కేక కథ

కేక కథ

కేక కథ

గీత కి జ్వరం రావడంతో

“కొంచెం మా అమ్మాయిని చూసుకుంటారా,పిన్నిగారూ”అని సీత తను పనిచేసే పాఠశాల వాహనం రాగానే ఒక సంచీలో ఆమెకి కావలసిన తిండి పదార్థాలు అవసరమైన మందులు అన్నీ సద్ది సుందరమ్మ గారి ఇంట్లో పెట్టి , గీతని అప్పజెప్పివెళ్లిపోయింది.

సుందరమ్మ ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని సీత నాలుగు గంటలకు ఇల్లుచేరుతుంది. గీత కూర్చుంటూ చుట్టూ చూసింది. “నువ్వు ఇంద్రప్రస్థ జన పాఠశాల లో ఐదవతరగతి చదువుతున్నావుకదా ?” అంది ఆవిడ. “ఉహు. డెల్లీ పబ్లిక్ స్కూల్ లో ఫిఫ్త్ క్లాస్ ” అంది గీత

“అదేగా నేను అన్నదీ” ఈ లోపు సుందరమ్మ గారి సెల్ ఒక రింగ్ వచ్చి ఆగిపోయింది . “ఎవరో హ్రస్వకేక పెట్టారు”అంది ఆవిడ. “నోమామ్మగారూ….కాల్ వచ్చింది.” “పర్వాలేదులే ..దీర్ఘ కేక వస్తే చూస్తాను ” “ఏంటి బామ్మ గారూ ! మీకు టెల్గు రాదా? అది సంస్కృతమా? నాకు అండర్ స్టాండ్ కావడంలేదు”

“టెల్గు రాదు సంస్కృతం రాదు గానీ…. తెలుగు వచ్చు” అంది ఆవిడ నవ్వుతూ మళ్ళీ కాల్ వచ్చింది.. ఆవిడ లేచేటప్పటికి ఆగిపోయింది . “మామ్మగారూ… ఇంపార్టెంట్ కాల్ ఏమో లిఫ్ట్ చెయ్యండి” “ఉచితమే కదా ….వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళు నాటకాలు బాగా నేర్చుకున్నారు… ఇలా తప్పించుకునే కేకలు వింటే నాకు మంట..

“తప్పించుకునే కేకా? ‌ఈ కేకలు ఏంటి మామ్మగారూ!”అంది అర్థంకాక అయోమయంగా చూస్తూ గీత… “ఇది చరవాణి…” “అంటే” “ఖర్మ.. ఖర్మ …మీకు ఆంగ్లంలో చెబితే గానీ అర్థంకాదు. మొబైల్ ఫోన్”  “వాట్!!!!” “మరదే…ఇలా మనం నడుస్తూ కూడా వినవచ్చుకదా…”

” వండ్రఫుల్..మరి కేక అంటే” “కాల్..” “ఈజిట్సో!!!!” “ఔనమ్మా… హ్రస్వకేక‌ అంటే ఒకటిరెండు రింగులు వచ్చి ఆగిపోవడం.. దీర్ఘ కేక అంటే కంటిన్యువస్ గా రింగ్స్ రావడం…… తప్పించుకునే కేక అంటే….” “ఆగండి… ఆగండి….. ఆ… మిస్డ్ కాలా?” అంది గీత.. “అద్భుతం… చక్కగా పట్టేసేవు.” “ఏమిటీ కబుర్లు లో రోజూ వచ్చే సందేశాలు…” “యూమీన్ వాట్సాప్ మెసేజెస్”

“వజ్రానివి” “యూమీన్ … డైమండ్” ” ఆహా .. ఎంతచక్కగా అర్థం చేసుకుంటున్నావు… చాలా ఆనందంగా ఉంది తల్లీ నిన్ను చూస్తుంటే …..” “మీకు టైం పాస్ ఎలా ఔతుంది మామ్మగారూ ” “యూమీన్ కాలక్షేపం…” “యా” “కాస్సేపు నువ్వు గొట్టంలో అవీ ఇవీ చూస్తాను” “ఏగొట్టం?—- ఓ.. గుడ్ గాడ్… యూట్యూబా…” “రత్నానివి”

“జెమ్మునా?”అంది ఆనందంగా గీత “ఏమిటి పిన్నిగారూ… మా గీత అల్లరి పెడుతోందా?” నిజానికి ఆ చాదస్తపు తెలుగు పిచ్చి ముసలావిడ అంటే అందరికీ చులకనే ఆ అపార్ట్మెంట్ లలో… ఏదో అవసరం కదా అని మరో గతిలేక అక్కడ వదిలింది సీత కూతురు గీతని… “ఏమీ లేదమ్మా .. అదిసరేగానీ ఏమిటమ్మా ఇప్పుడే వచ్చేసేవు?”అంది సుందరమ్మ

“హాఫ్ డే…. సారీ అండి…. ఒకపూట శెలవు తీసుకున్నాను… ఎలాగ ఉందో అని గాభరా అనిపించి వచ్చేసేను. వస్తాము పిన్నిగారూ” అంది సీత ” సరేనమ్మా… మంచిది… శుభం ” అంది ఆవిడ వాళ్ళు వెడుతూఉంటే ద్వారబంధందాకా వచ్చి.. “మీతో గడపడం ఓ కెవ్వు కేక మామ్మగారూ…. రోజూ వచ్చి తెలుగు నేర్చుకుంటాను” అని గీత అంటే చిత్రం గా చూసింది సీత “అలాగే తల్లీ “అంది ఆనందంగా సుందరమ్మ

– ఉపద్రష్ట సుబ్బలక్ష్మి

హాస్య కధ Previous post హాస్య కధ
మేల్కొలుపు Next post మేల్కొలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close