ఖర్మ

ఖర్మ

ఖర్మ

నేనంటే నీకెందుకంత కోపం? నేనేం చేశాను అని కొప్పడతావు? నిన్ను నేనేమన్నా అని తిడతావు? ప్రతి సారి తప్పు నాదే అన్నట్టుగా అందరి ముందు తిడతావు, ఎన్నెన్నో మాటలు అంటావు, అసలు ఏమైంది అని కూడా అడగవు. ఎవరేం చెప్పినా నమ్ముతావు కానీ నా మాట మాత్రం నమ్మవు. నువ్వన్న ఒక్కొక్క మాట నా గుండెల్లో మంటలు రేపుతుంటే, ఆందరి ముందు అవమానంగా అనిపిస్తున్నా, నిన్ను ఏమీ అనలేని స్థితిలో ఉన్నాను నేను.

అందుకే కదు నీ గొంతు చించుకుని మరీ నన్ను అన్నన్ని మాటలంటావు. నేను మాట్లాడ లేననే కదా నీకు అంత పొగరు. ఏం పాపం చేశానని దేవుడు నాకిలా శిక్ష వేశాడో, అసలు ఇలాంటి బతుకు ఒక బతుకేనా? ఎన్ని సార్లు నాకు నేనే చావలని అనుకున్నా కూడా ధైర్యం చాల లేదు. అయినా నేనెందుకు చావాలి అనుకున్నా, నాకు బతికే అర్హత లేదా అని నన్ను నేనే ప్రశ్నించు కున్నా…

అప్పుడు అర్థమయ్యింది. నాకు బతికే అర్హత, నీతో సేవ చేయించుకునే అర్హత నాకున్నాయి అని, కానీ నువ్వేం చేసావు? గంటగంటకు తింటున్నా అంటూ చిందులు తొక్కి నన్ను తిననీయకుండ చేసావు. ఆకలితో అలమటిస్తూ బాధ పడుతూ ఉంటే నవ్వుతూ కూర్చున్నావు. ఎక్కడ మాత్రలు తెవలసి వస్తోందో అంటూ నాకు నరకం చూపించావు.

ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటూ నిన్ను సాకిన పాపానికి అంటుకున్న షుగర్ వ్యాధికి కారణం నేనా? నువ్వు కాదు, నాకీ రోగాలు అన్నీ రావడానికి నువ్వే కదా కారణం, నిన్నేలా పెంచాలి, నిన్నెలా చదివించాలి, నిన్నెలా వృద్ది లోకి తేవాలంటూ అనుక్షణం ఆలోచనల ఒత్తి తో ఈ రోగాలన్నీ వచ్చినా కేవలం నువ్వు ఎక్కడ బాధ పడతాడో అని బాధ తో నీకు చెప్పకుండా దాచి, నా మందుల కోసం దాచుకున్న డబ్బు కూడా ఉద్యోగం వస్తుందంటే లంచం కోసం ఇచ్చాను.

ఎన్ని సేవలు చేసినా, నీ కోసం ఎంత కష్ట పడినా, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రోగిష్టి అంటూ పక్షపాతంతో మూలన ఉన్న నన్ను అష్ట కష్టాలు పెట్టావు. వచ్చే పెన్షన్ డబ్బు కోసం నన్ను బతికి ఉంచావు. నీ పెళ్ళాం బిడ్డలు నువ్వు బాగుండాలి. సినిమాలకు షికార్లకు తిరగాలి. కానీ నాకు మాత్రం సరిగ్గా తిండి పెట్టకుండా, కనీసం మంచి నీళ్ళు ఇవ్వకుండా, నీళ్ళు తాగితే బాత్రూం పోస్తా అని, నీళ్ళు కూడా ఇవ్వకుండా నన్ను చంపావు.

నువ్వు పుట్టినప్పుడు ఎంతో సంతోషించాను. నువ్వు మాట్లాడితే పొంగి పోయాను. కూర్చుంటే నలుగురికి చెప్పుకుంటూ తిరిగాను. నడిస్తే కాళ్ళు కందుతాయని ఒళ్ళో వేసుకునే తిప్పాను. నీకు ఏ లోటూ లేకుండా పెంచాను. కష్టపడి నువ్వు అడిగిందల్లా చేసుకుంటూ వచ్చాను. ఉద్యోగం అంటే లంచం ఇచ్చాను. ప్రేమించాను అంటే పెళ్లి చేశాను.

ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను. ఆఖరికి నా తాళి బొట్టు బాగుందని నీ పెళ్ళాం అడగగానే తీసి ఇచ్చాను. అన్ని ఇచ్చినా నాకు రోగమని తెలియగానే ఒక మూలన పారేసావు. నీ కడుపు నింపిన నాకు తిండి పెట్టకుండా మాడ్చినా ఊరుకున్నాను. నాకు నీళ్ళు ఇవ్వక పోయినా నాలుక కన్నీళ్ళ తో తడుపుకుంటూ రోజులు గడిపాను.

రోగానికి మందులు తేకపోయినా ఓర్చుకున్నాను. ఇదిగో ఇప్పుడు నా ఆఖరి డబ్బుల కోసం నా శవం తో వేలిముద్ర వేస్తున్నా చూస్తూనే ఉన్నా, కానీ నాన్న ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇప్పుడు నువ్వు నాకు చేస్తున్నవి అన్ని నీ పిల్లలు కూడా చూస్తున్నారు. నా లాంటి పరిస్థితి నీకు రావొద్దు అని కోరుకుంటున్నా, ప్రతి తల్లి లాగే నేనూ ఆలోచిస్తున్నా, కానీ ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు. నీకంటూ ఒక రోజు తప్పక వస్తుంది ఖర్మ అనుభవించక తప్పదు.

అయితే నాన్న నా నోటి తో నేనేమీ అనను. ఎంతైనా కడుపు తీపి కదా, కానీ నీ చేష్టలు అన్నీ చూసాక నాకు మనసు విరిగిపోయింది. అందుకే ఇలా అంటున్నా, లేదంటే పాత తరం తల్లిలాగ కడుపు తీపి తో ఆశీర్వాదాలు ఇచ్చేదన్ని. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ ఇవ్వను. ఇది శాపం కాదు. ఖర్మ అనుభవించక తప్పదు అని మాత్రమే తెలియచేస్తూన్నా…. ఉంటాను….. ఛీ నీ తల్లిని అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు.

చేతిలో కాగితం, కళ్ళనిండా నీటి తో నిల్చున్న ప్రసాద రావు గారు, గంట వినిపించ లేదా పదండి భోజనానికి అంటూ భుజం పై చేయి వేసిన శేఖరం చేయందుకుంటూ నాకు ఆకలిగా లేదండీ అన్నాడు గొంతు దుఖం తో ముగబోతూ ఉండగా. ఇలా ఆకలి లేదంటే ఇక్కడ బ్రతిమాలి పెట్టే వారు ఉండరు. ఏ రాత్రో ఆకలి అయితే ఎవర్నీ అడిగినా తిడతారు.

మన పిల్లలు కష్టపడి డాలర్స్ పంపుతుంటే మనం తినకుండా ఉంటే మనకే నష్టం. పదండి ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదు. పదండి పదండి మళ్లీ ఆలస్యం అయితే ఆ చారు నీళ్ళు కూడా దక్కవు. అంటూ వెళ్లిపోయాడు శేఖరం. అమ్మ అన్నట్టు తన పిల్లలు తాను చేసినవన్నీ చూసి జీర్ణించుకున్నారు.

అందుకే ఇప్పుడిలా అనుభవిస్తున్న అనుకుంటూ తల్లి చనిపోయాక దిండు కింద ఉన్న లేఖ ను చదివి అప్పుడు తీసి సూటుకేస్ లో పారేశాడు. ఇప్పుడు ఖర్మతో పాటూ అది కూడా తన దరికి చేరింది. వస్తున్నారా అనే శేఖరం పిలుపుతో బరువైన గుండె తో చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తూ ముందుకు నడిచాడు ప్రసాద్.

ఖర్మ కాలమే నిర్ణయిస్తుంది.

– భవ్య చారు

ప్రేమతో.... Previous post ప్రేమతో….
గాలిలో దీపం Next post గాలిలో దీపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *