కూలిపోతున్న కలల సౌధం

కూలిపోతున్న కలల సౌధం

చుట్టూ చీకటి అలుముకున్న నా దేశం‌ కులాల చిచ్చులో..

మతాల ఉచ్చులో నిత్యం రగులుతోంది..

నేను ఎరిగిన..

నేను కలలుగన్న నా భరతావని‌ సుందర సౌధం కూలిపోతోంది.

ఆడబిడ్డలకు రక్షణ లేక..

దౌర్జన్యాలకు అంతం రాక..

విసిగివేసారిన కన్నీటి బతుకులకు దిక్కేది..

వీధికొక్కడై వికటాట్టహాసం చేస్తున్న మానవ మృగాల చేతిలో సమిధలవుతున్న ప్రాణాలకు దిక్కేది.

అన్నదాత ఆత్మహత్యలే అభివృద్ధి అనుకోవాలా..

నిరుద్యోగమే ఆస్తిగా భావించాలా..

ఆకలిదప్పుల‌ జీవితంలో నిత్య సమరాన్నే గెలుపుగా చూడాలా.

పెరుగుతున్న ధరలకు..

ఉప్పు, ‌పప్పులకే చాలని జీతాలతో..

రేయింబవళ్ళు చెమటోడ్చినా ఇల్లే గడవని రోజులతో..

ఎవరిని నిందించాలి..

ఏమని ప్రశ్నించాలి.

కష్టాలకు ఓర్చుకుని..

కన్నీళ్లను దిగమింగుకుని..

ఆలుబిడ్డలతో బతుకు బండిని‌ ఈడ్చుకుంటూ భారమైన జీవితాన్ని గడిపేస్తున్నాం‌ ఇలా మనం.

ఇదేనా లోకం మెచ్చిన మన పుణ్యభూమి..

ఇదేనా వేదం పుట్టిన మన ఖర్మభూమి..

మోడు వారిన మన జీవితాల్లో మరలా ఆశలు చిగురించేనా..

కూలిన మన కలల మేడలు మళ్లీ మన కళ్లముందు నిలబడేనా.!

– ది పెన్

Related Posts