కవి చిరునవ్వు

కవి చిరునవ్వు

కీబోర్డు మీద
నర్తించాలని వేళ్ళు
ఉబలాట పడుతు
భావాల తోడును వెతుకుతుంటాయి

భావాలన్నీ ముడుచుకొని
అలిగినట్టున్నాయి
ఆలోచనలేమో పోస్టింగ్ కోసం
ఎదురుచూసే అధికారిలా దీనంగా ఉన్నాయి

కవితయినా వచనమయినా
వేదన తప్పదు
మస్తిష్కాన్ని వేధిస్తాం కానీ
హృదయం స్పందించాలిగా

ఎటుచూసినా వ్యధలు
వధ్యశిలపై అమాయకులు
అధోగతిలో అధోజగత్ సోదరులు
గడ్డకట్టిన హృదయ స్పందన

అందుకే హృదయాన్ని
బతిమాలు కుంటున్నాను
ఎగసిపడే నీ కవాటాలు
నాకు అక్షర కపోతాలంటూ

దయతలచి లబ్ డబ్ లను
డీ కోడ్ చేసుకోమంటుంది
డీకోడ్ అయిన భావాలన్నీ ఆలోచన మత్తడి దాటి
అక్షరాల్లో ప్రవేశించగా కీబోర్డు కదులుతుంది

కవి తనతో తాను చేసే యుద్ధమే
అతని కవితా ప్రసవవేదన
మనీని వదిలి మనిషిగా మిగిలినవాడే ఆ వేదనకు చిరునవ్వుతో చేరువవుతాడు

– సి.యస్.రాంబాబు

Related Posts