానేమో అని”

“వేరే యాడైనా తీసుకున్నావేమో సారూ. ఈడనైతే కాదు.”

“ఇదిగోమ్మా , ఫోన్ పే పేమెంట్” చూపించే ప్రయత్నం చేశాను.

“నాకు తెల్వదు సర్.. కొన్నవేమో.. యాడనో మర్సి నన్నడుగుతవేంది సార్..” స్వరం పెంచేసరికి అందరూ నావైపు చూట్టం మొదలెట్టారు.

“సర్లేమ్మా.. కిలో బెండకాయలు ఇవ్వు.”

“తీస్కోండి సార్.. రెడీగా ఉన్న క్యారీ బ్యాగ్ చేతిలో పెట్టింది. జోకినంక ఓ సార్ వద్దని చెప్పిండు” అర్థమయిపోయింది, అది నేను కొన్నదే అని. ఏమీ అనలేక ఓ వెర్రి నవ్వు నవ్వి మళ్లీ ఫోన్ పే లో డబ్బులు కట్టాను..

నడుస్తూ భార్యామణికి ఫోన్ చేశాను. “మొత్తానికి బెండకాయలు దొరికాయి మేడం” విజయం సాధించినట్టు చెప్పాను..

అవతల వైపు నుంచి నవ్వు వినిపించింది

“అదేమిటి నవ్వుతున్నావు” అనుమానంగా అడిగాను.

“మీరు మళ్ళీ కొన్నారని తెలుసు మాస్టారు” అదే కొంటె నవ్వు మళ్ళీ..

ఇక అబద్ధాన్ని దాచుకోలేక క్యూరియస్ గా అడిగాను కొంచెం అయోమయాన్ని కలిపి..

“మీ సంగతి నాకు తెలుసుగా. మీరు ఏదో ఆలోచిస్తూ ఆ ఫోన్ పే రిసీట్ నాకు పంపించారు. కాస్త తెలివిగా ఉండటం నేర్చుకోండి మాస్టారు..” నవ్వు మళ్లీ.

ఎంత ప్రయత్నించినా ఇలా దొరికిపోతుంటాను.. ఏం చేయాలి చెప్పండి.. అయోమయానికి మందుంటే చెబుతారూ!

– సి. యస్. రాంబాబు

Related Posts